Saturday, 20 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 100వ భాగం - విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభతొమ్మిదవ భాగం ఇక్కడ

100వ సజీవరాగం - విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

చిత్రం - డాక్టర్ బాబు
గానం - ఘంటసాల
రచన - సి.నారాయణ రెడ్డి

సంగీతం - టి.చలపతిరావు

పల్లవి:

విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే

                                                    !విరిసే!

చరణం 1: 

నీ కనుపాపలే వినీల కాంతి దీపాలు

నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు

నీ సొగసే నాదైతే నీ సొగసే నాదైతే

కలకలలాడులే వసంతాలు..

                                                    !విరిసే!

చరణం 2: 

ఎదురుగ నువ్వుంటే ఉదయకాంతులెందుకులే

జతగా నువ్వుంటే జాబిలి ఇంకెందుకులే

నీ వలపే నాదైతే నీ వలపే నాదైతే

ఏ బృందావనాలు ఎందుకులే...

                                                    !విరిసే!

ఓ పాత తెలుగు సినిమాలో హీరోయిన్ (భానుమతి) 'ప్రేమంటే'... అని అడుగుతుంది హీరో (నాగేశ్శర్రావు) ని. దానికి హీరో ఏం చెప్పాడో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు.

'ఆశ అరవైనాళ్ళు-మోహం ముఫ్ఫైనాళ్ళు' అని ఓ సామెత. ప్రేమలో నిజాయితీ గానిగాఢత్వంగాని లేకుండా  కేవలం బాహ్యాకర్షణ వలన కలిగిన వ్యామోహమే ప్రేమగా చెలామణి అవుతోంది ఈ రోజుల్లో, అలాటివారిని ఉద్దేశించిన సామెత. ఎంతో సత్యమున్న సామెత. 'వయసు పిచ్చిది, ప్రేమ గుడ్డిది, మనసొక కళ్ళెం లేని కోర్కెల గుర్రం. పగ్గాలొదిలితే అంతా అస్తవ్యస్తమే. మనస్సు ప్రేరణతో మోహావేశాలకులోనైనప్పుడు  ఏర్పడిన ప్రేమ తాత్కాలికం.  నీటిబుడగలా ఏ క్షణాన్నైనా పేలిపోవచ్చు. అలాకాకుండా, విచక్షణతో తమ తమ వ్యక్తిత్వాలకు భంగం కలుగకుండా ఒకరినొకరు సంపూర్ణంగా అర్ధం చేసుకొని  ఎట్టి పరిస్థితులలోనైనా జీవితాంతం  స్వార్ధరహితంగా, నిష్కల్మషంగా కలసిమెలసి ప్రేమానురాగాలతో జీవనయానం చేస్తామనే దృఢనిశ్చయం కలిగినవారి మధ్య అంకురించిన ప్రేమే  నిజమైన ప్రేమ. అలాటి ప్రేమ మూడు పువ్వులు ఆరుకాయలుగానిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. ముగ్ధమనోహరంగా అరవిరిసిన కన్నుల్లో ఎన్నో ఆశలు, ఊసులుమౌన భాషలు, చెప్పలేనన్ని బాసలు. అవి వలచినవాడి గుండెల్లో రేపే అల్లరులు అన్నీ ఇన్నీకావు. ప్రేయసి చిరునవ్వులే వెన్నెల పారిజాతాలు, ఆమె కనుపాపలే వినీలకాంతి దీపాలు. అటువంటి సుందరి సొగసులే తన సొంతమైతే వసంతమంతా కలకలలాడుతూ తన జీవితమంతా  ప్రకాశిస్తుందని భావించే ఓ నవయువకుని మనోగతమే నేటి మన సజీవరాగం. అదే డాక్టరు బాబు సినీమాలోని డా.సి.నారాయణరెడ్డి గారి భావుకతలో నుండి పుట్టి ఘంటసాలవారి గళం నుండి జాలువారిన మనోజ్ఞ ప్రణయగీతం 'విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే...'

డాక్టర్ బాబు సినిమా కు సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావుగారు. యువతరం మెచ్చే అధునాతన చలాకీ పాటలతో పాటు మనసుకు ఆహ్లాదం కలిగించే మెలోడియస్ గీతాలను స్వరపర్చడంలో కూడా చలపతిరావు గారు ఆరితేరిన దిట్ట. 'విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలేపాటను రూపొందించడానికి ఆయన ఎన్నుకున్న రాగం దర్బారీ కానడ. దర్బారీ కానడ పేరు వినగానే సంగీతాభిమానులందరికీ వెంటనే స్ఫురణకు వచ్చే అద్భుతగీతాలు 'శివశంకరీ; 'నమో భూతనాధా'. రెండూ పెండ్యాల గారివేవిజయావారి కోసం చేసినవి. వేర్వేరు సన్నివేశాలకోసం విభిన్నమైన మూడ్ లో చేసినవి. ఇక్కడ డాక్టరు బాబు సాంఘికం. తాను ప్రేమిస్తున్న మనోహరి నుద్దేశించి కథానాయకుడు ఆలపిస్తున్న ప్రణయగీతం.  రాగం ఒక్కటే కానీ  దానిని పరిపరివిధాలుగా మలచడంలో సంగీతదర్శకుని, గాయకుని ప్రతిభ, మనోధర్మం సుస్పష్టంగా తెలుస్తుంది. దర్బారీ కానడ సున్నితమైన వివిధ మనోభావాలను సుశ్రావ్యంగా వెలిబుచ్చడానికి అనువైన రాగం. 

ఈ రాగం కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలో చాలా ప్రసిధ్ధమైనది. 20వ మేళకర్త నఠభైరవికి జన్యరాగం. వక్ర సంపూర్ణరాగంగా చెపుతారు.కర్ణాటక సంగీతంలో చిరకాలంగా ప్రచారంలో వున్న ఈ దర్బారీ కానడ రాగం 16వ శతాబ్దపు సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మియా తాన్సేన్ ద్వారా ఉత్తర భారతదేశానికి పరిచయం చేయబడింది. ఈ దర్బారీ కానడ రాగంలో ఘంటసాలగారు ఆలపించిన సినిమా గీతాలు ఎన్నో బహుళ జనాదరణ పొందాయి. వాటిలో ఈనాటి 'విరిసే కన్నులలోపాట కూడా గత ఐదు దశాబ్దాలుగా  ఘంటసాల మాస్టారి సజీవరాగంగా సంగీతాభిమానులకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది. ఈ పాట విడియో చూడకుండా ఆడియో విన్నాకూడా మన కళ్ళముందు శోభన్ బాబు మెదులుతారు. అది ఘంటసాలవారి ఘనత. శోభన్ బాబు వాయిస్ మాడ్యులేషన్ ఈ పాటలో స్పష్టంగా వినిపిస్తుంది. చరణాలలో  'నీ సొగసే నాదైతే', అలాగే, 'నీ వలపే నాదైతే' అనే మాటలు రెండుసార్లు రిపీట్ అవుతాయి. అప్పుడు  'నీ' అనే అక్షరం మీద ఘంటసాల మాస్టారు  రెండుసార్లు ఇచ్చిన గమకాలు పాటకి నిండుదనాన్ని, ఎంతో మాధుర్యాన్ని కలిగిస్తుంది. పియోనా వ్యాపింగ్ బిట్ తో పాట మొదలవుతుంది. సితర్, ఫ్లూట్, వైయొలిన్స్, షెహనాయ్, తబలాడోలక్ వంటి వాద్యాలను చలపతిరావు ఉపయోగించుకున్నారు.

పాట మూడ్ కి తగినట్లుగా తెరమీద శోభన్ బాబు, జయలలిత చాలా హుందాగా నటించారు. ఇదే పాట సుశీలగారు పాడగా సినిమా ద్వితీయార్ధంలో  జయలలిత మీద మరోసారి విషాదంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు మనోజ్ కుమార్, మాలాసిన్హా నటించిన 'హిమాలయ్ కె గోద్ మే' అనే హిందీ సినిమా మూలం. అదే సినిమా తమిళంలో ఎమ్.జి.ఆర్జయలలిత జోడీగా 'పుదియబూమి' (తమిళ లిపిలో ఒత్తులుండవు) పేరుతో వచ్చింది. తెలుగులో జయలలిత హీరోయిన్ గా నటించడానికి ఇదో కారణం కావచ్చు. ఈ తమిళ సినీమాను తాపీ చాణక్య డైరక్ట్ చేశారు.

డాక్టరు బాబు సినిమాలో ఘంటసాల మాస్టారు పాడిన రెండు పాటల్లో బహుళ ప్రచారమై ఈనాటికీ అందరిచే పాడబడుతూ సజీవరాగం గా నిలిచింది 'విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే' పాట మాత్రమే.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...