"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
53వ సజీవరాగం - పాడుతా తీయగా చల్లగాచిత్రం - మూగమనసులు
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - కె.వి.మహాదేవన్
పల్లవి:
పాడుతా తీయగా సల్లగా -2
పసిపాపలా నిదరపో
బంగారు తల్లిగా !! పాడుతా !!
కునుకుపడితె మనసు కాస్త
కుదుటపడతది
కుదుటపడ్డ మనసు
తీపి కలలు కంటది - ! కునుకు!
కలలె మనకు మిగిలిపోవు
కలిమి సివరకు - 2
ఆ కలిమి కూడా దోచుకునే
దొరలు ఎందుకు !! పాడుతా !!
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు -2
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
!! పాడుతా !!
మణిసిపోతె మాత్రమేమి
మనసు వుంటది
మనసుతోటి మనసెపుడో
కలసిపోతదీ - 2
సావు పుటక లేనిదమ్మ
నేస్తమన్నది జనమ జనమకదీ
మరీ గట్టిపడతది !! పాడుతా !!
'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు' అని అనడంలో మన భారతీయ సంస్కారం ఎంత గొప్పదో చాటి చెప్పారు కవి ఆత్రేయ. మన కళ్ళెదటలేని, గతించిపోయిన వ్యక్తుల గురించి అనౌచిత్య ప్రస్తావనలు సముచితం కాదని అందరిలోనూ మంచితనాన్నే చూడాలనే నీతిని పరోక్షంగా నేర్పే గీతం "పాడుతా తీయగా చల్లగా". అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.
'మనసులు' తో అంతమయ్యే అనేక సినీమాలలో సాదాసీదా మాటలతో పాషాణ హృదయాలను కూడా కరిగించి కలకాలం గుండెల్లో హత్తుకుపోయేలా గీతాలను రచించి 'మనసు కవి' గా తెలుగువారి మన్ననలందిన గీత రచయిత ఆత్రేయ. ఆత్రేయ వ్రాసిన 'పాడుతా తీయగా' పాట తెలుగు శ్రోతల మనసులలో ఎంతటి సంక్షోభాన్ని, సంచలనాన్ని సృష్టించిందో తెలుగు సినిమా అభిమానులందరికీ తెలుసు. గుండెలను పిండే రాగభావాలతో, శోకరసాభినయాలతో నిండిన ఈ పాట ప్రతి తెలుగుల నోట ఈనాటికీ స్మరించబడుతూనే వుంది. అందుకు కారణభూతులైనవారు ఒకరా, ఇద్దరా! ఆత్రేయ, కె.వి.మహాదేవన్, ఘంటసాల, ఆక్కినేని, సావిత్రి, ఆదుర్తి - అందరూ తెలుగు సినిమా పరిశ్రమలో పట్టుకొమ్మలే. నిత్య స్మరణీయులే.
గోపి, రాధ, గౌరీ - ఈ మూడు బాధాతప్త హృదయాల మౌనవేదనే మూగ మనసులు సినీమా. గత జన్మ వాసనల వల్లన జరిగిన కథను గుర్తుకు తెచ్చుకున్న ఓ యువ జంట. దీనంతటికి నిండుకుండలాటి గోదావరియే సాక్షి.
అంతరాంతరాల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు వున్నా పైకి చెప్పలేని మూగబాధ. దానికి కారణం అంతస్తులలోని అంతరాలు. గొప్పింటి అమ్మాయి, పేదింటి అబ్బాయిల మధ్య గల పవిత్ర మూగ ప్రేమను గుర్తించి వారి అనురాగబంధాన్ని వివాహబంధంతో ముడివేయగల పెద్దలే కరువయ్యారు. అమ్మాయిగారు వేరొకరికి సొంతమైనా తాళి కట్టిన కొద్ది క్షణాలలోనే ఆ భర్త గోదావరికి బలి అవడం, దానితో అమ్మాయిగారిని విధవరూపంలో చూడవలసిరావడం ఎంతటి బాధాకరం. ఆ అమ్మాయిగారిని మౌనంగా ఆరాధించి, అభిమానించే పడవలవాడు గోపి మానసికంగా కృంగిపోతాడు. అమ్మాయిగారి హృదయానికి స్వాంతన కలిగేలా మంచి మాటలతో మరపించడానికి ప్రయత్నిస్తూంటాడు. ఆమె తన బాధలను మరచి నిదురపోయేలా జోలపాడతాడు. ఆ పాటే 'పాడుతా తీయగా చల్లగా'.
కథ, కథనం బాగా వుంటే సాహితి , సంగీతపు విలువలున్న మంచి పాటలు పుడతాయనడానికి మూగమనసులు సినీమాయే సాక్ష్యం. ఈ సినీమా విజయానికి కె.వి.మహాదేవన్ సంగీతం ఎంతో దోహదం చేసింది.
ఈ సినీమా లో వున్న ఎనిమిది పాటలనూ ఆత్రేయ వ్రాయగా వాటిని ఘంటసాల, సుశీల, జమునారాణి ఆలపించారు. ప్రతీ ఒక్క పాట ఆపాతమధురమే. ఘంటసాలగారు మూడు డ్యూయెట్లు, రెండు సోలోలు పాడారు. సన్నివేశపరంగా ఘంటసాలగారు పాడిన రెండు సోలో గీతాలు చిత్రంలో చాలా కీలకమైనవి, ఉదాత్తమైనవి. ఆత్రేయగారి రచన వైదుష్యానికి, మహాదేవన్ స్వరకల్పన ప్రతిభకు, ఘంటసాల గాన రాగ భావనా పటిమకు గీటురాళ్ళుగా నిలిచిపోయాయి. అందులో మొదటిది 'ముద్దబంతి పూవులో', రెండవది 'పాడుతా తీయగా చల్లగా'.
కష్టాల్లో వున్న మనిషికి మనసుకు ఊరట కలిగించే అనునయం, సానుభూతి ఎంతో అవసరం. అది తన మనసెరిగిన వ్యక్తి ద్వారా పొందడం వలన హృదయానికి ఎంతో శాంతిని కలిగిస్తుంది. ఈ పాటను ఆత్రేయగారు చాలా సరళమైన భాషలో మనశ్శాంతి ని కలిగించే జోలపాటలా వ్రాస్తూనే, కొన్ని జీవితసత్యాలను, వేదంత విషయాలను మనసుకు హత్తుకునేలా వ్రాశారు.
సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ ను తెలుగువారికి అత్యంత సన్నిహితుడిని చేసింది 'పాడుతా తీయగా చల్లగా' పాటేనంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మహాదేవన్ పాటల ఆర్కెస్ట్రేషన్ కు ఒక ప్రత్యేకత వుంది. ఆ ముద్ర ఆయన పాటలన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటలో మహాదేవన్ సితార్, ఫ్లూట్, వైయొలిన్స్, గిటార్, తబలా, డోలక్, బాంగోస్, కబాష్ వంటి వాద్యాలను చాలా సమర్ధంగా ఉపయోగించారు. ఈ పాటలో పహడి, కాపి, పీలు రాగాల ఛాయలున్నాయి. ఈ మూడు రాగాలు సున్నితమైన భావాలను, శోక రసాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ రాగ లక్షణాలన్నింటినీ మనసున నింపుకొని మహా ఆర్ద్రతతో ఎలాటి మనస్తాపాన్నైనా తొలగించి మనసారా ప్రశాంతంగా నిదురపోయేలా ఘంటసాల మాస్టారు చాలా భావోద్వేగంతో ఈ పాటను పాటను పాడారు. మధ్య మధ్య సావిత్రి గారి 'గోపి, గోపి' అనే పిలుపులు ఈ పాటకు మరింత రససిధ్ధి కలిగించాయి. ఈ పాటకు ఘంటసాల మాస్టారిని తప్ప వేరొక గాయకుడిని ఊహించుకోలేము. ఇక తెరమీద నాగేశ్వరరావుగారు, సావిత్రిగారు ఈ పాటలో నటించలేదు, పరిపూర్ణంగా జీవించారు. తద్వారా ఆత్రేయ, కె.వి.మహాదేవన్, ఘంటసాల, అక్కినేని, సావిత్రి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
జమున, గుమ్మడి, పద్మనాభం, సూర్యకాంతం, నాగభూషణం, అల్లురామలింగయ్య, పువ్వుల లక్ష్మీకాంతమ్మ, ఇంకా మరెందరో మూగమనసులు ఘనవిజయానికి ఇతోధికంగా దోహదం చేశారు. తెలుగులో సిల్వర్ జూబ్లీ సినీమాగా నమోదైన మూగమనసులు సినీమాను ఎల్.వి.ప్రసాద్ గారు, ఆదుర్తి దర్శకత్వంలో 'మిలన్' గా నిర్మించి గొప్ప ఆర్ధిక విజయంతో పాటు అవార్డ్లు సంపాదించారు.
1971లో 'మూగ మనసులు' సినీమాను నటి సావిత్రి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తమిళంలో 'ప్రాప్తం' విడుదల చేశారు. శివాజీ గణేశన్, సావిత్రి, ఎమ్.ఎస్.విశ్వనాధన్ వంటి ఉద్దండులు పనిచేసినా కూడా 'ప్రాప్తం' సావిత్రికి అశనీపాతం అయింది. ఆవిడ పతనావస్థకు ముఖ్య కారణమయింది.
ఘంటసాలవారి సజీవరాగం గా కోట్లాది తెలుగు హృదయాలలో నిలిచిపోయిన 'పాడుతా తీయగా' ను బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా చిత్ర గాయక చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు తర్వాతి కాలంలో తన సంగీతకార్యక్రమాలకు మకుటంగా చేసుకొని సాధించిన ఘనవిజయం లోకవిదితమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment