Saturday, 19 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 52వ భాగం - నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయొకటవ భాగం ఇక్కడ

52వ సజీవరాగం - నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో 
చిత్రం - పూజాఫలం
గానం - ఘంటసాల 
రచన - డా.సి. నారాయణరెడ్డి
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

పల్లవి: 
నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో!! 
                                నిన్నలేని !!

పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో
                            నిన్నలేని !!

తెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
                           నిన్నలేని...!!

పసిడి యంచు పైట జార... ఆ... ఓ... - 2

పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే  పరవశించెనే..
                            నిన్నలేని !!  

మునిపల్లె రాజుగారు రక్షణశాఖోద్యోగి. ఉద్యోగకాలంలో రచన ఆయన ప్రవృత్తి. తర్వాతి కాలంలో వృత్తి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. మునిపల్లె రాజుగారు వ్రాసిన ' పూజారి' నవల బి.ఎన్.రెడ్డిగారి దర్శకత్వంలో  "పూజాఫలం" సినీమాగా 1964లో విడుదలయింది. అక్కినేని, సావిత్రి, జమున, జగ్గయ్య మొదలగువారు నటించారు. 

ఆ సినీమాలో ఘంటసాలగారు ఆలపించిన  "నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో" అనే  సుశ్రావ్యగీతమే నేటి మన సజీవరాగం.

కొత్తగా ప్రేమాంకురం మొలకెత్తిన హృదయంలో కదలాడే ఊహలకే కన్నులుంటే... అరుణోదయం నవనవోన్మేషంగా వుంటుంది. నిన్నటివరకు లేని  కొత్త  కొత్త అందాలేవో నిద్రలేచినట్లనిపిస్తుంది. ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. హృదయతంత్రులు తెలియరాని తీయని రాగమేదో పలికిస్తాయి. పసిడి అంచు పైట జారిన మేఘబాల అరుణారుణ కాంతిరేఖలకు పరవశించిపోతుంది. ఎంతటి మధురమైన భావన. 

అంతవరకు ఆడగాలి సోకని ఆ అమాయక యువకుని జీవితంలో ఒక అందమైన సుందరితో పరిచయం ఏర్పడగానే కదలాడే మధురోహలు, సుతిమెత్తని మధురభావనలు. ఇంతటి భావుకతతో మనసు పరవశించేలా గీతాలను రాయడంలో అందెవేసిన కలం  కవి డా.సి. నారాయణరెడ్డిగారిది.

బి.ఎన్.రెడ్డిగారు కమర్షియల్ సినీమా డైరెక్టర్ కాదు.  ఆయన తన వాహినీ బ్యానర్ మీద అనేక ఉదాత్త,  కళాత్మక చిత్రాలను నిర్మించారు. బయట నిర్మాతలకు ఆయన చేసిన సినీమాలు బహు అరుదు. ఆయన అభిరుచి, సంస్కారాన్ని అర్ధంచేసుకొని ఆయనతో సినీమా లు తీసిన నిర్మాతలు ఇద్దరు మాత్రమే . ఒకరు "భాగ్యరేఖ" నిర్మాత పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి; మరొకరు శంభూ ఫిలింస్ దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి. ఈయన నిర్మించిన చిత్రమే "పూజాఫలం".

బి.ఎన్.రెడ్డిగారి మనసెరిగిన సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మూల్యమైన అమృతగుళికలవంటి పాటలు తెలుగువారిని అలరించాయి. అలాగే "పూజాఫలం"లోని పాటలన్నీ మధురాతిమధురంగా, ఉదాత్తమైన రీతిలో మలచబడ్డాయి. ఈ సినీమాలో స్త్రీ పాత్రలకే ఎక్కువ పాటలు. ఆ ఏడు పాటలను పి.సుశీల, ఎస్.జానకి , బి.వసంత పాడారు. హీరో అక్కినేని కి ఒకే ఒక్క పాట " నిన్నలేని అందమేదో" పాట.

రాజేశ్వరరావుగారి సిగ్నేచర్ కనిపించే గీతం. రాజేశ్వరరావు , ఘంటసాల ఇద్దరూ ఆరితేరిన సంగీతకళాకారులు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉండేది. మల్లీశ్వరి నుండి యశోదాకృష్ణ వరకు మధ్య వచ్చిన ఎన్నో సినీమాలలో మరపురాని మంజులగీతాలెన్నో వీరి కలయిక లో రూపొందాయి  లలిత సంగీతానికి సరికొత్త భాష్యం చెప్పాయి. వారి వారి ప్రతిభలు వీరి కీర్తి ప్రతిష్టలకు పరస్పరం దోహదపడ్డాయి.

"నిన్నలేని అందమేదో" పాటను ఘంటసాల చాలా మనోజ్ఞంగా, సున్నితంగా  ఆలపించారు. ఆ కథానాయకుడికి తాను తప్ప మరొకరు నప్పరనే రీతిలో పాడి శ్రోతలను ఒప్పించారు. ఇది రాజేశ్వరరావు బాణియని చెప్పకనే చెప్పే గీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రాజేశ్వరరావుగారి ముద్ర సుస్పష్టంగా తెలిపే పాట. "పసిడి అంచు పైట జార" తర్వాత వచ్చే ఆలాపన  ఘంటసాల బాణీకి దర్పణం. ఈ పాటలో వినిపించే  ఫ్లూట్, వైబ్రోఫోన్, సితార్, డబుల్ బేస్, వైయొలిన్స్, తబలాలు, బర్డ్స్ ఎఫెక్ట్స్ ఈ పాటకు కొత్త సొబగులు చేకూర్చాయి. 

ఈ పాట శుద్ధసావేరి రాగలక్షణాలతోనే ఉన్నట్టుగా భావించవచ్చు. ఆరభి లక్షణాలు కొందరికి వినిపించినా, అవరోహణలో గాంధార ప్రయోగం లేదన్నది, నిషాదం కూడా అల్పప్రయోగంగా వినిపిస్తున్నది అన్నది గమనించగలం*. అయినా, సినిమా సంగీత దర్శకుడుకి నిత్యం కొత్తదనాన్ని సృష్టించవలసిన అవసరం ఉన్నది కనుక, రాగలక్షణాల విషయంలో ఎంతో కొంత స్వంతత్రంగా వ్యవహరించడం సినిమా సంప్రాదాయం.  సినీమా పాటలు పరిపూర్ణంగా శాస్త్రీయ రాగాధారితంగానే వుండాలన్న నియమ నిబంధనలేవీ లేకపోవడం వల్ల ఈ పాటను సుస్వరాజేశ్వర గీతంగా భావించి, మనసారా విని ఆనందిద్దాము. రాగం ఏదైతేనేం, గత ఆరు దశాబ్దాలుగా ఈ పాట సంగీతాభిమానుల హృదయాలలో సజీవరాగంగా ఇంకా నిలిచేవుంది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 
*Disclaimer: ఈ వ్యాసాల్లో అప్పుడప్పుడు రాగాల గురించి ప్రస్తావించే విషయాలు నా స్వంత రాగ పరిజ్ఞానం కావు. అనుభవజ్ఞులనుండి తెలుసుకున్నవినికిడి జ్ఞానమేనని గ్రహించగలరు.

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...