Saturday, 2 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 13 - చిలకన్న చిలకవే బంగారు చిలకవే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 13


జయం మనదే - చిలకన్న చిలకవే బంగారు చిలకవే


"ఒక దెబ్బకు రెండు పిట్టలు" అనేది ఒక తెలుగు సామెత. అంటే ఒక క్రియతో రెండు వేర్వేరు  లక్ష్యాలు సాధించడం. ఈ రకమైన ధోరణి మన పాత తెలుగు సినిమాలలో కనిపించేది. సినీమాల  లక్ష్యం  ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించడం.  అందుకోసం అవసరమున్నా లేకపోయినా  మూడు డాన్స్ లు, ఆరు పాటలు  జొప్పించినా అందుతోపాటు నర్మగర్భంగా ఏదైనా మంచి సందేశాన్ని కూడా కథ ద్వారా, లేదా పాటల ద్వారా ప్రేక్షకులకు అందించేవారు. 'ధర్మమేవ జయతే' అనే ఆర్యోక్తి గుర్తు చేస్తూ సినిమాలు తీసేవారు. అది ఇప్పుడు కాదు . ఒకప్పటి మాట. అటువంటి ఒక నర్మగర్భమైన జానపద గీతమే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

అదే మాధవపెద్ది సత్యం, జిక్కి పాడిన యుగళగీతం 'చిలకన్న చిలకవే బంగారు గిలకవే' 1956 లో వచ్చిన 'జయం మనదే సినిమా లోనిది. జానపద కవి చక్రవర్తి కొసరాజు రాఘవయ్య చౌదరీ గారు వ్రాసిన గీతం. గాయక, సంగీతదర్శకుడు ఘంటసాలగారి స్వరరచనతో రూపుదిద్దుకున్న ఆపాతమధుర గీతం ... పాత్రోచితంగా తెరపై రేలంగి , అంజలీదేవీ అభినయించిన  గీతం...

 

రేలంగి: 

చిలకన్న చిలకవే బంగారు గిలకవే

పంచవన్నెల రామచిలకా - హోయ్

పంచవన్నెల రామచిలకా

ఏడుకొండలమీద ఎగిరివచ్చిన పిట్ట

యెందున్నదో చెప్పవే

మేడల్లొవున్నదో మిద్దెల్లోవున్నదో

జాడయిన చెప్పవే చిలకా

అంజలి:

పంజరమ్మున యినుపసంకెళ్ళు

తగిలించి  బంధించి యుంచారె చిలుకా  

మూడారు వాకిళ్ళు దాటిరావాలంటే 

కోడెత్రాచున్నదే చిలుకా ! కోడె!

రేలంగి:

పట్టుబడ్డాచోట ప్రాణానికేమైన

మోసమ్ము లేదటే చిలుకా

పచ్చన్ని చేలపై స్వేఛ్ఛతో యెగిరేటి

భాగ్యమెప్పుడె రామచిలకా

 

అంజలి:

బంధాలు విడిపించి బయటికంపాలంటె సమయమ్ము చిక్కాలి చిలకా

ఓర్పుజూపక నీవు ఉడుకు జుర్రావంటె

ఓగు తప్పదు రామచిలకా ! ఓగు!

 

రేలంగి:  

బలుపు భారమ్మంత నీమీదనే బెట్టి 

భయము లేకుంటాము చిలకా - రామచిలకా

నీళ్ళల్లొ ముంచివా, పాలల్లొ మంచినా

నీవె దిక్కో రామచిలకా మాకు నీవే

దిక్కు రామచిలకా ...

పోతున్నాం.. పంచవన్నెల రామచిలకా. 


గూఢచారి శాఖల్లో, భద్రతా దళాల్లో వుండేవారంతా శత్రువుల జాడలను, సమాచారాన్ని తెలుసుకునేందుకు మామూలు ప్రజలకు అర్ధంకాని సీక్రెట్ కోడ్  భాషలో మాట్లాడుకుంటారట. ఇక్కడ ఈ పాటలో కూడా అలాటి రహస్య భాషలోనే కథానాయకుడి స్నేహితుడు, కథానాయకుడి ప్రియురాలైన రాకుమారి పరస్పరం సమాచారాన్ని అందజేసుకుంటున్నారు. కోటలో బందీగావున్న కథానాయకుడి యోగక్షేమాలు ఆరాతీస్తూ  అతని స్నేహితుడు రాచనగరు వీధుల్లో చిలకపంజరాలు పట్టుకుతిరుగుతూ  రాకుమారిని పంచవన్నెల రామచిలకా, బంగారు గిలకా అంటూ పాటరూపంలో పలకరించే అతనికి రాజభటులు కథానాయకుని ఇనుపసంకెళ్ళతో బంధించి చెరలో వుంచారనిఅక్కడి మూడారు వాకిళ్ళు దాటవీలులేకుండా కోడెత్రాచులాంటి దుష్ట సేనాని కాపాలా కాస్తున్నాడని, ఇలాటి సమయంలో ఓర్పు చూపకుండా ఆవేశపడితే కీడుతప్పదని ఆ రాకుమారి రహస్యభాషలో హెచ్చరిక చేస్తుంది.

నీళ్ళముంచినా , పాలముంచినా ఇక కథానాయకుని కాపాడే భారమంతా  నీదేనని రాకుమారిని అర్ధిస్తూ ఆ స్నేహితుడు అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఇది ఆ పాట సన్నివేశం. సన్నివేశపరంగా పాట బాహ్యరూపం ఇదే అయినా ఈ పాటలోని చిలక, పంజరం, మూడారువాకిళ్ళు వంటి మాటలు జిజ్ఞాసులకు, తాత్త్వికులకు మరో కోణంలో ఆలోచించడానికి అవకాశం కల్పిస్తున్నది.

బంగారు పంజరంలో చిలకలా రక్తమాంసాలతో కూడిన శరీరమనే పంజరంలో చిలక అనే ఆత్మ బందీఅయి స్వేఛ్ఛను కోల్పోయి జ్ఞాన సముపార్జన కు, ముక్తికి దూరమైపోతున్నది.  పంజరం తెరిచినప్పుడు చిలక ఎలా అయితే స్వేఛ్ఛగా ఎగిరిపోతుందో అలాగే జ్ఞానం పొందిన ఆత్మ  పరమాత్మ లో విలీనమైపోతుందని తాత్వికులు బోధిస్తారు. ఈ విధంగా కొసరాజుగారు ఒక సామాన్య జానపదగీతంలో రెండు వేర్వేరు కోణాలను స్ఫురింపజేశారు.

ఈ పాటలో కొసరాజుగారు ఉపయోగించిన - గిలక, ఉడుకు, జుర్రు, ఓగు, బలుపు వంటి మాండలీక పదాలు అరుదుగా మన సినిమా పాటలలో వినిపిస్తాయి.  సినిమా పాటంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఎంతో మేధోమథనం చేయాలని ఇలాటి గతకాలపు పాటలు కొన్ని నిరూపిస్తాయి.

'చిలకన్న చిలకవే బంగారు గిలకవేపాటను మాధవపెద్ది సత్యం , జిక్కి గార్లతో పాడించారు ఘంటసాల. సందర్భోచితంగా వరసలను కూర్చడంలో, ఆ పాటలను పాడడానికి తగిన గాయనీగాయకులను ఎన్నుకోవడంలోనూ ఘంటసాలగారు అసమాన ప్రజ్ఞావంతుడు. మాధవపెద్ది గారిని అలవాటుకు విరుధ్ధమైన పధ్ధతిలో ఘంటసాల ఈ పాటలో వినిపించారు సాధారణంగా మాధవపెద్దిగారి కంఠంలో ధ్వనించే కరకుదనం, తీవ్రత ఈ పాటలో వినపడవు. శ్రద్ధగా వినకపోతే ఈ పాటను ఘంటసాలగారే పాడుతున్నారేమో అనే భ్రమ కలుగుతుంది. జిక్కిగారుఒక్క ఒత్తుల విషయంలో తప్ప, ఏ రకమైన పాటనైనా అవలీలగా పాడి రక్తి కట్టించగల గాయని. ఆవిడచేత ఏ రకమైన పాటలు పాడించాలో ఘంటసాలగారికి బాగా తెలుసు. జిక్కిగారు కూడా ఈ విషయాన్ని గురించి తన ఇంటర్వ్యూలలో ప్రస్తావించేవారు.

వీర శృంగార రసాలకు ఎక్కువ ప్రాధాన్యత గల 'జయం మనదే' సినిమాలోని పది పాటలను జంపన, కొసరాజు, సముద్రాల, ముద్దుకృష్ణ, సదాశివబ్రహ్మంగార్లు సినిమాలోని కథాంశానికి తగినట్లు వ్రాయగా వాటిని ఘంటసాల, లీల, జిక్కి, మాధవపెద్ది పాడారు. ఘంటసాల సంగీత ప్రతిభకు తార్కాణంగా - లీల పాడిన 'కలువలరాజా కధవినరావా', నేటి సజీవరాగ గీతం 'చిలకన్న చిలకవే', 'మరువజాలని మనసు తాళని', ' వీరగంధం తెచ్చినామయా', ' ఓ చందమామ అందాలభామ' (హిందీ అనుకరణే అయినా) వంటి ఈ సినిమా లోని పాటలు ఈనాటికి సంగీతాభిమానులను అలరిస్తూనేవున్నాయి.

ఘంటసాలగారు నేటి సజీవరాగం 'చిలకన్న చిలకవే బంగారు గిలకవేయుగళగీతాన్ని యదుకుల కాంభోజి రాగ స్వరాలతో , దేశ్ రాగ ఛాయలతో స్వరపర్చారు. యదుకుల కాంభోజి 28వ మేళకర్త హరికాంభోజికి జన్యం. హరికాంభోజికి సమాంతర హిందుస్థానీ రాగం ఖమాస్ థాట్. ఈ ఖమాస్ థాట్ కు జన్యరాగం దేశ్. అందుచేత ఈనాటి మన పాటలో దేశ్ ఛాయలు కూడా వినిపించివుండవచ్చును. యదుకులకాంభోజి రాగం  అరోహణా క్రమంలో శుధ్ధసావేరిలోని ఐదు స్వరాలు, అవరోహణాక్రమంలో హరికాంభోజిలోని ఏడు స్వరాలు కలిగి ఔఢవ-సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. భక్తి, శృంగార, కరుణరసాలకు అనువైన యదుకులకాంభోజి రాగాన్ని ఘంటసాలగారు  సందర్భోచితంగా ఉపయోగించి ఈ జానపదగీతాన్ని జనరంజకం చేశారు. ఈ పాటను తానే పాడుతున్న భ్రమను కలిగించారు అక్కడక్కడ. అంత మార్దవంగా మాధవపెద్ది గళాన్ని ఈ పాటలో మార్చారు.

ఘంటసాలగారు ఈ పాటలో వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియంమేండొలిన్, తబలాడోలక్, కోల్ వంటి వాద్యాలను మన తెలుగు ప్రాంతీయత ఉట్టిపడేలా ఉపయోగించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. ఈ  పాట సన్నివేశంలో రేలంగి, అంజలీదేవీ సంపూర్ణంగా లీనమైపోయి సహజంగా  పాత్రోచితంగా నటించారు.

'జయం మనదే' రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత సుందర్లాల్ నహతా నిర్మించిన మొట్టమొదటి తెలుగు జానపద చిత్రం. 1956 లో విడుదలయింది. జానపదమంటే మాయలు, మంత్రాలు, జంతువులు, రాక్షసులు, దేవకన్యలతో వుండే విఠలాచారి నమూనా కాదు. న్యాయానికి అన్యాయానికి మధ్య, సన్మార్గులకు దుర్మార్గులకు మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా గల సినిమా. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, షావుకారు జానకి, గుమ్మడి, సి.ఎస్.ఆర్., రేలంగి, ఆర్.నాగేశ్వరరావు, పెరుమాళ్, మొదలగువారు నటించిన చిత్రం.

ఇదొక 'రాబిన్ హుడ్' తరహా సినిమా. దిలీప్ కుమార్ నటించిన ' ఆన్' సినిమాను గుర్తు చేసే కథాంశం కలిగిన సినిమా 'జయం మనదేసోషలిస్టు భావాలు గల తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన సినిమా. తొలి సినిమాతోనే ఎద్దుకంటిని సూటిగా పొడిచి ఘనవిజయం పొందారు సుందర్లాల్ నహతాగారు.

1956 లో వచ్చిన 'జయం మనదే' మొదలు 1964 లో వచ్చిన 'గుడిగంటలు'' సినిమా వరకు సుందర్లాల్ నిర్మించిన అన్ని సినిమాలకు ఘంటసాలగారే సంగీత దర్శకుడు. అనుకరణ పాటల విషయంలో వుండే భేదాభిప్రాయాలు తప్పించి నహతా-ఘంటసాలగార్ల మధ్య చాలా మంచి మైత్రి వుండేది. ఘంటసాలగారంటే అమితమైన గౌరవమర్యాదలు, అభిమానం సుందర్లాల్ కు వుండేవి. ప్రతి సంవత్సరం దీపావళి మర్నాడు సాయంత్రం తమ గృహంలో జరిగే లక్ష్మీపూజకు ఘంటసాలగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి నూతనవస్త్రాలతో గౌరవించి సత్కరించడం సుందర్లాల్ గారి ఆచారం. 'ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర మాత్రం కాదు' అనే సామెతను ఋజువు పరుస్తూ పరభాషాగీతాల అనుకరణకు ఒత్తిడి చేసేవారు. ఈ విషయంలో ఘంటసాల-నహతాగార్ల మధ్య ప్రణయ కలహం వంటిది వస్తూండేది. అయినా దాదాపు నహతాగారి పది సినిమాలకు వరసగా ఘంటసాలగారు సంగీతదర్శకుడిగా పనిచేశారు.

ఘంటసాలగారి లవకుశ సంగీతం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందినది సుందర్లాల్ నహతాగారే. ఆర్ధిక సమస్యలతో ఆగిపోయిన ఎ.శంకరరెడ్డిగారి లవకుశను సంపూర్ణ హక్కులతో కొనుగోలుచేసి, సినిమా పూర్తిచేయించి విడుదల చేసింది సుందర్లాల్ నహతాయే. ఆ సినిమా విజయం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలు అనుభవించిన అదృష్టశాలి నహతాగారే.

దాదాపు 70 ఏళ్ళు నిండవస్తున్న 'జయం మనదే' ను ఇంకా మనం తలచుకుంటున్నామంటే అందుకు కారణం ఆ సినిమా లోని ఘంటసాలగారి మధుర సంగీతమే.


ఘంటసాలగారి ఇటువంటి మరో సజీవరాగంతో వచ్చేవారం మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 13 - చిలకన్న చిలకవే బంగారు చిలకవే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...