Saturday, 21 September 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 48వ భాగం - దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయేడవ భాగం ఇక్కడ

48వ సజీవరాగం -   దేవ దేవ నారాయణ  పరంధామ పరమాత్మ
చిత్రం - శ్రీ కృష్ణార్జున యుద్ధం
గానం - ఘంటసాల 
రచన - పింగళి
సంగీతం - పెండ్యాల

పల్లవి:
దేవ దేవ నారాయణ 
పరంధామ పరమాత్మ 
నీ లీలలనెన్నతరమ 
భక్త పారిజాతమా !! దేవ దేవ

ఆ......... (రాగాలాపన)

చరణం:
సకల భువన సంచాలక 
అఖిల దనుజ సంహారక
ఎప్పుడెచట అవతరించి
ఏమి నటన సేతువో !! దేవ దేవ

చరణం:
దీన సుజన పరిపాలా
 ఆ....... ( ఆలాపన)
దీన సుజన పరిపాలా
మునిసన్నుత గుణజాల
ధరణినేమి మహిమచాట
ద్వారకలో నుంటివో
దేవ దేవ నారాయణ ....
రాగాలాపన .......
...........

దేవ దేవ నారాయణ ధరణి 
నేమి మహిమ చాట
ద్వారకలో నుంటివో !! దేవ దేవ!!

తెలుగు పౌరాణిక నాటక రంగం మీద మరాఠీ నాటక రంగ ప్రభావం వుండేదన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు పౌరాణిక నాటక పద్య సంగీతమంతా మరాఠీ సంగీత బాణీనే అనుకరించి అనుసరించింది. 1940ల నాటి తెలుగు సినీమాలు కూడా రంగస్థల బాణీలోనే సాగాయి. 

సుప్రసిధ్ధ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు పౌరాణిక నాటక రంగం నుండి వచ్చినవారు. ఆనాటి రంగస్థలనటుడు, గాయకుడు, రచయిత అయన దైతా గోపాలంగారి ప్రభావం పెండ్యాలగారి మీద ఎంతైనా వున్నది. గంధర్వ గాయకుడు ఘంటసాలవారి సహకారంతో పెండ్యాల గారు పౌరాణిక సినీమా సంగీతం మీద ఎన్నటికీ చెరపలేని చిరస్థాయి ముద్ర వేశారు.

1960 వ దశకం తెలుగు సినీ సంగీతానికి ఒక సువర్ణాధ్యాయం. ఆ దశాబ్దంలో వచ్చిన సినీమా సంగీతమే ఆపాతమధురమై కోట్లాది తెలుగు హృదయాల సంగీత పిపాసను ఈనాటికీ తీరుస్తున్నది. ఆ విధంగా 1962 లో వచ్చిన రసరమ్య సంగీతభరిత పౌరాణిక చిత్రరాజమే కె.వి.రెడ్డిగారి  "శ్రీకృష్ణార్జున యుధ్ధం".

అలనాటి సుప్రసిధ్ధ నాటక , కథా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసిన "గయోపాఖ్యానం" పౌరాణిక నాటకం ఆధారంగా కె.వి.రెడ్డిగారు ఈ "శ్రీకృష్ణార్జునయుధ్ధం" సినీమాను తీశారు. ఈ సినీమా నాటికి అగ్రనటులిద్దరి మధ్యా అంతర్లీనంగా విరోధం కొనసాగుతున్నా ఇద్దరూ మంచి సంస్కారం గలవారు, వృత్తి ధర్మాలను నిక్కచ్చిగా పాటించేవారు, దర్శకుడు మీద గల భక్తిశ్రధ్ధల కారణంచేతనూ ఈ సినీమా నిర్మాణంలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా సినీమా సాఫీగా సాగిపోయింది. దిగ్గజాలవంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన సినీమా కావడం వలన శ్రీకృష్ణార్జున యుధ్ధం ఘన విజయం సాధించి రజతోత్సవాలు జరుపుకుంది. 

శ్రీకృష్ణార్జున యుధ్ధంలో కృష్ణార్జునులైన ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్.ల తర్వాత తెర వెనుక ప్రముఖ పాత్రను పోషించింది అమరగాయకుడు ఘంటసాలవారే. పెండ్యాలగారి సంగీతంలో, పింగళివారి రచనలో రూపొందిన 19 పాటలు, పద్యాలలో పదకొండింటికి గాత్రదానం చేసింది ఘంటసాల మాస్టారే. శ్రీకృష్ణుడు ఎన్.టి.ఆర్, అర్జునుడు ఎ.ఎన్.ఆర్., నారదుడు కాంతారావు, ఈ మూడు పాత్రలకు సంబంధించిన పాటలను, పద్యాలను పాడడంలో ఘంటసాలవారు చూపించిన వైవిధ్యం, అద్వితీయ గాన ప్రతిభ అనన్యసామాన్యం. ఏ పాటకు ఆ పాటే, ఏ పద్యానికి ఆ పద్యమే ఆ నటులే ఆలపిస్తున్నారా అనే అనుభూతి ని ప్రేక్షకులలో కల్పించడం ఒక్క ఘంటసాలగారికి మాత్రమే సాధ్యం. తెరమీద ఆంగిక, వాచకాభినయాలతో ఎ.ఎన్.ఆర్., కాంతారావు లు అలరిస్తే ఘంటసాల తన గళబలంతో తెరవెనుక తన నటనా ప్రాభవాన్ని చాటిచెప్పారు.

శ్రీకృష్ణార్జున యుధ్ధంలో నారద పాత్రధారి కాంతారావుగారికి ఘంటసాల మాస్టారు పాడిన పాటే ఈ వారం "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవ రాగం". అదే "దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ" పాట. పింగళి నాగేంద్రరావుగారు - 'సకల భువన సంచాలక, 'అఖిల దనుజ సంహారక', 'దీన సుజన పరిపాలా', 'ముని సన్నుత గుణజాల' అనే పదప్రయోగాలతో తన కవితా పటిమను చాటుతూ దేవదేవుడైన నారాయణుని మహిమలను పొగిడారు.

నిజానికి ఈ పాట సినీమా లో టైటిల్స్ మీద వచ్చే పాట. ఆఖరి చరణంలో ఆలాపనలు ముగిసి 'ధరణినేమి మహిమ చాట ద్వారకలో నుంటివో' అన్న పదంమీద  నుండి మాత్రమే నారద పాత్రధారి కనిపిస్తాడు.

టైటిల్ మ్యూజిక్ నిండుగా వినిపించడానికి కావలసిన వాద్యాలన్నీ ఈ పాట నేపథ్యంలో పెండ్యాలగారు ఉపయోగించారు. వీణ, సితార్, వైయొలిన్స్, తబలా, పక్వాజ్, మృదంగం వంటి వాద్యాల సహకారంతో ఘంటసాలవారు ఓ మూడున్నర నిముషాలపాటు  ఈ పాటలో విజృంభించారు. తన సంగీత వైదుష్యాన్ని ప్రదర్శించారు. పెండ్యాల, ఘంటసాల కలయికలో ఈ పాట ఆనాటి పౌరాణిక నాటక సంగీతప్రియులను, ఆధునిక సంగీతప్రియులను సమానంగా అలరించింది.  సినీమాలో ఒక పాటకు గానీ, ఒక పద్యానికి గాని ఆలాపన అనేది ఎంతవరకు వుండాలి, అందుకు కావలసిన రాగభావాలు  ఎంతవరకు, ఎలావుండాలి అనే విషయంలో ఘంటసాలవారు చాలా నిర్దిష్టంగా ఒక ప్రామాణికతను మనకు ఏర్పర్చారు.

పెండ్యాల గారు ఈ పాటను కె.వి.రెడ్డిగారికి చాలా అభిమాన రాగమైన  "అభేరి" ( హిందుస్థానీ భీంఫ్లాస్) రాగంలో స్వరపర్చారు.  కర్ణాటక దేవగాంధారి అనే రాగమే శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి సంప్రదాయం లో అభేరి అనే పేరుతో ప్రచారమయింది. అభేరి ఔఢవ- సంపూర్ణ రాగం. 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగానికి జన్యరాగం. ఈ అభేరి/ భీంప్లాస్ రాగాలలో లెఖ్ఖలేనన్ని సూపర్ హిట్ సినీమా పాటలను మన సంగీత దర్శకులు రూపొందించారు. ఈ రాగంలో ఘంటసాల మాష్టారు కూడా తన వంతుకు  అనేక ఆణిముత్యాలను ఏర్చి కూర్చి మనకు అందించారు.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

1 comment:

  1. తెలుగు పౌరాణిక నాటక రంగం మీద మరాఠీ నాటక రంగ ప్రభావం నేపథ్యాన్ని వివరిస్తూ , శ్రీకృష్ణార్జున యుధ్ధం చిత్రం లో పెండ్యాల నాగేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో , ఘంటసాలవారు తమ గానంలో చూపించిన వైవిధ్యం, అద్వితీయ గాన ప్రతిభను చాలా చక్కగా రచయిత ఈ వ్యాసంలో విశదీకరించారు. ధన్యవాదాలు.

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...