Saturday, 14 September 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 47వ భాగం - రావే ప్రణవరూపిణి రావే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయారవ భాగం ఇక్కడ

47వ సజీవరాగం -  రావే ప్రణవరూపిణి రావే
చిత్రం - స్వర్ణమంజరి
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - పి.ఆదినారాయాణ రావు

పల్లవి:
రావే ప్రణవరూపిణీ రావే
నా కళాసాధనాశక్తి నీవే
కళల బలము చవి చూపగరావే !!రావే

చరణం:
జగతిని కళలే జీవాధారం
జరిగె నేడపచారం
కళోపాసికే తీరని ప్రళయం
సలుపవే లోక విలయం - 2

రావే ...రావే ...రావే....

మధ్యమావతి రాగంలో రెండు ఆవర్తాల ఆలపన... తర్వాత సుమారు ఏడున్నర ఆవర్తాల స్వరాలాపనతో ఘంటసాలవారు ఈ గీతాన్ని అజరామరం చేశారు.

నాదోపాసన దైవీకమైనది. యుగయుగాలుగా సంగీతం భారతీయ సంస్కృతిలో కలసిపోయివున్నది. సంగీతాన్ని బాహ్యదృష్టితో చూస్తే శ్రవణాలకు ఆనందాన్ని కలిగిస్తూ మానసికోల్లాసాన్ని కలిగించడమే దాని ప్రధాన లక్ష్యం. కానీ అనాదిగా ఎందరో మహానుభావులు నాదోపాసనను పరమేశ్వరుని చేరుకునే పరమసాధనగా భావించారు. ఋషులు, యోగులు సుదీర్ఘ కాలం తపస్సుచేసి మహాశక్తులెన్నింటినో తమ స్వాధీనం చేసుకున్నట్లే, ఎందరో మహానుభావులైన నాదోపాసకులు సంగీతాన్ని మహా తపస్సుగా భావించి అనేక అతీతశక్తులను సంపాదించి లోకకళ్యాణం కోసం వినియోగించేవారు. నాదబ్రహ్మను తమ కైవసం చేసుకున్న మహాపురుషులు ఘటనాఘటన సమర్ధులు. ఋషులు, మునులలాగే నాదోపాసకులు కూడా ఈ లోకంలో శాంతిభధ్రతలకు, న్యాయ ధర్మాలకు విఘాతం కల్పించేవారిని తమ సంగీతంతో శపించేవారు, శిక్షించేవారు.

ఈ రకమైనటువంటి నేపథ్యంతో గతంలో మన తెలుగులో కొన్ని జానపద చిత్రాలు వచ్చాయి.  అలాటి ఒక గొప్ప సంగీత కళాకారుడికి జరిగిన అన్యాయం, అపరాధం కధావస్తువుగా 1962 లో ఒక జానపద చిత్రం వచ్చింది. అదే అంజలీ పిక్చర్స్ వారి "స్వర్ణమంజరి" సంగీతరసభరిత చిత్రం. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినీమాలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి, నాగయ్య, రాజనాల ముఖ్య పాత్రధారులు.

సంగీత సరస్వతియొక్క అపార కటాక్షవీక్షణాలు పొందిన సంగీత కళాకారుడికి ఒక రాజాస్థానంలో జరిగిన ఘోర అవమానానికి తీవ్రంగా క్షోభించి ఆవేశ ఆక్రోశాలతో "రావే ప్రణవరూపిణి రావే" అని ఆలపిస్తూ ఒక ప్రళయాన్నే సృష్టిస్తాడు. సంగీతసాహిత్యపు విలువలు కలిగిన ఆ పాటే నేటి మన సజీవరాగం.

జగతికి జీవాధారమైన లలితకళలకు ఒక రాజ్యంలో తీరని అపచారం జరుగుతూంటే అది కళోపాసికి తీరని అవమానం. శాంతి నెలకొనడానికి ధర్మపరిరక్షణ కోసం ఈ లోకాన విలయాన్ని సృష్టించమని ఆగ్రహావేశాలతో ఆ గాయకుడు ఓంకార ప్రణవరూపిణిని వేడుకుంటున్నాడు.

సముద్రాల రాఘవాచార్యులవారి బలమైన సాహిత్యానికి ఈ చిత్ర నిర్మాత, సంగీత దర్శకుడు అయిన పి.ఆదినారాయణరావుగారు మధ్యమావతి రాగంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక పాటను స్వరపర్చారు.  మధ్యమావతి 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ జన్యరాగం. ఔఢవరాగమే అయినా విస్తారమైన రాగసంచారానికి అవకాశం గల రాగం. సాధారణంగా గాయకులు  ఈ మధ్యమావతి రాగ కీర్తన ఆలపనతో తమ కచేరీలను ముగించడం ఆనవాయితీ. మధ్యమావతి కి సరిపోలే హిందుస్థానీ రాగం మేఘ్ మల్హర్ గా చెపుతారు.

"రావే ప్రణవ రూపిణీ రావే" గీతాన్ని ఘంటసాల మాస్టారు చాలా ఆవేశంతో ఒక వృధ్ధుడు పాడుతున్నట్లే రసోద్దీపన కలిగిస్తూ పాడారు. తెరమీద ఈ పాటకు నటించే నాగయ్యగారిని తన మనసులో పెట్టుకొని ఘంటసాలవారు ఈ పాటకు అవసరమైన ముసలివయసు ప్రకంపనలను తన గొంతులో పలికించారు. ఈ పాటను ఆడియోలో విన్నా ఈ పాటను నాగయ్యగారే పాడివుంటారనే భావన మనకు కలుగుతుంది. ఈ పాట చివరలో వినిపించే తొమ్మిది ఆవర్తాల రాగాలాపన, స్వరకల్పనలు ఘంటసాలవారి సంగీతప్రతిభకు దర్పణం పడతాయి.

ఆదినారాయణ రావు గారు ఈ పాటకు సితార్, ఫ్లూట్, తబలా, పక్వాజ్, తబలాతరంగ్, మొదలైన వాద్యాలు ఉపయోగించారు. స్వరకల్పనలలో డ్రమ్స్, సింబల్స్, మెటల్ షీట్స్( ఉరుములు, మెరుపుల ఎఫెక్ట్స్ కోసం) వంటి వాద్యాలుపయోగించి శ్రోతల ఒడలు గగుర్పొడిచేలా చేశారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతశాస్త్రం పట్ల సదవగాహన, వివిధ రాగాలలో పట్టుగల అతి కొద్దిమంది సినీమా సంగీత దర్శకులలో అగ్రగణ్యులు ఆదినారాయణరావుగారు. ఆర్ధికంగా వారు చేసిన కొన్ని చిత్రాలు పరాజయం పొందినా ఏ ఒక్క సినిమా కూడా సంగీతపరంగా సంగీతాభిమానులను నిరాశపర్చలేదు.

స్వర్ణమంజరి సినీమాలో అధ్భుతమైన గీతాలు ఓ పదివరకూ వున్నా ఆర్ధికంగా ఈ సినీమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. స్వర్ణమంజరిలో ఘంటసాలవారు పాడిన ఐదు పాటలు వారికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. వాటిలో సదా మదిలో మెదిలే సజీవరాగం " రావే ప్రణవరూపిణి రావే".





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...