Saturday, 13 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 38వ భాగం - శిలలపై శిల్పాలు చెక్కినారూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఏడవ భాగం ఇక్కడ  

38వ సజీవరాగం - శిలలపై శిల్పాలు చెక్కినారూ
చిత్రం - మంచి మనసులు
గానం - కె.వి.మహాదేవన్
రచన - ఆత్రేయ
సంగీతం - ఘంటసాల

సేలమ్ మోడర్న్ ధియేటర్స్ చాలా పాత నిర్మాణ సంస్థ. ఏక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. 1935 నుండి 1982 వరకు సేలమ్ లో వారి సొంత స్టూడియోలోనుండి అనేక విజయవంతమైన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, సింహలీస్, ఇంగ్లీషు భాషలలో దాదాపు 150 సినీమాలు నిర్మించారు. ఆ మోడర్న్ ధియేటర్స్ వారు "కుముదమ్" అనే ఫ్యామిలీ సెంటిమెంట్  సినీమాను నిర్మించారు. 

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, కె.వి.మహాదేవన్ సంగీత నిర్దేశకత్వంలో వచ్చిన ఈ సినీమా  సంగీతపరంగా , ఆర్ధికపరంగా ఘన విజయం సాధించింది. కెవి మహాదేవన్ కు 'మామ' ముద్దుపేరును కట్టబెట్టిన "మామ మామ మామా" పాట ఈ "కుముదం"లోనిదే. అందులో బాగా హిట్టయిన మరో పాట శీర్కాళి గోవిందరాజన్ పాడిన " కల్లిలే కలై వన్నమ్ కన్డాన్" అనే పాట. ఆ పాటకు తెలుగు సేత "శిలలపై శిల్పాలు చెక్కినారు.." అదే ఈనాటి మన సజీవరాగం.

చక్రవర్తి అయ్యంగార్ అనే తమిళ నిర్మాత  వరసగా తెలుగులో సినీమాలు తీయడానికి సంకల్పించి బాబూ మూవీస్ బ్యానర్ ను స్థాపించి ఈ "కుముదం" తమిళ చిత్రాన్ని తమ తొలి ప్రయత్నం గా మొదలుపెట్టారు. తమిళ చిత్రానికి పనిచేసిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు, సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ లనే తెలుగు వెర్షన్ చేయడానికి వినియోగించుకున్నారు.

ఆక్కినేని, సావిత్రి, ఎస్.వి.రంగారావు, షావుకారు జానకి, గుమ్మడి, నాగభూషణం, వాసంతి మొదలగు నటులతో "మంచి మనసులు" పేరిట 1962 లో విడుదలై అన్నివిధాలా ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా తమిళం వరసలనే  దాదాపు అన్ని పాటలకు ఉపయోగించినా , తిరుగులేని సంగీతదర్శకుడిగా కొన్ని దశాబ్దాలపాటు  ఇతర సంగీత దర్శకులను వెనుకకు నెట్టి  కెవి మహాదేవన్ తెలుగు చిత్రసీమలో తన విజయపతాకం ఎగురవేయడానికి "మంచిమనసులు" పాటలు మంచి దోహదం చేసాయి. ఆరు దశాబ్దాల తర్వాత కూడా  ఆ పాటలన్నింటినీ ఈనాటికి సంగీతాభిమానులు పాడుకుంటున్నారంటే సంగీత దర్శకుని ప్రతిభతోపాటు ఆ పాటలను పాడిన ఘంటసాల, పి.సుశీల, జమునారాణి, మొదలగువారి శ్రావ్యమైన గానమాధుర్యం కూడా ముఖ్య కారణమని చెప్పకతప్పదు.

ఇక నేటి ఘంటసాలవారి సజీవరాగానికి వస్తే....

ఏడు, ఎనిమిది శతాబ్దాలనాటి పల్లవ రాజుల కళాసంస్కృతిని ఈనాటికి ప్రతిబింబింపజేస్తూ విరాజిల్లుతున్న మామల్లపురం( మహాబలిపురం) శిల్పాల నేపధ్యంతో కన్నదాసన్ తమిళంలో ఒక అద్భుతమైన గీతాన్ని రచించగా, మహాదేవన్ ఆ పాటను జోన్పురి రాగంలో స్వరపర్చి శీర్కాళి గోవిందరాజన్ చేత పాడించారు. గోవిందరాజన్ సినీగాయకుడిగా కంటే కర్నాటక సంగీత విద్వాంసుడిగా బాగా పేరుపొందారు. హిందీలో శాస్త్రీయ గీతాలను పాడేందుకు మన్నాడేకు ఎలాటి ప్రాధాన్యతనిచ్చేవారో అలాగే తమిళంలో శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం వున్న పాటలను శీర్కాళి గోవిందరాజన్ చేతనే పాడించేవారు.  "కల్లిలే కలై వన్నమ్ కన్డాన్" అనే పల్లవితో ప్రారంభమయే ఆ పాట తమిళనాట ఈనాటికీ సూపర్ హిట్ పాటగానే చెలామణి అవుతూవుంది.

అదే సన్నివేశానికి దాదాపు అదే భావజాలంతో ఆత్రేయగారు తెలుగులో  " అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవారాయా..."అనే మకుటంతో వ్రాసిన పాట. అక్కడ తమిళంలో కన్నదాసన్  పల్లవుల కళావైభవాన్ని చాటిచెపితే , ఇక్కడ తెలుగులో ఆత్రేయగారు 15వ శతాబ్దానికి చెందిన విజయనగరం (హంపీ) 'మూరు రాయర గండడు ' శ్రీకృష్ణ దేవరాయల కాలంనాటి సంగీత, సాహిత్య, శౌర్య వీర్య ప్రతాపాలను, శిల్పకళా ప్రాభవాన్ని ఘనంగా వర్ణించారు.  ఇందుకుగానూ ఆదుర్తివారు తెనాలి రామకృష్ణ చిత్రంలోని ఎన్.టి.ఆర్, అక్కినేనిల స్టాక్ షాట్స్ ను సందర్భోచితంగా ఉపయోగించి సన్నివేశాన్ని రక్తి కట్టించడంతోపాటూ ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్. అభిమానుల ఆదరాభిమానాలను కూడా మూటకట్టుకున్నారు.

"శిలలపై శిల్పాలు చెక్కినారు 
మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు"

పాట మెట్టు కట్టడం విషయంలో మహాదేవన్ కొంత అదనపు కృషిని చేసారు. తమిళం పాటకు తెలుగు పాటకు మధ్య చాలా మార్పునే చేసారు. పాట ఔన్నత్యాన్ని గుర్తించి మహాదేవన్ ఈ పాటను రాగప్రధానంగా చేయ సంకల్పించి రాగమాలికలో స్వరపర్చారు. అందుకుగాను  శుధ్ధ శాస్థ్రీయ రాగాలైన శుధ్ధ ధన్యాసి, పడ్దీప్ (కర్నాటక సంగీతంలో గౌరీ మనోహరి), నఠభైరవి , ఖరహరప్రియ రాగాలను సమర్ధవంతంగా , సందర్భోచితంగా ప్రయోగించారు. సంగీత దర్శకుడికి, గాయకుడికి కూడా సంగీత రాగాల విషయంలో సరైన అవగాహన వున్నప్పుడే రాగమాలిక గీతాలు శ్రవణానందం కలిగిస్తాయి. ఒక రాగం లో నుండి మరో రాగంలోకి మారాలంటే ఏ స్వరం మీద, ఏ స్థాయి దగ్గర మార్పు చేస్తే సహజంగా, సున్నితంగా వుంటుందో బాగా ఆలోచించి చేయవలసివుంటుంది. అందరూ రాగమాలికలలో పాటలు చేస్తారు, పాడతారు. కానీ వాటికి సార్ధకత కలిగేది ఏ కొద్దిమంది గాత్రాలలో మాత్రమే. అందుకే ఈ పాట ఘంటసాలవారిని మాత్రమే వరించింది.

ఈ పాటను సాకీతో ప్రారంభించి, సాకీతోనే ముగించడం ఒక విశేషం.

కె.వి.మహాదేవన్ పాటలు పాడడమంటే ఘంటసాల మాస్టారికి నల్లేరు మీది బండి వాటమే. మంచి మనసులు చిత్రంతో ప్రారంభమైన మహాదేవన్- ఘంటసాలల స్వరప్రస్థానం ఓ పుష్కరం పాటు నిరాటంకంగా కొనసాగింది. వారిద్దరి మధ్య చక్కటి సంగీతావగాహన, సాన్నిహిత్యం వుండేది.  క్వాలిటీ, పెర్ఫెక్షన్ అంటూ గాయనీగాయకులను తీవ్రంగా శ్రమపెట్టే నైజం మహాదేవన్ కు లేదు. ఒకటి, రెండు టేకులలోనే తనకు కావలసిన నాణ్యతను గాయకులనుండి రాబట్టుకునేవారు. అందువల్ల మహాదేవన్ రికార్డింగ్ అంటే ఘంటసాల మాస్టారు ఎప్పుడూ హాయిగా, ఆనందంగా ఫీల్ అయ్యేవారు. అందువల్లే 'శిలలపై శిల్పాలు " పాట ఘంటసాలవారి గళంలో అమోఘంగా పలికింది. చెక్కు చెదరని శ్రుతిలయలు , భావగాంభీర్యం, మంద్ర,  తార స్థాయిలలో కూడా ఒకేరకమైన నాదానుభూతిని  కలిగిస్తూ, సుశ్రావ్యంగా  ఈ పాటను అనితర సాధ్యంగా ఘంటసాల ఆలపించారు.

విజయనగరరాజుల కళా ప్రాభవాన్ని మనకళ్ళెదట చూపించారు. కళ్ళులేనివారు కూడా ఈ పాటను వింటూ ఆనాటి దృశ్యాలను అనుభవించే విధంగా ఈ పాటను మాస్టారు వినిపించారు. ఒకే సమయంలో అనేక రసాలను తన గళం ద్వారా పోషించి తెర మీది నటుల హావభావాల ప్రకటనకు దోహదం చేసారు.

ఈ పాట సన్నివేశం చిత్రంలో చాలా కీలకమైనది. అంధురాలైన భార్యకు ప్రకృతిలోని అందాలన్నీ కళ్ళకుకట్టేలా వర్ణిస్తూ  ఓ మంచి మనసున్న భర్త పాడే పాట ఇది. ఈ పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి ఎంతో ఉదాత్తంగా నటించారు.

శ్రీకృష్ణ దేవరాయల వారి పాగాలో కలికితురాయిలా, ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక మణిమకుటంగా "శిలలపై శిల్పాలు చెక్కినారు" పాట తెలుగు చరిత్ర వున్నంతవరకూ శాశ్వతంగా నిలిచిపోతుంది. 








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...