చిత్రం - భక్త తుకారం
గానం - ఘంటసాల
రచన - దేవులపల్లి
కృష్ణశాస్త్రి
సంగీతం - పి.ఆదినారాయణరావు
ఘనా ఘన సుందరా
కరుణా రస మందిరా
అనుపల్లవి:
అది పిలుపో, మేలుకొలుపో
నీ పిలుపో, మేలుకొలుపో
అది మధుర మధుర
మధురమౌ
ఓంకారమో!
పాండురంగ...
పాండురంగ...!ఘనా!
చరణం 1:
ప్రభాత మంగళ పూజా
వేళ
నీ పద సన్నిధి
నిలబడి
నీ పద పీఠిక తలనిడి!
-2
నిఖిల జగతి
నివాళులిడగా-2
వేడగా,కొనియాడగా
పాండురంగ....పాండురంగ
!ఘనా.... ఘన...!
గిరులు, ఝరులు, విరులూ తరులూ
నిరతము నీ పద
ధ్యానమే
నిరతము నీ
నామగానమే!గిరులూ!
సకల చరాచర
లోకేశ్వరేశ్వర-2
శ్రీకరా! భవహరా!
పాండురంగ! పాండురంగ
పాండురంగ!పాండురంగ!
పాండురంగ
లోకేశ్వరేశ్వరా! శ్రీకరా! భవహరా! పాండురంగా! ఈ విశ్వములోని చరా చరములు, గిరులు, ఝరులు, విరులు, తరులు సకలము నీ పద ధ్యానమే, నిరతము నీ పాద ధ్యానమే... అంటూ ఓ భక్తుడు ప్రభాత సమయాన భగవంతుని నామ స్మరణలో తన్మయత్వం చెంది పరవశించిపోతున్నాడు. ఆ భక్తుడు చేసిన నామ సంకీర్తనమే ఈనాటి సజీవరాగం. అదే 'భక్త తుకారాం' చిత్రం కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి సాహిత్యానికి తదాత్మ్యంతో ఘంటసాలగారు గానం చేసిన 'ఘనాఘన సుందరా కరుణా రసమందిరా!' అనే భక్తిగీతం.
నవ విధ భక్తి మార్గాలలో 'కీర్తనం' ఒకటి. భగవంతుని గుణగణాలను అనేక నామాలతో కీర్తిస్తూ, భగవంతుని ఏకాగ్రచిత్తంతో పూజించడం. జ్ఞానశూన్యులై లౌకిక వ్యామోహాలతో, రకరకాల ప్రలోభాలకు లోనయి మూఢాచారాలతో సమాజం నిర్వీర్యమైపోతున్నప్పుడు పామరజనులను, కుహానా పండితులను జాగృదవస్థకు తీసుకువచ్చి, వారిని చైతన్యవంతులను చేయడానికి మహామహులెందరో అహర్నిశలు కృషి చేశారు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఎన్నో మార్గాలను అనుసరించారు. అందులో భక్తిమార్గం ఒకటి. స్వార్ధంతో, స్వలాభ చింతనతో నాస్తికవాదులు వితండవాదనలు చేస్తూ భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తూ సంఘ విద్రోహక శక్తులుగా మారి సనాతన ధర్మాన్ని కూకటివ్రేళ్ళతో పెకలించే తరుణంలో భక్తి ఉద్యమాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఎందరో మహానుభావులు సమాజ సంక్షేమం కోసం తీవ్రంగా కృషిచేశారు. భక్తి చింతన ద్వారా ప్రజలలో సాత్విక గుణాలను పెంపొందించి, నిరంతర భగవధ్యానంతో సన్మార్గాన జీవనం చేస్తూ అంతిమంగా ముక్తిని సాధించడమే ధ్యేయంగా సాధు సత్పురుషులెందరో కృషిచేశారు. 6,7 శతాబ్దాల కాలంలోనే దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన ఈ భక్తి ఉద్యమం మరో పది శతాబ్దాల నాటికి ప్రాక్పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాలన్నింటికి తీవ్రంగా వ్యాపించింది. నవ విధ భక్తి మార్గాలతో సామాన్య ప్రజలకు జ్ఞానబోధ జరిగింది.
15-17 శతాబ్దాల మధ్యకాలంలో భక్తి ఉద్యమం మహారాష్ట్ర దేశంలో ముమ్మరంగా సాగింది. అనేకమంది సాధు సత్పురుషులకు జన్మస్థలం మహారాష్ట్ర దేశం. ధ్యానేశ్వర్, నామదేవ్, ఏక్ నాథ్, సక్కుబాయి, మీరాబాయి, సమర్థ రామదాసు వంటి మహాభక్తులు తమ భక్తిగానాలతో తాము తరించడమే కాక సామాన్య ప్రజానీకానికి మార్గదర్శకులయ్యారు. అలాటివారిలో తుకారాం ఒకడు. ఈయన మరాఠా సింహం ఛత్రపతి శివాజీ మహరాజ్ కాలంనాటివాడు. శ్రీవైష్ణవ భక్తుడు. పండరిపురంలో వెలసియున్న పాండురంగ విఠలుని పరమభక్తుడు. తరచూ పండరినాథుని దర్శించడమే తమ విధిగా భావించే కుటుంబంలో జన్మించినవాడు. 'మానవసేవయే మాధవసేవగా' భావించినవాడు. సమాజంలో అగ్రకులాల వారి మత మౌఢ్యాన్ని, దురాచారాలను,స్వార్థపరత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ, తన భక్తిగానంతో వాడవాడలా పర్యటించి ప్రజలను ఎంతో ప్రభావితం చేశాడు. ఆ క్రమంలో తుకారాం ఎన్నో భక్తిగీతాలను రచించాడు. మరాఠీ భాషలో వాటిని అభంగాలని అంటారు.
అలాంటి అభంగ గీతాలకు తెనుగు రూపమే ఈనాటి మన సజీవరాగం - 'ఘనాఘన సుందరా కరుణా రస మందిరా!' అనే అపురూపమైన ఘంటసాలవారి భక్తిగీతం. సంగీతరస ప్రధానంగా జనరంజకమైన చిత్రాలకు పెట్టింది పేరు అంజలీ పిక్చర్స్. నటి అంజలీదేవి, ఆమె భర్త సుప్రసిద్ధ సంగీతదర్శకుడు పి.ఆదినారాయణ రావు మంచి అభిరుచి గల చిత్రనిర్మాతలు. ఆ సంస్థ నిర్మించిన మంచి భక్తిరస ప్రధాన చిత్రమే 'భక్త తుకారాం'. శాస్త్రీయ రాగాలమీద మంచి పట్టున్న ఆదినారాయణరావుగారు రాశిపరంగా తక్కువ సినిమా లకే సంగీత దర్శకత్వం వహించినా వాసిలో మాత్రం అగ్రగణ్యులే. ఆదినారాయణరావుగారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో మనసుకు హాయిని, ప్రశాంతిని కలిగించే సుశ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. ఆయన తన సినిమాలలో ఎక్కువగా హిందుస్తానీ శైలిని అనుసరిస్తారని చెపుతారు. అంజలి, ఆదినారాయణరావు చిత్రాలలో ఘంటసాలగారు పాడిన పాటలెన్నో విపరీతమైన జనాదరణ పొందాయి. ఆదినారాయణరావుగారికి, ఘంటసాలగారికి మధ్య మంచి అవగాహన వుండేది. పరస్పర గౌరవ మర్యాదలతో చాలా సన్నిహితంగా వుండేవారు. గాయకుడిగా ఘంటసాలగారికి మంచి స్వేచ్ఛనిచ్చేవారు ఆదినారాయణరావుగారు. ఎంతకాలమైనా ఫర్వాలేదు ఘంటసాలగారే భక్త తుకారాం లోని పాటలు పాడాలని దృఢనిశ్చయంతో ఆదినారాయణ రావుగారు ఆ చిత్రనిర్మాణం సాగించారు. అనారోగ్య కారణాలవలన గొంతు సహకరించక కొన్ని పాటల ట్రాక్ లను రామకృష్ణ చేత పాడించడం, మిక్సింగ్ సమయంలో ఘంటసాలగారు ఆ పాటలను విని అవే పాటలను సినిమాలో వుంచమని చెప్పి నూతన గాయకుని ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది.
భక్త తుకారాం చిత్రం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడుకొని సంగీత, నృత్య సాహిత్యాలు మూడింటికి మంచి ప్రాధాన్యత కల్పించిన చిత్రం. అనుభవజ్ఞులైన నటీనటుల అద్భుత నటనాపాటవంతో భక్త తుకారాం చిత్రం ఉత్తమ విలువలతో రూపొందింది. ఇక సంగీతపరంగా అద్భుత విజయాన్నే సాధించింది. చిత్రంలోని ఇరవైయొక్క పాటలు, పద్యాలు సంగీతాభిమానులను ఎంతగానో అలరించాయి. వాటిని రచించిన దేవులపల్లి, దాశరథి, ఆత్రేయ, సి.నా.రె., వీటూరి అందరూ గీత రచయితలు గా లబ్దప్రతిష్టులే. వీరి కలం బలంతో ప్రతీ పాట, పద్యము ఆణిముత్యాలై భాసిల్లాయి.
ఈ సినిమా లో ఘంటసాలగారు ఐదు పాటలు, నాలుగు పద్యాలు పాడారు. వాటిలో మకుటాయమానంగా నిలచిపోయిన గీతం కృష్ణశాస్త్రిగారు వ్రాసిన నేటి సజీవరాగం - 'ఘనాఘన సుందరా...' కృష్ణశాస్త్రిగారి ఈ గీతంలో పద పటాటోపం కనపడదు. మాటలు సరళంగా, క్లుప్తంగా వుంటాయి. దైవసన్నిధిలో భక్తులు పాటించవలసిన నియమాలు ఈ పాటలో కనిపిస్తాయి. పాండురంగ నామ సంకీర్తనం ద్వారా శరణాగతిని, ఆత్మాశ్రయాన్ని సూచించారు. కవి హృదయగత భావాలను తన గానంతో మూర్తిమంతం చేశారు 'పాండురంగ' నామాన్ని ఉచ్ఛరించిన ప్రతీసారీ మాడ్యులేషన్ లో వైవిధ్యాన్ని చూపించడం ఆయనకే చెల్లు.
తంబురా శ్రుతి
మీద 'హరి ఓం...' అంటూ ఓంకార నాదాన్ని పూరిస్తూ ఘంటసాల చేసిన ఆలాపన ప్రభాత సమయాన్ని, సుందర ప్రకృతిని కళ్ళకు సాక్షాత్కరింపజేసి శ్రోతల
ఒడలు గగుర్పొడిచేలా చేస్తుంది. ఈ పాటలో ఘంటసాలవారి గళం మృదువుగా, గంభీరంగా, ఘనంగా ధ్వనించి అందరిలో భక్తిభావాన్ని ఇనుమడింప జేస్తుంది.
ఈ పాట వాతావరణానికి, సన్నివేశానికి తగినట్లుగా ఈ పాటను స్వరపర్చడానికి ఆదినారాయణరావుగారు 'భూప్' రాగాన్ని ఎన్నుకున్నారు. 'భూప్', లేదా'భూపాలి' ఒక హిందుస్థానీ రాగం.కళ్యాణ్ థాట్ జన్యం. భక్తి రస ప్రధానం. ఈ రాగం ఆరోహణ, అవరోహణాక్రమంలో ఐదే స్వరాలుంటాయి. (మ)ధ్యమ,(ని)షాదాలు వర్జితాలు. ఔఢవజాతి రాగం. దీనికి సమాంతరమైన కర్ణాటక రాగం 'మోహన'. విజ్ఞతతో ఆదినారాయణ రావుగారు 'భూప్' రాగంలో స్వరపరిచిన 'ఘనాఘన సుందరా' గీతం బహు కమనీయం, రమణీయం.
ఈ పాటలో తంబురా, సితార్, షెహనాయ్, హార్ప్, ఫ్లూట్, వైబ్రోఫోన్, వైలిన్స్, సెల్లో, తబలా, డోలక్ మొదలైన వాద్యాలతో atmosphere effect కోసం ఎకో సౌండ్ ను చాలా చక్కగా ఉపయోగించారు.
ఘంటసాల, అక్కినేని, ఒకరిలో ఒకరు
కలసిపోయి 'ఘనాఘన సుందరా' గీతంలో జీవించారు. ప్రాతఃకాల సమయంలో గత కాలం నాటి
పల్లెటూరి వాతావరణాన్ని, ప్రకృతి శోభను పాటలో చక్కగా
చూపించారు.
అంజలీదేవి, కాంచన, నాగభూషణం, తదితర నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చి చిత్ర విజయానికి దోహదం చేశారు. తెరపై కనిపించేది కొద్దిసేపైనా నడిగర్ తిలకాన్నని నిరూపించారు ఛత్రపతి శివాజీ పాత్రధారి శివాజీ గణేశన్. విల్లుపురం చిన్నయ మన్రయార్ గణేశమూర్తి అనే సామాన్య రంగస్థలనటుని ప్రపంచ విఖ్యాత శివాజీ గణేశన్ గా మార్చింది రంగస్థలం మీది ఈ వీరశివాజీ పాత్రే. భక్తి , రక్తితో పాటు సామాజిక స్పృహ కలిగిన 'భక్త తుకారాం' కధను చాలా రసవత్తరంగా తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ వి.మధుసూదనరావుగారికి దక్కుతుంది.
ఆదినారాయణరావుగారి సంగీతం, ఘంటసాలవారి గానం వలన అంజలీవారి ఉత్తమ చిత్రాల కోవలోకి చేరే 'భక్త తుకారం' చిరకాలం గుర్తుండిపోయే చిత్రం.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment