Saturday, 30 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 58వ భాగం - మనసున మనసై బ్రతుకున బ్రతుకై

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయెనిమిదవ భాగం ఇక్కడ

58వ సజీవరాగం -  మనసున మనసై బ్రతుకున బ్రతుకై
చిత్రం - డాక్టర్ చక్రవర్తి
గానం - ఘంటసాల 
రచన - శ్రీశ్రీ
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:
మనసున మనసై బ్రతుకున బ్రతుకై 
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము !!మనసున!!

ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో
ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో 
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
                           !!మనసున!!

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు 
నీకోసమే కన్నీరునించుటకు - 2
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము...
                          !!మనసున!!

చెలిమియె కరువై వలపే అరుదై
చెదరిన హృదయమె శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము... మనసున మనసై!
                          !!మనసున!!

          
సంతోషం , దుఃఖం; విజయం , ఓటమి - ఇవన్నీ ఒకే సమయంలో సంభవిస్తే  ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు; అతనిలోఈ భావాలు ఎలా ప్రతిఫలిస్తాయి. మాటల్లో చెప్పలేని  భావాలు సంగీతం ద్వారా వ్యక్తపర్చవచ్చని సంగీతజ్ఞులు అంటారు.  సంగీతరాగాల ద్వారా ఆయా మనోభావాలను స్పష్టంగా ప్రకటించవచ్చని గతకాలపు సంగీతవిద్వాంసులు నిరూపించారు. హిందుస్థానీ సంగీతంలో రాగాలను ఆలపించడానికి  ప్రత్యేకమైన కాలనిర్ణయం వుంది.

ఉదయకాలపు రాగాలు, సాయంకాల రాగాలు, రాత్రివేళ రాగాలుగా వర్గీకరించడం జరిగింది. గత తరం ప్రముఖ సంగీత విద్వాంసులందరూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించేవారు. ఆయా సమయాలకు నిర్దేశించిన రాగాలను మాత్రమే తమ కచేరీలలో వినిపించడం ద్వారా రసస్ఫూర్తిని సాధించేవారు. హిందుస్థానీ సంగీతంలో  'జయజయవంతి ' అనే రాగం వుంది. ఖమాస్ థాట్ కు చెందిన రాగం. దీనినే కర్ణాటక సంగీతంలో ద్విజావంతి అంటారు. 28 వ మేళకర్త హరికాంభోజి జన్య సంపూర్ణరాగం.  జయజయవంతి సాయంకాలపు రాగంగా నిర్ణయించడం జరిగింది. మనిషిలో సంతోషం, దుఃఖం, సాధన, ఓటమి పొందినప్పుడు కలిగే భావాలన్నీ ఈ జయజయవంతి లేదా ద్విజావంతి రాగంలో ప్రతిఫలిస్తాయని సంగీత విశ్లేషకులు చెపుతారు. ఈ రాగానికి దగ్గరలో వుండే మరో హిందుస్థానీ రాగం 'గార'.  నౌషద్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్  ' ముఘల్ ఈ అజం' సినీమా కోసం పాడిన ' మోహెపన్ ఘట్ పె నందలాల్' భక్తిగీతం ఈ ' గార' రాగంలో చేసినదే.

భక్త జయదేవ చిత్రం కోసం సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపర్చిన 'ప్రియే చారుశీలే', 'పాండవ వనవాసం' కోసం ఘంటసాలగారు చేసిన ' హిమగిరి సొగసులు' ,  అలాగే ఘంటసాలవారి' భక్త రఘునాధ్' లోని 'ఈ మరపేలా ఈ వెరపేలా' వంటి పాటలు ' ద్విజావంతి' రాగంలోనే వున్నాయి. 

ద్విజావంతి రాగంలో  'డాక్టర్ చక్రవర్తి' సినీమా కోసం సాలూరు వారు స్వరపర్చిన  మరువలేని మరో  అద్భుత గీతం
'మనసున మనసై బ్రతుకున బ్రతుకై''.   అదే ఈనాటి మన  ఘంటసాలవారి   సజీవరాగం .

కవుల సహజ ప్రవృత్తికి విరుధ్ధంగా వైవిధ్యభరితమైన పాటలు వ్రాయించుకోవడంలో అన్నపూర్ణా మధుసూధనరావుగారు దిట్ట. తమ తొలి చిత్రాలలో ఒకటైన ' తోటికోడళ్ళు' సినిమా లో మనసు కవిగా పేరుపొందిన ఆత్రేయగారి చేత  'కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిచాన', ' డా.చక్రవర్తి లో శ్రీశ్రీగారు వ్రాసిన ' మనసున మనసై ' పాటలు ఇందుకు నిదర్శనం. శ్రీశ్రీగారు, ఆత్రేయగారు తమ మనసులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఈ పాటలు వ్రాసారేమో అనే సందేహం శ్రోతలకు కలగడం సహజం. 

అన్నపూర్ణా మధుసూధనరావుగారి మనసెరిగిన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. అలాగే రాజేశ్వరరావు గారి స్వేఛ్ఛకు, స్వాతంత్య్రానికి భంగం కలగకుండా తనకు కావలసిన పధ్ధతిలో అమృతగుళికలవంటి పాటలను చేయించుకున్న ఘనత మధుసూధనరావుగారిది. ఈ సంస్థకోసం సాలూరు వారు స్వరపర్చిన అసంఖ్యాక గీతాలు ఘంటసాల , సుశీల గాత్ర మాధుర్యం వలన నేటికి అజరామరంగా నిలిచిపోయాయి. 

అలాటి ఆపాతమధురమే ఘంటసాలవారు ఎంతో మనోజ్ఞంగా ఆలపించిన  "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాట. శ్రీశ్రీ, రాజేశ్వరరావు, ఘంటసాల అపురూప కలయికలో రూపొందిన ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా తెలుగువారందరినీ ఎంతో ప్రభావితం చేసింది. మనసు చెదిరి మనోక్లేశానికి గురియైన ఎందరికో స్వాంతన చేకూర్చిన గీతం 'మనసున మనసై'.  అన్నీ కలిగివున్న  సంస్కారవంతుడైన ఒక ప్రముఖ డాక్టర్ కు, తన మనసును అర్ధం చేసుకోలేని  ఒక సగటు స్త్రీ జీవిత భాగస్వామిగా లభించి అతని జీవితం నరకప్రాయమైనప్పుడు,  అతని హృదయంలో రగిలే బాధ, ఆవేదనలకు 
ప్రతీక ఈ పాట. ఈ భావాలన్నింటికి తమ అద్వితీయ గాన పటిమతో  ఘంటసాల, నటనా వైదుష్యంతో అక్కినేని నాగేశ్వరరావు గార్లు ప్రాణప్రతిష్ట చేసి చక్రవర్తి అనే ఒక ఉన్నత వ్యక్తిని మన కళ్ళెదుట నిలబెట్టారు.  ఒకరికోసం మరొకరు పుట్టారన్నట్లుగా తెలుగువారంతా భ్రమించడానికి ఈ రకమైన భావగాంభీర్యం గల పాటలే ముఖ్యకారణం.

శాస్త్రీయ సంగీత రాగాల పట్ల గల  చక్కటి అవగాహనతో ద్విజావంతి రాగ లక్షణాలన్నింటిని  ఈ పాటలో ఘంటసాల తన గాత్రమాధుర్యంతో మరింత ఇనుమడింపజేసారు.

కధానాయకుని మనోభావాలను, ఆవేశ, ఆవేదనలను పరిపూర్ణంగా తనలో అనుభవిస్తూ చక్రవర్తి పాత్రలో పూర్తిగా లీనమైపోయి ఆర్తితో ఘంటసాలవారు ఈ పాటను గానం చేశారు. తోడుగా సితార్ జనార్దన్ లాటి ప్రతిభావంతులైన కళాకారులు వాద్యబృందంలో వుంటే హృద్యమైన గీతాలకు స్వరకల్పన చేయడం రాజేశ్వరరావుగారిలాటి వారికి నల్లేరు మీద నడకే. ఈ పాటలో సితార్ తో పాటు ఫ్లూట్, వైయొలిన్స్, పియోనా, తబలా, రిథిమ్స్  వంటి వాద్యాలు సున్నితంగా , శ్రావ్యంగా వినిపిస్తాయి.

తెరమీద అక్కినేని తో పాటు జగ్గయ్య , సావిత్రి కూడా ఈ పాట  సన్నివేశం రక్తికట్టడానికి తోడ్పడ్డారు.

తెలుగు పత్రికా రంగాన  మహిళా రచయిత్రుల నవలలు రాజ్యమేలుతున్న తరుణంలోనే సినీమాలకు కావలసిన మసాలా దినుసులన్నీ వుండే నవలలు చాలానే వెలువడ్డాయి. వాటిలో కోడూరి కౌసల్యాదేవిగారి ' చక్రభ్రమణం' నవల ఒకటి. ఆంధ్రప్రభలో ఉత్తమ నవలగా బహుమతి పొంది ధారావాహిక గా ప్రచురించబడి పత్రిక సర్క్యులేషన్ ను ఎంతగానో పెంచింది. ఆ నవల దుక్కిపాటి , ఆదుర్తి దృష్టిలో పడి  'డా. చక్రవర్తి' సినీమా గా రూపొందింది. గొల్లపూడి మారుతీరావు, ఆత్రేయ  సంభాషణాబలం,  అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, జానకి, గుమ్మడి, కృష్ణకుమారి మొదలగువారి నటకౌశలం, అన్నిటికి మించి సాలూరి వారి సంగీతం, ఘంటసాల, సుశీల  గానామృతం డాక్టర్ చక్రవర్తి సినీమా ఘనవిజయానికి ఢోకాలేకుండా చేసింది. 1964 సంవత్సరం లో కేంద్రప్రభుత్వ ఉత్తమ చిత్ర బహుమతిని , రాష్ట్రప్రభుత్వం బంగారు నందిని 'డా. చక్రవర్తి' తన సొంతం చేసుకున్నది. 

తెలుగునాట తెలుగు పాట వున్నంతకాలం తెలుగు హృదయాలలో ఘంటసాలవారి ఈ మనసున మనసై పాట చిరస్థాయిగా నిలిచేవుంటుంది.  



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...