Saturday, 11 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 103వ భాగం - వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటరెండవ భాగం ఇక్కడ

103వ సజీవరాగం - వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురా

చిత్రం - కనకతార
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - ఘంటసాల

పల్లవి:

వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర-2

ఆ యిబ్బందే మనకొద్దురా

యములోడికి కూడా వద్దురా

వద్దుర బాబూ వద్దురా!

చరణం 1: 

ఆపెతో సరసాలాడామా అగ్నిపర్వతం పగిలిందే -2

ఈపెతో యిష్టం చూపేమా యిల్లు పిల్లి కూనెగిరిందే

గోడదెబ్బతో చెంపదెబ్బతో  కుమిలి

కుమిలి పడిచస్తున్నాం 

                                !వద్దుర బాబూ!

చరణం 2: 

ఎక్కడ తాళం అక్కడ వేసీ టక్కరితనం నేర్వాలి 

నిజం చెప్పడం మరవాలి

                                        !వద్దుర!

రంభా ఊర్వశి తాతలు మీరని 

రకరకాలుగా పొగడాలి 

                                !వద్దుర బాబూ!

 చరణం 3: 

శివుడిద్దరి పెళ్ళాల బాధతో 

తిరిపమెత్తుకొని తిరిగాడూ

గంగను తలపై నిలిపాడు ! శివుడి!

అదీ యిదేమని పార్వతీదేవిని

అర్ధనారిగా చేశాడూ

                                !వద్దుర బాబూ!

చరణం 4:  

ఏడుకొండల యెంకటేశ్వరా -2

ఈ బాధే నీకున్నదా?

అలివేలు బాధ నీకున్నదా?

నాంచారి బాధ నీకున్నదా ?

దేవుళ్ళగుండే మీపనే యిట్లుంటే

మనుషులు పాట్లు చెప్పాలా

                                !వద్దుర బాబూ!

 

ఇద్దరి భార్యల బాధతో పరమశివుడు బిచ్చమెత్తుక తిరిగాడట; గంగను నెత్తిన పెట్టి గౌరిని తన దేహంలో అర్ధనారిగా చేశాడట. ఇద్దరు పెళ్ళాల జీవితంలోని సుఖము,ఆనందము ఎంతమాత్రమో తెలియదు కానీ ఆ మొగుడి అగచాట్లు మాత్రం చెప్పశక్యంకాదు. మంచితనం, వ్యక్తిత్వం గల మనిషికి రెండిళ్ళ పూజారిత్వం చాలా దౌర్భాగ్యం. ఇచ్చకాలతోమోసకారితనంతో నీతి నిజాయితీలకు తిలోదకాలివ్వాలి.  చూడ దుర్భరంగా వున్నా రంభా ఊర్వశులను చంపిపుట్టిన అందగత్తెలని సదా భజన చేస్తూవుండాలి. మరి అలాటివారిని ఎందుకు కట్టుకున్నాడంటే అది లలాట లిఖితమే. 

నుదుటను జాతకాలు రాసే బ్రహ్మకు సరస్వతి ఒక్కతే; ఆయన తండ్రి మహావిష్ణువు కు ఇద్దరు సతులు శ్రీదేవి, భూదేవి; ఆ విష్ణువు అంశతో అవతారమెత్తిన రాముడు ఏకపత్నీ వ్రతుడనని పరస్త్రీల జోలికే పోలేదు. రాముడి తండ్రి దశరధునికి భార్యలు ముగ్గురు. ముద్దుల భార్య కైక మూలంగా  పెద్ద రామాయణమే జరిగింది. ద్వాపరయుగంలో కృష్ణుడిగా అష్టభార్యలతోపాటు పదహారు వేల మంది గోపికలను మాయచేస్తూ వచ్చాడు. కలియుగంలో  ఇద్దరు భార్యల పోరు భరించలేక శ్రీపతి వేంకటాద్రిపై శిలయైపోయాడు.

ఇలాటి గాథలెన్నో విన్న ఒక అర్భకుడు గ్రహపాటు సరిగాలేక రెండు సంసారాల జంఝాటంలో చిక్కుకొని 'వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురఅని ఇద్దరు భార్యల ఎంకన్న దేముడికి మొరెట్టుకుంటున్నాడు... అదే నేటి మన సజీవరాగం.

'కనకతార' సినిమాలో ఈపాటను సరదాకోసం హాస్యనటుడు చదలవాడ కుటుంబరావు మీద చిత్రీకరించినాఆలోచించి చూస్తే ఇందులో చాలా వ్యవహారముంది. ఇద్దరు భార్యలు గల మగాడి జీవితంలో ఈతిబాధలనేకం. ఈ విషయంలో అనుభవజ్ఞుడైన వ్యక్తినే ఈ గీతం సంగీతదర్శకుడిగా, గాయకుడిగా వరించడం ఒక విశేషం. తన స్వానుభవసారంతో ఘంటసాలగారు ఈ గీతానికి పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

అసలు ఈ బహుభార్యా వ్యవస్థ ఏనాటిది? దీని అవసరం ఎంతవరకుతరచిచూస్తే రామాయణమహాభారత, భాగవత కాలాలనుండి ఈ బహుభార్యత్వం అనేది మన భారతదేశంలో కొనసాగుతున్నట్లు ఈ కావ్యాల ద్వారా తెలుస్తోంది. గొప్ప గొప్ప చక్రవర్తులురాజాధిరాజులుధనికవర్గాలవారు తమ తమ హోదానుదర్పాన్నిఅహంకారాన్ని చాటుకునేందుకు, తమ తమ రాజ్యాలను సుస్థిరం చేసుకునే క్రమంలో రాచకీయపుటెత్తులలో భాగంగా అనేక పెళ్ళిళ్ళను చేసుకునేవారు. పరశురాముడు దాడి నుండి తప్పించుకునేందుకు దశరథుడు తరచూ పెళ్ళిపీటలెక్కేవాడట. అలాగే తమ సామ్రాజ్య విస్తారణ కోసం శ్రీకృష్ణ దేవరాయలు, అక్బర్ పాదుషా అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నారని చరిత్ర చెపుతుంది.  రెండో భార్యగానో, నాల్గవ భార్యగానో కాలం గడపడానికి సిధ్ధపడిన స్త్రీల సంగతేమోకానీ తమ ఇష్టానికి విరుధ్ధంగామనసు చంపుకొని, పరిస్థితుల ప్రాబల్యంతో బలవంతాన ఉంపుడుగత్తెలుగా జీవితాంతం వ్యధలపాలవుతున్న స్త్రీలు ఎందరో!  ఏమైనా, అక్రమ సంబంధాల వలనరహస్య వివాహాలు చేసుకునే సామాన్య స్త్రీలకు సామాజిక గౌరవం, జీవితాలలో ఆత్మ తృప్తిసుఖసంతోషాలు మృగ్యమనే చెప్పాలి. అలాగే మోహావేశాలకుప్రలోభాలకులోనై  పెళ్ళి పేరిట అనేక మంది స్త్రీలతో ఆడుకునే పురుషుల జీవితమూ దుర్భరమే. అక్రమ సంబంధాలురహస్య పెళ్ళిళ్ళు వాటి వల్ల సంభవించే కష్టనష్టాలు ఇతివృత్తాలుగా మనకు వున్నన్ని కథలుసినీమాలుసీరియల్స్ కోకొల్లలు.

వీటికి ఉన్నంత క్రేజ్గిరాకీ ఇతర కథాంశాలకు లేదు. ఇందులోని గొప్ప తమాషా ఏమంటే, మన దేశంలో ఇలాటి సినీమాలను  ఆదరించి పోషించేది, అలాటి హీరోయిజంపై మోజుపడేది ఎక్కువగా మహిళా ప్రేక్షకులే. సంఘానికి చీడపురుగులైన అలాటి స్త్రీ పురుషుల మీదా ఎలాటి తిరుగుబాటుదనమూ మనవాళ్ళలో కనపడదు. 

బహుభార్యత్వం విషయంలో ప్రభుత్వాలు కూడా ద్వంద వైఖరి నే పాటిస్తున్నట్లనిపిస్తుంది. ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలతో సహా అనేక దేశాలలో బహుభార్యత్వం నిషేధించబడింది. ముస్లీం దేశాలలో కూడా నిబంధనలతో కూడిన ఆమోదం మాత్రమే అమలులో వుంది. భారతదేశంలో కూడా బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ 1956 లో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిప్రకారం ఒక భార్య సజీవంగా వుండగా మరొక స్త్రీతో సంపర్కమో లేక రెండవ వివాహం చేసుకోవడమో చట్టవిరుధ్ధంగా పరిగణించబడింది. అయితే చట్టాలలోని లొసుగుల వల్ల రాజకీయ ప్రలోభాలవలన ఈ చట్టం వల్ల కలిగే సత్ఫలితాలు అంతంతమాత్రమే. ఇలాటి చట్టాలనునీతి నియమాలను గౌరవించేది అంతరాత్మకు భయపడే సగటు మనిషి మాత్రమే.

సరి, ఎక్కడో మొదలైన మన చర్చ ఎక్కడికో పోతోంది. ప్రస్తుతం ఈనాటి సజీవరాగం విషయానికి వద్దాము. 1956 లో విడుదలైన ' కనకతార' అనే ఒక జానపద చిత్రంలోని పాట ' వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర'. సినిమా లో ఒక జాలరి పాత్ర (చదలవాడ కుటుంబరావు) పాడే పాట. స్వీయ సంగీతంలో ఘంటసాలగారు సంపూర్ణంగా అనుభవిస్తూ జనరంజకంగా ఆలపించిన గీతం. దీనిని జానపదగీత బ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి తనదైన శైలిలో అద్భుతంగా వ్రాసారు. కొసరాజుగారికి తాను వ్రాసిన పాటను ఏదో మీటర్లో పాడుతూ వినిపించడం అలవాటు. కొన్ని సందర్భాలలో ఆయన పాడిన ట్యూన్ నే అవసరమైన సవరణలు చేసి సంగీతదర్శకులు పాటను స్వరపర్చడం జరిగేది. జానపదశైలిలో సాగే ఈ పాటను ఘంటసాలగారు ఖరహరప్రియ రాగస్వరాలతో రూపొందించారు. ఖరహరప్రియ కర్ణాటక సంగీతశైలిలో 22వ మేళకర్త. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతాయి. చాలా ప్రాచీనమైనరాగం.హిందుస్థానీ బాణీలో కాపి థాట్ రాగంగా చెపుతారు. ఖరహరప్రియ రాగానికి ప్రసిధ్ధి చెందిన జన్యరాగాలు ఎన్నో వున్నాయి. ఖరహరప్రియ రాగానికి ఆ పేరు రావణుని గానం వలన శివునిపరంగా (హరప్రియ) ఖరుడనే రాక్షసుని చంపిన రామునికి ఇష్టమైన రాగంగా త్యాగరాజస్వామి వారి వలన కలిగినట్లు ప్రతీతి. ఖరహరప్రియలో, దాని జన్యరాగాలైన ఉదయరవిచంద్రికరీతిగౌళశ్రీరంజనిముఖారిఅభేరిఅభోగిభీంప్లాసdకాపి, మధ్యమావతి, బృందావనసారంగి, మొదలైన వాటిలో స్వరపర్చబడిన సినీమాపాటలు అసంఖ్యాకం.

రాగప్రధానమైన గీతాలను రసానుభవానికి తగినట్లుగా రూపొందించడంలో ఘంటసాలగారు మాస్టరే. జానపద బాణీలో సాగే ఈ పాట కోసం ఘంటసాల మాస్టారు మాండొలిన్వైలిన్స్ఫ్లూట్, క్లారినెట్తబలాడోలక్చిడతలు వంటి వాద్యాలను ఉపయోగించారు. చదలవాడ మ్యానరిజమ్స్ ను దృష్టిలోపెట్టుకొని ఘంటసాల ఈ పాటను బలే గమ్మత్తుగా పాడారు.

తెలుగు సినిమా తొలితరం మాటలపాటల రచయిత చందాల కేశవదాసు వ్రాసిన నాటకం 'కనకతార'. దీనిని 1937లో సరస్వతీ టాకీస్ వారు హెచ్.వి.బాబు డైరక్షన్ లో కన్నాంబ, సూరిబాబుదొమ్మేటి సూర్యనారాయణ లతో సినిమాగా తీసారు. భీమవరపు నరసింహారావు సంగీతం నిర్వహించగా పాటలు పద్యాలను సముద్రాల రాఘవాచార్యచందాల కేశవదాసు వ్రాసారు. అదే కనకతార, తన పుత్రసమానుడు ఘంటసాల సంగీతదర్శకునిగా, 1956లో రెండవసారి  నిర్మించినపుడు అందులో సముద్రాలగారు ఒక పాటను, పద్యాన్ని కూడా వ్రాయకపోవడం ఒక విశేషం. దీనినిబట్టి  ఆనాడు ఎక్కువగా నిర్మాతల మాటే చెల్లుబాటు అయేదని తెలుస్తోంది.

కనకతారలో వున్న 13 పాటలు/పద్యాలను జంపనఅనిశెట్టి, కొసరాజు వ్రాయగా వాటిని ఘంటసాలఎస్.వరలక్ష్మి, జిక్కిమాధవపెద్ది ఆలపించేరు. ఇందులో ఘంటసాలగారు నాలుగు పాటలు పాడగా ఆ నాలుగింటినీ కొసరాజుగారే వ్రాసారు. గోకుల్ ప్రొడక్షన్ దోనేపూడి కృష్ణమూర్తి అంతకుముందు తీసిన 'వదినగారి గాజులు' చిత్రానికి కూడా ఘంటసాలగారే సంగీతం నిర్వహించారు. రజనీకాంత్ సబ్నవీస్ ఈ కనకతార చిత్రదర్శకుడు. 

ఎన్నో మంచి పాటలున్న ఈ చిత్రం విడియో లభించకపోవడం దురదృష్టం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

1 comment:

  1. అద్భుతం. అన్ని కోణాలను స్పృశిస్తూ అపూర్వంగా ఉన్నది సార్. నాటి విషయాలను, విశేషాలను నేటి తరానికి తెలియ జేస్తూ, కళామతల్లి సేవలో తరిస్తూ ఒక సద్గురువు లా మమ్మల్ని ధన్యులుగా చేస్తున్న మీకు హృదయపూర్వక నమస్సుమాంజలులు. సార్.

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...