అధ్యాయం - 2 - భాగం 33
లవకుశ - ఒల్లనోరి మామా నీ పిల్లనీ
మన జాతిపిత, మహాత్మా గాంధీజీ కి రఘువంశ శ్రీరాముడన్నా, రామరాజ్యమన్నా చాలా విశ్వాసం. ఆయన తన ఆఖరి క్షణాల్లో కూడా హరే!రామ్! అంటూ రాముడినే తలచుకున్నారు. నవీన భారతదేశం రామరాజ్యంగా తీర్చిదిద్దబడాలని గాంధీజీ ఆకాంక్షించారు.
రామరాజ్యమంటే ఏదో ఒక వర్గానికో, లేక, హిందూమతాన్ని అవలంబించే వారికోసం ఏర్పడిన రాజ్యం మాత్రం కాదు. రామరాజ్యమంటే ధర్మం, నీతి, న్యాయం, సత్యం, అహింసలనే సూత్రాల ఆధారంగా నడిచే ఆదర్శవంతమైన ప్రజాపరిపాలనే రామరాజ్యం. ధనిక వర్గం, పేదవర్గం అనే తేడాలేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన నీతి, న్యాయం, సుఖసంతోషాలతో హాయిగా జీవించడానికి సమాన అవకాశాలు కల్పించడమే రామరాజ్య లక్ష్యం. క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన జీవనమే ఆర్ష ధర్మ లక్షణమని పెద్దలు చెపుతారు. ధర్మదేవత ఒకప్పుడు నాలుగు పాదాలమీద నడిచేదట. ఆ నాలుగు పాదాలు ఏవంటే... సత్యము, శౌచము, దయ, తపస్సు. ఎప్పుడైతే కలియుగం ప్రారంభమైనదో అప్పటినుంచి ప్రజలలో దౌష్ట్యం, హింస పెచ్చు పెరిగి శౌచము, దయ, తపోనిష్ట అనే లక్షణాలు క్రమక్రమంగా మాయమై ధర్మదేవత ఒంటికాలిపై కుంటినడకలు నడుస్తున్నది.
యుగ యుగానికి కాలమాన పరిస్థితుల ప్రకారం ధర్మం నిర్దేశించ బడుతుంది. ఆ యుగ ధర్మానుసారం ప్రజలు తమ జీవనాన్ని క్రమబద్ధంగా న్యాయమైన రీతిలో కొనసాగించాలి. నిందలకు, అపఖ్యాతులకు ఎంతటివారైనా తలొగ్గక తప్పదు. ముల్లోకాలలో పురుషోత్తముడిగా, ధర్మనిరతితో ప్రజారంజకముగా పరిపాలన సాగించే ఆదర్శమూర్తిగా పేరుగాంచిన శ్రీరాముడు సైతం అభియోగాలు, అపనిందలకు బలియైనాడు. అది తన సాటి మహారాజుల వలనో లేక సర్వజ్ఞులైన ఋషుల వల్లనో కాదు. కేవలం ఒక అవివేకి, సంస్కారహీనుడు వ్యక్తిగత నిందలకు పాల్పడడంతో శ్రీరాముడి సంసార జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. అల్పుడైన ఒక తాగుబోతు చాకలి సీతామాత సౌశీల్యాన్ని శంకిస్తూ మత్తులో పలికిన మాటలను శ్రీరాముడు జనవాక్యంగా భావించి న్యాయ పరిరక్షణ కోసం తన భార్య, గర్భవతియైన సీతాసాధ్విని ఒంటరిగా అడవుల్లో వదిలిపెట్టించాడు.
విద్యావిహీనుడు, కుసంస్కారియైన చాకలి
తిప్పడు ఉత్తర రామాయణంలో ప్రధాన పాత్రధారి. సీతారాముల వియోగానికి మూల కారకుడు. వాల్మీకి రామాయణంలోని
ఉత్తరకాండ గాధను ఏడవ శతాబ్దపు కవి భవభూతి సంస్కృతంలో, తర్వాత తిక్కన నిర్వచనోత్తర రామాయణంగా, 18వ శతాబ్దపు కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని
(చంపూకావ్యం) గా రచించారు. చంపూకావ్యమంటే పద్యము, గద్యము రెండూ మిళితమైవున్న కావ్యం. నెల్లూరి సీమకు చెందిన పాపరాజు గారు తన ఉత్తర
రామాయణం కావ్యాన్ని తన ఇష్టదైవమైన మదనగోపాల స్వామివారికి అంకితం చేశారట.
చేమకూర వెంకటకవి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన కవి కంకంటి పాపరాజు. ఆయన వ్రాసిన ఉత్తర రామాయణం పద్య-గద్య కావ్యం ఆధారంగా ప్రముఖ సినీకవి వెంపటి సదాశివబ్రహ్మం గారు తయారు చేసిన కధను లలితా శివజ్యోతి ఫిలింస్ ఎ.శంకరరెడ్డి 'లవకుశ' రంగుల సినిమాగా నిర్మించి 1963 లో విడుదల చేశారు.
లవకుశుల కథలో ప్రతినాయకుడు, కీలకపాత్రధారి అని చెప్పుకోదగ్గ చాకలి తిప్పడి దుష్ప్రేలాపనల గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం. అదే... 'ఒల్లనోరి మామా నీ పిల్లని.....'
ఘంటసాల:
ఒల్లనోరి మామా నీ పిల్లని
నేనొల్లనోరి మామా నీ పిల్లని అబ్బా నీ పిల్ల
దీని మాటలెల్ల కల్ల సంసారమంత గుల్ల ! నేనోల్లనోరి!
జిక్కి:
నన్నొల్లనంతవెందుకు మామయ్య...
నా వల్ల నేరమేమిర అయ్యయ్యో...
దెయ్యాన్ని కోడుదునా దేవతనే కోడుదునా
నూతిలోన పడుదునా గోతిలోన పడుదునా
ఘం.
హె...య్య! చమతకారి నాయాలా ఊరుకో
సూరిగాడి ఇంటికాడ చూడలేదటే నిన్ను
మారుమాటలాడతావ మాయదారి గుంట
నిన్ను సూస్తె వొళ్లుమంట నేనోల్లనోరి మావా నీ పిల్లని
రాఘవులు:
నా మాటిన్రా బాబు అయిందానికి అల్లరెందుకల్లుడా
ఓరల్లుడ మేనల్లుడ మా అప్పగోరి పిల్లడా ! అయిందానికి!
మీ తప్ప మొగం చూడర మా అమ్మిని కాపాడరా
ఘం.
నేనోల్లనోరి మావా నీపిల్లని
రాణీ :
చూడు తప్పేమీ జేసింది తమ్ముడా ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా తప్పతాగి
వున్నావు సెప్పుడు మాటిన్నావు_2
అప్పడగబోయింది అదీ ఒక తప్పా... ఏరా అప్పడగబోయింది అదీ ఒక తప్పా
ఘం.
అప్పా ఓలప్పా నీ మాటలు నేనొప్పా ఇకచాలును నీ గొప్పా
నా అలి గుణము ఎరుగన నేనేలుకోను తీసుకు పో !ఒల్లనోరి!
జి.
నీ తాగుబోతు మాటలింక మానరా
నేసత్యమైన ఇల్లాలిని చూడరా
నే నగ్గి ముట్టుకుంటా అరిసేత బట్టుకుంటా
తలమీద పెట్టుకుంటా
ఛె..య్య్... యెర్రిరాముడంటివోణ్ణి కాదులే నేను యెర్రి రాముడంటి
వోణ్ణి కాదులే గొప్ప శౌర్యమున్న ఇంట బుట్టినానులే .. చూడు
అగ్గిలోనబడ్డ నువ్వు బుగ్గిలోనబడ్డ పరాయింట ఉన్నదాన్ని పంచచేరనిస్తానా
వల్లనోలే పిల్లా ఇంకెల్లీపో..ఫో.. -2
ఫో.. ఫోయే ఫోయే... నీ యాల
"...సూరిగాడి యింటికాడ చూడలేదటే నిన్ను... మాయదారి గుంట... అగ్గిలోనబడ్డ నువ్వు బుగ్గిలోనబడ్డ పరాయింట ఉన్నదాన్ని పంచ చేరనిస్తానా... నేనేం యెర్రి రాముడంటివోణ్ణి కాదులే ... గొప్ప శౌర్యమున్న యింట బుట్టినానులే ... ఒల్లనోరి మామా నీ పిల్లని..." పరనింద, ఆత్మస్తుతి, పెళ్ళాం శీలాన్ని శంకించి దుర్భాషలాడడం ఈ పాటలోని ప్రధానాంశం. సంస్కారం, ఔచిత్యం ఎరుగని మనుషులు ఎలా రచ్చకెక్కి తమ పరువు కుటుంబపరువునే కాక తమకు సంబంధంలేని ఇతరులను కూడా అవమానపరుస్తారో చాలా సహజంగా మాండలీక భాషలో తెలియజెప్పారు కవి సదాశివ బ్రహ్మంగారు. ఈ పాటంతా ప్రాస పదాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయి.
రావణ వధానంతరం సీతాదేవి రాముడిని చేరడానికి ముందు అగ్నిప్రాయోపవేశంజేసి తన సౌశీల్యాన్ని నిరూపించుకున్న విషయాన్ని కూడా కవి నర్మగర్భంగా ఈ పాటలో ప్రకటించారు. లవకుశుల కథకే కీలకమైన ఈ పాటను సదాశివ బ్రహ్మంగారు చాలా రసవత్తరంగా వ్రాశారు.
గీత రచన ఉత్తమంగా వుంటే స్వర రచన కూడా ఉన్నతంగా వుంటుందని లవకుశ సినిమా సంగీతదర్శకుడు ఘంటసాల నిరూపించారు. వివేకం, విచక్షణ లేని కుటుంబాల్లోని దెబ్బలాటలు ఏరీతిలో వుంటాయో అద్భుతంగా ఈ పాటలో పాడి చూపించారు ఘంటసాల, జిక్కి, రాఘవులు, రాణీలు. మరి, యాదృచ్ఛికమా లేక ఘంటసాలగారు కావాలనే చేశారో మనకు తెలియదు కానీ, జానపద శైలిలో సాగే ఈ పాటలో ఏ రాగలక్షణాలు స్పష్టంగా కనపడవు. చాకలి తిప్పడు లాంటి తాగుబోతు రాగయుక్తంగా పాడగలడని మనం మాత్రం ఎలా అనుకుంటాము? సన్నివేశానికి, సందర్భానికి తగినట్లుగా మంచి రసస్ఫూర్తిగల పాటనే మనకు అందించారు ఘంటసాల. లవకుశ సంగీతం గురించి తలచుకున్నప్పుడల్లా ఈ 'ఒల్లనోరి మామా నీ పిల్లని...' పాట కూడా తప్పక గుర్తుకువస్తుంది.
ఘంటసాల గాత్ర వైవిధ్యానికి ఒక మచ్చుతునక. మాస్టారు ఈ పాటలో మేండొలిన్, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్ ,
తబలా, డోలక్, జముకు వంటి వాద్యాలను జానపద సంగీత రీతిలో ఉపయోగించారు.
గత నాలుగైదు వారాల ఘంటసాల సజీవరాగాలను జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎంతటి విలక్షణ
(versatile) గాయకుడో, సంగీతదర్శకుడో అర్ధమవుతుంది.
'ఒల్లనోరి మామా నీ పిల్లని' పాట ఎంతో జనాదరణ పొంది ఈనాటికి సజీవమైన నిలిచి వుండడానికి కారణం ఘంటసాల గారి గానం, సంగీతం ఒక ఎత్తైతే, ఆ సన్నివేశంలో నటించిన రేలంగి, గిరిజ, శివరామకృష్ణయ్య, అన్నపూర్ణల సహజ నటన మరో ఎత్తు. గత తరంలో గ్రామ ప్రాంతాల్లోని సామాన్య ప్రజానీకంలో వుండే భావోద్వేగాలు, వారిలో రేగే కుటుంబ కలహాలను రేలంగి, గిరిజ, శివరామకృష్ణయ్య చాలా సహజంగా నటించి చూపారు.
ఏ సినీమాలోనైనా ఏ సన్నివేశమైనా రక్తి కట్టాలంటే సంబంధిత కళాకారులు, సాంకేతిక నిపుణులు పాత్రల స్వభావాన్ని అర్ధం చేసుకుని తగిన ఔచిత్యాన్ని కనపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. రసరమ్య సంగీత కావ్యం లవకుశ. ఘంటసాల వారి అపూర్వ సంగీత సృష్టి లవకుశ సంగీతం. నవరస సమన్వితము. నవరత్నోజ్జ్వల కాంతివంతము లవకుశ సంగీతప్రభ. ధన్యంబాయె తెనుగు రసజ్ఞ హృదయంబుల్.
లవకుశ సినిమాలో వున్నన్ని శ్లోకాలు, పద్యాలు, పాటలు మరే ఇతర సినిమాలోనూ అంతవరకు రాలేదు. ఈసినిమాలో 21 అనుశ్రుతంగా వస్తున్న సంప్రదాయం శ్లోకాలు, కంకంటి పాపారాజు, దువ్వూరి రామిరెడ్డి, సదాశివబ్రహ్మం పద్యాలు; సీనియర్ సముద్రాల గారు, సదాశివ బ్రహ్మంగారు, కొసరాజు గారు వ్రాసిన 18 పాటలు, వాటికి అమర్చబడిన సంగీతం లవకుశకు మణిమకుటం. లవకుశ లో మాటలు ప్రభావం కన్నా పాటలో ప్రభావమే మిన్న.
లీల, సుశీల సంగీత ప్రజ్ఞకు పెను
పరీక్ష లవకుశ రామాయణ గీతాలు. పోటాపోటీగా గానం చేసి విజయం సాధించారీ గాయనీ మణులు.
ఘంటసాలగారితో పాటు, జిక్కి, జానకి, రాణి, కోమల, ఎస్.వరలక్ష్మి, ఉడుత సరోజిని, మాధవపెద్ది, మల్లిక్, జె.వి.రాఘవులు, సౌమిత్రి, లవకుశ
పాటలకు జీవం పోసారు. ఇందులోని ప్రతీ పాటా, పద్యం, శ్లోకం అన్నీ ఈనాటికి ఏనాటికీ ఆణిముత్యాలే.
శ్రీరాముడిగా నటించిన ఎన్.టి.రామారావుకు, సీతాదేవిగా నటించిన అంజలీదేవికి ప్రేక్షకుల మనస్సుల్లో ఒక ప్రత్యేక స్థాయిని ఏర్పరచిన సినిమా లవకుశ. లక్ష్మణుడు కాంతారావుకు కేంద్రప్రభుత్వ జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన సినిమా లవకుశ. శ్రీమద్రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షి అంటే నాగయ్యేనని చాటిచెప్పిన సినిమా లవకుశ. బాల నటులు నాగరాజు, సుబ్రహ్మణ్యం లను ఈనాటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని ఆదరించి అభిమానిస్తున్నారంటే అందుకు కారణం లవకుశ సినిమాయే. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులంతా కూడా తమ తమ పాత్రల్లో చాలా సహజంగా ఒదిగిపోయేలా చేసిన ఘనత లవకుశ దర్శకులు సి.పుల్లయ్య, సి.ఎస్.రావుగార్లదే.
కళాత్మకమైన భారీసెట్లకు, మునివాటికలకు అత్యుత్తమమైన రూపకల్పన చేసిన ఆర్ట్ డైరెక్టర్ టి.వి.ఎస్.శర్మగారి పనితనం, దానిని మరింత అద్భుతంగా కన్నులుపండువగా రంగుల్లో తెరకెక్కించిన కెమేరామెన్ పి.ఎల్.రాయ్ ప్రజ్ఞపాటవాలు లవకుశను ఒక మరపురాని కళాఖండంగా తీర్చిదిద్దాయి.
1934లో ఈస్టిండియా కంపెనీ వారు పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని లతో మొదటిసారిగా లవకుశ సినిమా ను తీసారు. ఆ సినిమా కు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యగారే ఈ కొత్త లవకుశ కు మొదటి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో సంయుక్తంగా ప్రారంభమైన లవకుశ నిర్మాణ కాలంలో ఏర్పడిన ఆర్ధిక సమస్యల వలన సినిమా పూర్తికావడానికి ఆరేళ్ళు పట్టిన మాట నిజం. ఈలోగా పుల్లయ్య గారు అనారోగ్యపాలవడం వలన ఆయన స్థానే ఆయన కుమారుడు సి.ఎస్.రావుగారు మిగిలిన సినిమాను పూర్తిచేశారు. అలాగే, తమిళ చిత్రం పంపిణీదారులు లేవనెత్తిన ప్రాంతీయ వాదం సమస్యల వలన సగం పాటలు స్వరపరిచిన తర్వాత తమిళ లవకుశ సంగీత దర్శకుడిగా ఘంటసాలగారి స్థానే కె.వి.మహదేవన్ గారిని నియమించడం జరిగింది. ఆర్ధిక లావాదేవీలు వలన నిర్మాత ఎ.శంకరరెడ్డి అనేక కోర్ట్ కేసులను ఎదుర్కొన్నారు.
లవకుశ అపూర్వ సంగీతానికి నిర్మాణ జాప్యం ఒక కారణమనే భావన చాలామందిలో వుంది. అది అంత సమంజసంగా నాకు తోచదు. నాకు తెలిసి ఘంటసాలగారు కూడా ఎప్పుడూ ఆ విధమైన భావాన్ని వ్యక్తం చేయలేదు. తాను, ఆచార్యులవారు కలిసి కూర్చొని ఒకటికి పదిసార్లు సావకాశంగా ఆలోచించుకుని లవకుశలోని రామాయణాలను మనసుకు తృప్తి కలిగేలా రూపొందించామని రేడియో ఇంటర్వ్యూ లో చెప్పారు.
కాలాతీత నిర్మాణం వలన ముఖ్య నటీనటుల, బాలనటుల వయసులోని మార్పులు సినిమా లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా ప్రేక్షకులు అదొక లోపంగా భావించకుండా కథాకధనంలో, ఆద్యంతం వీనులకు విందు చేసే దివ్య సంగీతంలో తాదాత్మ్యం చెందారు.
లవకుశ సంచలన విజయం తెలుగు సినీరంగాన ఒక గొప్ప చరిత్ర. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు వసూళ్ళు అంతంతమాత్రమే. సినిమా ఫెయిలయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అనూహ్యంగా మూడవ వారం నుండి వసూళ్ళు పుంజుకుని విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయదుందుభులు మ్రోగించింది. తెలుగులో 500 రోజులు ఆడిన మొదటి సినిమాగా, ఎన్నో థియేటర్లలో రజతోత్సవాలు, శతదినోత్సవాలు జరుపుకున్న మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. తెలుగు లవకుశ ఇతరభాషలలో డబ్ చేయగా అక్కడ కూడా రజతోత్సవ, శతదినోత్సవ సినిమాగా నమోదు కావడం అపూర్వ విషయం.
లవకుశ అపూర్వ ఆర్ధిక విజయం నిర్మాత ఎ శంకరరెడ్డి గారికి ఏమాత్రం ఉపయోగించలేదు. ఆ సినిమా నెగెటివ్ రైట్స్ ను కొనుగోలు చేసిన సుందర్లాల్ నహతాగారికి కనకవర్షం కురిపించింది. ఏ నిముసానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు. విధివిలాసాన్ని ఎవరూ తప్పించలేరు.
'రాకోయీ అనుకోని అతిథి...' అని అనుకునేలా లవకుశ సినిమా వీక్షకుల తాకిడికి మేము గురయ్యాము. మా బొబ్బిలిలో
ఈ సినిమా ఆడినంతకాలం రోజూ చుట్టుపక్కల గ్రామాల్లోని చుట్టాలు, స్నేహితులు కుటుంబ సమేతంగా సినిమా చూడ్డానికి వచ్చి
రాత్రి తిరిగి వాళ్ళ ఊళ్ళకు వెళ్ళే అవకాశం
లేక మా చిన్ని ఆశ్రమం(పురిల్లు)లోనే నిద్ర చేసి ఉదయం లేచి వారి వూళ్ళకు
వెళ్ళేవారు. కేవలం నిద్రతో సరిపోదు కదా, గృహస్తు కనీసం మర్యాదలు తప్పనిసరి. అలా చుట్టాలు, సన్నిహితులు లేని పరాయి గ్రామ వీక్షకులు కుటుంబాలతో సహా ఎడ్లబళ్ళలో తరలివచ్చి
లవకుశ రెండాటలు చూసి సినిమా హాలు సమీపంలో ఆరుబయట చెట్లక్రింద బళ్ళల్లో, బళ్ళ క్రింద ఎండుగడ్డి, చాపలు పరుచుకుని నిద్రపోవడం నాకెంతో వింతగా,
ఆశ్చర్యంగా అనిపించేది.
వచ్చేవారం, మరల, ఘంటసాల వారి మరో సజీవరాగంతో కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment