Saturday, 27 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 101వ భాగం - ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

 "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూరవ భాగం ఇక్కడ

101వ సజీవరాగం - ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

చిత్రం - భూమికోసం
గానం - ఘంటసాల
రచన - శ్రీశ్రీ

సంగీతం - పెండ్యాల

పల్లవి:

ఎవరో వస్తారని ఏదో చేస్తారని 

ఎదురుచూసి మోసపోకుమా!

నిజం మరచి నిదురపోకుమా....

చరణం 1:

బడులే లేని పల్లెటూళ్ళలో-2

చదువేరాని పిల్లలకు

చవుడురాలే చదువుల బడిలో

జీతాల్ రాలని పంతుళ్ళకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

చరణం 2:

చాలీచాలన పూరిగుడిసెలో-2

కాలేకడుపుల పేదలకు

మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

చరణం 3:

తరతరాలుగా మూఢాచారపు వలలో 

చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి 

బలియైపోయిన పడతులకు 

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

 చరణం 4:

కూలి డబ్బుతో లాటరీ టిక్కెట్ -2

కూలి డబ్బుతో లాటరీ టిక్కెట్ కొనే దురాశా జీవులకు

దురలవాట్లతో బాధ్యత మరచి చెడే నిరాశా జీవులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

 చరణం 5:

సేద్యం లేని బీడునేలలో ఓ....-2

పనులే లేని ప్రాణులకు

పగలు రేయి శ్రమపడుతున్నా ఫలితం దక్కని దీనులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

ఎన్నో శతాబ్దాలుగా మన దేశాన్ని, మన దేశమే ఏమిటి యావత్ప్రపంచాన్ని పట్టి కుదుపుతున్న ప్రధాన సమస్యలు Social injustice & economic inequality అంటే సామాజిక అన్యాయం మరియు ఆర్ధిక అసమానత్వం. వీటివల్ల కలుగుతున్న దురాగతాలనుండికష్టనష్టాలనుండి బక్కచిక్కిన బడుగు ప్రజలను రక్షించి ఉధ్ధరించాలని ఎందరో మహానుభావులు తరతరాలుగా శ్రమిస్తున్నారు, యింకా ఆ దిశగా కృషిచేస్తూనే వున్నారు. అయినా ఫలితం అంతంతమాత్రమే.

దున్నేవాడిదే భూమిప్రజలదే రాజ్యం అనే నినాదాలు కేవలం ఉపన్యాసాలకే పరిమితం. ఫలితం ఎక్కడవేసిన గొంగళి అక్కడే. విదేశీ పాలకుల కబంధహస్తాలనుండి విముక్తి కలిగి స్వరాజ్యంస్వాతంత్ర్యం లభిస్తే పేదప్రజల జీవనవిధానమే మారిపోతుందనే కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. జమిందారీ వ్యవస్థ రద్దువలనభూదానోద్యమాల వల్ల, మరేవేవో సంస్కరణల వలన సగటు మనిషి సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాడని ఆశించినవారి కలలు ఇంకా పరిపూర్ణంగా సఫలీకృతం కాలేదు‌అవి పగటికలలుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏమిటి? లోపం ఎక్కడుందిఈ దుస్థితిని రూపుమాపడానికి సామాజిక స్పృహ కలిగిన సంస్కర్తలు,దీనజనోధ్ధారకులు తమవంతు కృషిని స్వార్ధరహితంగా చేస్తూనేవున్నా పేదా గొప్పా తారతమ్యాన్ని మాత్రం సమూలంగా నిర్మూలించలేకపోతున్నారు.

ఆలోచించి చూస్తే కారణాలెన్నో కనిపిస్తాయి. అట్టడుగు స్థాయిలో ఉన్న నిరక్షరాస్యత, బుధ్ధిహీనతతెలివిలేమి వారి అభివృద్ధికి అడ్డుకట్టగా నిలుస్తున్నాయి. తమ దైనందిక జీవితావసరాలు తీరడానికి, రెండుపూటలా ఇంత గంజి త్రాగడానికి  ఏ డబ్బున్న ఆసామినో ఆశ్రయించక తప్పడంలేదు. ధనికవర్గాలు సర్వవిధాల దోపిడీ చేసి ఆ పేదలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని తమ బానిసలుగా చేసుకుంటున్నారు.  నోట్లతో ఓట్లను కొని పదవులకు ఎగబ్రాకే రాజకీయ నాయకులంతా ఆ ధనికులకు వత్తాసుగా నిలుస్తున్నారు. క్రమంగా ఆ ధనికులే నాయకుల అవతారలెత్తుతున్నారు. 

దీనికి తోడు పేదలలోని అజ్ఞానంఒకే రాత్రిలో అప్పనంగా డబ్బు సంపాదించి కోటీశ్వరులైపోవాలన్న దురాశ. అందుకోసమై తప్పుడు దార్లు తొక్కడం. చాలీచాలని దినసరి కూలి డబ్బులను త్రాగుడు మీదలాటరీ టిక్కెట్ల మీద తగలేసి బాధ్యతారహితంగా బ్రతికేవారిలో  చైతన్యం  తీసుకువచ్చి వారిలోని పిరికిదనాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యం కలిగేలా నవసమాజ స్థాపనే ధ్యేయంగా ఎందరో అభ్యుదయవాదులు కృషి చేశారు.

మనిషి తనకు తానుగా  ఆలోచించి సక్రమ మార్గంలో ఎదగడానికి ప్రయత్నించాలి. పరాన్నజీవులుగా బ్రతకడం మానుకోవాలి. నీ కష్టసుఖాలు నీవే. నిన్ను ఉధ్ధరించడానికి ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఆశిస్తూ ఎదురుచూడడం అవివేకం.  అలా ఏ స్వయంకృషి లేకుండా   అలసత్వంతో సోమరిగా గడిపితే మొదటికే మోసం వస్తుందంటున్న ఘంటసాల మాస్టారు ఆలపించిన శ్రీశ్రీ ప్రబోధ గేయమే నేటి మన సజీవరాగం... అదే...

'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా....'

 ప్రజలను మేల్కొలిపి వారికి కావలసిందేమిటో వారే తెలుసుకునేలా చేయడమే ఈ గీతం లక్ష్యం. వామపక్ష భావజాలం కలిగి అట్టడుగు వర్గ సమాజానికేదో మంచి ఉద్బోధ చేయాలనే తలంపుతో కె.బి.తిలక్, శ్రీశ్రీ, సుంకర , పీపుల్స్ వార్ గ్రూప్  వ్యవస్థాపకుడు కె.జి.సత్యమూర్తి మొదలగువారి సమిష్టి కృషి ఫలితమే 1974లో వచ్చిన  ' భూమికోసం'.

సుప్రసిద్ధ సీనియర్ హిందీ నటుడు అశోక్ కుమార్ ఈ చిత్రంలో అతిధి నటుడిగా కనిపించడం ఒక విశేషం. సాత్వీక మైన పాత్రలలో కనిపించే అశోక్ కుమార్ 'భూమికోసం' లో స్వార్ధపరుడైన  దుష్ట జమీందారుగా నటించడం మరో విశేషం. సామాన్య ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా జమీందారు కుమారుడిగా జగ్గయ్య, కుమార్తె గా జమున నటించారు. లలితారాణి అనే నూతన నటిని జయప్రదగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసింది  ఈ 'భూమికోసం'.

ఘంటసాలగారు పాడి, ఆయన నిర్యాణం తర్వాత ఎనిమిది మాసాలకు విడుదలైన సినిమా 'భూమికోసం'. ఈ సినిమా లో ఘంటసాలగారు పాడిన ఏకైక గీతం 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా'. ఈ పాటను కథానాయకుడి స్నేహితుడు, శ్రేయోభిలాషి, సమాజ శ్రేయస్సుపై  అక్కరగల పాత్రలో నటించిన గుమ్మడిపై చిత్రీకరించారు.

అనుపమ ఫిలింస్ ఆస్థాన సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారే ఈ సినిమాకు కూడా సంగీతదర్శకుడు.

కరుణ, శోకం, భక్తి,విరహంప్రేమ వంటి రసాల ప్రకటనకు ఎంతో అనువైన రాగం సింధుభైరవి. కర్ణాటక సంగీతంలో 8వ మేళకర్త అయిన హనుమత్తోడికి జన్యరాగం. అక్బర్ ఆస్థాన విద్వాంసుడు మియా తాన్సేన్ ఈ సింధుభైరవి రాగాన్ని ఉత్తరభారతదేశంలో బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడని చెపుతారు. అసావేరీ థాట్ కు జన్యరాగం. ఈ సింధుభైరవి రాగంలో అసంఖ్యాకమైన సినిమా పాటలు అన్ని భాషలలో వచ్చాయి. మన తెలుగు సినిమా సంగీతదర్శకులకు, నిర్మాతా దర్శకులకు అత్యంత ప్రీతిపాత్రమైన రాగం సింధుభైరవి. ఈ రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపర్చి గానం చేసిన పాటలెన్నో అత్యంత జనాదరణ పొందాయి. అటువంటి ఘనత వహించిన సింధుభైరవి రాగంలో పెండ్యాలగారు 'ఎవరో వస్తారని' అనే పాటను  చాలా చక్కగా స్వరపర్చారు.

పాటలోని ప్రతీ చరణానికి ముందు వచ్చే మొదటి లైన్ ను సాకీగా మలచి మూడు చరణాలకు మూడు సాకీలు చేశారు. డప్పుచిటికలుమువ్వలుమేండొలిన్తబలా, డోలక్ వంటి వాద్యాలను చాలా సమర్థవంతంగా పెండ్యాల ఈ పాటలో ఉపయోగించారు.

శోకశాంతఉదాత్తభావాలను  వ్యక్తపరుస్తూ ప్రేక్షకుల మనస్సులలో అవ్యక్తమైన ఉద్వేగం రేకెత్తిస్తూ హృదయాలకు హత్తుకునేలా ఘంటసాల మాస్టారు ఈ ప్రబోధగీతాన్ని  ఆలపించారు. గుమ్మడిఘంటసాల కలయిక  ఈ పాటకు మంచి రాణింపునిచ్చింది.

భూమికోసం జరిగిన పోరాటాలలో పాల్గొని పోలిస్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడు రామనరసింహారావుకు, అశువులుబాసిన  మరెందరో త్యాగమూర్తులకు  కె.బి.తిలక్ 'భూమికోసం' చిత్రాన్ని అంకితం చేశారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...