Saturday, 28 December 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 62వ భాగం - బొమ్మను చేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయొకటవ భాగం ఇక్కడ

62వ సజీవరాగం -  బొమ్మను చేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా

చిత్రం - దేవత
గానం - ఘంటసాల 
రచన - వీటూరి & శ్రీశ్రీ
సంగీతం - కోదండపాణి

సాకీ - 

'బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి

ధారగా కరగిపోయే తలచేది 

జరుగదూ జరిగేది తెలియదూ...'

పల్లవి :

"బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు

నీకిది వేడుకా -2

గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత చాలిక 

                                        !బొమ్మను!

చరణాలు :

అందాలు సృష్టించినావు

దయతో నీవూ మరల నీ చేతితో

నీవె తుడిచేవులే  -2

దీపాలు నీవే వెలిగించినావే

గాఢాంధకారాన విడిచేవులే

కొండంత ఆశ అడియాస చేసి -2

పాతాళ లోకాన తోసేవులే! బొమ్మను!

                                        !బొమ్మను!

 

ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ 

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ! ఒకనాటి!

అనురాగ మధువు అందించి నీవు

హాలాహలజ్వాల చేసేవులే ! అనురాగ!

ఆనందనౌక పయనించువేళా

శోకాల సంద్రాన ముంచేవులే

                                        !బొమ్మను!

నిశ్చలంగా వున్న తటాకంలో రాయి విసిరితే ఏమవుతుంది , అందులోని నీరంతా అల్లకల్లోలమవుతుంది... నట్ట నడి సముద్రంలో ప్రశాంతంగా సాగిపోతున్న నౌక అకస్మాత్తుగా పెనుతుఫానుకు గురై పడవ మునిగిపోతే ప్రయాణీకుల హాహాకారాలు, వారి బంధువుల మనోవేదన ఎలా వుంటుంది... 

గాఢనిద్రలో వున్న ప్రయాణీకులు హటాత్తుగా రైలు ఘోర ప్రమాదానికి లోనై  నదిలోపడి కంటికి కనపడకుండాపోతే వారి ఆత్మీయుల మనఃస్థితి ఎలా వుంటుంది... ఇలాటి ఉపమానాలతో హీరో మనోక్లేశాన్ని వివరిస్తూ డైరెక్టర్ గారు కవిగారిని ఒక శోక గీతం వ్రాయమన్నారు. మాటలు బరువుగా, అర్ధవంతంగా ప్రేక్షకుల హృదయాలను కరిగించేలావుండాలని కోరుకున్నారు.

అలనాడు సీతా సాధ్విని కోల్పోయి మనసు కకావికలై దుఃఖసముద్రంలో ములిగిపోయినప్పుడు రాముడు ఎంతటి బాధను, మనోవేదనను అనుభవించాడో, అలాటి సంక్షోభాన్ని తన భార్య చనిపోయిందని తెలుసుకుని హీరో దీనాతి దీనంగా విలపిస్తున్నాడు.

 ఈ సిట్యుయేషన్ కి మీరు అద్భుతమైన పాట వ్రాయాలి... కవిగారికి దర్శకుడు , నిర్మాతల సూచన.

 సిల్క్ జుబ్బా, సిల్క్ వేస్టి (లుంగీ) ధరించి, బుగ్గన ఘాటైన కిల్లీతో, చేతి వ్రేళ్ళ మధ్య  త్రిబుల్ ఫైవ్ సిగరెట్ తో కవిగారు ఆలోచనలో పడ్డారు. అంతా నిశబ్దంగా వున్నారు ఫ్యాన్ గాలికి కదలాడే ఎదురుగా వున్న ప్యాడ్ లోని తెల్లకాగితాల రెపరెపల శబ్దం తప్ప మరేదీ వినపడడం లేదు. కవిగారికి ఒక థాట్ వచ్చింది...

 

"బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదూ జరిగేది తెలియదూ" అని సాకీతో మొదలెట్టారు కవి వీటూరి. ఈ బ్రహ్మాండమైన ఓపెనింగ్ నిర్మాత పద్మనాభంగారికి, దర్శకుడు హేమాంబరధరావుగారికి, సంగీత దర్శకుడు కోదండపాణిగారికి మహబాగా నచ్చేసింది. పల్లవి వ్రాయాలి... పల్లవి ట్యూన్ వినిపించారు. వీటూరిగారు మరల ఆలోచనలో పడ్డారు. రెండు మూడు పల్లవులు వ్రాసి వినిపించారు. దర్శకుడికి నచ్చలేదు. సాంగ్ కంపోజింగ్ మర్నాటికి వాయిదా వేసారు. మర్నాడు మరల నిర్మాత ఆఫీసులో పాట కంపోజింగ్ . కాఫీ, టిఫిన్ లు, తాంబూల సేవనం తర్వాత అందరూ పాటమీద కూర్చున్నారు. వీటూరిగారు చాలా రకాలుగా వ్రాసిన పల్లవులేవి దర్శకుడికి తృప్తినివ్వడం లేదు. ఇంకా వెరైటీగా, అంతకుముందు ఎవరూ వ్రాయని థాట్ తో పదాలు పడాలని, మరోసారి ప్రయత్నించమని కోరిక. రెండోరోజు కూడా ఏవిధమైన సానుకూల పల్లవి రాలేదు. కవిగారి ఆలోచనల్లోంచి వచ్చిన పల్లవులేవి ఆమోదానికి నోచుకోలేదు. పల్లవి లేనిదే చరణానికి అడుగువేయడమెలా?

ఇలాటి తర్జనభర్జనలతో రోజులు గడచిపోతున్నాయి. పాట మాత్రం తయారుకాలేదు.  పాట ఘంటసాలగారితో పాడించి, అన్నగారిమీద షూట్ చేయాలి. అన్నగారి కాల్షీట్లు దొరకడమే కష్టం. అనుకున్న ప్రకారం ఈ షెడ్యూల్ లో పాట షూటింగ్ ముగించకపోతే చాలా కష్టాలొస్తాయి...  నిర్మాత బి.పద్మనాభంగారికి బిపి పెరిగిపోతోంది.

పాట వేగంగా వ్రాయించాలంటే వీటూరిని తప్పించి వేరే కవిగారిని రప్పించాలి. పద్మనాభంగారు , వీటూరిగారు మంచి మిత్రులు. ఇద్దరి మధ్య మంచి అవగాహన వుంది. ఈ పాట వరకు కవిగారిని మార్చడానికి నిర్ణయించారు. వీటూరి స్థానే ఈ పాట వ్రాయడానికి శ్రీశ్రీ వచ్చారు.

తెల్లటి అరచొక్కా , షెరాయితో వ్రేళ్ళ మధ్య నిరంతరం ఆరక వెలిగే శ్వేతకాష్ట వెలుగులనుండి, పొగల అలలనుండి ప్రేరణను, స్ఫూర్తిని పొందే శ్రీశ్రీ హాలాహల జ్వాలలాంటి పదాలతో మనసుకు పట్టే శోక గీతాన్ని వ్రాసిచ్చారు.

(ఇదంతా ఊహాచిత్రం. వాస్తవంలో ఏం జరిగిందో  సంబంధిత వ్యక్తులకు తప్ప పూర్తిగా ఎవరూ చెప్పలేరు. అంతా ఊహాగానమే.)

మహాప్రస్థాన కవి శ్రీశ్రీ  పద్మనాభంగారి 'దేవత' కోసం వ్రాసిన పాటే నేటి మన ఘంటసాల సజీవరాగం. అదే "బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుకా" అనే పాట.

విధాత వ్రాత గురించి, విధివిలాసం గురించి, విధి చేసే వింతల గురించి గతంలో ఎన్నో పాటలు, ఎంతోమంది కవులు వివిధ రకాలుగా వర్ణించి వ్రాసారు. వాటన్నిటిని మించిన అపూర్వ గీతాన్ని ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షించారు దర్శక నిర్మాతలు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకే పాటను ఇద్దరు కవులచేత వ్రాయించవలసి వచ్చింది. పడ్డ కష్టానికి మించిన సత్ఫలితమే దొరికింది శ్రీశ్రీ గారి సౌజన్యంతో.

ప్రశాంతంగా సుఖప్రదమైన సంసారజీవనం గడుపుతున్న ఒక వ్యక్తి జీవితంలో అనుకోని దుర్ఘటన ఏర్పడితే అందువలన కలిగిన దుష్ఫలితాలను తట్టుకోలేక , నిజాన్ని భరించలేక ఒక వ్యక్తి పడే మానసిక వేదనను శ్రీశ్రీ ఈ పాటలో అత్యంత హృదయవిదారకంగా వెల్లడించారు. సామాన్య జనాలకు సైతం సులభంగా అర్ధమయే ఉపమానాలతో ఈ పాటను వ్రాసారు.

దేవుడు మనిషనేవాడికి సుఖాన్ని , దుఃఖాన్ని రెంటినీ పంచుతూ వాటివల్ల మనిషి పడే పాట్లను చూసి నవ్వుకుంటాడు. మనుషులను తన చేతిలో కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తూంటాడు. భగవంతుడి లీలా వినోదాన్ని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు.

శ్రీశ్రీ విప్లవ కవి మాత్రమే కాదు, మనసు కవి కూడా అని నిరూపించే ఆయన జీవిత, రచనా శైలి, భావోద్వేగం అనితరసాధ్యం.  ఎన్ని తరాలు గడచినా  మనసున పట్టి కుదిపే మరపురాని మహొద్వేగభరితం ఈ శోక గీతం.

'దేవత' సినీమా వచ్చేవరకు ఒక వర్గపు ప్రేక్షకులచేత మాత్రమే గుర్తింపబడిన సంగీత దర్శకుడు ఎస్ పి కోదండపాణి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తిగారి ద్వారా గాయకుడిగా పరిచయం కాబడి ఆయన వద్ద సహాయకుడిగా ఎన్నో చిత్రాలకు పనిచేసారు. కోదండపాణిగారికి సంగీత సహాయకుడిగా ఎన్నో సినీమాలకు పనిచేసిన జి.నాగరాజన్ మా తండ్రిగారు(పట్రాయని సంగీతరావు) వెంపటి చిన సత్యంగారి నృత్యనాటకాలకు సంగీతదర్శకుడిగా వున్నకాలంలో వారి వాద్యబృందంలో ఫ్లూట్ వాద్యకారుడిగా సహకరించేవారు. శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రవేశం గల వ్యక్తి నాగరాజన్.

'దేవత' సినీమా కోదండపాణిగారికి మంచి గుర్తింపును , ఖ్యాతిని తెచ్ఛిపెట్టింది. ఈ సినీమాలోని పాటలన్నీ అందరినీ అమితంగా అలరించాయి. 'దేవత' సినీమాకు సన్నివేశపరంగా మకుటాయమానమై నిలిచే పాట "బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా" పాట. ఎంతో కరుణను, శోకాన్ని ధ్వనింపజేసే పాట. కోదండపాణిగారు ఈ పాటను బిలాస్ఖాన్ తోడి స్వరాల ఆధారంగా చేసినట్లు విన్నాను. రాగాల విషయంలో నాది వినికిడి జ్ఞానం మాత్రమే. (బిలాస్ ఖాన్ తోడి కరుణరస ప్రధాన హిందుస్థానీ రాగం.  కర్ణాటక సంగీతంలో సంపూర్ణరాగమైన హనుమత్తోడి రాగంలో ఆరోహణాక్రమంలో 'నిషాదాన్ని'అవరోహణాక్రమంలో 'పంచమాన్ని' స్వరాలను వర్జించి ప్రయోగిస్తే అది హిందుస్థానీ శైలిలో బిలాస్ఖాన్ తోడి అంటారని, ఈ రాగాన్ని సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత చక్రవర్తి తాన్సేన్  మరణించినప్పుడు ఆయన కుమారుడు బిలాస్ఖాన్ ఈ రాగం ఆలపిస్తూ శోకించారని , ఆవిధంగా ఈ రాగం బిలాస్ఖాన్ తోడిగా ప్రచారమయిందని శ్రీ పట్రాయని సంగీతరావు గారు ఘంటసాల భగవద్గీత రాగస్ఫూర్తి గురించిన విశ్లేషణలో పేర్కొన్నారు.)

ఘంటసాల ఈ పాటను ఎంతో ఆర్ద్రతతో, హృదయాలను కదిలించేలా ఆలపించారు. పాట  సాకీని మంద్రస్థాయిలో ప్రారంభించి క్రమక్రమంగా మధ్యమంలో పాడుతూ చివరకు  శ్రోతల దేహాలు గగుర్పొడిచేలా తారస్థాయిలో ముగించారు. ఈ తరహా గంభీరమైన గీతాలకు తనకు తానే సాటియని మరోసారి నిరూపించారు ఘంటసాల. ఈ పాటలోని భావోద్వేగాలకు తగినట్లుగా కోదండపాణి హెవీ ఆర్కెస్ట్రానే ఉపయోగించి ' బొమ్మను చేసి' పాటకు ప్రాణ ప్రతిష్ట చేసారు.

తెర వెనుక ఘంటసాల బరువైన గాత్రానికి దీటుగా తెరమీది ఎన్.టి.రామారావు అమోఘమైన నటవైదుష్యం ఈ పాటకు అజరామరత్వాన్ని కల్పించింది. ఎన్.టి.ఆర్, సావిత్రి, నాగయ్య, రాజనాల, పద్మనాభం, గీతాంజలి, మొదలగువారు నటించిన 'దేవత' బాక్సాఫీస్ వద్ద ఘన ఫలితాలానే సాధించింది.

నిర్మాత గా తన మొదటి చిత్రాన్ని ఎన్.టియరామారావు సహకారంతో నిర్మించిన బి.పద్మనాభం తర్వాత మరెన్నో సినీమాలు తీసారు, డైరెక్టర్ గా వ్యవహరించారు. కానీ మరల ఎన్.టి.ఆర్ తో మరే చిత్రమూ నిర్మించకపోవడం ఒక విశేషం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 


1 comment:

  1. వ్యాసం చాలా బాగుంది.

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...