Saturday, 20 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 39వ భాగం - సుందరి నీవంటి దివ్యస్వరూపమ్ము

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఎనిమిదవ భాగం ఇక్కడ  

39వ సజీవరాగం -  సుందరి నీవంటి దివ్యస్వరూపమ్ము

చిత్రం - మాయాబజార్
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల

పల్లవి:


సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
ఎందెందు వెదకిన లేదు కదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి.. ఓహో సుందరి.. ఆహా సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా



చరణం 1:

దూరం దూరం...ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా


అయ్యో.. సుందరి....

ఆహా సుందరి.. ఓహో సుందరి
సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా


చరణం 2:

రేపటి దాకా ఆగాలి... ఆ...

అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
ఊ....
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేకదా


సుందరి.. ఓహో సుందరి.. ఆహ సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ వగల నా విరహము హెచ్చేకదా


చరణం 3:

హెచ్చితే ఎలా? పెద్దలున్నారు...
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి..
ఊ.. ఆ...


పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా..ఆ...
ఆ.. 

పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా.....
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా


సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా...
ఊ.. అహ...సుందరి ...సుందరి ఓహో సుందరి ..
ఒహొ సుందరి... ఊ.. ఒహొ...సుందరి ....ఓహో సుందరి
"


కె.వి.రెడ్డి గారి ఇంద్రజాల, మహేంద్రజాల అపూర్వ, అపురూప సృష్టి  "మాయాబజార్" సినీమా. వ్యాస భారతంతో సంబంధం లేని కొన్ని పాత్రలతో ఒక అద్భుతమైన కథను సృష్టించి అది మహాభారత కథేనేమో అనే భ్రమను కల్పించి, పౌరాణికతను ఆపాదించిన ఘనత కె.వి. రెడ్డిగారిది. 

1957 లో విజయావారి మాయాబజార్ రావడానికి ఇరవై సంవత్సరాల ముందే వేల్ పిక్చర్స్ వారు మాయాబజార్  సినీమాను తీసారు."శశిరేఖా పరిణయం" ఒక జానపద కథ ఆధారంగా తీయబడింది. సురభి నాటక సమాజం వారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ శశిరేఖా పరిణయం నాటకాన్ని మాయాబజార్ గా ప్రదర్శిస్తూ ఆ కథకు జనబాహుళ్యంలో మంచి ప్రాచుర్యాన్ని కల్పించారు. అంతకుముందుగా పదకొండుసార్లు మూకీ చిత్రంగా నిర్మించబడిన ఈ కథ తమిళంలో "వత్సలా కళ్యాణం" గా తీశారు. తెలుగువారి శశిరేఖ, తమిళులకు వత్సల. కానీ, కె.వి.రెడ్డిగారి అపూర్వ మేథాశక్తితో, నిబధ్ధతతో, సాంకేతిక నైపుణ్యంతో విజయావారి మాయాబజార్ యొక్క విజయదుందుభులు దిగంతాలలో మార్మోగాయి. స్క్రీన్ ప్లే ను మహాభగవద్గీత యంత పవిత్రంగా భావించి అందులోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని, సంభాషణలను తు.చ. తప్పకుండా యదాతధంగా తెరకెక్కించడంలో కెవి రెడ్డిగారికి గల  క్రమశిక్షణ, శ్రధ్ధాభక్తులు అనితరసాధ్యం. కళ, వ్యాపారం రెండింటి సమన్వయ స్వరూపమే సినీమా మాథ్యమం అని మనసారా నమ్మిన వ్యక్తి కె.వి.రెడ్డి. పండిత, పామరుల అభిరుచుల నాడిని గట్టిగాబట్టి సంభాషణలలో, పాటలలో ఒక నవ్యత్వాన్ని తీసుకువచ్చి తన సినిమాలను విజయవంతం చేసారు.

మాయాబజార్ లో కృష్ణుడు, ఘటోత్కచుడు తర్వాత అంతటి ప్రముఖమైన పాత్ర లక్ష్మణకుమారునిది. మహాభారతం లోని లక్ష్మణకుమారుడు సుయోధన చక్రవర్తి కుమారుడు, గొప్ప వీరుడు. కురుక్షేత్ర సంగ్రామంలో  పోరాడి వీరస్వర్గం పొందాడు. అంతకుమించి అతనికి పెద్ద కథేమీ వున్నట్లు కనపడదు.

అదే కె.వి.రెడ్డిగారి కల్పనలో లక్ష్మణకుమారుడు భీరువు, విదూషక లక్షణ సమన్వితుడు. హాస్య రసాన్ని పోషించడం కోసం మలచబడిన కథాపాత్ర. ప్రాచీన సంస్కృత నాటకాలలో, కావ్యాలలో హాస్యానికి, వినోదానికి ఎంతో ప్రాధాన్యత కల్పించబడింది. అలంకారికులు హాస్యాన్ని పలురకాలుగా వర్ణించారు. వాటన్నిటి ఆధారంగా మాయాబజార్ లోని లక్ష్మణ కుమారుడి  పాత్ర హాస్యరస ప్రధానంగా రూపొందించబడింది.

లక్ష్మణకుమారుడికి శశిరేఖ మీద పెద్ద ప్రేమగానీ వ్యామోహంగాని లేవు. తనకు దాయాది, విరోధియైన అభిమన్యుడు  శశిరేఖను పెళ్ళిచేసుకోకుండా అడ్డుతగలడమే అతని ధ్యేయం. అందుకోసమే  తనకు గల సాహితీ, సంగీత పాటవాన్ని శశిరేఖ అనుకొని ఘటోత్కచుడు ఆవహించిన మాయా శశిరేఖ ముందు "సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా"  అంటూ ప్రదర్శించి అపహాస్యం పాలవుతాడు.   ఈ సన్నివేశం లో శశిరేఖగా సావిత్రి, లక్ష్మణకుమారుడిగా రేలంగి పొటాపోటీగా నటించి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు.  ఈ పాట సన్నివేశంలో రేలంగి, సావిత్రిల మధ్య సాగిన ఏక్షన్ - రియాక్షన్, శృంగార హాస్యరస ప్రదర్శన అద్వితీయం. లక్ష్మణకుమారుడి (రేలంగి) వెఱ్ఱిబాగులతనం, అమాయకత్వాన్ని ఆసరాగాతీసుకొని  పాట ఆద్యంతం శశిరేఖ (సావిత్రి) ప్రదర్శించిన అవహేళన, వెక్కిరింత ఈ పాట సజీవం కావడానికి ఎంతో దోహదపడ్డాయి.

ఈ పాట రచనకు ముందే  కవి పింగళి, సంగీతదర్శకుడు  ఘంటసాల, డైరెక్టర్ కె.వి.రెడ్డి  చేసిన కసరత్తు మూలంగా ఈ పాట చిత్రీకరణ సమయంలో ఎక్కువ కష్టపడకుండా నటీనటుల నుండి తనకు కావలసిన ఎఫెక్ట్ ను అద్భుతంగా రాబట్టుకోగలిగారు.  తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి నిర్మించబడిన మాయాబజార్ లో సావిత్రి కి నలుగురు బావలు. తెలుగు శశిరేఖ గా అక్కినేని, రేలంగిలతోనూ, తమిళ వత్సలగా జెమినీ గణేశన్, కె.ఎ.తంగవేలుతోనూ సావిత్రి ఆడిన ప్రేమ సయ్యాటలు రెండు ప్రాంతాల ప్రేక్షకులకు మహదానందాన్ని కలుగజేసాయి. 

మాయాబజార్ సంగీత రసభరితం కావడంలో ఘంటసాల ప్రముఖ పాత్ర వహించారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను కనపర్చారు.  చిత్రం ఆద్యంతం పాటలు, పద్యాల వరసల కూర్పులో, రీ-రికార్డింగ్ విషయంలో ఘంటసాల తన విశ్వరూపం చూపించి మాయాబజార్  మ్యాజికల్ మ్యూజికల్ హిట్ కావడంలో  ఎంతో తోడ్పడ్డారు.

"సుందరి నీవంటి దివ్య స్వరూపంబు" పాట అంతగా జనాకర్షణ పొందడానికి ఆ పాటలో గొప్ప కవిత్వంతో కూడిన సాహిత్యం లేదు. పాట మెట్టులో శుధ్ధ శాస్త్రీయతా లేదు. పాటంతటిని చిన్న చిన్న సరళమైన మాటలుపయోగించి పింగళివారు హాస్యరస ప్రధానంగా వ్రాయగా, ఘంటసాల తన సంగీతంలో కూడా హాస్యాన్నిజొప్పించి పండిత పామరులంతా హర్షించేలా పాడారు. ఖమాస్ రాగ స్వరాలతో స్వరపర్చిన  ఈ పాట మొదలుపెట్టి, పూర్తి అయేంతవరకు ఘంటసాల, నటి సావిత్రి చూపిన ఎఫెక్ట్స్, కౌంటర్ ఎఫెక్ట్స్ ఆ పాటకు చిరంజీవత్వాన్ని ప్రసాదించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  అలాగే ఈ పాటకు ఉపయోగించిన వాద్యగోష్టి కూడా హాస్యాన్ని పండించడంలో కృతకృత్యులయ్యారు.

ఖమాస్  28 వ మేళకర్త హరికాంభోజికి జన్యరాగం.శృంగారభావాలను ప్రకటించడానికి అనువైన ఈ రాగం ఆరోహణలో రిషభం లేకుండా ఆరు స్వరాలు, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతాయి.

అసలు "సుందరి నీవంటి దివ్యస్వరూపంబు" పాటను ఘంటసాలవారు పాడవలసిన పాట కాదు. తెలుగులో ఈ పాటను రేలంగికి పిఠాపురం నాగేశ్వరరావు, సావిత్రి లచేత , తమిళంలో ఎస్ సి కృష్ణన్ ,సావిత్రి ల చేత పాడించాలనే నిర్ణయం చేసి పాడించి రికార్డింగ్ ముగించారు. తమిళం పాట ఏ అభ్యంతరం లేకుండా అందరి ఆమోదం పొందింది. కాని తెలుగు వెర్షన్ కె.వి.రెడ్డిగారికి , చక్రపాణిగారికి అంత సంతృప్తి కలిగించలేదు.  ఆశించిన జీవం  పాటలో ధ్వనించలేదనే భావన వారిలో కలిగింది.  ఆ పాట ఘంటసాల పాడితేనే బాగుంటుందని  నిర్ణయించి  మరల  ఘంటసాల, సావిత్రిల చేత ఆ పాటను పాడించారు. తన స్వీయసంగీతంలో వచ్చిన "మన దేశం" సినీమాలో ఘంటసాల తొలిసారిగా రేలంగికి ఒక పాట, జిక్కితో కలసి పాడారు. అది యుగళ గీతం. ఆ తర్వాత "పెద్ద మనుషులు"  సినీమాలో రేలంగికి పాడిన రెండు పాటలతో ఆ ఇద్దరి కాంబినేషన్ స్థిరపడింది. రేలంగి  నటనకు ఘంటసాల గళమే తప్పనిసరని మాయాబజార్ లోని ఈ పాట మరోసారి నిరూపించింది.  ఘంటసాల గాత్రంలో మంచి నటుడు కూడా వున్నాడనే విషయాన్ని తెలుగువారంతా  కూడా నిర్ద్వంద్వంగా ఆమోదించారు. 

అందుకే ఘంటసాలవారి గళం నుండి జాలువారిన అనేక లలిత, శాస్త్రీయ గీతాలు ఈనాటికీ సజీవమై తెలుగు హృదయాలలో సదా మెదులుతూనే వుంటాయి.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...