Saturday, 6 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 37వ భాగం - ముక్కోటి దేవతలు ఒక్కటైనారూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఆరవ భాగం ఇక్కడ  

37వ సజీవరాగం - ముక్కోటి దేవతలు ఒక్కటైనారూ
చిత్రం - బావామరదళ్ళు
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - పెండ్యాల

అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన
రక్ష, రక్ష జనార్దన

నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు. నీ శరణు కోరుతున్నాను. దయతో నన్ను రక్షించు అని ఆ దేవదేవుని చరణాలనాశ్రయిస్తే తప్పక రక్షించి చింతలన్నీ తొలగిస్తాడు. భార్యావియోగంతో ఒంటరితనంతో వేదనలపాలై తల్లిలేని తన పసిపాపడికి మీరే దిక్కని తెలుగుదేశంలోని పవిత్ర దేవాలయాలలోని దేవుళ్ళ దగ్గర మొరపెట్టుకుంటున్న ఒక దీనుడి అంతరంగ ప్రార్ధన ఈ గీతం. 

ఆ దేవుడనేవాడు సతీవియోగ బాధనెరిగిన తిరుపతి వెంకన్న గావచ్చు, లేదా  నెల్లూరు శ్రీరంగనాయకుడు కావచ్చు, లేదా తల్లి రూపంలో లోకాలనేలే కనకదుర్గమ్మ కావచ్చు,  కంచర్ల గోపన్నను ఆదుకున్న భద్రాద్రి రామన్నైనా, బాల ప్రహ్లాదుని కాపాడిన సింహచలేశ్వరుడైనా, ఏ రూపంలో వున్నా ఎక్కడ వున్నా ముక్కోటి దేవతలంతా ఒక్కటై  తన చిన్నారి బాలునికి రక్షణ కల్పించమని ఈ కథానాయకుడు అర్థిస్తునాడు.

ఎవరూ లేనివారికి దేవుడే దిక్కు. ఆ దేవుని నమ్మినవారెవరూ చెడిపోరు అనే సూక్తి ఆధారంగా ఈగీతాన్ని ఎంతో బరువుగా, వేదనాభరితంగా, ఆర్ద్రతతో ఆరుద్రగారు రచించారు. పి.ఎ.పద్మనాభరావు నిర్మాత, దర్శకుడిగా రూపొందించిన ఒక చక్కటి కుటుంబగాధా చిత్రం "బావా మరదళ్ళు"  లో ఒక ఉద్విగ్నభరిత సన్నివేశం కోసం ఈ పాటను నేపథ్యగానంగా రూపొందించి కధానాయకుడు రమణమూర్తి మీద చిత్రీకరించారు. ఆతని భార్యగా కుసుమ కుమారి (మాలిని), మరదలుగా కృష్ణకుమారి నటించారు.

బావామరదళ్ళు సినీమాకు పెండ్యాల నాగేశ్వరరావుగారు అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆరుద్ర వ్రాసిన "నీలిమేఘాలలో గాలికెరటాలలో",  "హృదయమా ఓ బేల హృదయమా", "ముక్కోటి దేవతలు"; శ్రీశ్రీ  వ్రాసిన "పయనించే మన వలపుల" వంటి పాటలు ఆపాతమధురాలై, ఆరు దశాబ్దాల తర్వాత కూడా సంగీతాభిమానులందరిచేతా మననం చేసుకోబడుతున్నాయి. ఈ పాటలను పాడిన ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి చిరస్మరణీయ గాయకులుగా తెలుగువారందరిచేతా ఆరాధించబడుతున్నారు.

"ముక్కోటి దేవతలు ఒక్కటైనారు" అనే ఈ గీతంలో పల్లవితో పాటు ఆరు చరణాలున్నాయి. ఒక్కొక్క చరణం ఒక్కొక్క దేవుని కీర్తిస్తూ వ్రాసారు ఆరుద్ర. గ్రామఫోన్ రికార్డులో లేని  ఆఖరిచరణం పూరి జగన్నాధస్వామి పరంగా వ్రాసి, ఆ దేవుని గురించి మనం ఊహించని ఒక చమత్కారాన్ని మనకు తెలియజేసారు ఆరుద్ర. పూరి జగన్నాధ స్వామి ఆలయాలలో, చిత్రపటాలలో మొండిచేతులవాడిగానే మనకు దర్శనమిస్తూంటాడు. దానికి కారణం చేతికి ఎముకలేకుండా భక్తులకు, దీనార్తులకు దానాలు చేయడమేనని ఆరుద్ర ఒక గొప్ప వ్యాఖ్యానం చేసారు.

పెండ్యాలగారు ఈ పాటను శుధ్ధ శాస్త్రీయ పధ్ధతిలో రాగమాలికలో స్వరపర్చగా తన సహజసిధ్ధమైన భావగాంభీర్యంతో, అపూర్వ గానపటిమతో, నవరసాలను గమకయుక్తంగా  తన గళంలో పలికిస్తూ శ్రోతలలో భక్తి పారవశ్యాన్ని కలుగజేసారు గానగంధర్వుడు ఘంటసాల. ఈ అపురూప గీతంలో - కాంభోజి, కానడా, కీరవాణి, మయామాళవగౌళ, నాటకురంజి వంటి శుధ్ధ కర్నాటక (కానడా తప్ప)  సంగీత రాగాలను పెండ్యాల అతి సమర్ధవంతంగా ప్రయోగించారు. అలాగే వాద్యబృందాన్ని కూడా పరిమితంగా   కర్ణాటక శైలిలో గమక ప్రాధాన్యతనిచ్చి ఉపయోగించారు. సదా మన మదిలో మెదిలే సజీవరాగం "ముక్కోటి దేవతలు ఒక్కటైనారు" రాగమాలిక.

"బావామరదళ్ళు" సినీమా ఆనాడు, ఈనాడు కూడా కేవలం పాటల ఔన్నత్యంతో మాత్రమే తెలుగువారికి గుర్తుండిపోయింది.  ఆర్ధిక పరాజయం పొందడంతో  ఈ సినీమా కాలగర్భంలో కలిసిపోయింది. 






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...