"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"
చిత్రం - మాయింటి దేవత
గానం - ఘంటసాల
రచన - దాశరథి
సంగీతం - మాస్టర్ వేణు
నీ లేత గులాబీ
పెదవులతో
కమ్మని మధువును
తాకాలి -2
విందులు చేసే నీ
అందాలు
నామదిలోనే చిందాలి
నీ లేత!
మధురమైన ఈ మంచి రేయిని
వృధాచేయకే...సిగ్గులతో -2
చంద్రుని ముందర తార
వలె
నా సందిట నీవే
ఉండాలి....
ఈ మధువంతా నీకోసం
పెదవుల మధువే నాకోసం
నీ లేత!చరణం 2:
మధువు పుట్టింది నా
కోసం
నేను పుట్టింది నీ
కోసం -2
కన్నుల కాటుక
కరగకముందే
సిగలో పువ్వులు
వాడకముందే-2
పానీయముతో పరవశమై-2
నీ కౌగిట నన్నే బంధించుకో
నీ లేత!'ప్రేమ' రెండక్షరాల ఒక చిన్న మాట. కాని సముద్రమంత లోతైనది, గాఢమైనది. ప్రేమ తత్వాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం అంత సులభంకాదు. ఈ విశ్వమంతా ప్రేమమయం. విశ్వశాంతికి, మనుషుల మధ్య ఐక్యతకు, సామాజిక పురోభివృద్ధికి ప్రేమ, మమకారం ఆవశ్యకం. మనిషి మానసిక, నైతిక, శారీరక స్వస్థతకు ప్రేమ ఎంతో ముఖ్యం. నీ నా తరతమ బేధం లేకుండా సమస్త ప్రాణులను ప్రేమించగలిగేవారికి ఆయుర్దాయం ఎక్కువగా వుంటుందని పెద్దలంటారు.
ప్రేమ అనే మధురభావం మనస్సుకు సంబంధించినది. ఆ ప్రేమ పరిపరివిధాలు. యువతీయువకుల మధ్య ప్రేమ; భార్యాభర్తల ప్రేమ; తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ --- ఇలా ప్రేమ భావనా స్వరూపం మారుతూంటుంది. అర్ధవంతము, గాఢత్వము కలిగి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పూర్తిగా నిష్కల్మషమైన స్నేహమనే పునాదిపై ఇద్దరు వ్యక్తుల మధ్య (అది స్త్రీ పురుషులు కావచ్చు లేదా ఇద్దరూ పురుషులు లేక ఇద్దరు స్త్రీలు కావచ్చు) ఏర్పడిన ప్రేమ పవిత్రమైనదిగా, ఉన్నతమైనదిగా భావించబడుతుంది. శాశ్వతత్త్వాన్ని కలిగివుంటుంది. అయితే అలాటి ఉత్కృష్టమైన ప్రేమ మనకు కథలలో, సినిమాలలో మాత్రమే కనిపిస్తుంది. నిజజీవితంలో అలాటి ఉదాత్తమైన ప్రేమ బహు అరుదు.
సామాన్యంగా సగటు మనిషి అనుభవించే ప్రేమ,పంచే ప్రేమ మోహ, ప్రలోభాలకు, స్వార్థానికి అతీతమైనదేమీ కాదు. బాహ్య సౌందర్యానికి,లౌకిక కోరికలకు లోబడివుంటుంది. జీవితం యవ్వన దశలో స్త్రీ పురుషుల మధ్య ఈ ప్రేమ శారీరక, ఆర్ధిక, సామాజిక అవసరాలను తీర్చే సాధనంగా ఉపయోగపడుతున్నది. ఈనాడు యువతీయువకులు లేదా భార్యాభర్తల మధ్య గల ప్రేమలో కూడా హిపోక్రసి చోటు చేసుకుంటున్నది. ఎదుటి వ్యక్తి బలహీనతలను ఆసరాగాచేసుకొని మోసం, దగాకోరుతనంతో తన చెప్పుచేతల్లో వుంచుకునే లక్షణం కనిపిస్తుంది.
స్త్రీ అంటే కేవలం శారీరక కాంక్ష తీర్చే భోగవస్తువుగా భావించే ఒక కాముకుడు పాడే గీతాన్ని ఈనాటి సజీవరాగంగా ప్రకటించడానికి మనసొప్పకపోయినా అలాటి వికృతభావాలను ప్రకటించడంలో కూడా ఘంటసాలవారి గాన ప్రతిభ ఎంత సున్నితంగా, హృద్యంగా వుంటుందో తెలియజేయడానికే ఈ వారం 'లేత గులాబీ పెదవులు' ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
వివాహం జరిగిన తొలినాటి రాత్రే శోభనంగదిలో ఆప్యాయంగా ప్రేమానురాగాలు పంచవలసిన భర్త మధువు నిషాలో తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి నిర్బంధిస్తూంటే సభ్యతా సంస్కారాలు గల ఆ భార్య మనసు ఎంత క్షోభిస్తుంది. వ్యసనపరుడైన ఆ భర్తకు భార్యయైనా ఒక్కటే, వెలయాలైనా ఒక్కటే. తన వాంఛ తీర్చుకోవడమే ముఖ్యం. వ్యామోహమే ప్రధానాంశంగా గల ఈ గీతాన్ని గొంతులో నిషాను, మోహాన్ని పలికిస్తూ ఘంటసాల మాస్టారు ఆలపించిన విధం; మగువ, మదిరలకు బానిసయైన భర్తగా తెరమీద హరనాథ్ రాజు, బలిపశువైన భార్యగా జమున నటన ఈ పాటకు సజీవత్వాన్ని కలిగించింది.
'కన్నుల కాటుక కరగకముందే సిగలో పువ్వులు వాడక ముందే నీ కౌగిట నన్ను బంధించుకో; మధురమైన ఈ మంచిరేయిని వృధా చేయకే సిగ్గులతో విందులు చేసే నీ అందాలు నా మదిలోనే నిండాలి నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి' - ఎంత చక్కటి భావన. ఎంత అద్భుతంగా వ్రాసారు దాశరథి ఈ ప్రణయగీతాన్ని. నిజానికి ఇటువంటి సున్నితమైన శృంగారభావాలు కల ఆ వ్యక్తి మందును ఆశ్రయించవలసిన పనే లేదు.
ఘంటసాలగారి గాత్ర మాధుర్యంతో ఈ తొలిరేయి గీతం ప్రేమికులందరిలో అనిర్వచనీయమైన మత్తునే కలిగిస్తుంది. పాటలో వచ్చే 'చిందాలి', 'సిగ్గులతో', ' నా కోసం, 'కన్నుల కాటుక కరగక ముందే' వంటి పదాలమీద ఘంటసాల మాస్టర్ గారు ఇచ్చిన వైవిధ్యభరితమైన భావాలు, మధ్య మధ్య చిరునవ్వులు ప్రేక్షకులలో ఈ పాట పట్ల మోజును పెంచుతుంది.
కృష్ణ, జమున, హరనాథ్, పద్మప్రియలు ముఖ్యపాత్రలుగా చాలా సాదాసీదా కధాంశంతో నడిచే సినిమా 'మాయింటి దేవత'. ఈ సినీమాకు అంతో యింతో ఊరట కలిగించే విషయం మాస్టర్ వేణుగారి సంగీతం, ఘంటసాల మాస్టారు పాడిన 'నీ లేత గులాబీ పెదవులతో' గీతం మాత్రమే. సంతూర్, సితార్, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, వైబ్రోఫోన్ కాంబినేషన్లతో మాస్టర్ వేణు సమకూర్చిన ఆర్కెస్ట్రేషన్ పాటకు ఎంతో శ్రావ్యతను చేకూర్చింది. పాట ఆద్యంతం ఘంటసాల మాస్టారి గాత్రాన్ని అనుసరిస్తూ సాగిన తబలా నడక మనసుకెంతో హాయిని కలిగిస్తుంది. అసలు ఈ పాట ఇంత హృద్యంగా రూపొందడానికి కారణం ఈ గీతాన్ని రూపొందించడానికి ఎన్నుకున్న రాగం. హిందోళ రాగ స్వరస్థానాలతో వేణు ఈ పాటను చేశారు. అంతేకాదు ఆ రాగంలో లేని అన్యస్వరాలను కూడా జోడించి ఎనిమిది స్వరాలతో (రిషభం, పంచమం, అంతరగాంధారం అన్యస్వరాలు) మనకు వీనులవిందు చేశారు. కర్ణాటక సంగీత హిందోళానికి సమాంతర హిందుస్థానీ రాగం మాల్కౌంస్. ఈ రెండు రాగాలలో అన్యస్వర ప్రయోగాలతో ఘంటసాల మాస్టారు పాడిన గీతాలెన్నో సంగీత ప్రపంచంలో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి.
ఈ సినిమాలోని పదకొండు పాటలలో ఘంటసాలగారు పాడినవి రెండు విడివిడి సాకీలు, ఈ పాట మాత్రమే. ఈ మూడింటిని విలన్ టైప్ పాత్రధారి హరనాథ్ మీదనే చిత్రీకరించారు నటదర్శకుడు బి.పద్మనాభం. ఘంటసాల హరనాధ్ కాంబినేషన్లో గతంలో కూడా చాలా మంచిపాటలు వచ్చాయి. 'నేను పాడిన పాటలకు హరనాథ్ లిప్ మూవ్మెంట్ చాలా చక్కగా సింక్రనైజ్ అవుతుందని ఒక రీరికార్డింగ్ లో ఘంటసాల మాస్టారు హరనాథ్ ను ప్రశంసించడం నేను విన్నాను. ఈ చిత్రంలో మిగిలిన పాటలను ఎస్పిబాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, వాణీ జయరాం పాడారు.
'మాయింటిదేవత' సినిమా అసలు నిర్మాత హరనాథ్. ఆర్ధికపరమైన ఇబ్బందులతో చిత్రనిర్మాణం ఆగిపోయింది. హరనాథ్ ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా చాలా నష్టపోయారు. తర్వాత సినిమా చేతులు మారి ఏడెనిమిదేళ్ళ తర్వాత విడుదలయింది. అప్పటికి ఘంటసాలగారు అమరులయి ఆరేళ్ళయింది. ఘంటసాలగారి గొంతును వినిపించిన ఆఖరి సినిమా 'మాయింటిదేవత'. హరనాథ్. తొలి చిత్రమైన 'మా ఇంటి మహాలక్ష్మి' లో కూడా ఘంటసాలగారు జిక్కి తో కలసి ఒక డ్యూయెట్ పాడారు. ఈ చిత్రంలో కూడా జమునే హీరోయిన్.
జమున హరనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించాయి. మరి, 'మాయింటిదేవత' కు ఆ అదృష్టం పట్టినట్లులేదు. చిత్రనిర్మాణం లోని
జాప్యం ఒక కారణం కావచ్చును.
ఇలాటి సినిమాలు ఇంకా గుర్తుండిపోవడానికి కారణం వాటిల్లోని ఘంటసాలగారి పాటలే అంటే అతిశయోక్తికాదు.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment