"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
54వ సజీవరాగం - నీ సుఖమే నే కోరుతున్నాచిత్రం - మురళీకృష్ణ
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - మాస్టర్ వేణు
పల్లవి:
ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా.....
నీ సుఖమే నే కోరుతున్నా ... 2
నినువీడి అందుకే వెళుతున్నా....
!!నీ సుఖమే!!
చరణం 1:
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని
!!నీ సుఖమే!!
చరణం 2:
పసిపాప వలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేశాను - 2
నువు వుండలేనని వెళ్ళావు
!!నీ సుఖమే!!
చరణం 3:
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువుకదా
!!నీ సుఖమే!!
చరణం 4:
నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ..
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని - 2
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి
వారై వేరైనా....
!!నీ సుఖమే!!
"నాకు దక్కని అందం , ఆనందం మరొకరి సొంతమవుతూంటే చూస్తూ వూరుకోవడానికి నేనేం చచ్చు దద్దమ్మను కాను, ఈ ఏసిడ్ తో నీ అందాన్ని, నిన్ను సర్వనాశనం చేస్తాను..." అనే పైశాచిక ప్రేమికులే ఎక్కువగా ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో ... " నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..." అని అనే ఉదారమైన, ఉన్నత సంస్కారం గల భర్తలు ఈ రోజుల్లో బహు అరుదుగా కనిపిస్తారు. కట్టుకున్న భార్యను తనకు నచ్చినవాడితో కలసి సుఖంగా జీవించమని ఆమెతో గల భార్యాభర్తల అనుబంధాన్ని త్రెంచుకొని ఎక్కడో దూరంగా ఒంటరిగా భార్య జ్ఞాపకాలతో అలమటిస్తున్న ఓ భర్త శోక గీతమే నేటి మన సజీవరాగం.
సినీమాలు కేవలం కాలక్షేపం కోసం తప్ప వాటివల్ల సమాజానికి ఏ ప్రయోజనం లేదనే వాదన సరికాదని నిరూపిస్తుంది ఈనాటి ఘంటసాల సజీవరాగం. అదే " నీ సుఖమే నే కోరుతున్నా.."
పి. పుల్లయ్యగారి "మురళీకృష్ణ" సినీమా కోసం ఆత్రేయగారు వ్రాసిన ఈ పాట నిజమైన ప్రేమకు దర్పణం. బాహ్యాకర్షణ వలన ఏర్పడిన ప్రేమలో, అనుబంధంలో మోహావేశం తప్ప నిజాయితీ, గాఢత్వం వుండవు. ఎదుటి మనిషి మనసును, వ్యక్తిత్వాన్ని గుర్తించి హృదయాంతర్గతమైన ప్రేమతో ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడే ఆ ప్రేమానుబంధం శాశ్వతంగా నిలుస్తుంది. అధికారంతో, బలవంతాలతో ప్రేమ నిలవదు. అవసరమైతే ప్రేమ త్యాగానికి సంసిధ్ధం కావాలి. నిజమైన ప్రేమకు అనుబంధానికి గల నిర్వచనమేమిటో ఆత్రేయగారు ఈ పాటలో చాలా చక్కగా విశదీకరించారు.
" అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని...."
"మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువుకదా..."
" నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ ( తొలగిపోవాలనే అర్ధంలో)
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని...."
ఎంతటి ఉదాత్తమైన భావన. ఆత్రేయగారి ప్రేమ -మనసు- మమతలకు సంబంధించిన పాటలేవైనా చాలా మనోమథనం జరిగిన తర్వాతే అక్షరరూపం దాలుస్తాయి.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మాస్టర్ వేణు. విషాదభావోద్వేగాలతో కూడిన ఈ పాటను వేణు శ్రీరాగం లో స్వరపర్చారు. శ్రీరాగం కర్ణాటక సంగీతంలో అతి ప్రాచీనమైనది. 22వ మేళకర్త కరహరప్రియ జన్యం. ఔడవ వక్ర సంపూర్ణ రాగంగా పేర్కొంటారు. ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. సంగీత ముమూర్తుల రచనలెన్నో శ్రీరాగంలో వున్నాయి. ఘనరాగ పంచకంలో శ్రీరాగం ఐదవది. త్యాగయ్య గారి పంచరత్న కీర్తనలలోని "ఎందరో మహానుభావులు" శ్రీరాగంలోనే స్వరపర్చబడింది. శ్రీరాగంలో చేసిన సినీమా పాటలెన్నో బహుళజనాదరణ పొందాయి.
వైయొలిన్స్, సెల్లోస్, సితార్, ఫ్లూట్, జలతరంగ్, తబలా, కాంగోడ్రమ్స్, బాంగోస్ వంటి హెవీ ఆర్కెస్ట్రాతో రూపొందిన ఈ పాటను మాస్టర్ వేణు ఘంటసాల మాస్టారి చేతే పాడించారు. నవరసాలను తన గొంతులో అవలీలగా పలికించగల ఘంటసాల గారు ఈ పాటను మృదుమధురంగా, విషాదభావాలు తొణికిసిలాడేలా గంభీరంగా ఆలపించారు. నాగేశ్వరరావుగారే పాడుతున్నారనే భ్రమను కల్పించారు.
ఉత్తమ ప్రమాణాలతో చక్కని సందేశాత్మక గీతానికి ప్రతీక ఘంటసాలవారి "నీ సుఖమే నే కోరుతున్నా..."
భగ్న ప్రేమికుని పాత్రలకు అక్కినేని నాగేశ్వరరావుగారు పెట్టింది పేరు. డా.కృష్ణ పాత్రలో సంపూర్ణంగా ఇమిడిపోయి నటించారు. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వున్నా అపోహలకారణంగా విడిపోయి అనేక సంఘటనల తర్వాత మరల ఒకటి కావడమే ఈ "మురళీకృష్ణ" సినీమా. అక్కినేని, జమున, హరనాథ్, శారద, ఎస్.వి. రంగారావు, గుమ్మడి మొదలగువారు నటించిన చిత్రం. పద్మశ్రీ పిక్చర్స్ పి పుల్లయ్య దర్శక నిర్మాత.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment