Saturday, 21 December 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 61వ భాగం - కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయవ భాగం ఇక్కడ

61వ సజీవరాగం -  కులములో ఏముందిరా సోదరా
                         మతములో ఏముందిరా
చిత్రం - సత్యహరిశ్చంద్ర
గానం - ఘంటసాల 
రచన - పింగళి
సంగీతం - పెండ్యాల

పల్లవి: కులములో ఏముందిరా సోదరా

మతములో ఏముందిరా

ఆ మట్టిలో కలిసేటి మడిసీ మడిసికి

భేదం ఏముంది ఏముందిరా 

                            !కులము!

నిలువు బొట్టుతో సొరగం రాదుర-2

అడ్డబొట్టుతో నరకం పోదుర-2

జుట్టు బొట్టు కట్టులన్నీ-2

పాడె కట్టుతో ఎగిరిపోవురా  

జంగాలంతా శివుడే యంటరు

దాసరులో కేశవుడే యంటరు!జంగా! 

                            !కులము!

 జంగము దాసరి జగడమాడుకొని-2

వల్లకాటిలో ఒకటైపోతురె !కులము!

 తలకో మతముగ నీతులు గీతులు

బోధలు చేసే స్వాములు చివరకు -

!తలకో! కాటిరేడు యీ వీరబాహుని 

చేతిమీదుగా బుడిదౌతరే  

                            !కులము! హహాహహా !

కులమా? గుణమాగుణమా? కులమాఏది మనిషిని , సమాజాన్ని ప్రగతిఫథంలోకి తీసుకువెళ్ళేది - గుణమా? కులమా?   సాత్విక లక్షణాలు మనిషిని తన ఆధీనంలో వుంచుకున్నంత కాలం సద్గుణాలే మార్గదర్శకంగా వుండేవి. చాతుర్వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ నీతి నియమాలతో ఎవరి వృత్తులను వారు చేసుకున్నంతకాలం ఈ లోకం సుఖసంతోషాలతో శాంతియుతంగా వుండేది.  రాను రాను ఎప్పుడైతే రజో తమో గుణాల ఆధిక్యత ప్రబలడం మొదలయిందో అప్పుడే మనిషి తెగలని, జాతులని, కులాలని, మతాలని ఏర్పర్చుకొని రాక్షసుడిగా మారాడు. బలమున్నవాడిదే రాజ్యమయింది.   సత్యలోకం, రామరాజ్యం, సమైక్యత, వసుధైక కుటుంబకం వంటి మాటలు ఎండమావులైనాయి. జాతి, కులం, మతం ప్రాతిపదిక మీద దుష్టరాజకీయముఠాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అనాదిగా వున్న ఈ జాతి, కుల, మత జాడ్యం వలన మానవ సమాజం భ్రష్టుపడకుండా వుండడానికి,   ఈ దేశాన్ని రక్షించడానికి మహానుభావులెందరో వివిధరకాలుగా కృషిచేసారు. కుల, మత తత్త్వాలకు అతీతమైన నవసమాజస్థాపన కోసం అహర్నిశలు శ్రమించారు.

ఆ దిశగా తెలుగు సినీమా చేసిన సేవకూడా సామాన్యమైనది కాదు. నేడు సంఘంలో ప్రబలివున్న జాతి, కుల, మత రాజకీయ వ్యవస్థ అవలక్షణాలను తెగనాడుతూ అనేక సుబోధక గేయాలను లబ్దప్రతిష్టులైన సినీ కవులెందరో  సినీమా పాటల ద్వారా ప్రచారం చేసి పామర ప్రజలలో జాగృతిని తీసుకురావడానికి తమ వంతు కృషి తాము చేసారు.

జనపదాలకు అర్ధమయేలా సులభమైన, సరళమైన శైలిలో కవి పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన ఒక వ్యంగ్య, ప్రబోధ గీతమే ఈనాటి సదా మదిలో మెదిలే  ఘంటసాల సజీవరాగం. అదే - "కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా" పాట. ఈ పాటలోని ప్రతి అక్షరం, ప్రతీ భావం మనం ఉలిక్కిపడేలా చేస్తుంది. జీవిత సత్యాలను బోధిస్తుంది.

మంచిని బోధించడానికి సకల శాస్త్ర పారంగతుడో, సర్వసంగ పరిత్యాగో కానక్కరలేదు. జీవితసత్యాన్ని క్షుణంగా అర్ధం చేసుకున్న సర్వసాధారణ నిరక్షర కుక్షి కూడా మంచిని నేర్పడానికి అర్హుడే. అలాటి పామరుడే వీరబాహు అనే కాటికాపరి. ఈ భూమండలాన్నే ఏలిన సత్యవాక్పరిపాలకుడు హరిశ్చంద్ర చక్రవర్తి విధివిలాసం వలన సర్వస్వం చివరకు భార్యా సుతులను కోల్పొయి అనాధగా మిగిలిపోయినప్పుడు శ్మశానంలో పని ఇచ్చి ఆదుకున్న వ్యక్తి వీరబాహు.  పరమ దుర్మార్గుడిగా , తాగుబోతుగా  బయటకు కనిపించినా సమాజంలోని అవలక్షణాలను, వాటిని పెంచి పోషించే పెద్ద మనుషులను నిర్భయంగా దుయ్యబట్టే వీరబాహుని చూస్తే చెడ్డవారికి భయము కలుగుతుంది, మంచివారికి గౌరవము పెరుగుతుంది. వైరాగ్య, వేదాంత సారాన్నంతా చిన్న చిన్న మాటల్లో  సుస్పష్టం చేసారు పింగళి.  'మట్టిలో కలిసేటి మడిసి మడిసికి భేదం ఏముంది'; 'నిలువు బొట్టుతో సొరగం రాదు, అడ్డబొట్టుతో నరకం పోదు';

(ఆ రోజుల్లో జరిగిన ఒక స్వారస్యమైన సంఘటన. కాంచీపురం వరదరాజస్వామి ఆలయంలోనే అని జ్ఞాపకం, వడకళం , తెన్కళం అనే  రెండు తెగల శ్రీవైష్ణవుల మధ్య ఆధిపత్యపు పోరు నడుస్తూండేది. ఆలయంలోని ఏనుగు నుదుటన నామం 'U'  ఆకారంలో పెట్టాలా ? లేక ' Y' ఆకారంలో పెట్టాలా? అనే విషయంలో  వారిలో వారు తీవ్రంగా కలహించుకొని మద్రాస్ హైకోర్ట్ కో, ఢిల్లీ సుప్రీం కోర్టుకో వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి)

'జుట్టు బొట్టు కట్టులన్ని పాడెకట్టుతొ ఎగిరిపోవురా'; శివకేశవులను ఆరాధించే జంగాలుదాసరులు జగడమాడుకొని వల్లకాటిలో ఒక్కటైపోతారు. "తలకో మతముగ నీతులు గీతులు చెప్పే స్వాములు సైతం కాటిరేడు చేతిమీదుగా బూడిదో, సమాధో కాకతప్పదు. ఇక ఆమాత్రందానికి జాతి ఏమిటి, కులమేమిటి, మతమేమిటిబతికిన మూణ్ణాళ్ళు జీవితం సార్ధకం చెందేలా  మంచిగా, శాంతిగా గడపకుండా ఎందుకీ ఆరాటం, ఎందుకీ వ్యామోహం. ఎంతటి అర్ధవంతమైన పాట. ఈనాడు మన దేశంలో కులం, మతం ప్రసక్తిలేని రాజకీయయ దాదాపు శూన్యమనే చెప్పాలి.

పెండ్యాలగారి సంగీత దర్శకత్వంలో అద్బుతంగా రూపొందిన ఈ జానపద వైరాగ్య గీతానికి ఘంటసాల జీవం పోసారు. వీరబాహుని మొరటుదనం, మాటల కరుకుదనం, భావంలో వీరావేశం వీటన్నిటిని ఘంటసాల బాగా ఆకళింపుజేసుకొని తానే ఓ వీరబాహు అన్నట్లుగా తన గళంతో నటించారు. తెరమీద వీరబాహు పాత్రధారి రాజనాల పాత్రోచిత నటనకు మరింత దోహదం చేసారు. (1954లో వాహినీ స్టూడియోలో జరిగిన ఆల్ స్టార్ కార్నివాల్ లో దాదాపు గా ఈ వీరబాహుని గెటప్ లోనే ఘంటసాల స్వయంగా డప్పువాయిస్తూ కనిపిస్తారు).

నిమ్నజాతివాడిగా పరిగణింపబడిన వీరబాహు కల్లుముంతతో వీరంగం వేస్తూ  వీధుల్లో పాడిన ''కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా'' పాటలో ప్రధానంగా వినపడేవి  డప్పులు, గజ్జెలు, తబల వంటి తాళవాద్యాలు.  పాటలో ప్రతీ పాదం తర్వాత ఘంటసాల మాస్టారు వినిపించే జానపద తరహా జతులు ఈ పాటకు జీవం. ఘంటసాలవారు ఈ పాటలో కనపర్చిన జోరు, హుషారు, వీరావేశం వీరబాహు పాత్రను ఎలివేట్ చేసాయి. తెరమీద రాజనాల మరింత విజృంభించి ఆ పాత్రలో లీనమైపోయారు. రాజనాల- ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన పాటల్లో ఈ పాటనే తలమానికంగా చెప్పాలి.

12వ శతాబ్దంలో హొయసళ రాజుల కాలంలో రాఘవాంక అనే కన్నడ కవి రచించిన 'హరిశ్చంద్ర కావ్య' బహుళ ప్రసిధ్ధి చెందింది.  తర్వాత గత శతాబ్దంలో ప్రముఖ కవి, నటుడు, నాటకప్రయోక్త అయిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హారిశ్చంద్ర చరిత్రను నాటకానికి అణుగుణం మలిచారు. తదాదిగా హరిశ్చంద్ర నాటకం తెలుగువారికి అత్యంత ప్రియతమ నాటకమయింది. 1913లో దాదా సాహేబ్ ఫాల్కే నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి మూకీ చిత్రం 'హరిశ్చంద్ర'. మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సబ్ టైటిల్స్ వేసారు. తర్వాత 1956 లో రాజ్యం పిక్చర్స్ వారు  జంపన చంద్రశేఖరరావు డైరెక్టర్ గా ఎస్.వి.రంగారావు హారిశ్చంద్రుడిగా, సుసర్ల దక్షిణామూర్తి సంగీతంతో ఒక అద్భుతమైన చిత్రం తీసారు. మరల 1965లో విజయావారు కె.వి.రెడ్డి దర్శకుడిగా ఎన్.టి.రామారావుతో సత్య హరిశ్చంద్రను నిర్మించారు. పెండ్యాల సంగీతం నిర్వహించారు. పౌరాణిక నాటకాలలో పద్య కృష్ణుడు, గద్య కృష్ణుడు లాగనే ఎస్.వి.రంగారావు హరిశ్చంద్ర పద్య హరిశ్చంద్రగా, ఎన్.టి.ఆర్ సత్యహరిశ్చంద్రను గద్య హరిశ్చంద్రగాను తెలుగు ప్రేక్షకులు గుర్తించి ఆదరించారు. విజయావారే సత్యహరిశ్చంద్రను కన్నడంలో కూడా రాజ్ కుమార్ తో నిర్మించి ఘనవిజయం సాధించారు. ఈ మూడు సినీమాలలోనూ ఘంటసాలవారి పాటలు, పద్యాలు బహుళ జనాదరణ పొందాయి. కన్నడ హరిశ్చంద్రలో పాటలన్నీ తెలుగు వరసలతో చేసినవే. అన్నింటినీ ఘంటసాలే ఆలపించి చిత్ర విజయానికి దోహదం అయ్యారు. ముఖ్యంగా , సత్యహరిశ్చంద్రలోని ''కులములో ఏముందిరా సోదరా'' పాట తెలుగు కన్నడనాట ఘంటసాలవారి కీర్తిని ద్విగుణీకృతం చేసింది.


https://youtu.be/j2c-vLUVi-8?si=kPvpjWjkVs-Rt_we

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...