అధ్యాయం - 2 - భాగం 31
రక్తసంబంధం - ఒహో
వయ్యారి వదినా ఉలుకెందుకే
తల్లితండ్రులు లేని
సంసారాలలో పెద్దన్నలు, పెద్దక్కలే తమ తోబుట్టువుల సంరక్షణా భారం వహించి వారి ఉన్నతి కోసం జీవితాంతం
కష్టపడతారు. తమ తోబుట్టువులు సంపూర్ణంగా తమ మాటకు కట్టుబడి ఎల్లవేళలా తమ ఆధీనంలోనే వుండాలని కోరుకుంటారు.
రక్తసంబంధీకుల మధ్య మమతానురాగాలు, బంధాలు, అనుబంధాలు దృఢంగా, బలీయంగా వుండవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కానీ, అవి మితిమీరి రాక్షస ప్రవృత్తికి దారితీయకూడదు. రక్తసంబంధీకులకు, సన్నిహితులకు హాని కలిగించకూడదు.
అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళ పరస్పర ప్రేమానుబంధాలు, రాగద్వేషాలకు సంబంధించిన ఇతివృత్తాలతో మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే over possessiveness (ఈ మాటకు సరైన తెలుగు పదం నాకు తట్టలేదు) వల్ల సర్వనాశనమైన కుటుంబగాధా చిత్రాలు వచ్చాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసినది ఎన్.టి.రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా జీవించి చిరంజీవత్వం కలిగించిన 'రక్తసంబంధం' సినీమా. అందులో వదినా మరదళ్ళ మధ్య సాగే ఒక సరససల్లాప గీతమే (పి.సుశీల గానం) నేటి మన ఘంటసాల సజీవరాగం.
ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే
నీ వగలన్నీ ఒకేసారి
చూపకే
అహా వుప్పొంగే
ఉబలాటం దాచవే
ఇది ఒకనాటితో
అయ్యేది కాదులే
నిజమే తొలిరేయీ భావాలు నిలుపలేనట్టి భావాలు
అయినా ఒక్కింతా
ఆగాలీ - ఆగాలీ
అనువైన నునుసిగ్గు
జవరాలు చూపాలీ
ఎంత సాహసివైనా ఇంత
తొందరపడితే
హవ్వ! నలుగురిలో
నగుబాట్లు తప్పవే -
నీ వలపెంతో గొప్పదని
చాటకే !!ఒహో!!
మరలరాదంటూ ఈ రోజూ
మదిలో శ్రుతిమించె నీజోరూ
అసలే అన్నయ్యది
వెన్నలాంటి మనసు
అలాగనీ గడుసుదేరి
చేయకమ్మ అలుసు
మగడు చెంతకు చేరీ
మేను తాకిన చాలూ
ఆ గడుసుదినం
గాలికెగిరిపోవునే
నీ పడుచుదనం పరవశించి పండును !!ఒహో!!
వైవాహిక జీవితంలో అంతో యింతో అనుభవం సంపాదించిన ఆ యింటి ఆడపడుచు శోభనం నాటి రాత్రి చెప్పవలసిన హితోపదేశాలను కొంత అల్లరి, కొంత చిలిపితనాన్ని మేళవించి ఒదినగారిని ఆట పట్టించే గీతం ఇది. ఆరుద్రగారు ఎంతో శ్రమించి ఈ పాటను వ్రాసారని ఈ పాట కంపోజింగ్ లో పాల్గొన్న ఘంటసాల మాస్టారి సహాయకులు శ్రీ సంగీతరావుగారు చెప్పడం జరిగింది. పరభాషా గీతాలు జోలికి పోకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాస్టారు ఇచ్చిన ట్యూన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ చూపిన దర్శకుడు వి.మధుసూదన రావుగారు పాట సాహిత్యం విషయంలో మాత్రం అడుగడుక్కు సొడ్లు పెడుతూవచ్చారట. ఆరుద్ర గారు కూడా ఏమాత్రం విసుగు, కోపం ప్రదర్శించకుండా ఎంతో ఓపికతో పల్లవి మీద మీద పల్లవి వరుసగా ముఫ్ఫై పల్లవులు వ్రాయగా మధుసూదనరావుగారు చివరకు ఈ 'ఓహో! వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్నీ ఒకేసారి చూపకే అహా వుప్పోంగే ఉబలాటం దాచవే ఇది ఒకనాటి తో అయ్యేది కాదులే...' మొట్టమొదటగా రాసిన పల్లవికే ఆమోదముద్ర వేసారట. పాట పల్లవిని బట్టే మిగిలిన చరణాలు రూపం సంతరించుకుంటాయి. సంగీత, సాహిత్య రంగాల్లో ఎంత ఆరితేరినా సినీమా రంగంలో అవేవీ చెల్లుబాటు కావని అక్కడ దర్శక నిర్మాతల ఇష్టాయిష్టాలు ప్రకారమే పనులు జరుగుతాయని ఇలాంటి ఉదంతాలు చెప్పకచెపుతాయి.
ఘంటసాల మాస్టారు ఈ పాటను హరికాంభోజి రాగం స్వరాలతో చేశారు. కర్ణాటక సంగీతంలో హరికాంభోజి 28వ మేళకర్త. అంటే సంపూర్ణ రాగం. ముత్తుస్వామి దీక్షితార్ సంప్రదాయంలో ఈ రాగాన్ని హరికేదారగౌళగా వ్యవహరిస్తారు. కాంభోజి, మోహన, ఖమాస్, శహన, సురటి రాగాలు హరికాంభోజికి జన్య రాగాలు. హిందుస్థానీ సంగీతంలో హరికాంభోజికి సమాంతరమైనది ఖమాస్ థాట్. వెస్ట్రన్ మ్యూజిక్ లో దీనిని మిక్సోలిడియన్ మోడ్ అంటారు. అతి ప్రాచీనమైన రాగాలలో ఈ హరికాంభోజి ఒకటి. ఈ రాగంలో ప్రసిద్ధి చెందిన అనేక శాస్త్రీయ సంగీత కృతులు, వివిధ భాషల్లో సూపర్హిట్ సినీమా పాటలు వున్నాయి. ఘంటసాలగారి సంగీతం సరళిని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న పి.సుశీలగారు ఈ పాటను సందర్భోచిత భావప్రకటనతో మనోజ్ఞంగా ఆలపించారు. తెరమీద వదినా మరదళ్ళుగా సావిత్రి, దేవిక, శోభనం పెళ్ళికొడుకుగా ఎన్.టి.ఆర్. ఔచిత్యమైన హావభావాలతో ఈ మొదటిరాత్రి సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఘంటసాలగారు ఈ పాటను చాలా ఆహ్లాదకరంగా స్వరపరిచారు. పాట నేపథ్యంలో వినపడే స్పానిష్ గిటార్, సితార్, పియోనా, వయొలిన్స్, హార్ప్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ వంటి వాద్యాల ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి మంచి హుషారును కలిగిస్తాయి.
రక్తసంబంధం సినిమాలోని ఎనిమిది పాటలను చేరో రెండేసి పాటలు చొప్పున ఆరుద్ర, సి.నా.రె., అనిశెట్టి, ఒక పాటను దాశరథి, ఒక పాటను కొసరాజు వ్రాయగా ఘంటసాల సంగీత దర్శకత్వంలో వాటిని ఆయనతోపాటు పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి పాడారు.
రక్తసంబంధం సినీమాకు మూలం కె.పి.కొట్టార్కర అనే మలయాళ రచయిత వ్రాసిన కథ ఆధారంగా తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రిలు అన్నాచెల్లెళ్లుగా నటించిన 'పాశమలర్' అనే తమిళ చిత్రం. తమిళ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సిల్వర్ జూబ్లీ సినిమా. ఈ సినిమాలోని అన్నాచెల్లెళ్ల రక్తపాశానికి తమిళ ప్రేక్షకులు ఎంతగా ప్రభావితులైనారంటే ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు శివాజీ, సావిత్రిలు కలిసి నటించినా ప్రేమికులుగా మరే సినీమాలోనూ నటించలేదని చెప్పుకుంటారు. పాశమలర్ అఖండ విజయం ఈ కథను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, సింహళీ భాషలలో సినీమాలను తీయడానికి ప్రేరేపించింది.
తెలుగులో ఈ కథను రక్తసంబంధం పేరుతో రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా, డూండీలు నిర్మించారు. సుందర్లాల్ గారి ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని ఒకటి రెండు తప్ప మిగిలిన పాటలన్నీ తమిళ సినిమా పాటల వరసలనే ఉపయోగించుకున్నారు. తమిళ వాసనలేని ఆ ఒక్క పాటే ఘంటసాలగారు స్వరపరిచిన 'ఒహో! వయ్యారి వదినా ఉలుకెందుకే' నేటి మన సజీవరాగం.
వీరమాచినేని మధుసూదనరావుగారి దర్శకత్వంలో నిర్మించబడిన 'రక్తసంబంధం' సినిమాలో అన్నాచెల్లెళ్లుగా జీవించిన ఎన్.టి.ఆర్., సావిత్రితోపాటు కాంతారావు, దేవిక, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, ప్రభాకరరెడ్డి, సూర్యకాంతం, మొదలగువారు ఈ సినిమా ఘన విజయానికి ఎంతో దోహదం చేశారు. ఈ సినిమాలోని పాటల ట్యూన్సన్నీ చాలావరకు తమిళంవే అయినా, ఘంటసాల గారి హస్తవాసితో తెలుగుదనాన్ని సంతరించుకుని బహుళ జనాదరణ పొందాయి.
అతి చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి వారి సంరక్షణకు, ప్రేమాభిమానాలకు నోచుకోని తన చెల్లెలికి తానే తల్లి, తండ్రీ అయి అతి గారాబంగా, ఎన్నో కట్టుబాట్లుతో పెంచి మితిమీరిన ప్రేమ బంధంతో ఆమెకు ఏవిధమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేసిన ఓ అన్నగారి మూర్ఖత్వం, మధ్యలో వచ్చిన ఆస్తి అంతస్తులు కల్పించిన అహంకారం, అలాగే సన్నిహితులనుకున్నవారి స్వార్ధబుద్ధి వలన ఆ అన్నాచెల్లెళ్ల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమై విషాదాంతంగా ముగిసాయో చూపించే ఒక ఉదాత్త చిత్రమే 'రక్తసంబంధం'. ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసి, చలింపజేసే గుండెలను బరువెక్కింది ఏ చిత్రం 'రక్తసంబంధం'.
సుడిగాలులెన్ని వచ్చినా తెగిపోని మధురబంధం, కలకాలం హృదయాలను కలిపివుంచే జన్మజన్మల బంధం అదే రక్తసంబంధం.
వచ్చేవారం, ఘంటసాల వారి మదిలో మెదిలే మరో సజీవరాగంతో మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment