అంధకార మలమినపుడు
వెలుతురుకై వెతకాలి
ముందుచూపు లేనివాడు ఎందునకూ
కొరగాడు
సోమరియై కునుకువాడు
సూక్ష్మమ్ము
గ్రహించలేడు !
పల్లవి :
మత్తు వదలరా నిద్దుర మత్తు
వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తౌదువురా
!మత్తు!
చరణం 1:
జీవితమున సగభాగం నిద్దురకే
సరిపోవు
మిగిలిన ఆ సగభాగం
చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రాలోలుడు తెలివిలేని
మూర్ఖుడు-2
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు
!మత్తు!
వచనం :
సాగినంతకాలం నా అంతవాడు
లేడందురు సాగకపోతే ఊరక
చతికిలబడిపోదురు కండబలముతోటే ఘనకార్యము
సాధించలేరు బుధ్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు
!మత్తు!చరణం 2:
చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా
పిరికితనము కట్టిపెట్టి
ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం
!మత్తు!
మని+షి = మనిషి ; మకార త్రయ సమన్వితుడు( మదం, మదిర, మగువ) లాటి చమత్కార నిర్వచనాలెన్నో సగటు మనిషి తత్త్వానికి నిదర్శనంగా చెప్పబడ్డాయి. మనిషిలో సాత్విక గుణాలు లోపించినప్పుడు రజో, తమో గుణాలు మనిషిని పట్టి పీడిస్తాయి. అలాటి సందర్భాలలో కర్తవ్య విమూఢుడై, సోమరిగా మారి రోజంతా తినడంలోనూ, నిద్రపోవడంలోనే గడిపేస్తూంటే ఎందుకు కొరగాకుండా పోతాడు. అలాటప్పుడు భగవంతుడు సాధు సత్పురుషుల రూపంలో మార్గాన్ని నిర్దేశిస్తాడు. మనిషి ఆ ఉపదేశాలను సక్రమంగా అనుసరిస్తే వృధ్ధిచెందుతాడు. లేదంటే పతనమైపోతాడు. భగవంతుడైనా కొంతవరకే మార్గం చూపించి చేయూతనిస్తాడు. పాటించాడా సరి, లేదంటే 'నీ ఖర్మం' అని వదిలేసి చక్కా పోతాడు.
ఇదే ' మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా' పాటలోని సారాశం.
పౌరాణిక చిత్ర నిర్మాణంలో నిష్ణాతుడు ఎన్.టి.రామారావుగారు. మంచి అభిరుచి గల దర్శక, నిర్మాత. తన చిత్రాల ద్వారా సమాజానికి ఉపయోగించే సందేశం వినిపించాలని తపించిన నట దర్శకుడు. తమ సొంత బ్యానర్ లో భారీ ఎత్తున నిర్మించిన పౌరాణిక చిత్రరాజం 'శ్రీకృష్ణ పాండవీయం'. పరస్పర విరుధ్ధ భావాలు గల శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను ఎంతో వైవిధ్యంతో పోషించి నటరత్న బిరుదుకు వన్నె తెచ్చారు.
నేటి సజీవరాగమైన "మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా " పాట శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోనిదే.
కార్యార్ధియై వెళ్ళిన భీముడు కర్తవ్యాన్ని మరచి నిద్రమత్తులో పడినప్పుడు శ్రీకృష్ణుడు మారువేషంలో వచ్చి అతనిని జాగ్రదావస్థకి తీసుకువచ్చి కర్తవ్యాన్ని బోధించే సన్నివేశంలో వచ్చే పాట ఇది. సన్నివేశపరంగా ఇది భీముని ఉద్దేశించి పాడినా ఆ పాటలోని సందేశం. ఈ లోక ప్రజలందరికీ వర్తిస్తుంది. ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరిగారు చాలా అద్భుతంగా వ్రాసారు. ముందు చెప్పినట్లుగా ఈ పాట సాహిత్య ప్రధానమైన గీతం. నిరక్షరాస్యులకు కూడా అతి తేలికగా అర్ధమయేరీతిలో ఈ పాటను కొసరాజు వ్రాసారు. మనిషిలోని బలహీనతలను, దుర్గుణాలను ఎత్తిచూపుతూ వాటిని తొలగించుకోవలసిన ఆవశ్యకతను చమత్కారంగా చిన్నచిన్న మాటలతో సుస్పష్టం చేసారు. మత్తు, గమ్మత్తు, చిత్తు, చుట్టుముట్టు, మట్టుబెట్టు, కట్టిపెట్టు, చేపట్టు వంటి పదాలు అంత్యప్రాసల మీద కొసరాజుగారికున్నమక్కువను తెలియపరుస్తాయి. పాటలోని భావాన్ని, సాహిత్యాన్ని విశ్లేషించవలసినంత కఠినతర భాషేమీ ఈ పాటలేదు. అన్నివర్గాలవారు అత్యంత సులభంగా అర్ధం చేసుకోగల పాట. ఇది కూడా అర్ధం కాలేదంటే ఇంక అది వారి 'ఖర్మం'.
ఇందులో సంగీతం పాత్ర నామమాత్రం. అయినా అందరూ సులభంగా పాడుకునేలా స్వరపర్చారు సంగీతదర్శకుడు టి.వి.రాజు. మరెన్నో శ్రవణపేయమైన గీతాలున్న శ్రీకృష్ణ పాండవీయంలో ఘంటసాలవారు ఆలపించిన ఈ పాట మాత్రం కధాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ రకమైన గీతమైనా ఆ పాట భావంలో లీనమై అవలీలగా మధురంగా ఆలపించగల నేర్పరి ఘంటసాల. ఈ పాటలో వున్న తమాషా ఏమంటే ఈ పాటలో వచనం, పాట రెండూ వినిపిస్తాయి. 'అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి...' అనే వచనంతో ప్రారంభమై తర్వాత 'మత్తు వదలరా' అనే పల్లవి తో పాట సాగుతుంది. అలాగే, ఒకటవ చరణానికి , రెండో చరణానికి మధ్య మరల వచనం వస్తుంది. ఒక్కొక్కసారి పాట సాహిత్యం లోని పదాలు తాళానికి ఎదురుతిరిగి పాట వరసకు, నడకకు అడ్డు తగులుతూంటాయి. అలాటి సందర్భాలలో పాటను ఆపి వచన రూపంలో చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పిస్తారు. ఇందువల్ల సంగీత పరంగా, సాహిత్య పరంగా ఔచిత్యం దెబ్బతినదు. ఈరకమైన విషయాలన్నింటిని ఆకళింపుజేసుకొని గీతానికి కావలసిన రసోత్పత్తిని సమర్ధవంతంగా కలిగించడం ఘంటసాలవారి ప్రత్యేకత.
టేప్(డప్పు), తబలా డక్క, గిటార్, ఫ్లూట్ వంటి వాద్యాలను మాత్రమే ఔచిత్యంతో ఉపయోగించారు టి.వి.రాజు. ఎన్నో మంచి పాటలున్న ఈ చిత్రంలో సి.నా.రె. వ్రాసి సుశీల, లీల గార్లు ఆలపించిన 'స్వాగతం, సుస్వాగతం' పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు.
1995లో ప్రశాంతినిలయంలో శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 70 జన్మదినోత్సవ సందర్భంగా అక్కడ మా జంటసంస్థల జాతీయసమైక్యతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంలో బాబావారు తమ రథంలో ఊరేగింపుగా వచ్చినప్పుడు ఈ 'స్వాగతం , సుస్వాగతం' పాట వరసలో బాబా వారి పరంగా వేరే సాహిత్యం వ్రాయించి ప్రముఖ గాయకుడు మనో, నటుడు సాయికుమార్, బృందంతో పాడించడం, అది లక్షలాది సంఖ్యలో హాజరయిన భక్త సందోహానికి అమితమైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది ఇంకా కనులముందు కదలాడుతోంది.
శ్రీకృష్ణపాండవీయం చిత్ర దర్శకుడిగా, శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రధారిగా ఎన్.టి.రామారావు తన విశ్వరూపాన్ని, బహుముఖ ప్రజ్ఞను దిగంతాలకు చాటిచెప్పారు. సుప్రసిద్ధ కన్నడ నటుడు ఉదయకుమార్ ఈ చిత్రంలో భీమసేనుడిగా నటించారు. తమ పూర్వీకం తెలుగునాటకు చెందినదేనని తమ ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటామని ఉదయకుమార్ ఏదో పత్రిక ఇంటర్వ్యూలో చెప్పగా చదివిన గుర్తుంది. తాను హీరోగా నటించిన మరికొన్ని ఇతర చిత్రాలలో కూడా ఉదయకుమార్ కు మంచి అవకాశాలు కల్పించి ప్రోత్సహించిన సహృదయుడు ఎన్.టి.ఆర్. పరమానందయ్య శిష్యుల కథ విజయం తరవాత నిర్మాత తోట సుబ్బారావు నిర్మించిన 'భువనుందరి కథ' చిత్రంలో చాకలి తిప్పడు పాత్ర వాటిలో ఒకటి. శ్రీ కృష్ణపాండవీయం సాధన గురించి, ఘనవిజయం గురించి నేను ప్రత్యేకించి చెప్పబూనడం హాస్యాస్పదమే అవుతుంది.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
Excellent analysis Sir.
ReplyDelete