Saturday, 18 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవై నాలుగవ భాగం ఇక్కడ

65వ సజీవరాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే 

చిత్రం - చిలక గోరింకా
గానం - ఘంటసాల
రచన - శ్రీశ్రీ
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు

పల్లవి :

నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే 

ఊరించు తొలి దినాలే ఈ రేయి పిలువసాగే 

                                            ! నా రాణి!

చరణం 1:

నగుమోము చూడబోయి నినుచేర

నాటి రేయి నను క్రీగంటనే కని

ఆ వెంటనే చని దూరాన దాగుంటివే

                                            ! నా రాణి!

చరణం 2:

 సిగలోని మల్లెపూలా సవరించబోవు వేళా 

మది గిలిగింతగా చేయి విదిలించగా 

ఎద నినుకోరి పులకించెనే

                                            ! నా రాణి!

 చరణం 3:

పడకింటి శయ్య చెంత నీ మేను

తాకినంత మన గీతాలలో

జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే

                                            ! నా రాణి!

మోహం ముఫ్ఫైయేళ్ళు, ఆశ అరవై రోజులు అని అంటాడో అరవ కవి. అంటే యవ్వన దశలోని  కోరికలు, పరస్పర ఆకర్షణలు  వాటివలన కలిగే ఆనందం క్షణికమైనవి, తాత్కాలికమైనవి అని చెప్పడం. జీవితంలోని మహదానందం, తృప్తి దంపతులకు లభించేది వయసు మళ్ళిన తర్వాతే.  జీవితం నేర్పిన అనుభవసారంతో దంపతులిద్దరూ పరస్పరం ఒకరినొకరు అర్ధంచేసుకొని ఒకరికోసం మరొకరుగా జీవించేప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం. ఆ ప్రేమ శాశ్వతం. నిజమైన ప్రేమ బాహ్యాసౌందర్యానికి, అందువలన కలిగే వాంఛలకు సంబంధించినది కాదు. అనురాగభరితమైన ప్రేమ మనసుకు సంబంధించినది. వృధ్ధాప్యం దేహానికేగాని మనసుకు కాదు. పటిష్టమైన ప్రేమానుబంధంతో అరవైలలో కూడా ముఫ్ఫైలలోలా  ఆనందం అనుభవిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చును.

అదే నేటి ఘంటసాలవారి సజీవరాగం మనకు బోధపరుస్తుంది.

సంతానం తప్ప సకల సౌభాగ్యాలు కలిగిన ఒక ధనిక దంపతుల షష్టిపూర్తి మహొత్సవంనాటి రాత్రి శోభాయమానంగా అలంకరించబడిన పడకగదిలో  సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్య మనసెరిగిన  ఆ భర్త  తమ మొదటిరాత్రి మధురానుభూతులను వీణ మీద పలికిస్తూ  'నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే....అని సుశ్రావ్యంగా ఆలపిస్తూ ఆమెకు పరవశత్వాన్ని, ప్రమోదాన్ని కలిగిస్తాడు.

వృధ్ధాప్య దశకు చేరుకున్న ఓ అనురాగపూరిత అన్యోన్య దంపతుల కథే ఈ 'చిలకా గోరింక'. (చిలక  గోరింక ఒక జాతి పక్షులు కావని, ఒక గూటిలో కలసి జీవించవని  పక్షిశాస్త్రజ్ఞులంటారు. అయినా 'చిలకా గోరింకల్లా' కలసిమెలసి ఉండడాన్ని ఆ రెండు పక్షులకి అన్వయించడం మాత్రం సర్వత్రా స్థిరపడిపోయింది).

మన తెలుగు సినిమాలలో యవ్వన దశ దాటి వృధ్ధాప్యంలో అడుగుపెట్టిన ఒక వ్యక్తి  శృంగారపరమైన మధుర గత స్మృతులను నెమరువేసుకుంటూ ఆలపించడమనేది అరుదుగా జరిగే ఒక విలక్షణమైన వ్యవహారం. ఇటువంటి గీతాల చిత్రీకరణ రచయితకు, సంగీత దర్శకుడికి, గాయకుడికి, నటీనటులకుదర్శకుడికి అందరికీ కత్తిమీద సామే. పెను సవాలు వంటిదే. సున్నిత, లలిత శృంగారభావాలకు ఆమడ దూరంలో వుండే ఎస్.వి.రంగారావు వంటి నటుడితో ఆయనకు జోడీగా అంజలీదేవి మీద ఈ గీతాన్ని చిత్రీకరించాలని నిర్ణయించడం దుస్సాహసమే.

అయినా అటువంటి క్లిష్ట కార్యాన్ని 'చిలకా గోరింక' సినీమాలో బహు చాకచక్యంగా సమర్ధవంతంగా నిర్వహించారు దర్శక నిర్మాత కె.ప్రత్యగాత్మ. ప్రత్యగాత్మ అంటే స్వయంప్రకాశత్వం గల ఆత్మ కలిగినవాడని అర్ధం. ఆత్మా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రత్యగాత్మ నిర్మాతగా తన తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం 'చిలకా గోరింక' . కృష్ణకుమారి, కృష్ణంరాజు నవయవ్వన చిలకా గోరింకలైతే, అంజలీ దేవి, ఎస్.వి.రంగారావు మలి వయసు చిలకా గోరింకలు. ఈ ఇద్దరే ఈ సినీమాకు అసలైన నాయికా నాయకులు.

 'చిలకా గోరింక' సినీమా లో ఏడు పాటలు, మూడు పద్యాలు వున్నా ఘంటసాల మాస్టారు పాడిన పాటలు మాత్రం రెండే రెండు. మిగిలిన గీతాలను పి.సుశీల, జానకి, మాధవపెద్ది, టి.ఆర్.జయదేవ్  గానం చేశారు. అందులో ఘంటసాలవారి గళంలో నుండి వచ్చిన రెండు పాటలు మాత్రం బహుళ జనాదరణ పొందాయి. వాటిలో ప్రముఖమైనది, సజీవరాగమై విరాజిల్లుతున్నది 'నా రాణి కనులలోనేఅనే గీతం. ఈ పాటను మహాకవి శ్రీశ్రీ వ్రాశారు. అగాధమౌ జలనిధిలో అమూల్య ఆణిముత్యాల్లా విప్లవకవి కలం నుండి కూడా  సున్నితమనస్కమైన సరసగీతాలెన్నో అలవోకగా జాలువారాయి. అలాటి వాటిలో 'నా రాణి కనులలోనే' పాట ఒకటి. ఈ గీతంలోని - "నగుమోము చూడబోయి నినుచేర నాటి రేయి నను క్రీగంటనే కని అ వెంటనే చని దూరాన దాగుంటివే""పడకింటి శయ్య చెంత నీ మేను తాకినంత మన గీతాలలోజలపాతాలలో నవ రాగాలు మ్రోగెనులే" వంటి పద ప్రయోగాలు శ్రీశ్రీ గారి ఉన్నత భావుకతకు అద్దం పడతాయి.

స్వరాలతో సయ్యాటలాడుకునే రసాలూరు రాజేశ్వరరావుగారు ఈ పాటకు అద్భుతమైన స్వరాలనే సమకూర్చారు. వలజి రాగ మాధుర్యమంతా ఈ పాటలో గుప్పించారు. వలజి ఐదు స్వరాలు కల ఔఢవరాగం. ఆరోహణలో ' స గ ప ద ని' అవరోహణలో ' స ని ద ప గ' అనే ఐదు స్వరాలే వుంటాయి. 'రిషభం మధ్యమం' స్వరాలు ఈ రాగానిలో వుండవు. వలజి రాగం 28వ మేళకర్త అయిన "హరికాంభోజి"  జన్యం.  హిందుస్థానీ సంగీత శైలిలో వలజికి సమాంతర రాగం 'కళావతి'. ఈ రెండు రాగాలలో జనాదరణ పొందిన సినీమా పాటలెన్నో అన్ని భాషలలో వున్నాయి. పాట ప్రారంభంలో వీణ చిట్టిబాబుగారి సుస్వరాల వీణ వలజి రాగ స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. వీణతో పాటు పియోనా, ఫ్లూట్, వైలీన్స్, తబలా, డబుల్ బేస్ వంటి వాద్యాలతో రాజేశ్వరరావుగారు ఈ పాటను మలచారు.

రాగ లక్షణాలకు, భావ ప్రకటనకు, సుస్పష్టమైన భాషకు మారుపేరైనై ఘంటసాల తన గాన మాధుర్యంతో 'నా రాణి కనులలోనే ' పాటను సజీవం చేశారు. ఆ గళంలోని లాలిత్యం, సౌమ్యత, శ్రావ్యత, గమకశుధ్ధి శ్రోతల హృదయాలలో మధురోహలను, అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తాయి.

 ఏ నటుడికి పాడినా, ఏ పాత్రకు పాడినా ఆ నటుడిని, ఆ పాత్రను మన కళ్ళెదట సాక్షాత్కరింపజేయడం ఘంటసాలవారికి వెన్నతో పెట్టిన విద్య. 'నా రాణి కనులలోనే' పాటను కళ్ళుమూసుకు విన్నా రంగారావుగారు, ఆయన పాత్రే మనకు గోచరిస్తాయి. అందుకు తగినట్లు గానే ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి ఈ పాటకు అసమాన్యమైన నటనను కనపర్చారు... లేదు ఆయా పాత్రలలో సజీవంగా కనిపించారు.   రొమాంటిక్ బెడ్ రూమ్ సీనే అయినా ఎక్కడా అసభ్యత, మితిమీరిన శృంగార చేష్టలు లేకుండా subtle expressions తో డిగ్నిఫైడ్ గా నటించడం వారిద్దరికే చెల్లు.  ముఖ్యంగా, ఈ పాటలో వీణను సక్రమమైన పధ్ధతిలో మీటడానికి రంగారావు గారు తీసుకున్న శ్రధ్ధ, కనపర్చిన అవగాహన ఎంతో అభినందించదగ్గది. సాధారణంగా మన సీనీమాలలో నటీనటులు వాయిద్యాలను సక్రమంగా handle చేయడం జరగదు. ఆ విషయంలో మన దర్శక నిర్మాతలు, నటులు ఆ విషయానికి తగిన ఓర్పు, ప్రత్యేక శ్రధ్ధ కనపర్చరు. అందుకే ఆ పాటలు సంగీతం తెలిసినవారికి హాస్యాస్పదంగా, ఆవేదన, కొన్ని సందర్భాలలో జుగప్స కలిగించేవిగా వుంటాయి.

ఘంటసాల గానం, ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి నట వైదుష్యంతో 'నా రాణి కనులలోనే' పాట సజీవరాగం అయింది. ఐదున్నర దశాబ్దాల తర్వాత కూడా ఇంకా సంగీతాభిమానులను అలరిస్తోంది.

ప్రత్యగాత్మ గారి "చిలకా గోరింక" కృష్ణంరాజు, రమాప్రభ వంటి నూతన నటులను తెలుగువారికి పరిచయం చేసింది. జయదేవ్ వంటి గాయకుడికి మూడు  పాటలతో మంచి అవకాశం కల్పించింది. ఈ సినీమా హీరోగా  కృష్ణంరాజుకుగాయకుడిగా జయదేవ్ కు గుర్తింపునిచ్చినా వెనువెంటనే మూకుమ్మడిగా గొప్ప అవకాశాలు లభించలేదు. అందుకు 'చిలకా గోరింక' సినీమా  అపజయం పాలవడం ఒక కారణం కావచ్చును. ఆర్ధికంగా అపజయం పాలయినా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది.

చిలకా గోరింక సినీమాలో ఘంటసాల మాస్టారు పాడిన రెండు పాటలు ఎస్.వి.రంగారావుగారి మీదే చిత్రీకరించబడడం ఒక విశేషం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...