"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
55వ సజీవరాగం - ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనోచిత్రం - అమరశిల్పి జక్కన్న
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు
పల్లవి:
ఈ నల్లని రాలలో ఏ కన్నులు
దాగెనో .. ఈ బండల మాటునా
ఏ గుండెలు మ్రోగెనో ఓ....
!!ఈ నల్లని రాలలో!!
చరణం 1:
పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి
మునులవోలె కారడవుల
మూలలందు పడియున్నవి
!!ఈ నల్లని రాలలో!!
చరణం 2:
కదలలేవు మెదలలేవు
పెదవివిప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే
జలజలమని పొంగి పొరలు
!!ఈ నల్లని రాలలో!!
చరణం 3:
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును
!!ఈ నల్లని రాలలో!!
మోహనా? బిలహరిలా వుంది!... పహడి కావచ్చు!?... ఇలాటి అసందిగ్ధతను ఏర్పర్చడం ఒక్క సినీమా పాటలకే సాధ్యం. సినిమా పాటలకి రాగనిర్ణయం చేయడం అంత సులభమూ కాదు, అంత అవసరమూ లేదని సంగీత విశ్లేషకులెందరో అభిప్రాయ పడుతున్నా ఒక మంచి పాట వింటున్నప్పుడు ఈ ఏ రాగంలో చేసివుంటారానే జిజ్ఞాస సంగీతాభిమానులలో కలగడం సహజం. నాలాటి సామాన్య శ్రోతలకి ఏ రాగమైనా ఒక్కటే. ఏ రాగమైతేనేం? శ్రావ్యమైనదిగా, మనసుకు హాయిని, చెవులకు ఇంపును కలిగించేదిగా వుండే ప్రతీ పాటా జనరంజకమై శాశ్వతత్త్వాన్ని పొందుతుంది. సజీవరాగమై నిలుస్తుంది. అటువంటి సుశ్రావ్యగీతమే "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో..." అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.
ఈ ప్రకృతిలో జడ పదార్ధంగా గోచరించే కొండలలోని బండలన్నింటినీ తన ఉలితో సౌందర్యమూర్తులుగా మలచి వాటికో నూతనత్వాన్ని, అస్తిత్వాన్ని కలిగించాలని ప్రతి శిల్పి కలలు కంటాడు. అహర్నిశలు శ్రమిస్తాడు. శిల్పకళకే తన జీవితం ధారపోస్తాడు. శిల్పికి, శిలకు మధ్య విడదీయలేని రాగానుబంధం వుంటుంది. ప్రాణంలేని రాయి రప్పలలో సజీవమైన సౌందర్యాన్ని శిల్పి వీక్షిస్తాడు. బండలలోని హృదయాన్ని, మానవత్వాన్ని శిల్పి అర్ధం చేసుకోగలడు. పైకి కఠినంగా వుండే ఆ రాళ్ళు శిల్పికి మృదువుగా, మెత్తగా తోస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా వుండే మునులలాగ కారడవులలో మౌనంగా వుంటాయి. స్వార్ధంతో ఇతరులకు హాని కలిగించే ప్రాణమున్న మనిషికన్నా చైతన్యంలేని శిలలే నయమనిపిస్తాయి.
దాదాపు ఆరు దశాబ్దాలకు ముందు డా. సి.నారాయణరెడ్డి గారు ఆకాశవాణి కోసం "రామప్పకొండ" అనే శ్రవ్యనాటకాన్ని వ్రాసారు. అందులో ఒక శిల్పియొక్క మనోగతమే ఈ సున్నితమైన , ఉదాత్తమైన "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో" అనే గీతం. ఆకాశవాణి కార్యక్రమం కోసం పాలగుమ్మి విశ్వనాథంగారు ఈ పాటను జోగ్ అనే హిందుస్థానీ రాగంలో స్వరపర్చి గాయకులు ఎమ్.చిత్తరంజన్ గారి చేత పాడించారు.
తర్వాత కొన్నేళ్ళకు ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎస్ రంగా ఈస్ట్ మన్ కలర్ లో కన్నడ, తెలుగు భాషలలో జక్కనాచార్య అనే శిల్పి కథను సినీమాగా తీస్తున్న సమయంలో డా.సి.నారాయణరెడ్డిగారిని పాటలు వ్రాయవలసిందిగా కోరినప్పుడు ఆయన ఈ పాటను నిర్మాతకు వినిపించడం, అది అందరి అమోదం పొందడం జరిగింది. అప్పట్లో తెలుగు సినిమా నిర్మాణం ఎక్కువగా మద్రాసులో సాగడం, నారాయణరెడ్డిగారు హైదరాబాద్ లో స్థిరపడడం వలన ఆయన వ్రాసిన అధిక సంఖ్యాకమైన పాటలు పాటకు మెట్టు కూర్చడమనే పధ్ధతిలోనే సాగేది.
అమరశిల్పి జక్కన్న తెలుగు కన్నడ భాషలు రెండింటి కీ సాలూరు రాజేశ్వరరావు గారే సంగీతదర్శకుడు. రెండు భాషలలోనూ ఘంటసాల, సుశీలలే ఎక్కువ పాటలు పాడారు. కన్నడంలో కళ్యాణ్ కుమార్, తెలుగులో నాగేశ్వరరావు హీరోలుగా నటించారు. బి.సరోజాదేవి, నాగయ్య, హరనాథ్, ఉదయకుమార్, ధూళిపాళ రెండు భాషల్లో నటించారు.
నృత్య, సంగీతాలకు అధిక ప్రాధాన్యత వున్న ఈ సినీమాలోని పాటలన్నీ అత్యంత జనాదరణపొందాయి. రాజేశ్వరరావుగారి ప్రతిభకు గీటురాయిగా నిలిచే చిత్రం "అమరశిల్పి జక్కన్న". ఈ చిత్రంలో ఘంటసాలగారు పాడిన మూడు సోలోలు, మూడు డ్యూయెట్లు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. వాటన్నిటిలోకి మకుటాయమానంగా ఈనాటికీ ప్రజలందరి మనసులలో నిలచిపోయిన గీతం "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో". ఘంటసాలవారి గళ మాధుర్యం, రస భావ ప్రకటనలు, తెరపై అక్కినేని వారి సున్నితమైన హావభావాలు పూవుకు తావి అద్దినట్లుగా ఈ పాట ఆపాతమధురంగా, అజరామరం గా నిల్చిపోయింది.
పాట ప్రారంభంలో కొండలలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఘంటసాల మాస్టారి ఆలాపన, దానికి ఊపిరిపోస్తూ ట్యూబోఫోన్, మువ్వల మేళవింపుతో వినవచ్చే ఉలుల శబ్దాలు, శ్రోతను పాటలో లీనమయేలా చేస్తాయి. చరణాల మధ్య వచ్చే బిజిఎమ్స్ లో రాజేశ్వరరావు గారికే సొంతమైన సంగతులు, గమకాల పోకడలు వైయొలిన్స్ మీద చిత్ర విచిత్రంగా వినిపించి శ్రోతలకు పరవశత్వం కలిగిస్తాయి.
ఇక ఈ పాట పాడిన ఘంటసాలవారి గాన మాధుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. Melancholy తో పాటు భావగాంభీర్యంగల పాటలు పాడడంలో ఘంటసాల మాస్టారికి మించిన గాయకులు లేరంటే అది అతిశయోక్తి కానేరదు.
బి.ఎస్.రంగాగారి నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం అన్నివిధాల ఘనవిజయం సాధించింది. కన్నడంలో ఈస్ట్ మన్ కలర్ లో వచ్చిన మొట్టమొదటిచిత్రం "అమరశిల్పి జక్కనాచార్య".
ఇదే కథ ఆధారంగా ప్రముఖ దర్శకనిర్మాత వి.శాంతారాం హిందీలో 'గీత్ గాయా పథ్థరోంనే' అనే సాంఘిక సినీమాగా నిర్మించారు. ఇందులో జంపింగ్ జాక్ జితేంద్ర హీరోగా నటించడం ఒక విశేషం.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
వ్యాసం చాలా బాగుంది. బాగా రాశారు.
ReplyDelete