"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
57వ సజీవరాగం - జగమే మారినది మధురముగా ఈవేళచిత్రం - దేశద్రోహులు
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు
పల్లవి:
జగమే మారినది మధురముగా ఈవేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
!!జగమే!!
మనసాడెనే మయూరమై పావురములు
పాడే ఎల పావురములు పాడే
!మనసాడెనే!
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత
!!జగమే!!
విరజాజుల సువాసన స్వాగతములు
పలుక సుస్వాగతములం పలుక.. ఆ....
తిరుగాడును తేనెటీగ తీయదనముకోరి
అనురాగాల తేలి కమ్మని భావమే
కన్నీరై చిందెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
!!జగమే!!
"నెనరుంచినాను అన్నిటికి నిదానుడని నేను నీదుపై నెనరుంచినాను" - అంటే ఈ లోకంలో జరిగే సకల కార్యాచరణకు కారణభూతుడవని విశ్వసించి నేను నీపై కృతజ్ఞత కలిగియున్నాను అని అంటారు సద్గురు త్యాగరాజస్వామి తమ కీర్తనలో. నెనరు - అనే మాటకు ప్రేమ, దయ, విశ్వాసము, స్నేహము, కృతజ్ఞత వంటి అర్ధాలు ఎన్నో ఉన్నాయి. కవులు తమ తమ భావాలకు అనుగుణంగా ఈ ' నెనరు' అనే మాటను ప్రయోగిస్తూంటారు.
నేటి ఘంటసాల సజీవరాగం లో 'నెనరు కూరిమి ఈనాడే పండెను' అనే పదజాలంతో ఆరుద్ర ఒక పాటలోని చరణాన్ని పూరించారు. ఇక్కడ వారు ఉపయోగించిన 'నెనరు' ప్రేమకు పర్యాయపదంగా భావించవచ్చును.
ఈ మాటలు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట "జగమే మారినది మధురముగా ఈవేళ", దేశద్రోహులు సినీమాలోని పాటే. ఇదే నేటి మన సజీవరాగం.
దేశద్రోహులు చిత్రంలో ఉన్న పది పాటలను ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, చెరొక ఐదు పాటలు వ్రాసారు. ఈ సినీమాలో ఇన్ని పాటలున్నా, దేశద్రోహులు సినిమా పేరు చెప్పగానే సంగీతాభిమానుల కు గుర్తు వచ్చే పాట "జగమే మారినది మధురముగా ఈవేళ" పాట ఒక్కటే. సాలూరి రాజేశ్వరరావుగారి స్వరకల్పనలో ఈ పాట ఆపాతమధురమై అజరామరమయింది.
కళ్యాణి రాగంలో స్వరపర్చబడిన ఈ మధురగీతం సినిమా ప్రధమార్ధంలో ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతంగా, ద్వితీయార్థంలో ఘంటసాలవారి సుస్వరంలో ఏకగళ గీతంగా శ్రోతల హృదయాలను దోచుకున్నది. కళ్యాణి రాగ వైశిష్ట్యాన్ని గురించి గతంలో ఇదే శీర్షికలో పలుమార్లు ముచ్చటించడం జరిగింది, కనుక ఆ రాగాన్ని గురించిన పరిచయం చర్వితచరణమే అవుతుంది.
గతంలో కళ్యాణి రాగంలో ఏ సంగీత దర్శకుడు ఏ పాట చేసినా అధికసంఖ్యాకమైన గీతాలను ఘంటసాలే ఆలపించడం, వాటిని పరవశత్వంతో విని ఆదరించిన సంగీతాభిమానులు ఘంటసాల అభిమాన రాగం కళ్యాణి అని ప్రేమతో ఆపాదించడం జరిగింది. ఆ రాగంలో ఎన్ని పాటలు పాడినా ప్రతి ఒక్క పాటకు తన గాన ప్రతిభతో ఘంటసాల జీవంపోసారు.
దేశద్రోహులు చిత్రంలో "జగమే మారినది" పాట రెండు సార్లు పునారావృతం కావడం మూలాన మరింతగా శ్రోతల హృదయాలకు చేరువయింది. మొదటిసారిగా ప్రేయసీ ప్రియులు పాడుకునేప్పుడు ఈ పాట సాహిత్యం అంతిమ చరణంలో ...."ఎదలో ఇంతటీ సంతోషామెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో జగమే మారినది మధురమూగా ఈవేళా" అని నాయకుని పరంగా " కలలు కోరికలు తీరినవి మనసారా" అని నాయిక పరంగా పద ప్రయోగం చేసిన ఆరుద్ర రెండవసారి కధానాయకుడు మాత్రమే పాడేటప్పుడు ఆఖరి చరణంలో "కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి" అనే గంభీరమైన భావంతో పాటను ముగించారు.
తోటలోని యుగళగీతం , తర్వాత పదిమంది మధ్య ఒక పార్టీలో తన ప్రేయసి మరొకరి భార్యగా కనిపించినప్పుడు ఆ మనోభావాల వైవిధ్యాన్ని అత్యద్భుతంగా తన గళంలో పలికించారు ఘంటసాల. ఈ పాట సోలోగా పాడినప్పుడు పైస్థాయిలో సంచారం, కళ్యాణి రాగాలాపన ఘంటసాలవారి గానప్రతిభకు దర్పణం.
ఈ పాట స్వరకల్పనలో రాజేశ్వరరావుగారి ముద్ర సుస్పష్టం. ఆయన ఈ పాటను వెస్ట్రన్ వాల్ట్జ్ బాణీలో చేసారు. భారతీయ, పాశ్చాత్య బాణీల మిశ్రమంగా ఈ పాటను సుస్వరామృతంలో ముంచెత్తారు రాజేశ్వరరావుగారు. ఈ పాట ఆద్యంతం వినిపించే పియోనా, డబుల్ బేస్, తబలా, సితార్, వైయొలిన్, ఫ్లూట్ ల సమ్మేళనం సాలూరి వారి orchestration ప్రతిభకు ఒక మచ్చుతునక.
తెరపై యుగళగీతంలో పాల్గొన్న ఎన్.టిఆర్., దేవికల సరస శృంగారాభినయాలు, ఏకగళ గీతంలో ఎన్.టి.ఆర్ ప్రదర్శించిన గాంభీర్యం, హుందాతనం ఈ పాటకు మరింత విశిష్టతను చేకూర్చింది.
దేశద్రోహులు సినీమా విజయం మాట ఎలా వున్నా , ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఈ ఘంటసాల కళ్యాణి గీతం తెలుగువారందరినీ నిత్యకళ్యాణిగా అలరిస్తూనేవుంది.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment