Saturday, 12 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 51వ భాగం - ఎవరివో నీవెవరివో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయవ భాగం ఇక్కడ

51వ సజీవరాగం -  ఎవరివో నీవెవరివో
చిత్రం - పునర్జన్మ
గానం - ఘంటసాల 
రచన - శ్రీశ్రీ
సంగీతం - టి.చలపతిరావు

పల్లవి: 
ఓ.... సజీవ శిల్పసుందరీ
నా జీవనరాగ మంజరీ...

ఎవరివో నీవెవరివో - 3

నా భావనలో నా సాధనలో - 2
నాట్యము చేసే రాణివో !! ఎవరివో!!

చరణం:
దివినే వదలి భువికేతెంచిన 
తేనెల వెన్నెల సోనవో ! దివినే!
కవితావేశమే కలలై అలలై
కురిసిన పూవుల వానవో ... ఎవరివో!

చరణం:
నవ వసంతమున 
నందనవనమున ఆ.... ! నవ !
కోయిల పాడిన పాటవో ! నవ వసంతమున!
వలపు కొలనులో  కలకల విరిసిన
కలువల కన్నుల కాంతివో .. ఎవరివో

చరణం:
నీ కరకంకణ నిక్వణమా అది
వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిస్వనమా అది
జలధి తరంగ మృదంగ నాదమా
రావే మోహన రూపమా
రావే నూతన తేజమా
రావే... రావే.... 

Cigarette smoking is injurious to health (in the long run and at times it can cause instant damage and loss of memory in a cinematic way and of course therefore dangerous to life)!

ఘంటసాలవారి సజీవరాగం అని చెప్పి స్టాట్యూటరీ వార్నింగ్ ఇస్తున్నానేమిటా ? అని అనుకుంటున్నారా ?

ఒక కాల్చి పారేసిన సిగరెట్ పీక నాలుగు భాషల్లో మూడు గంటల సినీమాకు మూలకారణమయింది.  అదే 1963ల నాటి 'పునర్జన్మ' తెలుగు సినీమా. అందులోని ఘంటసాలగారు ఆలపించిన ' ఎవరివో నీవెవరివో'' పాట ఈ వారం మన సజీవరాగం.

కళాకారులు చాలా సహృదయులుగాను, అతి సున్నిత మనస్కులుగాను వుంటారని లోక ప్రతీతి. అలాటివారి మనసు వికలం చెందేలా ఏ సంఘటన జరిగినా దానికి వారు తీవ్రంగా స్పందించి ఉన్మాదులవుతారు. వారి జీవిత సరళీయే మారిపోతుంది.  అలాటి ఒక శిల్పకళాకారుని కథయే 'పునర్జన్మ'.

చక్కని కథాంశంగల సినీమాలో చిక్కని సన్నివేశం లభించినప్పుడు ఏదైనా పాటను తయారు చేయాలంటే రచయిత, సంగీతదర్శకుడు, గాయకుడు, నటుడు, దర్శకుడు అందరికీ ఆనందమే. అలాటి పాటలలో మంచి సాహిత్యానికి, శ్రావ్యమైన సంగీతానికి ఎక్కువ అవకాశం వుంటుంది. ఘంటసాలవారి పరిభాషలో పదికాలాలపాటు ప్రజల హృదయాలలో  నిల్చిపోతుంది. " ఎవరివో నీవెవరివో" పాటకు అలాటి అదృష్టం లభించింది.

తన స్వహస్తాలతో రూపొందించిన శిల్పసుందరికి ప్రాణప్రతిష్టచేయాలని సంకల్పిస్తాడు ఆ శిల్పి. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి,  ఆరిన దీపాలు వెలుగుతాయి, మ్రోళ్ళు చిగురిస్తాయి, మేఘాలు వర్షిస్తాయి. అలాటి శక్తివంతమైన సంగీతంతో తన శిల్ప స్వప్నసుందరిని నిజమైన సజీవసుందరిగా ఆమె నాట్యం చేస్తే చూసి ఆనందించాలని  తన చేతిలోని సగం కాలిన సిగరెట్ ను గిరాటేసి పక్కనున్న సితార్ ను చేతిలోకి తీసుకొని తన గానం ప్రారంభిస్తాడు.

సన్నివేశం బలంగా ఉంటే పాటలోని సాహిత్యము, సంగీతము కూడా ఉదాత్తంగా మనసుకు హత్తుకునేలా రూపొందుతాయి. శ్రీశ్రీ వంటి మహాకవి మనసు పెట్టి " ఓ సజీవ శిల్ప సుందరీ, నా జీవనరాగ మంజరీ.. ఎవరివో నీవెవవరివో " అనే పల్లవిని అందించారు. భావనలో, సాధనలో నాట్యం చేసే రాణివా, లేక , దివిని వదలి భువికి వచ్చిన తేనెల వెన్నెల సోనవా? అంటూ ప్రశ్నించారు. కవితావేశంతో పూవుల వాన కురిపించి నవవసంత నందనవనంలో కోయిలపాటలు పాడించారు. వలపు కొలనులో కలువకన్నుల కాంతిని నింపారు. తన్నెదుట  సజీవంగా నిల్చి (భ్రమలో) నవసోయగాలతో నాట్యమాడే ఆ సుందరి కరకంకణ నిక్వణాలను, వీణా నినాదాలను, ఆమె పద నూపుర నిస్వనాలను జలధి తరంగ మృదంగ నాదాలుగా అభివర్ణిస్తూ మోహావేశం ఉప్పొంగగా ఆ సమ్మోహన రూపంలో మైరచిపోతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి శిల్పస్వప్నసుందరి దగ్ధమైపోతుంది  అక్కడితో శ్రీశ్రీ గారి మనోజ్ఞ భావనా చెదరిపోయింది.  అప్పుడే సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారు కవిగారి ఉదాత్త భావనలకు స్వరాలుకల్పించారు. పాటను ప్రధానంగా కళ్యాణి రాగంలో చేస్తూ, మోహన, హంసధ్వని (రెండు మధ్యమ స్వరాలు వలన) రాగ ఛాయలు కూడా ధ్వనింపజేస్తూ ఈ పాటను సుశ్రావ్యంగా మలచారు. నృత్య ప్రధానగీతం కావడం వలన అనేక తాళ వాద్యాలను ముక్తాయింపులతో సమర్ధవంతంగా ఉపయోగించారు. 

మిట్ట జనార్దన్ గారి సితార్ వాదనం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. హార్ప్, ట్యూబోఫోన్ , వైబ్రోఫోన్ , తబలా, డోలక్ ,  తబలాతరంగ్ , వంటి తాళవాద్య సమ్మేళనంతో ఈ పాట చాలా హృద్యంగా సాగింది.

ఇక ఈ పాటను ఆలపించిన ఘంటసాలవారి గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పగలను. పాట ఆరంభంలో వచ్చే సాకీలోనే ఘంటసాల ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెరమీద కనిపించేది నాగేశ్వరరావు గారు కావడాన అందుకు కావలసిన లాలిత్యం, భావోద్రేకం, మాధుర్యం ఘంటసాలవారి గళంలో అలవోకగా పలికాయి. తెరమీద అక్కినేని గానానికి, దివినుండి దిగి వచ్చిన అప్సరసలా ఎల్.విజయలక్ష్మి చేసిన నృత్యం ఈ పాటకే జీవం, ప్రధానాకర్షణ.

సుప్రసిధ్ధ రచయిత గుల్షన్ నందా వ్రాసిన "పత్థర్ కె హోన్ట్" కథ  ఆధారంగా నిర్మించబడిన 'పునర్జన్మ'  తెలుగు సినిమాలో అక్కినేని, కృష్ణకుమారి, వాసంతి, గుమ్మడి, ప్రభాకరరెడ్డి మొదలగువారు ప్రధాన తారగణం. ఈ సినీమా ఘనవిజయంతో ఈ కథ హిందీలో 'ఖిలోనా' గా, తమిళంలో "ఎంగిరిన్దో వన్దాళ్"  మలయాళం లో "అమృతవాహిని" గా ఆయా సినీమాలు మంచి విజయం పొందాయి.

1970 లో జరిగిన బ్రహ్మాండమైన ఘంటసాల సీనీజీవిత రజతోత్సవ సంగీత విభావరిలో ఘంటసాల మాస్టారు ఈ పాటను అక్కినేని వంటి ప్రముఖుల,  వేలాది ప్రేక్షకుల సమక్షంలో సంగీత దర్శకుడు టి.చలపతిరావు పర్యవేక్షణలో  అద్భుతంగా పాడి అందరి హర్షధ్వానాలు పొందారు.

ఇంతమంది హేమాహేమీల ప్రతిభావంతమైన కృషివలన ఘంటసాలవారు ఆలపించిన "ఎవరివో నీవెవరివో" పాట  పునర్జన్మ  సినీమా వచ్చిన 60 ఏళ్ళ తర్వాత కూడా సజీవరాగం గా నిల్చివుంది.

ఈ సినీమా లో ఏడు పాటలుండగా ఒక్కటి కూడా డ్యూయెట్ లేకపోవడం విశేషం. ఐదు సోలోలను పి.సుశీల పాడగా రెండు సోలోలను ఘంటసాల పాడారు. అందులో ఒకటి "ఎవరివో నీవెవరివో".

కొసమెరుపు :
సినీమాకు ముందే విడుదలైన ఈ పాటను గ్రామఫోన్ లో వింటూ పునర్జన్మ సినీమా ప్రివ్యూ కోసం ఎదురుచూస్తూన్నం. ఒకరోజు పిఎపి సుబ్బారావుగారి ఆఫీస్ నుండి  ఘంటసాల వారింటికి వర్తమానం వచ్చింది, ఫలానా స్టూడియోలో ఫలానా టైముకు ప్రివ్యూ వుంది, మాస్టారి కుటుంబం అంతా రమ్మనమని. ఎప్పటిలాగే ఆలస్యంగా ఇంటికి చేరిన మాస్టారు మమల్నందరిని తీసుకొని, కోడంబాక్కం రైల్వేగేట్ అవాంతరాలన్నీ దాటి స్టూడియోలో ప్రివ్యూ థియేటర్ చేరేసరికి సినీమా మొదలెట్టేసారు. మేము సీట్లలో కూర్చోని తెరవేపు చూసేసరికి, మేము ఎంతో ఆసక్తితో చూడాలనుకున్న ఘంటసాల మాస్టారి "ఎవరివో నీవెవరివో" పాట అయిపోయి,  ఎల్.విజయలక్ష్మి మాయమై, విగ్రహం ఏదో పూర్తిగా మంటల్లో కాలిపోవడం కనిపించింది. అప్పటికి దాదాపు పావుగంట సినీమా అయిపోయిందని తెలిసింది.  మళ్ళీ ప్రివ్యూ వేస్తారుకదా, అప్పుడు వద్దురుగాని అని ఇంట్లోవారిని సముదాయించారు. ఘంటసాల మాస్టారికి తాను పాడిన సినీమాలు చూడడంలోగాని, తన పాటలు తిరిగి రిపీటెడ్ గా వినడంలో కాని పెద్ద ఆసక్తి వుండేది కాదు.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...