Saturday, 24 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 44వ భాగం - ప్రళయ పయోధిజలే ధృతవానపి వేదం - జయదేవుని అష్టపది

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైమూడవ భాగం ఇక్కడ

44వ సజీవరాగం -  ప్రళయ పయోధిజలే ధృతవానపి వేదం

చిత్రం - భక్త జయదేవ
గానం - ఘంటసాల 
రచన - జయదేవుని అష్టపది
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

నవ విధ భక్తులలో ' భార్యాభర్తృ' విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప తత్త్వవేత్త నింబాచార్యుడు. బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన ప్రముఖ వేదాంతి. ద్వైతాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు. ఇతనికే నింబార్కుడు, నింబాదిత్యుడు అని పేర్లు వున్నాయి. భక్తి ఉద్యమం మహా ఉధృతంగా ప్రచారమైన మధ్య యుగానికి చెందిన వైష్ణవ మత ప్రచారకుడు. అవతారపురుషులైన  రాధాకృష్ణుల ప్రణయారాధనను బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చినవాడు.

నింబార్కుని మార్గాన్ని అనుసరించిన మరో గొప్ప కవి జయదేవుడు. 12 వ శతాబ్దానికి చెందిన జయదేవుడు ఉత్కళ (నేటి ఒడిస్సా) దేశంలోని పూరి సమీపాన వున్న కెందుళి గ్రామానికి చెందినవాడు.  భారతదేశంలో కెందుళి పేరుతో ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని గ్రామాలువున్నందువలన జయదేవుని పుట్టుక , స్వస్థలం విషయంలో కొన్ని చారిత్రక వివాదాలున్నాయి. జయదేవుడు సంచారజీవిగా అనేక ప్రాంతాలలో నివసించాడు. వంగదేశపు రాజైన లక్ష్మణసేనుని ఆస్థాన కవీశ్వరునిగా మిక్కిలి ప్రసిధ్ధిపొందిన కవి జయదేవుడు. జయదేవుడు గొప్ప విష్ణుభక్తుడు కూడా. జయదేవుడు సంస్కృతంలో మరికొన్ని రచనలు చేశాడు. రాధాకృష్ణుల ప్రణయతత్త్వాన్ని గీతగోవిందం పేరిట ఒక గొప్ప కావ్యం రచించాడు. జయదేవుని గీతగోవిందం మధ్యయుగం భక్తి ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించింది. 

జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించాడు. గీతగోవిందంలో కృష్ణుడు నాయకుడు  రాధ నాయకి. ఇక్కడ రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ, సఖి. సఖి జీవాత్మను పరమాత్మలో లీనం కావడానికి తోడ్పడుతుంది. అదే గీతగోవిందంలోని సారాంశం. జయదేవుడు ఈ గీత గోవిందాన్ని మధురభక్తితో నాయికా, నాయక పరంగా శృంగార రసాత్మకంగా రచించాడు.

జయదేవుని గీతగోవింద కావ్యాన్నే జయదేవ అష్టపదులని అంటారు. ఈ మధురభక్తి కావ్యంలో 12 అధ్యాయాలు. ఒక్కోక్క అధ్యాయానికి 24 ప్రబంధాలు. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిదేసి ద్విపదలు. వీటినే అష్టపదులంటారు. మొత్తం మీద జయదేవుని గీతగోవింద కావ్యంలో ఇరవైనాలుగు అష్టపదులు, ఎనభైకి మించిన శ్లోకాలు భక్తి, శృంగారాలను ప్రతిబింబిస్తూ వర్ణించబడ్డాయి. కృష్ణుడే జయదేవుని రూపంలో వచ్చి గీతగోవిందం లోని  కొన్ని అసంపూర్ణ భాగాలను పూరించడం; జయదేవుని ప్రాణసఖి, భార్యయైన పద్మావతి అకస్మాత్తుగా మరణిస్తే తిరిగి తన ప్రార్ధనలతో పునర్జీవం కల్పించడం వంటి సంఘటనలు భక్తునిగా జయదేవుని మహిమలను చాటి చెపుతాయి. 

అటువంటి సుప్రసిద్ధ సంస్కృత కవి జీవితచరిత్ర  " భక్త జయదేవ" పేరిట ఒక సంగీతభరిత చిత్రంగా  రూపొంది తెలుగు ప్రేక్షకులను అలరించింది. 1938లో మొదటిసారి విశాఖపట్నంలో " భక్త జయదేవ" సినీమా నిర్మించబడింది.

మరల 1961 లో లలితకళా నికేతన్ నారాయణరావు, పి.వి.రామారావు దర్శకత్వంలో భక్త జయదేవను అక్కినేని, అంజలీదేవి లు నాయికా నాయకులుగా తీశారు. భరణీ రామకృష్ణ గారు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందింది. సాలూరు రాజేశ్వరరావుగారి సంగీత విద్వత్తు, ఘంటసాలవారి గానపటిమ‌, అక్కినేని నాగేశ్వరరావుగారి నటనా వైదుష్యం ఈ ' భక్త జయదేవ' సినీమాను ఒక గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దింది. 

జయదేవుని గీతగోవిందంలోని అతి రమణీయమైన అష్టపదులను, శ్లోకాలను తీసుకొని  వాటికి సముద్రాల రాఘవాచార్యులవారి మరికొన్ని మధురాతి మధుర గీతాలను జతపర్చి భక్త జయదేవ సినీమాలో పొందుపర్చడం జరిగింది. సంగీతపరంగా ఈ చిత్రంలో అగ్రతాంబూలం ఘంటసాల మాస్టారిదే. వారిలోని సంగీత ప్రజ్ఞాపాటవాలకు దర్పణం పట్టే చిత్రం భక్థ జయదేవ. ఇందులో జయదేవ కవి విరచితమైన "ప్రళయ పయోధిజలే" అని దశావతారాల విశిష్టత ను చాటిచెప్పే అష్టపదే నేటి మన సజీవరాగం.

నిజానికి ఈ చిత్రంలోని ప్రతీ గీతము , శ్లోకమూ సజీవరాగమే. ఈ సినీమాలో ఉపయోగించిన  -

- యారమితా వనమాలి
- ధీరసమీరే యమునాతీరే( మోహన)
- ప్రియే చారుశీలే
- ప్రళయ పయోధిజలే (రాగమాలిక)
వంటి అష్టపదులు ;
- మందారగంధ సంయుక్తం
- మేఘైర్మేమరమంబరం వనభువ శ్యామా
- వాగ్దేవతా చరిత
- సాధుస్వరముభోయమస్తు
వంటి జయదేవుని రచనలు ;
సముద్రాల రాఘవాచార్యులవారి
- దయగనుమా జగదీశ
- నాదుప్రేమ భాగ్యరాశి
-  నీ మధుమురళీ గానలీల(హమీర్ కళ్యాణీ)

ఇలా ప్రతి ఒక్కటీ ఒక్కొక్క ఆణిముత్యం. వీటన్నింటినీ ఘంటసాలవారే ఆలపించి చిత్రానికి ఔన్నత్యం కల్పించారు. మిగిలిన గీతాలను పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, సీతారామానుజాచార్యులు ఆలపించారు.

భక్త జయదేవ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతమే సగం ప్రాణం. ఇక్కడ జయదేవుని అష్టపదుల స్వరరచన విషయమై ప్రస్తావించాలి. అన్నమయ్య కీర్తనలలాగే, జయదేవుని అష్టపదులు కూడా రాగని‌ర్దేశనం చేయబడి వాటికి వరసలు కట్టి గానం చేయబడ్డాయి. అయితే ఆ అసలు బాణీలు ఏవి ఇప్పుడు లేవు. గాయకులంతా ఎవరికి తోచిన రాగాలలో వరసలు కట్టి వారివారి మనోధర్మాన్ని బట్టి గానం చేస్తున్నారు.

ఆ రకంగా సాలూరు వారి ప్రతిభావ్యుత్పత్తులకు నిదర్శనంగా భక్థజయదేవ పాటలు నిల్చిపోయాయి. ఈ సినీమా విడుదలైన కొన్నేళ్ళకు ఘంటసాల మాస్టారు కూడా ఓ నాలుగు అష్టపదులను తనదైన బాణీలో వరసలు కట్టి గ్రామఫోన్ రికార్డ్స్ గా విడుదల చేశారు. అలాగే తన సంగీతకచేరీలలో పాడుతూవచ్చారు.

ఈ నాటి "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" గా భక్త జయదేవలోని " ప్రళయ పయోధి జలే" గీతాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనిని ఘంటసాలగారు ఏకగళగీతంగా ఆలపించారు. పరమాత్మ అయిన మహావిష్ణువు యొక్క దశావతార వర్ణనలను అత్యద్భుతంగా, అత్యంత భక్తిభావంతో గానం చేశారు మాస్టారు. తెరపై ఇదొక నృత్యగీతం. జయదేవుని(అక్కినేని) గానానికి ఆయన భార్య( అంజలీదేవి) నటనమాడే దృశ్యం. ఏడుం పావు నిముషాలు నిడివిగల ఈ దశావతార గీతంలో మనకు శుధ్ధ శాస్త్రీయ రాగాలైన - కాపి, హిందోళ, హంసానందిని, కేదారగౌళ, మోహన రాగాలను అతి సమర్ధవంతంగా ప్రయోగించారు సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. అంతే సమర్ధవంతంగా మృదుమధురంగా, భక్తిభావం ప్రస్ఫుటం చేస్తూ ఈ గీతానికి ఘంటసాల ప్రాణప్రతిష్టచేశారు. లలిత, శాస్త్రీయ సంగీత నుడికారం ఘంటసాలవారి గళంలో అలవోకగా పలుకుతుందనే పండిత విమర్శకుల ప్రశంస మరోసారి భక్త జయదేవ గీతాలలో నూటికి నూరుశాతం ఋజువు అయింది. ఈ గీతం లో రాజేశ్వరరావుగారు  సితార్, ఫ్లూట్, క్లారినెట్,  వీణ,  వైయొలిన్స్, జలతరంగ్, తబలా, మృదంగం,  కోల్, తబలాతరంగ్, పక్వాజ్, మువ్వలు, తాళాలు వంటి వాద్యాలను ఉపయోగించారు. 

సంగీతదర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావు, గాయకుడిగా ఘంటసాలవారి కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసిన భక్త జయదేవ గీతాలు ఎన్ని యుగాలైనా సజీవరాగాలే. 

భక్త జయదేవ  పాటలు విడుదలైన కొత్తల్లో రోజూ ఆ పాటలను ఘంటసాల మాస్టారు ఇంట్లో లేని సమయంలో గ్రామఫోన్ లో వింటూవుండేవాళ్ళం.  ఒకరోజు ఇంట్లోని ఆడవారు ఈ భక్త జయదేవ పాటలు అరగదీస్తున్న సమయంలో మాస్టారు సడన్ గా బయటనుండి వచ్చి హాల్ లో అడుగుపెట్టారు. ఆ సమయంలో "ధీర సమీరే యమునాతీరే"  పాట వినిపిస్తోంది. ఈపాటకు అర్ధం తెలుసునా అని మాస్టారు అడిగారు. అక్కడున్నవారంతా తెల్లబోయి చూశారు. తర్వాత మాస్టారు సావిత్రమ్మగారికి ఏం చెప్పారో ఏమో కానీ భక్త జయదేవలోని కొన్ని అష్టపదులు రికార్డ్ ర్యాక్ లో కనపడలేదు. జయదేవ అష్టపదులు సంస్కృత భాషలో వుండబట్టి  సరిపోయింది. అంత మంచి సుశ్రావ్య గీతాలు అందుబాటులోకి వచ్చాయి. వాటినే మన తెలుగు భాషలోకి అనువదించి వుంటే సగం అష్టపదులు సెన్సార్ బారినపడి మనకు వినే భాగ్యం కలిగేది కాదు. జయదేవుని మధురభక్తి తత్త్వాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకునే జ్ఞానం అలవడనంతవరకు  బుధ్ధి వికసించని పసివాళ్ళే. గీత గోవిందంలోని కొన్ని అష్టపదుల సాహిత్యం for Adults only మాత్రమే. 

అయితే ఇది ఆరు దశాబ్దాల క్రితం మాట. ఇప్పుడు మల్టీమీడియా పుణ్యమాని చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిలో లోకజ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...