Saturday, 11 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 64వ భాగం - మదిలో మౌనముగా కదలె మధుర వీణ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవై మూడవ భాగం ఇక్కడ

64వ సజీవరాగం - మదిలో మౌనముగా కదలె మధుర వీణ

చిత్రం - శకుంతల
గానం - ఘంటసాల
రచన - సినారె
సంగీతం - ఘంటసాల

శ్లోకం :

అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై

అనావిధ్ధం రత్నం మధు నవమనాస్వాదిత రసమ్

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూప మనఘం

నజానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః నజానే 

 (కాళిదాసు విరచిత అభిజ్జాన శాకుంతలం నుండి)

తాత్పర్యం :

అభిజ్ఞాన శాకుంతలం రెండవ అంకంలో శకుంతల గురించి రాజా దుష్యంతుడు తన చెలికానితో పలికిన మాటలు ...

 "ఈమె వాసన చూడబడని పువ్వుఏ గోళ్ళచేతా గిల్లబడని చిగురుటాకు. రంధ్రం తొలవబడని రత్నం. రుచి చూడబడని తియ్యని కొత్త తేనె. చేసుకున్న పుణ్యాలకి పరిపూర్ణమైన ఫలం. ఎవడు ఈ కన్నెను అనుభవించాలని బ్రహ్మ వ్రాసిపెట్టాడో! నాకు తెలియదు."

ఈ శ్లోకం దుష్యంతుడి వ్యామోహానికి, నిర్లజ్జకు పరాకాష్టగా కవి కాళిదాసు మలిచాడని భావించవచ్చును.

 (కీ.శే. పట్రాయని సంగీతరావుగారు ఇచ్చిన వివరణ )

పల్లవి : 

మదిలో మౌనముగా

కదలె మధుర వీణ - 2

చరణం 1 :

రాజహంసవోలె సాగి రమణి తిరిగి చూసే

మరుడేమొ దాగి దాగి విరితూపులు దూసె

ఈ విరాళి నాలో ఏ నాటికి తీరునో

                                    ! మదిలో!

 చరణం 2 :

తెలివెన్నెల జాలువారె చెలియ నవ్వులోన

కనరాని జ్వాలలేవో కలిగెను నాలోన

ఈ తీయని రేయి ఇటులే తెలవారునో

                                    ! మదిలో!

అనాదిగా మన సమాజంలో  పురుషాధిక్యత వలన స్త్రీ అబలగా, బానిసగా, భోగవస్తువుగా అణగద్రొక్కబడింది. ఏ స్వేఛ్ఛ, స్వాతంత్ర్యం లేకుండా  స్త్రీలు అనుభవించే  కష్టనష్టాలకు, అవమానాలకు దర్పణం శకుంతల. పుట్టిన వెంటనే పసికందుగా వున్న కన్నబిడ్డను  నిర్దాక్షిణ్యంగా వదలిపెట్టి వెళ్ళి పోయిన ఆమె తల్లిదండ్రులు మేనకా విశ్వామిత్రులు. శాకుంతల పక్షులు కరుణించి  ఆ పసికందు ఆకలిని తీర్చడం వలన శకుంతలగా గుర్తించబడింది. కణ్వ మహర్షి దయతో పెరిగి పెద్దయిన కన్య శకుంతల.

కణ్వాశ్రమంలోని శకుంతల అందచందాలకు, ముగ్ధత్వానికి వ్యామోహం చెంది దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడినుండే శకుంతల కష్టాలు ప్రారంభమయాయి. నేడు మనం ఎవరి పేరుతో ఈ దేశాన్ని భారత దేశం అని పిలుచుకుంటున్నామో ఆ భరత చక్రవర్తి ఈ శకుంతల కుమారుడు. అంతటి చారిత్రక ప్రశస్తి పొందిన కావ్యనాయిక శకుంతల. ఐదవ శతాబ్దానికి(?) చెందిన సంస్కృత కవి కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని కథానాయిక శకుంతల. శకుంతలదుష్యంతుల ప్రణయగాథ ఇతివృత్తం. కాళిదాసు మహాకవి ఏ రాజాస్థానానికి చెందినవాడో నిర్దిష్టమైన చారిత్రకాధారాలు లేవు. అయినా రెండవ చంద్రగుప్తుని ఆస్థానకవియని కొంతమంది చరిత్రకారుల వాదన. విక్రమాదిత్యుని కొలువులో వున్నట్లు చెప్పబడినా 'విక్రమాదిత్య' అనే బిరుదు అనేక మంది చక్రవర్తులకు వున్నట్లు తెలుస్తోంది. కాళిదాసు మహాకవి అభిజ్జాన శాకుంతలంతో బాటు రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం, విక్రమోర్వశీయం వంటి గొప్ప కావ్యాలను కూడా వ్రాశాడు.

సినీమా మాధ్యమం ఆవిర్భవించినప్పటినుండి ఈ కథను అనేక భాషలలో అనేకసార్లు అనేక దిగ్ధంత దర్శకులు సినిమాగా మలిచారు. ముందుగా, 1940లో Ellis R. Dungan దర్శకత్వంలో తమిళంలో సుప్రసిధ్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం శకుంతల, దుష్యంతులుగా ఈ శకుంతల వచ్చింది. ఆ తర్వాత హిందీలో వి.శాంతారాం తన మొదటి భార్య జయశ్రీ గాడ్కర్ శకుంతలగా, చంద్రమోహన్ (తెలుగు రంగులరాట్నం  హీరో చంద్రమోహన్ కాదు) దుష్యంతుడిగా 1943లో నిర్మించారు. భారతీయ సంగీత, నృత్య, చిత్రకళలలోఅణువణువున ద్యోతకమయ్యే భావ సౌందర్యాన్ని, విశిష్టతను తన సినిమాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించి ప్రపంచానికి చాటిచెప్పిన నిర్మాతదర్శకుడు వి.శాంతారామ్. ఆయనకు శకుంతల పాత్ర అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది.

ఈ శకుంతలను తిరిగి కలర్ లో  తెలుగు, హిందీ భాషలలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా నిర్మించబోతున్నారనే వార్త కొన్నాళ్ళు మద్రాస్ లో సంచారం చేయడం చేసింది. కానీ, ఏ కారణం చేతనో శాంతారాం సంకల్పం నెరవేరలేదు. అదే కనుక జరిగివుంటే ఎన్.టి.ఆర్., ఘంటసాల కీర్తికిరీటాలలో మరో ఉత్తమ మణిగా భాసిల్లివుండేది.

తర్వాత, 1961లో శాంతారాం తానే దుష్యంతుడిగా, తన రెండవ భార్య సంధ్య శకుంతలగా 'స్త్రీ' పేరిట నిర్మించి అఖండ ఖ్యాతిపొందారు. ఈ సినీమాను మౌంట్ రోడ్ లోని గ్లోబ్ ధియేటర్ (LIC పక్కన వుండేది) లో చూసిన గుర్తు. ఈ చిత్రంలోని పాటలు, నృత్యాలు,దృశ్య చిత్రీకరణ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. విదేశాలలో, చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలను పొందిన చిత్రం శాంతారాం 'స్త్రీ'.

ప్రేక్షకులను ఇంతటి ప్రభావితం చేసిన 'శకుంతల' ను 1965 లో తీయ సంకల్పించారు లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావులు. కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, బి.సరోజాదేవి శకుంతలగా, నాగయ్య కణ్వుడిగా, ఇ.వి.సరోజముక్కామల మేనకా విశ్వామిత్రులుగా, శారదాగీతాంజలి శకుంతల నెచ్చెలులు, అనసూయ, ప్రియంవదలుగా ప్రముఖ తారాగణంతో తలపెట్టారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని నియమించారు.

ఈ విషయం నాకు చాలా రకాలుగా ఆనందం కలిగించింది. ఒకటి ఈ సినిమా ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా పని చేయడం; సహజంగానే పౌరాణిక చిత్రాలంటే సుశ్రావ్యమైన మంచి సంగీతానికి స్కోప్ వుంటుంది; మరొకటిశాంతారాం తీసిన  స్థాయిలో తెలుగులో సినీమా వస్తుందనే ఆశ. అయితే అది ఆశగానే మిగిలిపోయింది. కారణం ఈ తెలుగు సినీమా కలర్ లో కాకుండా బ్లాక్ ఎండ్ వైట్ లో తీసారు. అది నాకు బాగా అసంతృప్తి కలిగించిన విషయం. కారణం, ప్రకృతి సౌందర్య దృశ్యాలుకళాత్మకమైన భారీ సెట్ల ఔన్నత్యం  రంగులలో ప్రతిఫలించినంతగా తెలుపు నలుపులలో ప్రతిఫలించవు. అయితే, పీత కష్టాలు పీతవి, చెప్పుకుంటూపోతే కొండవీటి చేంతాడంత. ఆ  నిర్మాతల సాధకబాధకాలు వారివి.

సినీమా కలర్ కాకపోతేనేం! నటీనటుల పాత్రోచిత నటన, దర్శకుని ప్రతిభనవరసాలతో నిండిన వైవిధ్యభరితమైన ఘంటసాలవారి పాటలు, నేపథ్య సంగీతం శకుంతలకు ప్రాణప్రతిష్ట చేశాయి. ఈ సీనీమాలో  దుష్యంతుడిగా  ఎన్.టి.ఆర్ హుందాగా, దర్జాగా, రాజసంతో నటించారు. ఆ పాత్రకు ఘంటసాల మాస్టారు పాడిన ' అనాఘ్రాతం పుష్పం' అనే కాళిదాసు శ్లోకం,  'మదిలో మౌనముగా' పాట ఎంతో మనోహరంగా వుంటుంది. అదే ఈనాటి మన 'ఘంటసాల - సజీవరాగం'.

'అనాఘ్రాతం పుష్పం' శ్లోకాన్ని ఘంటసాల మాస్టారు కళ్యాణి రాగంలో స్వరపర్చి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ శ్లోకం అయిన మరుసటి ఒకటి రెండు సీన్లలో "మదిలో మౌనముగా" విరహగీతం.  ఎంతో ఔచిత్యంతో  డా.సి.నారాయణరెడ్డిగారు సమకూర్చిన సాహిత్యంఈ పాటకు నిండుదనాన్ని చేకూర్చింది. ఘంటసాల మాస్టారు హిందుస్థానీ ఖమాస్ రాగ నుడికారంతో అద్వితీయంగా గానం చేసారు. గాంభీర్యం, లాలిత్యంతో కూడిన ఘంటసాలవారి గాత్రమాధుర్యంతో ఈ పాట ఆపాతమధురమే అయింది.  ఘంటసాల మాస్టారు ఉపయోగించిన సితార్, ఫ్లూట్, హార్ప్, ఎలక్ట్రిక్ గిటార్, వైబ్రోఫోన్, వైలీన్స్, తబలా, డబుల్ బేస్ వంటి వాద్యాలు  "మదిలో మౌనముగా" పాటకు  నిండుదనాన్ని, శ్రావ్యతను చేకూర్చాయి. 'శకుంతల' చిత్రానికి ఆద్యంతం ఘంటసాల మాస్టారు అందించిన నేపథ్య సంగీతాన్ని అనుభవించడానికి ఎంతో రసహృదయం కావాలనడంలో ఎటువంటి సందేహం లేదు.  పాటలో 'కదలె మధుర వీణ' అంటూ నేపధ్యంలో పూర్తిగా సితార్ నే వినిపించడం; తెరమీద సితార్, వీణలకు బదులు ' గోటు' వాద్యంలాటిదానిని చూపించడం గీత వాద్యాల పట్ల కనీస అవగాహన ఉన్నవారిని కూసింత ఇబ్బంది పెట్టే విషయమే. అయితే ప్రాచీనకాలంలో ప్రతీ తంత్రీ వాద్యాన్ని 'వీణ' అనే అనేవారట. ఆ విధంగా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అగత్యంలేదు.

మంచి సంగీతాన్ని ఆస్వాదించాలని ఆశించే ప్రతీ ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం ' శకుంతల'.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...