Saturday, 10 February 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 16వ భాగం - హాయి హాయిగా ఆమని సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


   

💐గానగంధర్వుడు ఘంటసాల భౌతికంగా మనకు దూరమై ఐదు దశాబ్దాలు కావస్తున్నా ఆయన సుమధుర గాత్రం , స్వరపర్చిన అశేషమైన ఆపాతమధుర గీతాలు మాత్రం సజీవంగా ఇంకా మన చెవులలో మార్మోగుతూనే వున్నాయి. 

ఘంటసాల వారి 50 వ  వర్ధంతి సందర్భంగా  జాతీయస్థాయిలో బహుళ జనాదరణ పొందిన  సువర్ణసుందరి చిత్రంలోని ఈ ఆపాతమధుర గీత విశ్లేషణలోకి  తొంగిచూసేముందు ఈ శతాబ్ది గాయకుని గురించి  వారి గురుపుత్రులు ,  సంగీత సహచరులు  'కలైమామణీ' కీ.శే. శ్రీ పట్రాయని సంగీతరావుగారి మాటల్లో విందాము. 💐🙏



                                                  


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదిహేనవ భాగం ఇక్కడ

16వ సజీవరాగం - 

"హాయి హాయిగా ఆమని సాగే"
 సాహిత్యం :  సముద్రాల రాఘవాచార్య
సంగీతం : పి. ఆదినారాయణ రావు
చిత్రం : " సువర్ణసుందరి " 1957.

               
జి. " హాయి హాయిగా ఆమని సాగే 
  సోయగాల గనవోయీ సఖా, హాయి సఖా....
 
ఘం. లీలగా పువులు గాలికి ఊగ

ఘం. జి.  కలిగిన తలపుల వలపులు రేగ ఊగిపోవు మది ఉయ్యాలగా , జంపాలగా !

జి. ఏమో .... తటిల్లతిక మేమెరుపో ?
మైమరపేమో ...

ఘం. మొయిలురాజు  దరి మురిసినదేమో!
ఘం. జి . వలపు కౌగిళుల వాలి సోలి , ఊగిపోవు...

జి. చూడుమా చందమామ
ఘం. కనుమా వయ్యారి  శారదయామిని 
కవ్వించే ప్రేమా !!

జి. వగలా తూలి విరహిణుల 
ఘం. మనసున మోహము రేపు నగవుల !!ఊగిపోవు!!

ఘం. కనుగవ తనియగా , ప్రియతమా
కలువలు విరిసెనుగా 

జి. చెలువము కనుగొన
మనసానంద నాట్యాలు సేయునోయి ...


కొన్ని సినీమాలు ఎటువంటి కథాబలం లేకున్నా  కథాకథనం బాగుండకపోయినా అందులోని పాటల వలన  ఆ సినిమాలు చిరస్మరణీయమైపోతాయి. అలాటి సాధారణ జానపద చిత్రమే అక్కినేని, అంజలీదేవి జోడీగా నటించిన 1957వ  నాటి " సువర్ణసుందరి" సినీమా. 

అయినా ఆ సినిమా నేటికి బహుళ ప్రచారం లో వుంది. అందుకు కారణం ఆ సినీమాలోని పి.ఆదినారాయణ రావుగారి అద్భుత సంగీతం. జాతీయ స్థాయిలో ఆదినారాయణ రావుగారికి ఎనలేని కీర్తిప్రతిష్టలను, అపరిమితమైన ధనాన్ని సంపాదించి పెట్టిన సినీమా "సువర్ణసుందరి". ఇందులో వున్న 14 పాటల్లో కనీసం ఏడు పాటలైనా ఈ నాటికీ వర్ధమాన గాయనీగాయకులచేత గానం చేయబడుతున్నాయి. ఈ సినీమాలో ఘంటసాలగారు ఒక శ్లోకం, ఒక సోలో, ఒక డ్యూయెట్ మాత్రమే పాడారు.

ఈ సినీమా లో పాటలన్నింటినీ సముద్రాల రాఘవాచార్య వ్రాసారు. వాటిలో మకుటాయమానంగా అపాతమధురంగా, అజరామరత్వం పొందిన గీతం "హాయి హాయిగా ఆమని సాగే". అదే ఈనాటి ఘంటసాలవారి సజీవరాగం. ఇదొక యుగళగీతం. శ్రీమతి జిక్కి, ఘంటసాల ఆలపించిన ఈ గీతం  భారతదేశం లోని అన్ని భాషలవారినీ నేటికీ అలరిస్తూనే వుంది.

"హాయి హాయిగా ఆమని సాగే" పాటకు ఎంతో హాయైన సాహిత్యాన్ని ఆచార్యులవారు సమకూర్చారు. ఈ పాటలో వారు ఉపయోగించిన "ఆమని", "తటిల్లకము" ,"మేమెరుపు - మైమరపు",  "మొయిలురాజు", "శారదయామిని", "తనిసిన కనుగవ", "విరిసిన కలువలు", "చెలువము" , "ఆనందనాట్యాలు" వంటి పద ప్రయోగాలు ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. పాటలోని సాహిత్యాన్నే మరుగుపరిచేలా మనసులను పరవశింపజేసే రాగాలతో ఈ పాటను ఆదినారాయణ రావుగారు స్వరపర్చారు. 

రాగమాలికలో ఈ పాటను రూపొందించడానికి ఆయన హిందుస్థానీ రాగాలను ఎన్నుకున్నారు. అవి - "సోహిని", "బహార్", "యమన్" అనే రాగాలు. ఈ మూడు రాగాలు మానసికోల్లాసాన్ని కలిగించే రాగాలు. వీటికి సమాంతరమైన కర్నాటక సంగీత రాగాలు  - "హంసానంది". ఇది ఆరు స్వరములు మాత్రమే కలిగిన షాఢవరాగం. 53వ మేళకర్త రాగమైన "గమనశ్రమ" రాగ జన్యం. రెండవది - "అసావేరి" - 8వ మేళకర్త రాగమైన హనుమతోడి జన్యరాగం. మూడవది - కళ్యాణి - సంపూర్ణ రాగం. 65 వ మేళకర్త  జన్యం. దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారు.

ఆదినారాయణ రావుగారు స్వరపర్చిన ఈ పాటలోని రాగాలు అటు హిందుస్థానీ బాణీలో, ఇటు కర్నాటక సంగీత శైలిలో ఎంతో ప్రసిధ్ధిపొందిన రాగాలు. ఈ రాగాలలో ఎన్నో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మొదలైన అన్ని భాషలలో ఎన్నో సినీమా పాటలు స్వరపర్చబడ్డాయి. ఆ పాటలన్నింటికి మణిమకుటం "హాయి హాయిగా" పాటంటే అది అతిశయోక్తి కాదనే నా భావన.  ఈ పాట సృష్టించిన చరిత్ర ఇంతా అంతా కాదు.

"హాయి హాయిగ ఆమని సాగే" పాటను తెలుగులో ఘంటసాల, జిక్కి పాడగా, తమిళం "మణాలనే మంగైయిన్ బాగియం" లో జెమిని గణేశన్ కు కూడా ఘంటసాలగారే పాడారు. తెలుగులో ఈ సినిమాలో జిక్కి పాడిన పాట ఇదొక్కటే. తమిళంలో ఈ పాటను ఘంటసాలగారితో పి.సుశీల పాడారు.

ఘంటసాల, జిక్కి పాడిన ఈ రాగమాలిక గీతం ఈనాటికీ గాయకులందరికీ పెను సవాలే. ఈ పాటలో ఘంటసాలగారు ఆలపించిన స్థాయిలో ఆ  ఆలాపనలను, గమకాలు, సంగతులు,  స్వరకల్పనలను అంత మధురంగా, నిర్దిష్టంగా, భావయుక్తంగా, అలవోకగా మరే ఇతర గాయకులు నూరు శాతం పాడలేకపోతున్నారనే మాటను గాయకులు తప్పు పట్టరనే అనుకుంటున్నాను. 

హిందీలో సువర్ణసుందరి సినీమాను హిందీలో తీసినప్పుడు తెలుగు వరసలనే హిందీలో వుంచారు ఆదినారాయణ రావు. "హాయి హాయిగా" పాటను హిందీలో మహమ్మద్ రఫి , లతామంగేష్కర్ పాడారు. లతా, రఫీలంటే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గాయకులు. తెలుగు పాటను విన్న లతా మంగేష్కర్, హిందీపాటను తనతో కూడా ఘంటసాలగారిచేతే పాడించమని సూచించారట. అయితే వాణిజ్యపరమైన వ్యవహారాలవలన ప్రాంతీయ హిందీ గాయకులచేత పాడించవలసిన అగత్యం ఏర్పడింది.  కనీసం రికార్డింగ్ సమయంలోనైనా ఘంటసాలవారు పక్కనవుంటే బాగుంటుందని లతామంగేష్కర్ కోరారట. కానీ, నీతి నియమాలకు, సిధ్ధాంతాలకు ప్రాధాన్యమిచ్చే ఘంటసాలవారు అందుకు అంగీకరించలేదు. ఈ విషయమై ప్రచారం జరగడం కూడా ఆయన ఇష్టపడలేదు. పాట రికార్డింగ్ ముగిసిన తర్వాత తెలుగులో వున్నంత రిచ్ నెస్, క్వాలిటీ తమ  పాటలో ప్రతిఫలించలేదనే  అభిప్రాయాన్ని ఆ ఇద్దరు హిందీ గాయకులు వెలిబుచ్చారని చెప్పుకోవడం జరిగింది. అది ఆ గాయనీ గాయకుల సహృదయతను, సాటి గాయకుని పట్ల గల గౌరవమర్యాదలను తెలియజేస్తుంది. అంతమాత్రాన రఫీ, లతాల విద్వత్తునో, గానప్రతిభనో మనం తక్కువగా అంచనావేయకూడదు. ఎవరి శక్తి వారిదే, ఎవరి ప్రతిభ వారిదే. 

నాదశుధ్ధి, గాత్రశుధ్ధి, గమకశుధ్ధి దైవదత్తం. ఆ దైవానుగ్రహం పరిపూర్ణంగా పొందిన అపూర్వగాయకుడు మన ఘంటసాల మాస్టారు. రాశిపరంగా వారి పాటలు ఇతరులకంటే తక్కువే కావచ్చు, కానీ వాసిలో మాత్రం వారికి సరితూగగల గాయకులు బహు అరుదు.

హిందీ సువర్ణసుందరి సంగీత దర్శకుడిగా పి.ఆదినారాయణరావుగారికి ఆ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి లభించింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో అంజలీ పిక్చర్స్ వారి సువర్ణసుందరి సినీమా ఘన విజయం సాధించింది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...