"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
59వ సజీవరాగం -సాకీ - న్యాయానికే పరాజయమా
వంచనకే ధర్మము తలవంచేనా..
బృందం - ఆ... ఆ....
పల్లవి : విధి వంచితులై విభవము వీడి
అన్న మాటకోసం అయ్యో
అడవిపాలయేరా !!విధి!!
చరణం 1: నీ మది రగిలే కోపానలము ఈ
మహినంతా దహియించేనని మోమును
దాచేవ ధర్మరాజా !
చరణం 2: సభలో చేసిన శపధముదీరా
పాపుల ననిలో త్రుంచెద నేనని
బాహువులూచేవ భీమసేనా
అమ్ములవానా ముంచెదనేనని
ఇసుమును చల్లేవ సవ్యసాచీ!!
విధి!
చరణం 4: ఏ యుగమందూ ఏ ఇల్లాలూ
ఎరుగదు తల్లీ ఈ అవమానం !! ఏ
యుగమందూ!!
నీ పతిసేవయె నీకు రక్ష
జీవితంలో ధర్మాన్ని, నీతి నియమాలను పాటిస్తూ ఒక లక్ష్యసాధన కోసం ముందుకు సాగేవారికి అడుగడుగునా కష్టాలే. భగవంతుడు వారికి అండగా నిలిచినా, ధర్మానికే అంతిమ విజయం సిధ్ధించినా వారు తరచూ విధి చేత వంచింపబడుతూంటారు. అలాటి వారి దుఃఖం, మనోవేదన, పడే కష్టాలు మామూలు మాటలకు అందనివి; ఇతరులకు ఏమాత్రం అర్ధంకానివి.
ఇలాటి దుస్థితులే గత తరం సినీమా కధలలోని పాత్రలకు ఏర్పడితే అలాటి సన్నివేశాలు రక్తికట్టడానికి, ఆ పాత్రల మనోభావాలు ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకడానికి దర్శకులు పాత్రల సంభాషణల ద్వారా కాక సంగీతం ద్వారా - నేపధ్యగీతం - ద్వారా తాము ఆశించిన ఫలితాన్ని రాబట్టుకునేవారు.
ఆనాటి సినిమాలలో సన్నివేశపరమైన ఉదాత్త భావాలను ప్రేక్షకుల
హృదయాలను హత్తుకునేలా నేపథ్యంలో ఆలపించగల
ఏకైక గాయకుడు ఘంటసాల. సందర్భానుసారం నవరసాలలో
తన మధుర, గంభీర కంఠస్వరం ద్వారా నటించగల ప్రతిభావంతుడు.
పాండవవనవాసము చిత్రం కోసం తన స్వీయ సంగీతదర్శకత్వంలో ఘంటసాల మాస్టారు ఆలపించిన ఆవేశపూరితమైన, ఆవేదనాభరితమైన "విధి వంచితులై విభవము వీడి..." అనే నేపధ్యగీతమే ఈ నాటి మన సజీవరాగం.
సినీమాలో ఈ సన్నివేశం చాలా కీలకమైనది. ఉదాత్తమైనది, ఉద్రేకభరితమైనది.
మాయాజూదంలో దాయాదులచే
దయాదాక్షిణ్యం లేకుండా పరాభవించబడిన పాండవులు, పాండవ ధర్మపత్ని అవమానభారంతో కౌరవ సభనుండి తలలు వంచుకొని హస్తినాపురం ప్రజల
ముందునుండి అడవులకేగుతున్న సందర్భం. అంతకుముందు వరకు కౌరవ సభలో దుర్యోధనుడు, భీముడి మధ్య జరిగిన తీవ్ర
వాదోపవాదాలు, భీకర ప్రతిజ్జలతో, ద్రౌపది ధర్మాధర్మ చర్చలు, దీనాలాపనలు చాలా ఉద్విగ్నభరితంగా సాగాయి. పాండవులు పూర్తిగా
నిస్తేజులైపోయారు. అరణ్యవాసం ఒక్కటే
వారికి గత్యంతరమయింది.
పాండవులంతా విధవిధాలుగా
పరితపిస్తూ, వివిధ భావోద్వేగాలతో ముందుకు పోతున్నారు. ఏమీ మాట్లాడలేని దుస్థితి. ఆ దుర్భర
స్థితిని వివరిస్తూ ఆక్రోశంతో, ఆవేశంతో ఆవేదనా భరితంగా ఘంటసావారి నేపథ్యగీతాన్ని ఎంతో కరుణరసాత్మకంగా
చిత్రీకరించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు.
ఆ సన్నివేశంలో పాండవుల మనోభావాలను, చేష్టలను సముద్రాలవారు తన గీతంలో సజెస్టివ్ గా వెల్లడించడం వలన పాట చిత్రీకరణలో ధర్మ, భీమ, అర్జున, ద్రౌపది పాత్రధారుల హావభావాలు ఘంటసాలవారి భావోద్వేగాలకు దీటుగా సరితూగాయి. ఈ పాటలో సముద్రాలవారు అని', 'ఆలము', 'ఇసుము', 'అమ్ములవాన' వంటి పదాలను భవిష్యత్ లోని సమయ సందర్భాలను సూచిస్తూ ప్రయోగించారు. ఈ చిత్రానికి అర్ధవంతము, సమర్ధవంతము అయిన సంభాషణలను వ్రాసినది కూడా సముద్రాల రాఘవాచార్యులుగారే.
ఘంటసాల మాస్టారు ఈ పాటను చక్రవాకం రాగంలో స్వరపర్చారు. 72 మేళకర్తలలో 16వ మేళకర్త చక్రవాకం. మేళకర్త అంటేనే ఏడు స్వరములు గల సంపూర్ణరాగం. ఈ రాగాన్ని ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయంలో "తోయగవాహిని" అని అంటారు. హిందుస్థానీ సంగీతంలో చక్రవాకానికి సమాంతరమైన రాగం "అహిర్ భైరవ్". చక్రవాకం రాగ లక్షణ ప్రకారం భక్తి, కరుణ, సానుభూతి వంటి రసాలను ప్రతిఫలించే రాగంగా సంగీతకారులు వర్ణించారు. చక్రవాక రాగాన్ని సినీమా లలో బాగా ప్రచారంలోకి తీసుకువచ్చిన ఘనత ఘంటసాల మాస్టారిదే. తన సంగీతదర్శకత్వంలో వచ్చిన ' పెళ్ళిచేసి చూడు' సినీమా లో పి.లీల పాడిన 'ఏడుకొండల వాడా వెంకటా రమణా' పాటను మొదటిసారిగా చక్రవాకం రాగంలోనే చేసి ఎంతో పేరు పొందారు.
అక్కడ భక్తిపూర్వకంగా వినిపించిన చక్రవాకాన్ని 'విధి వంచితులై 'పాటలో కొంత ఆక్రోశాన్ని, కొంత కరుణను మిళితం చేసి వినిపించారు. ఒక రాగానికి శాస్త్రరీత్యా ఏ లక్షణాలు ఆపాదించి చెప్పినా సినీమా మాధ్యమంలో ఆ రాగాన్ని ఏవిధమైన రసానికైనా సమర్ధవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించిన ప్రతిభాశాలి ఘంటసాల మాస్టారు.
"విధివంచితులై" పాట ఐదు వైయొలిన్ బ్యాంగ్ లతో మొదలవుతుంది "న్యాయానికే పరాజయమా" అని తారస్థాయిలో సాకీతో ప్రారంభించిన ఘంటసాలవారి కంచుకంఠం శ్రోతలకు గగుర్పాటు కలిగిస్తుంది. అరిచినట్టుగా కాకుండా, తారస్థాయిలో కూడా గాత్రాన్ని వినసొంపుగా మాధుర్యంగా వినిపించగల గాయకులు అరుదు. ఘంటసాలవారి ఆ ప్రతిభ అనుపమం.
పాట పల్లవికి ముందు కోరస్, తర్వాత వచ్చే షెహనాయ్ ఆలాపన చక్రవాక రాగ లక్షణాన్ని సంపూర్ణంగా మనకు అవగతం చేస్తాయి. ఈ పాటలో ప్రధాన వాద్యాలుగా షెహనాయ్ వైయొలిన్స్, తబలా, వైబ్రోఫోన్ వాద్యాలు పాటకు కావలసిన రసోత్పత్తిని కలిగించాయి.
పాండవవనవాసములో పాటల సంగీతమే కాదు నేపథ్య సంగీతం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సినీమాలో ప్రధాన పాత్రలైన ఎన్.టి.రామారావు (భీముడు), లింగమూర్తి (శకుని)లకు బేస్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్ ల మీద మాస్టారు వినిపింపజేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి.
మాటకు మెట్టా; లేక మెట్టుకు మాటా? అనేది ఒక సమస్యే కాదు. ఆనాటి సంగీతదర్శకులు, గీతరచయితలు రెండు ప్రక్రియలకు అనుగుణంగా పనిచేయగల సమర్ధులే. పరస్పర అవగాహనతో, సహకార దృక్పథంతో గీత రచన, స్వర రచన సాగేవి. ఏ పధ్ధతిలో స్వరరచన చేసినా అది సన్నివేశపరంగా రక్తికట్టాలి. జనాకర్షణ కలిగివుండాలి. అదే ఆనాటి గీత రచయితల, సంగీతదర్శకుల లక్ష్యంగా వుండేది. పాండవవనవాసములో గల మొత్తం ఇరవైరెండు పాటల, పద్యాల స్వరరచన ఆ పధ్ధతిలోనే సాగింది.
ఈ చిత్రంలోని పాటలన్నింటిని
సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, కొసరాజు వ్రాయగా కొన్ని పద్యాలను సముద్రాల వ్రాశారు. ఓ రెండు పద్యాలను నన్నయ
భారతం నుండి , మరొకటి సూర్యాష్టకం నుండి తీసుకున్నారు. ఈ సినీమా లో ఓ పన్నెండు పాటలు, పద్యాలు, దండకం ఘంటసాల మాస్టారు పాడగా
మిగిలిన వాటిని సుశీల, లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, బాలమురళీకృష్ణ మొదలగువారు పాడారు.
పాండవవనవాసానికి నేపథ్య కధానాయకుడు ఘంటసాలగారైతే తెరమీద కథానాయకులు ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు. ఈ ఇద్దరూ పోటాపోటీగా తమ రాజసాన్ని అభిజాత్యాన్ని ప్రదర్శించారు. ద్రౌపదిగా సావిత్రి నటీ శిరోమణి అనిపించుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో లింగమూర్తి, కాంతారావు, గుమ్మడి, బాలయ్య, రాజనాల, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి, రాజసులోచన, మొదలగు అగ్రశ్రేణి నటులంతా తమ తమ పాత్రలలో రాణించి పాండవ వనవాసం 175 రోజుల దిగ్విజయోత్సవానికి కారణకర్తలయ్యారు.
దర్శకేంద్రుడిగా ప్రఖ్యాతి పొందిన కె.రాఘవేంద్రరావు తొలిసారిగా ఈ సినిమాలో కమలాకర కామేశ్వరరావు కు సహాయకుడిగా పనిచేశారు. అలాగే ఆధునిక చిత్రాలలో సాధారణంగా ఐటం సాంగ్ అన్న ప్రక్రియలో ఆనాటికి పాపులర్ కథానాయికతో కథకి సంబంధంలేని ఒక నృత్యసన్నివేశాన్ని జొప్పించడం పరిపాటి. దానికి విరుద్ధంగా కథలో భాగంగా పాండవవనవాసములో అటువంటి ఒక ఐటం సాంగ్ లో కనిపించిన అప్పటికి అనామక నాట్యకారిణి తరవాత కాలంలో డ్రీం గర్ల్ గా పేరుప్రఖ్యాతులు సంపదించుకున్న నటిగా ఎదగడం విశేషం.
బహు భాషలలోకి తర్జుమా చేయబడి విజయం సాధించిన సినీమా. పౌరాణిక సినీమా తీయాలంటే తెలుగువారే తీయాలని మరోసారి నిరూపించిన చిత్రం పాండవ వనవాసం. వాణీ ఫిలింస్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు మాధవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా తొలిసారి గా నిర్మించి ఘన విజయం సాధించిన చిత్రం 'పాండవవనవాసం' ఇదే సంస్థ నిర్మించిన మరో రెండు సినీమా లకు కూడా ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు.
పాండవ వనవాసం సినీమాలోని అనేక పాటల కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్, రీరికార్డింగ్ కార్యక్రమాలను నేను పూర్తిగా పక్కనే వుండి చూడగలగడం నేనెప్పుడు మర్చిపోలేని ఆనందదాయకమైన విషయం.
https://youtu.be/n_0tJSZXgMk?si=86_8RObQhiBFtSJb
No comments:
Post a Comment