Saturday, 14 December 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 60వ భాగం - కొండగాలి తిరిగింది

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైతొమ్మిదవ భాగం ఇక్కడ

60వ సజీవరాగం -  కొండగాలి తిరిగింది" కొండగాలి తిరిగింది
చిత్రం - ఉయ్యాలా జంపాలా
గానం - ఘంటసాల 
రచన - ఆరుద్ర
సంగీతం - పెండ్యాల 

పల్లవి: కొండగాలి తిరిగిందీ

కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది

గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది... ఆ... ఆ..

                                 !! కొండగాలి!! ఆ...

 పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ

గట్టుమీద కన్నె లేడి గంతులేసి ఆడింది

పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది

ఆ.. ఓ... ఆ...

పట్టరాని లేత వలపు పరవశించి పాడింది

                                 !! కొండగాలి!! ఆ...

 మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయిందీ -2

నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది

 పడచుదనం అందానికి తాంబూలమిచ్చిందీ  -2

 ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది

 కొండగాలి తిరిగిందీ  గుండె ఊసులాడింది

గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది


గతవారం సజీవరాగం గుర్తుందా ? ఆ పాట రాగంలో పలికే మధ్యమం ('' స్వరం) లేకుండా పాడితే అది ఈ వారం ఘంటసాలవారి సజీవ రాగమవుతుంది. ఏమిటీ అనవసర గందరగోళం అనుకుంటున్నారాగతవారపు 'విధివంచితులై' చక్రవాక రాగమైతే, ఈ వారపు మాస్టారి 'కొండగాలి తిరిగింది' పాట యొక్క రాగం 'మలయమారుతం'. అదే ఈ వారం ఘంటసాల సజీవరాగం.

మలయమారుతం, చక్రవాకం మేళకర్తకి జన్యరాగం. చక్రవాక రాగంలో పలికే మధ్యమ స్వరం తొలగిస్తే అది మలయమారుతం. ఆరు స్వరాలు మాత్రమే గల షాఢవరాగం. మలయమారుతంలో వుండే 'రిషభం'('రి' స్వరం) లేకుండా ఆలపిస్తే అది 'వలజి' అనే ఐదుస్వరాల ఔఢవరాగం అవుతుంది.  వలజి రాగం కూడా చక్రవాక జన్యమే. ఈ వలజి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం 'కళావతి'. ఈ విధంగా చిన్న చిన్న స్వరభేదాలతో అనేక రాగాలు మన సంగీతశాస్త్రంలో వున్నాయి. అలాటి రాగాలలో సినిమా పాటలు చేసేప్పుడు ఆ యా రాగాల ప్రభావం వలన ఎక్కడోదగ్గిర ఆ స్వరాలు కలిసి ఇలాటి పాట గతంలో ఎప్పుడో విన్న భావన కలగడం, ఆ పాట, ఈ పాట ఒక్కలాగే వున్నాయనుకోవడం, సంగీతదర్శకులు తమ పాటలను తామే కాపీకొట్టుకున్నారనడం, లేదా ఇతర సంగీత దర్శకుల పాటలు కాపీ కొట్టారని విమ‌ర్శించడం మనం ( శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం లేనివారు) తరచు చేసే పనే. ఈ ప్రపంచంలో అత్యంత సులభమైన పని ఇతరుల శక్తి సామర్ధ్యాలను కించపరుస్తూ విమర్శించడమే. కానీ, ఇక్కడ ఒక విషయం మాత్రం వాస్తవం. రాగాలలోని చిన్న చిన్న స్వరభేదాలను, గ్రహభేదాలను క్షుణంగా అవగాహన చేసుకొని పాడే గాయకుల పాటకు, అలాటి పరిజ్ఞానం లేకుండా పాడే గాయకుల పాటకు మధ్య ఎంతో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.  కంఠస్వరం బాగున్నా , రాగజ్ఞానం, స్వరజ్ఞానం లేని గాయకుల పాటలు పేలవంగా , నిర్జీవంగా వినిపిస్తాయి.

ఘంటసాల వంటి ఉత్తమ గాయకుల గళం నుండి సజీవ స్వరాలే కాని నిర్జీవ స్వరాలు పలకవు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు  తెలుగువారి గుండెలలో ఊసులాడుతున్న సుమధుర గీతం 'కొండగాలి తిరిగింది' పాట. మలయమారుతానికి అర్ధం కొండగాలి. ఆరుద్ర కవిగారి పాట పల్లవిని బట్టి సంగీత దర్శకుడు పెండ్యాలగారు మలయమారుత రాగంలో ఈ పాటను చేసారో లేక పెండ్యాలగారి మలయమారుతం వరుసకు ఆరుద్రగారు పాట వ్రాసారో నాకు తెలియదు కానీ ఈ పాటలో పడుగు పేకల్లా సంగీతం, సాహిత్యం రెండూ పరస్పరం పెనవేసుకొని ఘంటసాల, సుశీల గార్ల కంఠాలలో గోదావరి వరదలా, సుమధుర  స్వరవాహినిగా పొంగిపొర్లింది.

ప్రభాత సమయ రాగంగా నిర్దేశించబడిన మలయమారుత రాగం ప్రేమ, శాంత, భక్తి రస భావాల ప్రకటనకు చాలా అనువైన రాగం. తెల్లవారు ఝామున గోదావరి నదీ తరంగాలపై నుండి  వీచే కొండగాలి మెలమెల్లగా మేనును తాకుతుంటేగోదారి గట్టమ్మటే అందమైన ఆడపిల్ల  పొడవాటి  తన నల్లని జడలో మొగలిరేకులు, నాగమల్లెలు ధరించి కులుకుతూ, కన్నె లేడిలా గంతులేసి ఆడుతూంటే, రస హృదయమున్న ఏ యువకుడికైనా గోదావరి వరదలాగ మనసులో కోరిక చెలరేగక తప్పదు. పట్టపగలే సిరివెన్నెల భరతనాట్యమాడినట్లు, పడుచుదనం అందానికి తాంబూలం ఇచ్చినట్లుగా  తోచకా మానదు. అన్నీ అందుబాటులో వున్నా ప్రాప్తమనేది మనిషిజీవితంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. జీవితమనే పడవ చివరకు ప్రాప్తమున్న తీరానికే సాగి చేరుకుంటుంది. ఆశలు , కోరికలు , ఆశయాలు ప్రాప్తాప్రాప్తాలనుబట్టే నెరవేరుతాయి.

'కొండగాలి తిరిగింది' పాటలో ఈ భావాలన్నింటిని ఎంతో హృద్యంగా వర్ణించారు కవి ఆరుద్ర. గోదావరి మీద పడవకు చుక్కానిపడుతూ ఘంటసాల(జగ్గయ్య)గారు మధురంగా పాడే గీతానికి , ఒడ్డునున్న కోనసీమ కొబ్బరితోటల సౌందర్యం పుణికిపుచ్చుకొని , కన్నెలేడిలా, తెలుగువారి ఆడపడుచులా ఒయ్యారంగా నడయాడే పి.సుశీల (కృష్ణకుమారి) గారు నాయికా నాయక పాత్రలలో తదాత్మ్యం చెంది ఆలపించడం వలన ఈ పాటకు శాశ్వతత్త్వం చేకూరి సజీవరాగమై నిలచిపోయింది. ప్రాప్తమున్న ఒక  మంచి భావగీతం తెలుగువారి సొంతమయింది.

'కొండగాలి తిరిగింది' పాటలో స్త్రీ, పురుష గాత్రాలు వినిపించినా సాహిత్య పరంగా ఇది కధానాయకుని ఏకగళ గీతం. కధానాయిక సాహిత్యంతో సంబంధం లేకుండా మధ్య మధ్యలో రాగాలాపన చేస్తూంటుంది. ఘంటసాల, సుశీల గళాల నుండి జాలువారిన ఈ గీతం మలయసమీరంలానే  చల్లగా, మృదువుగా, హాయిగా శ్రోతల హృదయాలను తాకుతుంది.

అనుపమా ఫిలింస్ బ్యానర్ లో వచ్చిన 'ఉయ్యాల జంపాల' సినీమా లోని గీతం 'కొండగాలి తిరిగింది'. నిర్మాత దర్శకుడు కె.బి.తిలక్. ఆయనకు ఆస్థాన సంగీత దర్శకుడు పెండ్యాల. శాస్త్రీయరాగాధారిత గీతాలు స్వరపర్చడంలో పెండ్యాలగారు ఆరితేరినవారు.  సంగీత దర్శకుని మనోధర్మానికి తగినట్లుగా  మలయమారుతాన్ని అత్యంత శ్రావ్యంగా ఆలపిపించారు ఘంటసాల, పి.సుశీల. పెండ్యాల, ఘంటసాల, పి.సుశీల సమ్మేళనంలో ఉద్భవించిన అద్భుత గీతం 'కొండగాలి తిరిగింది'.

నదులమీద పడవ పాటలంటేనే సాధారణంగా జముకు, ఫ్లూట్ వంటి వాద్యాలకు ప్రధాన్యత వుంటుంది. ఎకో సౌండ్ ఎఫెక్ట్ తో చేసిన ఈ పాట ఆద్యంతం  ఫ్లూట్, జముకు, తబలడ్రమ్  వాద్యాలు వినిపిస్తాయి.

మంచి అభిరుచి, అభ్యుదయ భావాలు గల నిర్మాత దర్శకుడు కె.బి.తిలక్. దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారికి స్వయాన మేనల్లుడు. కానీ వీరిద్దరూ ఏనాడూ కలిసి పనిచేయలేదు.

తిలక్ తన అనుపమ ఫిలింస్ బ్యానర్ మీద అనేకమైన మంచి సినీమాలు తీశారు. అన్నిటికి పెండ్యాలే సంగీతం సమకూర్చగా , జగ్గయ్యే హీరోగా నటించారు. 

1941 లో అశోక్ కుమార్, లీలాచిట్నీస్ ప్రధాన తారలుగా "ఝూలా" అనే హిందీ సినీమా వచ్చింది. ఆ సినీమా కథ ఆధారంగా కె.బి.తిలక్ జగ్గయ్య , కృష్ణకుమారిలతో ' ఉయ్యాల జంపాలసినిమా నిర్మించారు. ఆర్ధికంగా గొప్ప విజయం సాధించకపోయినా మంచి మంచి పాటల ఊపిరితో 1965ల నాటి ' ఉయ్యాల జంపాల ' ను ఈనాటివరకు ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే వున్నారు.

ఆరుద్ర నిర్యాణం తర్వాత, ఆయన సతీమణి కె రామలక్ష్మి గారు ఆరుద్ర సినీ గీతాలను సంకలనపర్చి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకానికి 'కొండగాలి తిరిగింది' అని  శీర్షిక పెట్టడంలోనే ఈ పాట ఎంత ప్రశస్తి పొందిందో అర్ధమవుతుంది. 





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 


ప్రణవ స్వరాట్ 


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...