Saturday, 28 September 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 49వ భాగం - జయ జయ జయ నటరాజా రజతశైల రాజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయెనిమిదవ భాగం ఇక్కడ

49వ సజీవరాగం -  జయ జయ జయ నటరాజా 
                            రజతశైల రాజా
చిత్రం - వాల్మీకి
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల

పల్లవి: 
ఓం... ఓం... ఓం....
జయ జయ జయ నటరాజా
రజతశైల రాజా - జయ జయ జయ !
భావ రాగ తాళ యోగ భామాశ్రిత వామభాగ అమరవినుత పాద యుగళ
దేవ దేవ సాంబశివ !! జయ జయ జయ!!


చరణం: 
ధిం తతత ధిం , - 3
తధిన తధిన తాంగటతక  తధిన తధిన 
తధిన తాంగటతక  - 3
తాంగటతక తాంగటతక తం..
ఆలాపన

చరణం: 
నిఖిలాగమ శిఖర ఘటిత 
నిత్యానంద ఖేలనా
చరణాశ్రిత సాధులోక పరిపాలన
చంద్రచూడ చర్మాంబర శింజాణ
మాణిక్య మంజీర అనిత ప్రణవ
!! జయ జయ జయ నటరాజా !!

సృష్ట్యాదిన అంధకారబంధురమై నిశబ్దమయంగా వున్న ఈ జగతిన ముందుగా శబ్ధం, ఆ శబ్దం నుండి ఓంకార ప్రణవనాదం, వేదాలు, సంగీత నాట్యాది కళలు ఉద్భవించాయి. వీటన్నిటికీ మూలాధారమైన సృష్టి స్థితి లయకారుడైన సర్వేశ్వరుడే, ఆ విశ్వేశ్వరుడే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపాలలో ఈ విశ్వాన్ని తన ఆధీనంలో వుంచుకొని పరిపాలిస్తున్నాడు. 

పంచభూతాత్మకుడైన పరమశివుడు వివిధ స్థితిగతులలో ప్రకటించిన ముఖ, హస్త, పాద భంగిమలే భరతనాట్య శాస్త్ర ఆవిర్భావానికి మూలాధారం. పరమేశ్వరుడు నాదప్రియుడు, లాస్యప్రియుడు. తన వామభాగాన అమరివున్న శక్తితో భావ రాగ తాళ ప్రక్రియలతో నిత్యానందభరితంగా లాస్య, తాండవాలను ప్రదర్శిస్తూ  లోకకళ్యాణ కార్యాలను నిర్వహిస్తున్నాడు. 

అటువంటి చంద్రచూడ, చర్మాంబర మాణిక్య మంజీరధారియైన నటరాజు, ప్రమథ గణాలు తనను వివిధ రీతులలో నృత్య గానాలతో స్తుతిస్తూండగా పార్వతీదేవి తో కలసి చేసిన ఆనందతాండవ నృత్య గీతమే "జయ జయ జయ నటరాజా రజతశైల రాజా " అనే మృదు మధుర గీతం. అదే నేటి "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం". 

1963 లో విడుదలైన "వాల్మీకి" పౌరాణిక చిత్రంలోని ఈ పాటను సముద్రాల రాఘవాచార్యులవారు అత్యద్భుతంగా వ్రాసారు. ఈ పాటలో ఆచార్యులవారు ప్రయోగించిన సంస్కృత విశేషణాలు వారి కవితాశైలికి దర్పణం.

ఘంటసాలవారి సంగీత విద్వత్ కు మరో మచ్చుతునక ఈ గీతం. సంగీతదర్శకుడిగా, గాయకుడిగా అద్భుత ప్రజ్ఞ కనపర్చి రూపొందించిన గీతం ఇది.  ఆనాటి ఈ పాటలో వందలాది వాద్యాలు గానీ, డాల్బీ సౌండ్ ఎఫెక్ట్స్ గానీ,  పాట చిత్రీకరణలో కళ్ళు చెదిరే రంగు రంగుల సెట్లుకాని, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన గ్రాఫిక్స్ గాని కానరావు. అయినా ఈ పాట ఎప్పుడు విన్నా ఇందులోని వాద్యగోష్టి అమరికకు నా ఒడలు జలదరిస్తుంది. ఈ పాటలో మాస్టారు ఉపయోగించిన భావ రాగ తాళాలు, జతులు వారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు నిదర్శనం. ఈ పాటలో మాస్టారితో కలసి గళం కలిపిన కోరస్ బృందం కూడా తమ విజ్ఞతను చక్కగా కనపర్చారు.

భారతీయ సంగీతంలో కనపడే ప్రాచీన శంఖనాదాలతో, మృదంగ,  ఛండ, తబలా, తరంగాది తాళవాద్యాలతో, క్లిష్టమైన నృత్య జతులతో ఘంటసాల మాస్టారు ఈ పాటకు గొప్ప ఔన్నత్యాన్ని కల్పించారు.  తెరమీద శివ పార్వతులుగా ధర్మరాజు, శకుంతల చూపిన  సశాస్త్రీయ నృత్యాభినయం రసజ్ఞులను ఎంతగానో అలరిస్తుంది.

ఘంటసాల మాస్టారు ఈ పాటను రూపొందించడానికి 'హంసానందిని' ( సోహినీ) మరియు 'హిందోళం' (మాల్కౌంస్) రాగాలను ఉపయోగించారు. పాట చివరలో వినవచ్చే వాద్య సంగీతం ' హిందోళం'లో' స్వరపర్చారు . 'హంసానందిని' 53వ మేళకర్త రాగమైన "గమనశ్రమ" కు జన్యరాగం. హంసానందినిలో 'ప' స్వరం వుండదు. ఆరు స్వరాలు మాత్రమే కలిగిన హంసానందిని ఒక షాఢవరాగం. శ్రావ్యత కలిగిన ఈ రాగం లలితగీతాలకు , నృత్యగీతాలకు చాలా అనువైన రాగం. ఇక ' హిందోళ' రాగం 20వ మేళకర్త రాగమైన నటభైరవి జన్యమే ఈ హిందోళం. ఈ రాగంలో రిషభం, పంచమ స్వరాలు లేవు. ఐదు స్వరాలు మాత్రమే కలిగిన ఈ ఔఢవ రాగం హిందోళం చాలా ప్రసిధ్ధిపొందినరాగం. హిందోళం (మాల్కౌంస్) రాగంలో వందలాది సినీమా పాటలు రూపొందాయి. ఘంటసాల మాస్టారు రూ పొందించిన గుండమ్మకధ లోని ఎల్.విజయలక్ష్మి నృత్య సంగీతం కూడా ఈ హిందోళ రాగంలో చేసినదే. అయితే ఆ నృత్యగీతానికి, ఈ వాల్మీకి పాటలోని ఆఖరి నృత్య వాద్య సంగీతం మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఉపయోగించే రాగం ఒకటే అయినా సన్నివేశం, సందర్భాన్నిబట్టి దాని రూపురేఖలలో వైవిధ్యం కనిపిస్తుంది. ఆ విధమైన వైవిధ్యం చూపి శ్రోతలను రంజింపజేయడంలో ఘంటసాల మాస్టారు అద్వితీయులు.

జూపిటర్ పిక్చర్స్ హబీబుల్లా నిర్మాతగా, సి.ఎస్.రావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, రాజసులోచన, లీలావతి రఘురామయ్య, రాజనాల నటించిన ఈ వాల్మీకి సినీమాలో 16 పాటలు పద్యాలున్నాయి. వాటిని ఘంటసాల, రఘురామయ్య, మాధవపెద్ది, పి.సుశీల, కోమల, ఎస్.జానకి ఆలపించారు. ఈ సినీమాలో ఘంటసాలగారు ఆలపించిన ఏకగళ గీతాలు, యుగళగీతాలు, పద్యాలు ఒకదానితో ఒకటి సంబంధంలేకుండా పాత్రౌచిత్యంతో విభిన్నంగా వుంటాయి.

వాల్మీకి సినీమాను జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగు,  కన్నడ భాషలలో ఒకేసారి నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్ వాల్మీకిగా ఆ పాత్రలో జీవించగా కన్నడంలో ఆ పాత్రలో రాజ్ కుమార్ సంపూర్ణంగా లీనమై నటించారు. తెలుగుకు సంగీత దర్శకత్వం, వహించి గానంచేసిన ఘంటసాల మాస్టారే  కన్నడంలో కూడా సంగీతదర్శకుడిగా, గాయకుడిగా మంచి ప్రశంసలందుకున్నారు.

దేవాలయాలలో జరిగే కచేరీలలో, పీఠాధిపతుల సమక్షంలో జరిగే కచేరీలలో ఈ "జయ జయ జయ నటరాజా" గీతాన్ని ఘంటసాల మాస్టారు తప్పక పాడేవారు. 

శ్రుతి ,రాగ , తాళ , భావాలకు అధిక ప్రాధాన్యం కలిగిన ఈ గీతం ఎన్నటికీ మదిలో మెదిలే సజీవరాగమే.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...