అధ్యాయం - 2 - భాగం 32
వాల్మీకి - హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా
ఒకసారి జనసంచారం లేని అరణ్యమార్గంగా నారదమహర్షి పయనిస్తూండగా ఒక దొంగ
తారసపడి నారదునివద్ద వున్న
వస్తువులను బలవంతాన తస్కరించబోయాడు.
నారదుడు ఆ దొంగను మాటలతో మభ్యపెట్టి అతను దొంగతనాలకు పాల్పడడానికి కారణమడిగాడు.
అప్పుడా దొంగ తన భార్య కోరికలు, ముచ్చట్లు తీర్చడానికి, కుటుంబసభ్యులను పోషించడానికి అరణ్యంలో సంచరించే బాటసారులను హింసించి
దోచుకుంటున్నాని చెప్పాడు. దొంగతనం, ఇతరులను హింసించడం పాపకార్యమని, పాపకర్మల ద్వారా వచ్చిన ధనంతో సుఖసంతోషాలననుభవిస్తున్న దొంగ కుటుంబం అతని
పాపాలను కూడా పంచుకుంటుందో లేదో తెలుసుకోమని నారదుడు ఆ దొంగకు సలహా ఇచ్చాడు. ఆ
దొంగ తన భార్యను, కుటుంబ
సభ్యులను తన సంపాదనను అనుభవిస్తున్నట్లు
గానే పాపాలలో కూడా భాగం పంచుకుంటారు కదా అని అడిగాడు. భార్యా
పిల్లలను, కుటుంబాన్ని పోషించడం అతని బాధ్యత, కర్తవ్యమని అందుకోసం అతను చేసే పాపకార్యాలతో
తమకేమాత్రం సంబంధం లేదని, అందుచేత అతని పాపాలను పెంచుకునే ప్రసక్తే లేదని నిష్కర్షగా తేల్చిచెప్పేశారు.
ఈ సంఘటనతో జీవితంపట్ల విరక్తి చెంది కర్తవ్యవిమూఢుడైన ఆ దొంగ మరల నారదుని
దర్శించి తనకు తరుణోపాయం ఉపదేశించమని కోరుకున్నాడు. అప్పుడు నారదమహర్షి ఆ దొంగతో 'రామ'నామ బీజాక్షరి మంత్రాన్ని తదేక ధ్యానంతో జపిస్తే అతనిలోని అజ్ఞానం తొలగి
సాత్విక లక్షణములు అలవడి మానసిక శాంతిని, సంతోషాన్ని పొందగలవని ఉపదేశిస్తాడు. అజ్ఞానం వలన, విద్యావిహీనత వలన 'రామ' శబ్దాన్ని ఉచ్ఛరించడానికి ఇబ్బందిపడుతున్న ఆ దొంగను 'మర మర' యని జరిపించమని సలహాయిచ్చి నారదుడు వెళ్ళిపోతాడు. ఆ దొంగ ఏకాగ్రచిత్తంతో 'మర మర' అని జపించడం ప్రారంభిస్తాడు 'మర మర' అనే నామం
క్రమక్రమంగా 'రామ'నామ బీజాక్షరిగా అతని నోట జపించబడింది. అతను తన
పరిసరాలను, ఇహలోకాన్ని పూర్తిగా మరచి తపోనిష్టలో మునిగిపోయాడు. ఎన్నో
సంవత్సరాలు గడిచిపోయాయి. అతని చుట్టూ దట్టమైన పుట్టలు పెరిగిపోయాయి.
రామనామం ఎంతో మహిమ కలది. అష్టాక్షరీ మంత్రంలోని 'రా' ను, పంచాక్షరీ మంత్రం లోని 'మ' కలిసి 'రామ' శబ్దంగా మారింది. 'రా' అంటే అగ్ని బీజం. శరీరాన్ని , మనసును ఉత్తేజపరుస్తుంది. 'మ' అంటే అమృతబీజం. మనశ్శాంతిని చేకూరుస్తుంది. రామనామ జపం వలన సర్వపాపాలు తొలగిపోయి జ్ఞానం, మనశ్శాంతి, ముక్తి సిద్ధిస్తాయని పండితులు చెపుతారు.
ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సు తర్వాత పుట్టలోని మనిషికి భగవదనుగ్రహం లభించింది. మహామనీషియై బ్రహ్మజ్ఞానం పొందాడు. సుదీర్ఘ తపోనిష్టలోనుండి బయటకు వచ్చాడు. పుట్టకు సంస్కృతంలో వాల్మీకం అని పేరు. అందులోనుండి బయటకు వచ్చినవాడు కనుక వాల్మీకియైనాడు. ఆ పుట్ట పరిసరాల్లోనే ఒక ఆశ్రమం నిర్మించుకుని సాత్విక జీవనం చేయసాగాడు.
ఒకరోజు ఉదయం వాల్మీకి నదీస్నానం ముగించుకుని తిరిగివస్తూండగా ఒక చెట్టుమీద మోహపరవశత్వంలో వున్న జంట క్రౌంచపక్షులలో ఒకదానిని బోయవాడొకడు బాణంతో కూల్చడం చూసాడు. వాల్మీకి హృదయం కరుణతో ద్రవించి పోయింది. ఆక్రోశం తో ఆశువుగా ఒక శ్లోకం ఆయన నోట వెలువడింది. అదే....
ఆదిశ్లోకం:
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌంచ మిధునాదేక మవధీ కామమోహితమ్
'ఓ కిరాతకుడా! కామమోహితమై యున్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని నీవు చంపావు
కాబట్టి శాశ్వత కాలం సత్కీర్తిని అనుభవించలేవు' అని శపించారు.
నిజానికి ఇక్కడ వేటగాడి రూపంలో వచ్చినది మహావిష్ణువు. క్రౌంచ పక్షుల రూపంలో సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులను వధించడానికి మారు రూపం ధరించాడు. ఈ శాప ఫలితంగా వేటగాడి రూపంలో వున్న మహావిష్ణువు తన రామావతారకాలంలో సీతాదేవిని కోల్పోయి సుదీర్ఘమైన భార్యావియోగాన్ని అనుభవించాడు.
ఆధ్యాత్మిక విశ్లేషకులు ఈ శ్లోకానికి రామాయణం పరంగా మరోలా అర్ధం చెపుతారు.
'మా' అంటే లక్ష్మీదేవి.'నిషాద' అంటే లక్ష్మీదేవికి నివాసమైన వాడు మహావిష్ణువు (శ్రీరాముడు). ఓ! లక్ష్మీనివాసుడైన శ్రీరామా నీవు ఈ
లోకాన శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు అందుకుంటావు. ఎందువలన అంటే ... క్రౌంచ పక్షుల
జంటలాంటి రావణాసుర, మండోదరీ దంపతుల్లో
కామమోహితుడైన అసురుడు రావణుని నీవు వధించి లోకకళ్యాణం చేశావు. వాల్మీకి నోటమ్మట ఆయనకు
తెలియకుండానే 'మా' (లక్ష్మి) అనే అక్షరంతో ప్రారంభమై శ్రీరాముని
కీర్తించే మంగళ శ్లోకం వెలువడింది. శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు బీజం పడింది. భారతీయులందరికీ ఆదికవి
వాల్మీకి. ఆది శ్లోకం 'మా నిషాద..' ఆదికావ్యం శ్రీమద్రామాయణం.
వాల్మీకి మహర్షి జన్మ వృత్తాంతం
విషయంలో ఒక్కొక్క పురాణం ఒక్కొక్కలా వర్ణించింది. కచ్చితమైన చారిత్రకాధారాలు
వున్నట్లు కనపడదు.
శ్రీరామచరిత్ మానస్ (తులసీ రామాయణం)ను వ్రాసిన 16 వ శతాబ్దపు భక్తుడు, కవియైన శ్రీ తులసీదాస్ వాల్మీకి అవతారంగా ఉత్తర
భారతీయులు విశ్వసిస్తారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తన
దివ్యదృష్టితో దర్శించగల బ్రహ్మజ్ఞాని వాల్మీకి.
శ్రీరాముడు ఈ భువిని జన్మించడానికి ముందే రామకథను రామాయణ మహాకావ్యంగా వ్రాసి
లోకానికి గొప్ప ఉపకారం చేశాడు. పితృవాక్య
పరిపాలకుడు, ఏకపత్నీ వ్రతుడు,
ధర్మనిరతికి మారుపేరు అయిన
రాముడు ఏ యుగానికైనా, ఏ ప్రాంతంవారికైనా
ఆదర్శప్రాయుడు, పూజనీయుడు. అటువంటి శ్రీరాముని సృష్టించిన వాల్మీకి గొప్ప
మహనీయుడు. అంతేకాదు, రామాయణ గాధతో
ప్రత్యక్ష సంబంధం గలవాడు వాల్మీకి. పరుల చెప్పుడు మాటలనే జనవాక్యంగా తలదాల్చి
మహాపతివ్రత, గర్భవతియైన
సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టి నప్పుడు ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి ఆమెకు
జన్మించిన లవకుశులను పెంచి పెద్ద చేసి రఘువంశ రాజుల వారసులుగా తీర్చిదిద్దిన
ఆచార్యదేవుడు వాల్మీకి.
లభ్యమైవున్న పౌరాణిక గాధల ఆధారంగా కవి సముద్రాల రాఘవాచార్యులు వారు తయారుచేసిన కధను 'వాల్మీకి' పేరుతో జూపిటర్ పిక్చర్స్ వారు 1963 లో తెలుగు, కన్నడ భాషల్లో సినీమాగా తీసి విడుదల చేశారు. ఆదికవి వాల్మీకి పాత్రలో తెలుగులో ఎన్.టి.రామారావు , కన్నడంలో రాజ్ కుమార్ తమ అత్యుత్తమ నటనతో జీవంపోసారు. రెండు భాషల్లోనూ సి.ఎస్.రావుగారు చిత్రదర్శకుడు కాగా సంగీత దర్శకత్వాన్ని ఘంటసాల గారు నిర్వహించారు.
లోకకళ్యాణార్ధం మహావిష్ణువు శ్రీరామునిగా ఈ భువిని అవతరించే సంఘటనను భవిష్యద్దర్శనం చేస్తూ వాల్మీకి గానం చేసిన 'హరియే వెలయునుగా భువిని...' అనే గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం.
వాల్మీకి:
హరియే వెలయునుగా భువిని
హరియే వెలయునుగా !హరి!
పరిపాలింప సాధుల పరిమార్ప
దనుజుల !హరి!
యజ్ఞ కుండములు ఆరక వెలుగు హోమధూమములు
మింటను చెలగు వేదగీతి
వనవీధుల మ్రోగు ఆ...
శిష్య బృందం:
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహే తన్నో
విష్ణు ప్రచోదయాత్
వాల్లీకి:
వేదగీతి వనవీధుల మ్రోగు
యాగ యోగములు సాగు !హరి!
సకల జీవులకు సంతతి సౌఖ్యము సిరిసంపదలు చేకూరు
పుడమిని ధర్మము నాల్గు
పాదములా ఆ...!పుడమిని!
నడిపించును జగదానందముగా !హరి!
ఎక్కడైతే యజ్ఞ యాగాదులు సక్రమంగా నిర్వర్తించ బడతాయో ఆ ప్రదేశమంతా సశ్యశ్యామలమై సుభిక్షంగా వుంటుంది. ప్రకృతి సమతుల్యంగా వుంటుంది. ప్రజలంతా మనశ్శాంతితో సుఖసంతోషాలతో హాయిగా వుంటారని శాస్త్రపురాణాలు చెపుతాయి. అందుకే ఆచార్యులు గారు 'యజ్ఞకుండములు ఆరకవెలుగు హోమధూమములు మింటను చెలగు వేదగీతి వనవీధుల మ్రోగు' అనే ఆశాభావాన్ని వాల్మీకి మహర్షి నోటమ్మట పలికించారు. అంతేకాదు, శ్రీహరి రామావతారం దాల్చితే ఈ భూమి మీద ధర్మము నాలుగు పాదాల నడుస్తుందనే ఆకాంక్ష ను కూడా వ్యక్తంచేయించారు. సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ 'లోకా సమస్తాః సుఖినోభవన్తు' అనే ఆర్యోక్తికి దర్పణం పట్టే మంచి పాట 'హరియే వెలయునుగా...'
ఘంటసాల మాస్టారు ఈ పాటను ఆరభి రాగంలో చేశారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర గల అతి ప్రాచీనమైన రాగం ఆరభి. కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త అయిన ధీర శంకరాభరణానికి జన్యం. ఔడవ-సంపూర్ణ రాగం. శుద్ధసావేరీ (5 స్వరాలు), శంకరాభరణం (7 స్వరాలు) రాగాల సమ్మేళనమే ఆరభి రాగం. ఘనరాగ పంచకాలలో మూడవ రాగం ఆరభి. ఎంతో శుభప్రదమైన ఈ రాగంలోనే సద్గురు త్యాగరాజస్వామి వారి 'సాధించెనే ఓ మనసా' పంచరత్న కీర్తన వుంది. నేటి మన సజీవరాగం 'హరియే వెలయునుగా' అనే గీతానికి అతి పురాతనమైన ఆరభి రాగాన్ని ఎంచుకోవడంలో ఘంటసాలగారు ఎంతో ఔచిత్యాన్ని కనపర్చారు. వాల్మీకి లోని సాత్విక, భక్తి, కరుణరసాలను ప్రస్ఫుటం చేస్తూ అత్యంత భక్తిభావంతో గానం చేసి ఆరభి రాగ స్వరూపాన్నంతా ఘంటసాలగారు ఈ పాటలో కనపర్చారు. మాస్టారు ఈ పాటలో వీణ (సంగీతరావుగారు వాయించారు), వయొలిన్స్, ఫ్లూట్, తబలా, తాళ వాద్యాలను సందర్భోచితంగా ఉపయోగించారు.
జానపద, పౌరాణిక సమ్మిళితం 'వాల్మీకి' సినిమా. ఈ సినిమా లో మొత్తం 17 పాటలు శ్లోకాలు వున్నాయి. వాటిని ఘంటసాల, రఘురామయ్య (నారదుడు), సుశీల, జానకి, కోమల, మాధవపెద్ది, జె.వి.రాఘవులు గానం చేశారు. వాల్మీకి సినిమాకు తలమానిక గీతాలు మూడు. అవి - 'శ్రీ రామాయణ కావ్యకథా జీవన తారక మమ”, “జయ జయ జయ నటరాజా రజతశైల రాజాఠ, మరియు, “హరియే వెలయునుగా”. ఈ మూడు గీతాలను ఘంటసాల గారే అద్భుతంగా ఆలపించి వాటికొక సార్ధకత ఏర్పరిచారు.
వాల్మీకి తెలుగు సినిమాలో వాల్మీకిగా ఎన్.టి.ఆర్., కన్నడంలో రాజ్ కుమార్ నటించగా ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన రఘురామయ్య, రాజసులోచన, లీలావతి, కాంతారావు, రాజనాల, శారదా కన్నడంలో కూడా నటించారు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో తెలుగులోని పాటల వరసలనే కన్నడంలో కూడా ఉపయోగించారు.
వాల్మీకి తెలుగు కన్నడ సినిమాలను నిర్మించిన జూపిటర్ పిక్చర్స్ తమిళ సంస్థకు రామాయణ కావ్యమంత చరిత్ర వుంది. తమిళ సినీమా పురోభివృద్ధిలో జూపిటర్ పిక్చర్స్ ప్రధానపాత్ర పోషించింది. 1934 మొదలు 1964 వరకు ముఫ్ఫై సంవత్సరాల కాలంలో తమిళ, తెలుగు(5), కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40 సినీమాల కు పైగా నిర్మించారు. కోయంబత్తుర్ లోని సెంట్రల్ స్టూడియో కేంద్రంగా అనేక తమిళ సినీమాలను తీసిన జంటనిర్మాతలు ఎమ్.సోమసుందరం & ఎస్.కె.మొహిద్దీన్ 1950 తర్వాత తమ స్థావరాన్ని మద్రాసుకు మార్చారు. రాజా అణ్ణామలైపురంలో (ప్రస్తుత దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్/ ఆంధ్ర మహిళా హాస్పిటల్ కు ఎదురుగా) ఆర్కాట్ నవాబ్ లకు చెందిన స్థలంలో కట్టబడిన నెప్ట్యూన్ స్టూడియోను కొని తమ చిత్రనిర్మాణాన్ని కొనసాగించారు. ఎమ్.జి.ఆర్. నటించిన అనేక పాత బ్లాక్ బస్టర్ లను నిర్మించిన జూపిటర్ సోము, మొహిద్దీన్ తదనంతరం మొహిద్దీన్ కుమారుడు ఎస్.కె.హబిబుల్లా ఆధ్వర్యంలో 1965 లో వరకు సినీమా లు తీసారు. జూపిటర్ తీసిన ఆఖరి మూడు సినిమాలు వాల్మీకి తెలుగు, కన్నడం; మర్మయోగి తెలుగు. ఈ ఆఖరి మూడు సినీమాల కు ఘంటసాలగారే సంగీత దర్శకులు.
ఆ తర్వాత నెప్ట్యూన్ స్టూడియో ను ఎమ్.జి.ఆర్. కొనుగోలు చేసి తన తల్లి పేరు మీద
సత్యా స్టూడియోగా మార్చి తాను నిర్మించిన, నటించిన సినీమాలను అక్కడే షూటింగ్ జరిపేవారు. ఎమ్.జి.ఆర్. మరణానంతరం సత్యా స్టూడియో ఆయన గౌరవ చిహ్నంగా వేల్స్ యూనివర్సిటీ నిర్వహణలో డా. ఎమ్.జి.ఆర్. - జానకి ఉమెన్స్
కాలేజీ గా రూపాంతరం చెందింది.
నేటి ఈ సుదీర్ఘ పురాణాన్ని ఇక్కడితో ముగించడం సముచితం.
వచ్చేవారం, మరో ఘంటసాల సజీవరాగంతో మరల కలుద్దాము.
కొసమెరుపు:
1952 లో ఘంటసాల గారు పాకిస్థానీ గాయని జొహ్రాబాయి తో
కలసి పాడిన ఏకైక హిందీ గీతం గల 'రాణి' హిందీ సినిమా ను తీసినది ఈ
జూపిటర్ పిక్చర్స్ వారే.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment