"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
43వ సజీవరాగం - శేషశైలావాసా శ్రీ వేంకటేశాచిత్రం - శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - పెండ్యాల
పల్లవి:
శేష శైలా వాసా శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా
శేష శైలా వాసా ...
చరణం 1:
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు......2
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి... 2
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి..
శేషశైలావాసా...
చరణం 2:
పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి..2
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ...
చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోము
కరువుతీరా కాంచి తరియింతుము మేము...
శేషశైలావాసా శ్రీవేంకటేశా...
" వేంకటాద్రీ సమం స్థానం
బ్రహ్మాండే నాస్తికించన
వేంకటేశ సమో దేవో
నభూతో నభవిష్యతి"
వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు; అలాగే , వేంకటేశ్వరుని తో సమానమైన దైవమూ లేడు.
నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటూ సంవత్సరం పొడుగునా నిత్యం కళ్యాణంగా విరాజిల్లే ఏకైక క్షేత్రం తిరుపతి తిరుమల. సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు నిర్విరామంగా జనసందోహంతో శ్రీవేంకటేశ్వరుని సన్నిధి అనుక్షణం కోలాహలంగా, కళకళలాడుతూ వుంటుంది. భక్త శిఖామణుల స్తోత్ర గీతాలు సప్తగిరులలో సదా ప్రతిధ్వనిస్తూనే వుంటాయి.
తాళ్ళపాక అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, భగవద్రామానుజాచార్యులు వంటి దాసభక్తులెందరో కలియుగ దైవం అయిన వెంకటాచలపతిని కీర్తించి, ఆరాధించి, తరించి, పునీతులయ్యారు. అపర రామభక్తుడు, సంగీత త్రిమూర్తులలో ఒకరైన సద్గురు త్యాగరాజస్వామి వారు కూడా తిరుపతి వేంకటేశ్వరుని మీద కీర్తనలు రచించారు.
వీరి కోవలోనికి చెందినవారే ఈ శతాబ్ది గాయకుడిగా అందరిచేత కొనియాడబడుతున్న భక్త గాయక శిఖామణి, కోట్లాది తెలుగుల అభిమాన గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరావు. తిరుపతి వేంకటేశ్వరుని మీద ఘంటసాల వేంకటేశ్వరుడు ఆలపించిన భక్తి గీతాలు అసంఖ్యాకం. ఆయన ఆలపించిన గీతాలన్నీ ఈనాటికీ ఏడుకొండలలో మార్మోగుతూనే వుంటాయి.
ఘంటసాల కంఠమాధుర్యానికి, గుండెల్లో దాగిన భక్తి తత్పరతకు మెచ్చి తిరుపతి వేంకటేశ్వరుడు ఈ ఘంటసాల వేంకటేశ్వరుని తన ఆస్థానగాయకునిగా నియమించుకొని ఆశీర్వదించాడు, తనలోనే ఐక్యం చేసుకున్నాడు.
తిరుమల-తిరుపతి దేవస్థాన గాయకుడిగా నియమించబడడానికి తొమ్మిదేళ్ళ ముందే శ్రీ వేంకటేశ్వర మహత్యం సినీమాలో ఘంటసాల భక్తగాయకుడి గా శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో గానం చేస్తూ తెరమీద కనిపించారు.
ఆ సన్నివేశం లో ఘంటసాల ఆలపించిన " శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాట నేటి మన సజీవరాగం.
శ్రీనివాసుడికి సంబంధించిన ఏ గాధలైనా, ఏ గీతాలైనా, కార్యక్రమాలైనా ప్రజలను అమితంగా ఆకర్షిస్తాయి, కనకవర్షం కురిపిస్తాయి. శ్రీ వేంకటేశ్వరుడి మహత్యాన్ని సినీమాగా పి.పుల్లయ్య రెండుసార్లు నిర్మించి ఘనవిజయం సాధించారు. 1939 లో మొదటిసారి తీసినప్పుడు పుల్లయ్య గారి సతీమణి శాంతకుమారి పద్మావతిగా, సి.ఎస్.ఆర్. శ్రీనివాసుడిగా నటించారు. అదే కథను మరల 1960 లో నిర్మించగా అందులో ఎన్.టి.రామారావు శ్రీనివాసునిగా, సావిత్రి పద్మావతిగా నటించారు. మొదటి చిత్రంలో పద్మావతిగా నటించిన శాంతకుమారి రెండవ చిత్రంలో శ్రీనివాసుని పెంపుడు తల్లి వకుళమాతగా నటించారు. కాలం తెచ్చే మార్పును ఎవరైనా స్వీకరించక తప్పదు.
1960 లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్యం లోని పాటలన్నీ అమృతగుళికలు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలన్నీ విపరీత జనాదరణ పొందాయి. ఈ చిత్రంలోని పాటలన్నిటిలోకి తలమానికంగా, ఆపాతమధురంగా , అజరామరంగా నిల్చిపోయిన గీతం ఆత్రేయ వ్రాసిన "శేషశైలావాసా శ్రీవేంకటేశా" అనే ఏకాంతసేవా గీతం. ప్రధాన సినీమా కథాకధనంతో ఏమాత్రం సంబంధం లేకుండా సినీమా చివరలో శ్రీవారి ఉత్సవ సన్నివేశాలు (స్టాక్ షాట్స్) చూపించే ఈ సందర్భంలో స్వామి సన్నిధిలో ఒక భక్తుడు గానం చేస్తున్నట్లుగా ఈ ఏకాంత సేవ గీతాన్ని చిత్రీకరించారు. ఈ పాటను తెరమీద కూడా ఘంటసాలే పాడుతూ కనిపించడం ఒక విశేషం.
ఘంటసాల చిత్రరంగ ప్రవేశం చేసిన తొలిరోజులలో భుక్తి కోసం 'సీతారామ జననం', 'త్యాగయ్య', 'యోగి వేమన' వంటి చిత్రాలలో చిన్న చిన్న వేషాలు ధరించినా, గాయకుడిగా స్థిరపడిన తర్వాత తెరమీద నటన జోలికి పోలేదు. అనేకమంది నిర్మాతలు ఆయనకు తగిన పాత్రలిచ్చి నటించమన్నా సున్నితంగా తిరస్కరించారు. తాను నటించడం ద్వారా ఇతర నటులకు వచ్చే అవకాశాలు పొగొట్టి వారి కడుపుమీద కొట్టడం తనకు ఇష్టంలేదని, సంగీతం ద్వారా వచ్చే అవకాశాలే తనకు చాలని తనని అభిమానించి వచ్చిన నిర్మాతలకు నచ్చచెప్పిన ఉదారుడు, సహృదయుడు ఘంటసాల.
కానీ, పి పుల్లయ్యగారి బలవంతాన్ని, గాఢమైన కోరికను త్రోసిపుచ్చలేక ఈ పాత్రలో కనిపించడానికి అంగీకరించారు. ముఖ్యంగా ఈ సన్నివేశం తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో చేసే గానానికి సంబంధించినది కావడంతో తను తెరమీద నటించడానికి ఒప్పుకున్నారు. వాహినీ స్టూడియో లో వేసిన ఒక సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. (ఈ పాట చిత్రీకరణ సమయంలో ఓ రెండుగంటలపాటు నేనుకూడా ఆ సెట్ లో ఉన్నాను). ఈ పాటలో ఘంటసాలవారితో పాటు సంగీత దర్శకుడు పెండ్యాల, వేణువాద్య కళాకారుడు నంజప్ప, తంబురాతో సంగీత సహాయకుడు డి.బాబూరావు, మృదంగం పై వాహినీ సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాం, మొదలగువారు కూడా కనిపిస్తారు.
దాక్షిణాత్య దేవాలయాలలోని కళా సంస్కృతి చాలా ఉన్నతంగావుంటుంది. ఆచారవ్యవహారాలను నియమనిష్టలతో పాటిస్తారు. అక్కడి కళాకారులు వివాహాది కార్యక్రమాలలో పాల్గొనేప్పుడు ఒకలా , రాజాధి రాజులు సమక్షంలో ఒకలా తమ వస్త్రధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. దేవాలయాలలో అయితే వస్త్రధారణ విషయంలో వారి ఆచారాలు మరింత కఠినంగా వుంటాయి. పురుషుల విషయంలో మామూలు ప్యాంట్, షర్ట్ లతో వెళ్ళేవారిని ఆలయంలోనికి అనుమతించరు. కేవలం పంచెలు మాత్రమే ధరించాలి. నడుము కు పైభాగాన ఏ ఆఛ్ఛాదన లేకుండా వుండాలి. నడుముకు విధిగా అంగవస్త్రాన్ని బిగించి కట్టుకుంటారు. దైవ సన్నిధిలో తమ తమ అహంకారాలు, అభిజాత్యాలు వదలి వినయ విధేయతలతో భక్తితో మసలుకోవాలనేది వారి భావన. సంగీత కచేరీల సమయంలో కూడా గాయకులు, ప్రక్కవాద్య కళాకారులు ఈ నియమాలను తప్పక పాటిస్తారు. అయితే తిరుమల తిరుపతి ఆలయప్రవేశానికి అంతటి నియమ నిబంధనలు లేవనిపిస్తుంది. అందుకే 'శేషశైలావాసా' పాట చిత్రీకరణలో ప్రధాన గాయకుడైన ఘంటసాలవారు తప్ప మిగిలినవారంతా సాదా దుస్తులలోనే కనిపిస్తారు.
పెండ్యాల ఈ రక్తి, భక్తి, ముక్తిప్రదమైన గీతాన్ని రీతిగౌళ రాగంలో స్వరపర్చారు. రీతిగౌళ రాగం సినీమాలలో అరుదుగా వినిపించే రాగం. ఘంటసాలవారి గిరిజాకళ్యాణంలో (రహస్యం) వచ్చే 'ఈశుని దాసుని చేతువా అపసదా...' అనే చరణానికి కూడా రీతిగౌళ రాగాన్ని ఉపయోగించారు.
రీతిగౌళ రాగం ఖరహరప్రియ రాగ జన్యం. వక్ర షాఢవ- సంపూర్ణ రాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు వుంటాయి. ఈ రాగంలో తెలుగు సినీమా పాటలు అరుదు. త్యాగయ్యగారి ' ద్వైతము సుఖమా', 'పరిపాలయ', 'చేరరావదేమిరా' మొదలగు ప్రసిధ్ధ కృతులు రీతిగౌళ రాగంలోనే మలచబడ్డాయి.
గతకాలపు భక్త గాయకులందరినీ మనసులో పెట్టుకొని అత్యంత భక్తిశ్రధ్ధలతో ఘంటసాలవారు 'శేషశైలావాసా శ్రీ వేంకటేశా' గీతాన్ని సంప్రదాయబధ్ధంగా గానం చేశారు. వేంకటేశ్వరస్వామి తన ఏకాంతంలో తన భార్యలతో ఎలా మసలుకొంటాడో అనే దానిని ఆత్రేయ రక్తికరంగా, సూచనప్రాయంగా తెలియజేశారు. స్వామి లీలలన్నీ భక్తి ముక్తి దాయకం అని సామాన్యులందరికీ అర్ధమయేలా తేట తేట తెలుగులో సుస్పష్టంగా, రీతిగౌళ రాగాన్ని ఆస్వాదిస్తూ భావయుక్తంగా గానం చేశారు ఘంటసాల. ఈ భక్తిగీతంలో తెరమీద మనకు కనిపించేవి మృదంగం, ఫ్లూట్, తంబురాలే అయినా తమ ఆర్కెస్ట్రాలో జలతరంగ్, ట్యూబోఫోన్, తబలా వంటి వాద్యాలను కూడా పెండ్యాల ప్రముఖంగా శుశ్రావ్యంగా వినిపింపజేసి శ్రోతలను భక్తితన్మయత్వానికి లోనయేలా చేశారు. తాను పాడే ప్రతీ పాటా భగవదత్తం అని భావించి గానం చేసే ఘంటసాలవారికి 'శేషశైలావాసా' గీతం ఎంతో అపురూపమైనదీ, అపూర్వమైనది. అందుకే ఈ పాట కలియుగ దైవం వేంకటేశ్వరుడు వున్నంతవరకూ సజీవరాగంగా సదా మన మదిలో మెదులుతూనే వుంటుంది.
ఇక్కడ, ఎంత వద్దనుకున్నా నా మనోచాపల్య బలం వలన మరో చిన్న విషయాన్ని చెప్పకుండా వుండలేకపోతున్నాను. శ్రీ వేంకటేశ్వర మహత్యం సినీమా చివరిలో చూపించిన స్వామి విగ్రహాన్ని (మోల్డెడ్), స్వామికి అలంకరించిన ఆభరణాలను, మా జంటసంస్థలు మద్రాస్ తెలుగు అకాడెమీ & భారత్ కల్చరల్ ఇంటగ్రేషన్ కమిటీల మీద వున్న గౌరవాభిమానాలతో శ్రీ పి.పుల్లయ్యగారు కానుకగా అందజేశారు. మా జాతీయోత్సవాలన్నింటిలో ఆఖరి మూడవరోజు కార్యక్రమం 'బాలాజీ సంగీత్ కళ్యాణోత్సవం' వేదికమీద ఈ విగ్రహాన్ని సకల శాస్త్రోక్తంగా సర్వాలంకారాలతో నిలబెట్టి ఉత్సవ విగ్రహాలకు తోమాలసేవ మొదలు అన్ని సేవలు జరిపి చివరకు కళ్యాణమహోత్సవం కూడా నిర్వహించి చివరలో ఏకాంతసేవలో అన్నమయ్య 'జో అచ్యుతానంద' జోలపాటను బోంబే జయశ్రీ, సుధారఘునాధన్, ప్రియా సిస్టర్స్ గానం చేస్తూ మంగళం పాడేప్పటికి అర్ధరాత్రి దాటి రెండు గంటలయ్యేది. ఇలా నిర్విరామంగా 1981 (మద్రాస్) మొదలు 2008 (విజయనగరం) వరకు ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల సహాయ సహకారాలతో భారతదేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో దేశ ప్రముఖుల సమక్షంలో జాతీయ సమైక్యతోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలన్నిటిలో నేనూ తగిన పాత్ర వహిస్తూ పాల్గొనే అదృష్టం కలిగింది. దీనంతటికీ కలియుగదైవమైన శ్రీ వేంకటాచలపతి దివ్యాశిస్సులే ముఖ్యకారణంగా భావిస్తాను.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment