Saturday, 29 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 36వ భాగం - కరుణా జూడవయా వరమూ జూపవయా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఐదవ భాగం ఇక్కడ  

36వ సజీవరాగం - కరుణా జూడవయా వరమూ జూపవయా
చిత్రం - దీపావళి
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల

కరుణా జూడవయా వరమూ జూపవయా మురళీ మోహన వినీల మేఘ శ్యామా..." (  2 భాగాలు)

పల్లవి:
కరుణా జూడవయా పరమూ జూపవయా
మురళీ మోహనా వినీల మేఘశ్యామా...

అలుకా మానవయా జాలీ పూనవయా
నరకాధీశ్వరా త్రిలోకజీవపాలా ... అలుకా ...

చరణం:
మృతికీ భీతిలని భుజబలసారము
అదికి కుండలముల దోచుకొనే బీరమూ
కలిగెను నీకీ జగతీ భళాభళీ ... అలుకా మానవయా ...

(స్వరకల్పన) ... అలుకా మానవయా ...

కరుణా జూడవయా పరమూ జూపవయా
మురళీ మోహనా వినీల మేఘశ్యామా...


చరణం:
మనసూ నీపయినా మరలిన చాలుగా
పులులే జింకలయీ లెంకలుగా మారుగా
నిరుపమ లీలా నిలయా దయామయా ... కరుణా ...

మదిలో నీ స్మరణ సలిపిన హాయిగా
బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా
త్రిభువన పావనా చరణా సనతానా

బృందం - రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ
కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ 
రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ
రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ ... నోర్ముయ్ ...

ఘంటసాల మాస్టారిలో వున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు, నటనాపటిమకు దర్పణం పట్టే ఈ పాట సదా నా మదిలో మెదులుతూనే వుంటుంది.

1960 లో విడుదలైన " దీపావళి" చిత్రంలోనిది ఈ పాట.  ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, కాంతారావు, గుమ్మడి, రమణారెడ్డి, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, వంటి అగ్రనటుల నటనా వైదుష్యం ఈ చిత్రంలో అణువణువునా కనిపిస్తుంది. రజనీకాంత్ సబ్నవీస్ దర్శకత్వంలో అశ్వరాజ్ ప్రొడక్షన్స్ కె.గోపాలరావు నిర్మించిన మంచి పౌరాణిక చిత్రం. మాయాబజార్, వినాయకచవితి సినీమాల తర్వాత ఎన్.టి.రామారావు మూడవసారి కృష్ణుడిగా తన నటకౌశలాన్ని సమగ్రంగా చూపించిన చిత్రం దీపావళి.

పౌరాణిక సినీమాలంటేనే పాటలకు, పద్యాలకు పెట్టింది పేరు. అందులోనూ ఘంటసాలవారి సంగీతమంటే తప్పక సుశ్రావ్యమైన సంగీతానికి కొదవేముంటుంది.  ఇందులో ఎ.పి.కోమల  " సరియా మాతో సమరాన నిలువగలడా" అని సత్యభామ సావిత్రికి పాడిన పాట ఎన్నటికీ వన్నె తరగని రత్నమే. దీపావళి చిత్రంలోని  సుమారు పదిహేను పాటలు, పది పద్యాలు సంగీతాభిమానుల వీనులకు విందునే చేసాయి.  ఈ సినీమాలో పద్యాలు, పాటలు అన్నింటినీ సముద్రాల పెద్దాయనే వ్రాసారు. 

ఈ పాట మొదటిభాగంలో  నరకాసురుని ఉద్దేశించి -
"నరకాధీశ్వరా త్రిలోకజీవపాలా" ;
"మృతికి భీతిలని భుజబలసారము";
అదితి కుండలముల దోచుకునే బీరము" అనే మాటలు, 

రెండవ భాగంలో కృష్ణుని పరంగా -
"పులులే జింకలయీ లెంకలుగా
మారురా( లెంకలు అంటే సేవకులు);
"నిరుపమలీలా నిలయా దయామయా";
"త్రిభువన పావనా చరణా సనాతనా" ;
వంటి పద ప్రయోగాలు సముద్రాలవారి రచనా చాతుర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి.

నేటి సజీవరాగమైన "కరుణా జూడవయా వరమూ జూపవయా" గీతం , సాహిత్యంలో స్వల్ప మార్పులతో  సినీమాలో రెండుసార్లు వస్తుంది.  ఈ రెండు సన్నివేశాలలో నారదుడిగా కాంతారావు హాస్యరసాన్ని అద్భుతంగా పండించారు. కాంతారావు, ఘంటసాల మాస్టారి మధ్య అపారమైన అవగాహన వుందని ఈ పాట చెప్పకనే చెపుతుంది. కాంతారావు గారి హావభావాలను, నటనా శైలిని ముందే ఊహించి అందుకు తగ్గట్లు ఈ పాటలో తానే నటించి చూపారు ఘంటసాల.

దీపావళి సినీమాలో చక్కని వినోదాన్ని , హాస్యాన్ని  పంచిపెట్టిన పాట ఇది. మొదటి భాగంలో  ఎస్.వి.రంగారావు, కాంతారావుగార్ల ఏక్షన్ - రియాక్షన్ లు, రెండవ భాగంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రమణారెడ్డిల పరస్పర హావభావాలను ముందుగానే ఊహించుకొని తనలో తాను నటిస్తూ ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చారనిపిస్తుంది. మాస్టారు, కాంతారావుల మధ్య perfect synchronization ఈ పాటలో సుస్పష్టంగా కనిపిస్తుంది.

ఈ  సంగీతభరిత హాస్యగీతాన్ని మలచడానికి ఘంటసాల మాస్టారు హిందోళరాగాన్ని తీసుకున్నారు. హిందోళం ఐదు స్వరాలు మాత్రమే కలిగిన జన్యరాగం. ఈ రాగం నటభైరవి, మరియు, హనుమతోడి రాగాల జన్యంగా భావించబడుతున్నది. ఈ రెండు రాగాలలోని రిషభ, పంచమ స్వరాలు తీసేసి పాడితే హిందోళమే అవుతుందని శాస్త్రకారుల ఉవాచ. కర్నాటక సంగీతంలోని హిందోళ రాగం హిందుస్థానీ శైలిలో మాల్కౌంస్ రాగానికి సమాంతరం. 

ఘంటసాల మాస్టారు  అన్యస్వరాలు చేర్చి హిందోళరాగానికి ఒక సరికొత్త మాధుర్యాన్ని తీసుకువచ్చారు. అలాటి పాటల కోవకే " కరుణా జూడవయా" పాట  చేరుతుంది. ఈ పాటలో ఘంటసాల మాస్టారు చేసిన స్వరసంచారం, స్వరకల్పనలు, పక్కపక్క గమకాలు స్వరకర్తగా, గాయకుడిగా ఘంటసాలవారి విద్వత్  ను, రసస్ఫూర్తిని,   ప్రతిభను చాటి చెపుతాయి.  గాత్రాన్ని అనుసరిస్తూ వీణ, ఫ్లూట్,  వయొలిన్స్, క్లారినెట్, తబలా వంటి వాద్యాలు ఈ పాటకు నిండుదనాన్ని చేకూర్చాయి. 

దీపావళి సినీమా డివిడి రూపంలో మార్చేటప్పుడు టైటిల్స్ లో సంగీత దర్శకుడిగా ఘంటసాలవారి పేరు మిస్సయింది. ఎలా  ఆ పొరపాటు జరిగిందో తెలియదు.  ఒరిజినల్ సినీమా  ప్రింట్ లో సహాయకులు కార్డ్ లో సంగీతం - సంగీతరావు అని వుంటుంది. దానిని చూసి ఓ ప్రముఖ టివి ఛానల్ వారు దీపావళి సినీమాలోని పాటలను ప్రసారం చేసేటప్పుడు సంగీతం సంగీతరావు అని క్రెడిట్స్ లో చూపించేవారు. ఈ పొరపాటు చాలా కాలం కొనసాగింది. 

దీపావళి సినీమా అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   


Saturday, 22 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 35వ భాగం - శ్యామలా దండకం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై నాలుగవ భాగం ఇక్కడ  

35వ సజీవరాగం - శ్యామలా దండకం
చిత్రం - మహాకవి కాళిదాసు
గానం - ఘంటసాల 
సంగీతం - పి.సూరిబాబు/పెండ్యాల

శ్లోకం : 
మాణిక్యవీణా ముఫలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి

శ్లోకం :
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే జగదేకమాతః..... 2

శ్లోకం:
మాతా మరకతశ్యామా మాతంగీ
మధుశాలినీ కుర్యాత్కటాక్షం కళ్యాణీ
కదంబ వనవాసినీ 

జయ మాతంగ తనయే 
జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే
జయ లీలాశుక ప్రియే....

దండకం :
జై జననీ ! 
సుధా సముద్రాంత
రుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ
మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీత సంభావనా
సంభ్రమాలోల నీపస్రగాబధ్ధ
చూళీసనాధత్రికే సానుమత్పుత్రికే
శేఖరీభూత శీతాంసు రేఖా మయూఖావళీ నధ్ధ సుస్నిగ్ధ నీలాలక
శ్రేణి శృంగారితే లోక సంభావితే
కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా
పుష్ప సందేహ కృఛ్ఛారు గోరోచనా
పంక కేళీ లలాభిరామే సురామే రమే
సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే 
సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మకే
సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే
సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
జగన్మాతృకే....
పాహిమాం... పాహిమాం.. పాహిమాం!
       

సుప్రసిద్ధ  పౌరాణిక రంగస్థల, సినీ నటుడు, శ్రీ పువ్వుల సూరిబాబు,  నటి శ్రీమతి శ్రీరంజనిగారి భర్త అయిన కె.నాగుమణిగారితో కలసి నిర్మించిన చిత్రం "మహాకవి కాళిదాసు". అంతే కాదు, ఈ చిత్రంలోని శ్లోకాలు, పద్యాలకు సంగీతం సమకూర్చింది పి.సూరిబాబేగారే. పాటలకు వరసలు కూర్చి, రీరికార్డింగ్ ను సమకూర్చినవారు పెండ్యాలగారు. ఈ యిద్దరు ప్రముఖ కళాకారుల మేలు కలయికలో మహాకవి కాళిదాసు చిత్ర సంగీతం అపూర్వము, అపురూపము అయింది.  ఆ చిత్రం ద్వారా తెలుగునాట అజరామరంగా నిలిచిపోయిన శ్యామలా దండకమే నేటి 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం.

ఈ శ్యామలా దండకం కాళిదాస కవి విరచితం. 'కుమారసంభవం', 'రఘువంశం' అనే కావ్యాలను, 'అభిజ్ఞాన శాకుంతలం', 'మాళవికాగ్నిమిత్రం', 'విక్రమోర్వశీయం', అనే నాటకాలను  'మేఘదూతం' అనే ఖండకావ్యాన్ని కూడా సంస్కృతంలో వ్రాసినట్లు ప్రచారంలో వుంది.  అయితే కాళిదాస కవి జీవితకాలానికి, ప్రాంతానికి సంబంధించిన విషయాలు వేటికీ ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. కాళిదాసు జీవితాకాలం వివాదాస్పదంగానే వుంది. కాళిదాసు  విక్రమాదిత్యునికి సమకాలికుడని చెప్పుకోవడం వుంది. అయితే విక్రమాదిత్యులు పేరుతో ఎంతోమంది రాజులున్నారని కూడా చెప్పబడుతున్నది. రెండవ చంద్రగుప్తుని కాలంనాటి వాడని మరో వాదన. ఇది ఇలావుండగా 13- 14 శతాబ్దాలకు చెందిన భోజరాజు ఆస్థానకవి కాళిదాసుగా మరొక ప్రచారం వుంది. పై కావ్యాలలన్నీ ఒకే కాళిదాసు కవి వ్రాసినవి కావని ఆ పేరుతోనే మరో ముగ్గురు నలుగురు సంస్కృత కవులు వుండేవారని కూడా తెలుస్తున్నది. కాళిదాసు వ్రాసిన కావ్యాలలోని వర్ణనలు ఆధారంగా ఆయన హిమాలయాల ప్రాంతంవాడని, ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడని పలు అభిప్రాయాలు ప్రచారంలో వున్నాయి.

అటువంటి కాళిదాస కవిని మహాకవి కాళిదాసుగా తెలుగువారి కవిగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం  ఈ కథా రచయిత పింగళి నాగేంద్రరావుగారికి, డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావుగారికి , కాళిదాసుగా అద్వితీయంగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారికి మాత్రమే దక్కుతుంది.

1974ల వరకూ ఏదైనా తెలుగు సినీమా సంగీతపరంగా  విజయవంతమైనదంటే అందులో ఘంటసాలవారి పాత్ర కూడా ఎంతో కొంత తప్పక వుండేదనే చెప్పాలి. 1960లో వచ్చిన యీ మహాకవి కాళిదాసు తెలుగువారందరికీ మరింత ఆత్మీయుడు కావడానికి కారణం ఈ చిత్రంలోని ఘంటసాలవారి గానమే అంటే సత్యదూరం కాదు. ఆదిలో వెర్రి వెంగళాయిలా వుండే కాలుడు పాడిన లోల్లాయి పదాలైనా, కాళికామాత అనుగ్రహంతో సకలశాస్త్రా పారంగతుడైన కళిదాసు ఆలపించిన సమాసభూయిష్టమైన దండకాలు, శ్లోకాలైనా అవి ఘంటసాలవారి గళంలో జీవాన్ని, చిరంజీవత్వాన్ని సంతరించుకున్నాయి. ఈ  సినీమాలో ఘంటసాలవారి  గాత్రం, సంగీత విద్వత్ వారిని శిఖరాగ్రాలకు చేర్చింది. మాస్టారు గానం చేసిన శ్యామలా దండకం నిత్యనూతనం. అజరామరం. ఈ దండకం గానం చేయడంలో మాస్టారికి భాషపట్ల గల శ్రధ్ధాభక్తులు, ఆవేశం, భావోద్వేగం, గాన ప్రతిభ అనన్యసామాన్యం. 

మాస్టర్ గారిని అనుకరిస్తూ వేదికలమీద అనేకమంది గాయకులు యీ శ్యామలా దండకాన్ని  గానం చేయడానికి ఆసక్తిచూపుతూంటారు. ఇది గాయకులందరికీ పెను సవాలు. ఈ శ్యామలా దండకం పాడినప్పుడు ఘంటసాలవారి కంఠంలోని తీవ్రత, భావోద్వేగం, శృతిశుధ్ధి, గమకశుధ్ధి, రాగాలపట్ల గల సంపూర్ణ అవగాహన అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. భగవద్దత్తమైన గాత్రం, విద్వత్తు వారి సొత్తు.

ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు పి.సూరిబాబు, సుప్రసిధ్ధ సంగీత దర్శకుడు పెండ్యాల సమ్మేళనంలో రూపొందిన ఈ శ్యామలా దండకంలోని మొదటి శ్లోకాలను 
వరసగా కళ్యాణి, కేదారగౌళ, కళ్యాణి, శంకరాభరణం రాగాలలోను చివరి దండకాన్ని కళ్యాణి, కానడ, పంతువరాళి, మధ్యమావతి రాగాలలో అత్యద్భుతంగా స్వరపరచేరు . ఈ రాగాలన్నీ కర్నాటక సంగీతంలోని సుప్రసిధ్ధ రాగాలే. 

రికార్డింగ్ సమయంలో శ్లోకాలను, దండకాన్ని విడివిడిగా రికార్డు చేద్దామని సంగీత దర్శకుడు పెండ్యాలగారు సూచించినా, వద్దని పట్టుబట్టి మొత్తం నాలుగు నిముషాల శ్లోకాలు, దండకం ఒకే స్ఫూర్తితో పాడేస్తానని ఘంటసాల మాస్టారు మైక్ ముందుకు వెళ్ళారట. ఆ సమయంలో  ఘంటసాలగారిలో ఏ దైవం ఆవహించిందో,  మాస్టారిలోని ఆవేశాన్ని, ఉద్వేగాన్ని చూసి తాను నిశ్చేష్టుడినై అలా వుండిపోయానని, అదొక అద్భుత సన్నివేశమని, ఆనందంతో పులకించిపోయి, మైమరపుతో ఘంటసాలవారిని కౌగిలించుకొన్నానని పెండ్యాలగారు తన ఇంటర్వ్యూలలో  చెప్పేవారు.

ఈ చిత్రం ముందు కన్నడంలో, ఆ తర్వాత తమిళంలో వేరే నటులు, గాయకులతో నిర్మించబడినా తెలుగువారి కాళిదాసుకు సాటిరాలేదనే నా భావన.

1959 లో ఈ శ్యామలా దండకం రికార్డింగ్ అయిన రోజులలోనే ఘంటసాలవారి పెద్ద కుమార్తె జన్మించడం, తర్వాత  అమ్మవారి పేరు మీద శ్యామల అని నామకరణం చేయడం జరిగింది.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

Saturday, 15 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 34వ భాగం - వాతాపి గణపతిం భజే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై మూడవ భాగం ఇక్కడ  

34వ సజీవరాగం - వాతాపి గణపతిం భజే
చిత్రం - వినాయకచవితి
గానం - ఘంటసాల 
సంగీతం - ఘంటసాల  

వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం శ్రీ  ! వాతాపి!

భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం ! వాతాపి

పురా కుంభసంభవ  మునివర 
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రస్థితం పరారి చత్వారి
వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజవామకర విధృతేక్షు దండం

కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం 
హరాది గురుగుహతోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంభం
! వాతాపి !

దైవంపట్ల విశ్వాసం, భక్తి కలిగివున్నవారంతా ఏదైనా కొత్త కార్యం తలపెట్టినప్పుడు మున్ముందుగా  విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి తమ పనులు మొదలెడతారు. కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు రచించి, హంసధ్వని రాగంలో స్వరపర్చిన "వాతాపి గణపతిం భజే" కీర్తన నేటి మన ఘంటసాల సజీవరాగం.

ముత్తుస్వామి దీక్షితుల జన్మస్థలమైన తిరువారూర్ జిల్లా తిరుచెంగట్టన్కుడిలో వున్న ఉత్తరపతీశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్టింపబడిన వాతాపి గణపతిని స్తుతిస్తూ గానం చేసిన కీర్తన. ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూర్ చుట్టుప్రక్కలగల పదహారు వినాయక మూర్తులను స్తుతిస్తూ షోడశ గణపతి కీర్తనలను వ్రాసారు. వాటిలో ప్రముఖమైనది ఈ "వాతాపి గణపతిం భజే" కీర్తన .

ఈ వాతాపి గణపతి వాతాపి ( బాదామి) నుండి  తిరుచెంగట్టన్కుడికి రావడం వెనుక ఒక చారిత్రక కథ వున్నది. పల్లవ నరసింహవర్మ సైన్యాధిపతి పరంజ్యోతి యుధ్ధంలో వాతాపి చాళుక్య రాజులపై (అనాటి వాతాపి ఈనాడు కర్ణాటక రాష్ట్రంలోని బాదామి ప్రాంతం) విజయం సాధించి విజయ చిహ్నంగా వాతాపిలోని ఈ గణపతి శిలను తన వూరికి తీసుకువచ్చాడు. తర్వాత పరంజ్యోతి తన ఘాతుక చర్యలకు పశ్చాత్తాపం చెంది వైరాగ్యంతో శైవమతాన్ని స్వీకరించి 63 నాయన్మర్ లలో ప్రముఖుడైన సిరుతొండై నాయన్మార్ గా లోకప్రసిధ్ధుడైనాడు. ఆ పరంజ్యోతి తీసుకువచ్చి ప్రతిష్టించిన వాతాపి గణపతిని ఉద్దేశించి ముత్తుస్వామి దీక్షితులవారు "వాతాపి గణపతిం భజే" కీర్తనను వ్రాసారు. దీక్షితులవారి కీర్తనలనేకం సంస్కృత భాషలోనే వున్నాయి.

త్రిమూర్తులు, కుమారస్వామి, చంద్రుడువంటి దేవతలచేత, అగస్థ్యాది మునివరులచేత పూజించబడుతూ త్రికోణ మధ్యం (శ్రీచక్రం)లో అధిష్టించబడివున్న గణపతిని, వ్యాసునికి చతుర్వేదాలు వ్రాసిపెట్టిన గణేశుని దీక్షితులవారు హంసధ్వని రాగంలో స్తుతించారు.

ఇక ఈ నాటి మన సజీవరాగం విషయానికొస్తే....

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు, ఆయన భార్య, ప్రముఖ నటి సురభి బాలసరస్వతి నిర్మాతలుగా మారి తమ తొలి ప్రయత్నంగా  అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద "వినాయకచవితి" చిత్రాన్ని తీయ సంకల్పించి కథ, మాటలు, పాటలు వ్రాసే బాధ్యతతోపాటు చిత్ర దర్శకత్వాన్ని కూడా సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. దర్శకుడిగా సీనియర్ సముద్రాలవారికిది మొదటి చిత్రం. సంగీత దర్శకుడు ఘంటసాలవారు. ఎన్.టి.రామారావు  మాయాబజార్ తరువాత నాలుగైదు మాసాల వ్యవధిలో మరల కృష్ణునిగా తెలుగు ప్రజలను అలరించిన చిత్రం 'వినాయకచవితి'.  సినీమా అంతా సంగీతమయం. అనాదిగా వున్న శ్లోకాలు, ఆచార్యులవారు వ్రాసిన పద్యాలు, పాటలు అన్నీ కలిపి ఓ పాతిక ఉన్నాయి. వీటిని ఘంటసాల మాస్టారు, లీల, సుశీల, కోమల, కె రాణి, మాధవపెద్ది, ఎమ్.ఎస్.రామారావు, మొదలగువారు ఆలపించారు.  వీటన్నిటికీ మాస్టారు సందర్భోచిత మృదుమధుర సంగీతాన్ని సమకూర్చారు. 

సినీమా నిర్విఘ్నంగా ముగిసి విజయవంతం కావాలనే ఆకాంక్షతో ముందుగా విఘ్నేశ్వరుని స్తుతిస్తూ సినీమా టైటిల్స్ మీద 'శుక్లాంబరధరం విష్ణుం' శ్లోకాన్ని, వెనువెంటనే ముత్తుస్వామి దీక్షితులవారి "వాతాపి గణపతిం భజే" కీర్తనను రసోద్దీపనం కలిగిస్తూ  ఘంటసాలవారు ఆలపించి శ్రోతలను భక్తి తన్మయత్వం లో ఓలలాడించారు.

"శుక్లాంబర ధరం విష్ణుం" శ్లోకం మహావిష్ణువు కు సంబంధించినదిగా చెప్పుకోవడం వుంది. అయితే, ఈ శ్లోకంలోని విశేషణాలన్ని గమనిస్తే ఈ శ్లోకం వినాయకుడికే వర్తింపజేసేలా వుంది. 

ఈ శ్లోకం  తంబురా శ్రుతి, బేస్ డ్రమ్, ట్రయాంగిల్ బెల్ ధ్వనులతో ప్రారంభమవుతుంది. అవుతూనే బేస్ డ్రమ్, ట్రయాంగిల్ బెల్ మీద ఒక చిన్న బ్యాంగ్ ఇచ్చి "వాతాపి గణపతిం భజే" కీర్తనను ఎత్తుకుంటారు. సంప్రదాయ హంసధ్వని రాగంలో మృదంగం , ఘటం, మోర్సింగ్ , తాళాలు , వైలిన్స్ సహకారంతో ఘంటసాల మాస్టారు తదాత్మ్యం చెంది ఒక చిన్న కచేరీనే శ్రోతలకు ఏర్పాటు చేసారు. మూడే మూడు నిముషాలలో హంసధ్వని రాగ స్వరూపాన్నంతా చూపించడం అంత సులభమైన విషయం కాదు. అందుకు ఎంతో విద్వత్తు, ప్రతిభ కావాలి.

కర్నాటక సంగీతం అభ్యసించేవారికి ప్రారంభ దశలో సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు మొదలైనవాటిని విళంబకాలం, మధ్యమకాలం, దృతకాలం అనే మూడు కాలాలలో విద్యార్థులు చేత సాధనచేయిస్తారు. వీటినే ఒకటవకాలం, రెండవకాలం, మూడవకాలం అని కూడా అంటారు. విలంబకాలంలో పాట చాలా నెమ్మదిగా సాగుతుంది. దానిప్రకారం మధ్యమకాలం, దృతకాలంలో వేగం అధికమవుతుంది.  ఈ రకమైన అభ్యాసం వున్నవారు ఏరకమైన పాటనైనా సునాయాసంగా ఆలపించగలరు. సాధారణంగా ఈ కీర్తన మధ్యమకాలంలో ఆలపించడం సంప్రదాయం. కానీ మూడు నిముషాల టైటిల్స్ లోపలే ఈ కీర్తన ముగించవలసిన నిర్బంధం వలన ఘంటసాల మాస్టారు ఈ కీర్తనను దృతకాలం పాడినట్లు అనిపిస్తుంది.

దీక్షితులవారి కీర్తనకు,  సినీమా లోని కీర్తనకు మధ్య సాహిత్యంలో చిన్న పాఠ్య భేదాలు కనిపిస్తాయి.  అసలు కీర్తనలోని "త్రికోణ మధ్యగతం" కు బదులు " త్రిభువన మధ్యగతం" అనే మాటను వాడారు సముద్రాలవారు. దీక్షితులవారు గొప్ప సంగీతవేత్తే కాదు, మంత్రశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడు. మానవ దేహంలోని శక్తి కేంద్రాలైన మూలాధార నుంచి సహస్రార మధ్యంలో వుండే వినాయకుడిగా వర్ణించారు. ఆ మాటకు బదులు త్రిభువనాలు అంటే మూడులోకాల మధ్య పూజింపబడుతున్నవాడనే అర్ధంతో ఆచార్యులవారు మార్చివుండాలి.

"వాతాపి గణపతిం భజే" కీర్తనకు ముత్తుస్వామి దీక్షితులవారు నిర్దేశించిన రాగం హంసధ్వని. ఆ రాగంలోనే ఘంటసాలవారు కూడా శాస్త్రోక్తంగా  గానం చేసి సూక్ష్మంలో మోక్షం చూపించారు.

హంసధ్వని ఔఢవరాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణ రాగ జన్యం. ఆరోహణ, అవరోహణలలో సరిగపని, సనిపగరి అనే ఐదు స్వరాలతో కూడిన రాగం.  షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలినిషాధం స్వరాలు పలుకుతాయి.హంసధ్వని రాగాన్ని ముత్తుస్వామి దీక్షితులువారి తండ్రి రామస్వామి దీక్షితులు సృష్టించినట్లు చెపుతారు. కాలక్రమేణా హంసధ్వని రాగం హిందుస్థానీ సంగీతంలో కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. మనసుకు ఏకాగ్రతను, హాయిని కలిగించే ఈ రాగంతోనే గాయకులు తమ సంగీత కచేరీలను ప్రారంభిస్తారు.

వినాయకచవితి సినిమాలో ఏ నటుడి మీద కాకుండా వినాయకుడి విగ్రహం మీద పేర్లను వేస్తూ ఈ వాతాపి గణపతిం భజే కీర్తనను నేపథ్యంలో వినిపించడం ఒక విశేషం.

కర్నాటక సంగీతంలో విశేష కృషి చేసి విద్వాన్ పట్టం పొందిన ఘంటసాలవారు తన జీవితకాలంలో సినీమాలలో, సంగీత ముమూర్తుల రచనలలో, పాడిన ఏకైక  కీర్తన ఇది ఒక్కటే అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

ఘంటసాలవారి గాత్రాన జాలువారిన ఈ కీర్తన జన బాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అందరికీ తెలిసిందే.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్ 

Saturday, 8 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 33వ భాగం - దినకరా శుభకరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై రెండవ భాగం ఇక్కడ  

33వ సజీవరాగం - దినకరా శుభకరా
చిత్రం - వినాయకచవితి
గానం - ఘంటసాల 
సంగీతం - ఘంటసాల

పల్లవి : 
దినకరా.. దినకరా.. హే.. శుభకరా..
దినకరా శుభకరా - 2
 దేవా దీనాధారా తిమిర సంహార ! దినకరా!

అనుపల్లవి :
సకలభువన సుఖకారణ కిరణా
మౌనిరాజ పరిపూజిత చరణా -2
నీరజాతముఖ శోభనకారణ -2
దినకరా శుభకరా -2

చరణం :
పతిత పావన మంగళదాతా
పాప సంతాప లోకహితా -2
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా - రాగాలాపన
బ్రహ్మ విష్ణు....
వివిధ వేద విజ్ఞాని నిధానా .. బ్రహ్మ..
వినతలోక పరిపాలక భాస్కర - దినకరా
దినకరా. హే.. దినకరా ప్రభో
దినకరా... శుభకరా 

గతం తరం తెలుగు పౌరాణిక చిత్రాలలో సూర్య భగవానుడు మీద శ్లోకాలు , పద్యాలు అనేకం వినవచ్చాయి , కానీ సూర్యుడిని వర్ణిస్తూ చేసిన పాటలు బహు అరుదు. అలాటివాటిలో తలమానికంగా నిలిచే పాట "దినకరా శుభకరా దేవా దీనాధారా తిమిరసంహార" అనే పాట. ఈ పాటే ఈనాటి ఘంటసాల సజీవరాగం.

"దినకరా శుభకరా" పాట 1957 లో వచ్చిన " వినాయకచవితి" సినీమా లోనిది. పేరుకు వినాయకచవితే అయినా అధికశాతం కథంతా చవితి చంద్రుడిని చూసినందువలన శ్రీకృష్ణునికి కలిగిన నీలాపనిందలు, శమంతకమణి ఉపాఖ్యానం,  జాంబవతి, సత్యభామా పరిణయాల మీదనే నడుస్తుంది.

రోజుకు ఎనిమిది బారువల (బారువ అనే తూనిక ఈనాటి కిలోలు, టన్నులు, క్వింటాళ్ళు, రాకపూర్వం. అప్పుడు తూనిక ప్రమాణాలు తులాలు, ఫలాలు, వీశెలు, మణుగులు లెక్కలో వుండేవి. ఒక బారువ అంటే సుమారుగా 224 కిలోలు.  ఒక రోజుకు 8 బారువలంటే 1792 కిలోలు. సంవత్సరానికి 6 లక్షల 55 వేల కిలోల బంగారం. నేను లెక్కల్లో చాలా చాలా వీక్. నా యీ లెక్కలో తప్పులుంటే మన్నించండి).

బంగారం మీది వ్యామోహంతో సత్యభామా మణి తండ్రి సత్రాజిత్తు సూర్యోపాసన చేసి సూర్యభగవానుడిని మెప్పించి రోజుకు 8 బారువల బంగారాన్ని ప్రసాదించే శమంతకమణిని పొందుతాడు. అంత ధనం ఒక వ్యక్తి దగ్గర వుందంటే అది పరులకంట పడకుండా కాపాడుకోవడంకోసం  ఎంత కథైనా జరుగుతుంది కదా. అలాటి కథే "వినాయకచవితి" సినీమా కథ.

సూర్యోపాసకుడైన సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధిస్తూ సముద్రపుటొడ్డున పాడిన పాటే "దినకరా శుభకరా" పాట. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారికి అనర్ఘమణిగా భాసిల్లిన గీతం "దినకరా శుభకరా". ఈ పాటను సినిమాలో సత్రాజిత్తు పాత్రధారి గుమ్మడి మీద చిత్రీకరించారు. ఈ పాటను వ్రాసినవారు శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారు. లోకపాలకుడైన సూర్యదేవుని గుణగణాలను వర్ణిస్తూ ఈపాటకు ఆచార్యులవారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు.   ఆయనే వినాయకచవితి సినీమా కు దర్శకత్వం వహించి, మాటలు, పాటలు, పద్యాలు వ్రాసారు.

చాలామంది సంగీతాభిమానులకు తెలియని ఒక విశేషం ఈ పాటలో వుంది. ఆచార్యులవారు ఈ పాటను వ్రాసినప్పుడు పల్లవి తర్వాత ఒక అనుపల్లవి , తర్వాత చరణాలు  వ్రాయడం జరిగింది. (చూడుడు పాట సాహిత్యం). ఘంటసాల మాస్టారు కూడా అత్యంత శ్రవణపేయంగా ఈ గీతాన్ని పంతువరాళి లేదా కామవర్ధని అనే రాగంలో స్వరపర్చారు. అయితే ఏ కారణం చేతనో ఈ పాటలోని అనుపల్లవి  సినీమా లోనూ లేదు, గ్రామఫోన్ రికార్డులోనూ లేదు. పాటలో పల్లవి, చరణాలు మాత్రమే వినిపిస్తాయి. ఘంటసాలవారి  సంగీత కచేరీలను ప్రత్యక్షంగా చూసిన నాలాటి శ్రోతలకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది.

ఘంటసాలవారి ప్రతీ సంగీత కచేరీ ఈ "దినకరా శుభకరా" పాటతోనే ప్రారంభమయేది. ఆయన రికార్డులో లేని ఈ అనుపల్లవితో సహా ఈ పాటను కడు రమ్యంగా ఆలపించేవారు. కచేరీ సందర్భం , స్థలాలనుబట్టి ఈ పాటను శాస్త్రీయ సంగీత కచేరీ కీర్తనలా  రాగాలపన చేసి, సంగతులు, నెరవులు వేసి ఘంటసాలగారు  సుమారు ఎడెనిమిది నిముషాలపాటు పాడేవారు. ఇప్పుడు మీరంతా కూడా విని ఆనందించడానికి వీలుగా వాషింగ్టన్ కచేరీలో ఘంటసాల మాస్టారు పాడిన పాటను, వినాయకచవితి  సినీమాలోని పాటను మీకు సమర్పిస్తున్నాను.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి ఎంచుకున్న రాగం - పంతువరాళి. దీనికే  కామవర్ధని అని మరో పేరు వుంది.  హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో పంతువరాళి రాగాన్ని 'పూర్యాధనశ్రీ'  అంటారు. కర్నాటక సంగీతంలో అత్యంత ప్రాచీనమైన రాగం పంతువరాళి. అయినా మేళకర్తరాగ వర్గీకరణ జరిగేప్పుడు ఈ రాగాన్ని 51 వ మేళకర్త రాగంగా నిర్ణయించారు.  పంతువరాళి/కామవర్ధని రాగం ఆరోహణ , అవరోహణలలో - షడ్జమం, శుధ్ధరిషభం, అంతర గాంధారం, ప్రతిమధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలినిషాధం అనే ఏడు స్వరాలు వినవస్తాయి. త్యాగయ్యగారి 'శివ శివ యనరాదా',' అప్ప రామభక్తి' అనే సుప్రసిధ్ధ కీర్తనలు పంతువరాళి రాగంలో చేసినవే. అలాగే, కంచెర్ల గోపన్న (రామదాసు ) కీర్తన  'ఎన్నగాను రామ భజన' కూడా పంతువరాళి రాగంలోనే చేశారు.

శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా తమ కచేరీలలో కామవర్ధని రాగ కృతులను విధిగా గానం చేస్తారు. శ్రోతల మనసులను రంజిఃపజేసే సుప్రసిద్ధ రాగం పంతువరాళి. ఈ రాగంలో స్వరపర్చబడిన "దినకరా శుభకరా" పాటను ఘంటసాలవారు ఎంత మనోజ్ఞంగా పాడారో, ఆ పాట ఎంతటి జనాదరణను పొందిందో అందరికీ తెలిసిందే. ఘంటసాల మాస్టారు మంచి  రసస్ఫూర్తితో  ఆత్మానందం పొందుతూ పాడిన ఈ పాట అరవైఆరేళ్ళ తర్వాత కూడా సంగీతాభిమానుల హృదయాలను రంజింపజేస్తూ, మేనులను పులకరింపజేస్తూనేవుంది. లలిత సంగీత గాయకులంతా తమ కచేరీలలో  తప్పక పాడే పాట "దినకరా శుభకరా". ఘంటసాలవారి ఉత్తమశ్రేణి గీతాలలో ప్రధమ వరసలో నిలిచే గీతం " దినకరా శుభకరా".

ఘంటసాల మాస్టారి అపూర్వ సృష్టి అయిన 108 శ్లోకాల భగవద్గీత లోని ప్రప్రథమ శ్లోకమైన "పార్ధాయ ప్రతిబోధితాం నారాయణీ..." కూడా కామవర్ధని/పంతువరాళి రాగంలోనే సముచిత రీతిని స్వరపర్చడం వారి రాగ పరిజ్ఞానానికి, గానప్రతిభకు ఒక నిదర్శనం. ఈ రాగంలో ఇంత నిర్దిష్టంగా రూపొందిన సినిమా పాట మరొకటి లేదంటే అది అతిశయోక్తి కాదు.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్ 

Saturday, 1 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 32వ భాగం - మోహనరూపా గోపాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఒకటవ భాగం ఇక్కడ  

32వ సజీవరాగం - మోహనరూపా గోపాలా
చిత్రం - కృష్ణప్రేమ
గానం - ఘంటసాల 
సంగీతం - పెండ్యాల

పల్లవి :
మోహనరూపా గోపాలా - 2
ఊహాతీతము నీ లీలా - 2

చరణం :
వలదని నిన్ను వారించువారిని
వదలక వెంట తిరిగెదవయ్యా ! వలదని!
వేణువునూదుచు వేడుక చేయగ
వేడినవారికి దరిశనమీయవు - మోహనరూపా గోపాలా 

రెండవ చరణం :
అవనిభారము అమితముకాగా
అవతరించితివి ఎన్నిసారులో... 
కృష్ణా.... రాగాలాపన
అవని భారము...
అన్నిటికన్నా అపురూపమైనది
కన్నులవిందగు ఈనాటి రూపము ..
మోహనరూపా గోపాలా..
రాగాలాపన.. 

శ్రీకృష్ణుడు లీలామానుష రూపధారి. మూర్తీభవించిన అలౌకికానందం. సచ్చిదానంద స్వరూపం. రాధ పట్ల,గోపికల పట్ల కృష్ణుడు కనపర్చిన ప్రేమానురాగాలు బాహ్యమైన మోహానికి అతీతమైనవి. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలకు అతీతమైనవారికే కృష్ణుని ప్రేమ అర్ధమవుతుంది.

తనంటే నమ్మకంలేనివారికి, తనను ద్వేషించేవారికి తరచూ కనిపిస్తూ వారిని కల్లోలపరుస్తాడు. తననే నమ్మి తన దివ్య దర్శనం కోసం తపించి , ఆరాటపడేవారి కంటపడకుండా దూరంగా వుంచుతూ మురిపిస్తూంటాడు  ఆ కృష్ణుడు.  కృష్ణ శబ్దంలోనే నల్లనివాడు అనే అర్ధముంది. ఆ నీలమేఘశ్యాముని సౌందర్యం స్త్రీ పురుషులనే కాదు సకలజీవులను సమ్మోహనపరుస్తుంది. సామాన్య మానవులకు అర్ధం కానిది కృష్ణతత్త్వం. మహావిష్ణువు అవతారాలలోని ఎనిమిదవ పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఆ భగవత్స్వరూపుని అర్ధంచేసుకోవాలని నారదాది మహర్షులు, మునిపుంగవులు, మహాభక్తులెందరో నిరంతరం స్మరించి, జపించి, తపించి, తరించారు.

నిత్య హరినామ స్మరణతో నారదుడు లోకకళ్యాణ కార్యక్రమాలెన్నింటినో ఆ దేవదేవుని అండదండలతో నిర్వహించాడు. "మోహనరూపా గోపాలా , ఊహాతీతము నీ లీల" అంటూ  అనిర్వచనీయమైన కృష్ణుని ప్రేమతత్త్వాన్ని సామాన్య పామరాజనాలకు బోధపరుస్తాడు నారదుడు "కృష్ణప్రేమ" చిత్రంలో. 

సంగీతాభిమానులందరినీ సమ్మోహనపర్చే ఈ భక్తిగీతాన్ని ఆరుద్ర ఎంతో భావయుక్తంగా వ్రాసారు. "వలదని నిన్ను వారించువారిని", "వేడుకచేయగ వేడినవారికి దరిశనమీయవు" అనే పదాలను తరచిచూస్తే ఎంతటి గొప్ప అర్ధమైనా స్ఫురిస్తుంది. ఎవరెంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆ కృష్ణుడు వివిధ కోణాలలో గోచరిస్తాడు.

ఈ పాటలో వున్నవి రెండే  చిన్న చిన్న చరణాలు. ఉన్న మూడు నిముషాల పాటా సినీమా లో ఒకేసారి రాదు. నారదుడు లోకసంచారికదా, అక్కడో పల్లవి, ఇక్కడో చరణం అని సందర్భానుసారం రెండు మూడు కట్ల్ గా "కృష్ణప్రేమ" సినీమా లో ఆలపిస్తాడు.

ఈ చిత్రానికి  దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. సాంఘిక చిత్రాల నిష్ణాతుడైన ఆదుర్తి బహు అరుదుగా పౌరాణిక చిత్రాలకు డైరక్ట్ చేసారు. బహుశా "కృష్ణప్రేమ" ఒక్కటేనేమో వారి పౌరాణికం. కృష్ణుడుగా బాలయ్యను ఎన్నుకోవడం ఆదుర్తిలాటివారికే సాధ్యం. సత్యభామ గా గిరిజ , రాధగా ఎస్.వరలక్ష్మి,  కృష్ణ ద్వేషిణి అయిన ఆమె చెల్లెలు చంద్రగా జమున నటించారు.  నారదుడు పద్మనాభం. 

కృష్ణుడి పాటలు, పద్యాలు పి.బి.శ్రీనివాస్ గారు పాడగా, నారదుడి రెండు పాటలు, కొన్ని పద్యాలు ఘంటసాల పాడారు.

ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెండ్యాల. పెండ్యాలగారు ఆషామాషీ సంగీతదర్శకుడు కాదు. రాగప్రధానమైన పాటలను స్వరపర్చడంలో అసమాన్యుడు. ఆయనకు నల్లేరుమీద బండి నడకే. అందులోనూ ఈ పాటను పాడేది ఘంటసాలగారేనని తెలిసాక ఊరకే ఉంటారా, ఆ పాట అంతుచూడక వదులుతారా చెప్పండి. "మోహనరూపా గోపాలా" పాటను అద్భుతంగా స్వరపర్చి ఆ పాట ఘంటసాల కోసమే పుట్టిందన్నట్లు మెట్టుకట్టారు. 

ఈ పాటకు పెండ్యాల గారు ఎంచుకున్న రాగం హిందోళం. హిందోళం నఠభైరవి రాగం యొక్క జన్యరాగం. షడ్జమం(స), సాధారణ గాంధారం(గ), శుధ్ధ మధ్యమం(మ), శుధ్ధ ధైవతం (ద), కైశికి నిషాదం(ని) ... సగమదని అనే ఐదు స్వరాలే ఆరోహణా, అవరోహణా క్రమంలో వినిపిస్తాయి. ఇదొక ఔడవరాగం. కర్ణాటక శైలిలోని హిందోళ రాగానికి సమానమైన హిందుస్థానీ సంగీత రాగాన్ని మాల్కౌంస్ అంటారు. ఈ రెండు రాగాలలో అనేక వందల సినీమా పాటలు అన్ని భాషలలో వెలువడ్డాయి. హిందోళ రాగంలోని త్యాగరాజకీర్తన 'సామజవరగమన' లోకప్రసిద్ధం. చైనా వంటి ప్రాచ్యదేశలలో కూడా ఐదు స్వరాలుతో కూడిన హిందోళం , మోహన రాగ ఛాయలుగల సంగీతం వినవస్తూంటుంది.

హిందోళరాగ ప్రస్తావన వచ్చింది కనుక ఈ పాటకు సంబంధంలేకపోయినా ఒక విషయం ప్రస్తావించడంలో తప్పులేదని భావిస్తున్నాను. "శంకరాభరణం"లో శంకరశాస్త్రి "శుద్ధహిందోళం"లో రిషభం ఎలా వచ్చిందని రంకెలు వేసినా అన్యస్వర లేదా భాషాంగస్వర ప్రయోగాల్ని సంప్రదాయ శాస్త్రీయ కర్నాటక సంగీతం భాషాంగరాగాలుగా గుర్తించి అంగీకరించింది. ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలో ఉద్దేశపూర్వకంగానే హిందోళలో రిషభ, పంచమాలు ప్రయోగించిన సందర్భాలున్నాయి. అయితే కర్నాటక సంప్రదాయ సంగీతంలో ఆ ప్రయోగ ఫలితంగా రూపుదిద్దుకున్న రాగానికి స్వరప్రస్తారసాగరం వంటి గ్రంథాలలో ఏ పేరూ కనబడదు. ఒకవేళ అటువంటి ప్రయోగాలకి ఏ పేరు లేకపోతే "మనం దానికి ఒకపేరు పెట్టుకుందాం" అని ఘంటసాలగారే ఒక AIR ఇంర్వ్యూలో అన్నారు. అంతేకాక ఆ రాగం ఎప్పుడు వినియోగించుకున్నా ఆ విశేష ప్రయోగంతోనే ఆ సంచారాన్ని వినియోగించేను అని అన్నారు. "సందేహింపకుమమ్మా" "కలనైనా నీ పిలుపే" లాంటి పాటలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  సినిమా సంగీతదర్శకుడి మనోధర్మనికి సంప్రదాయ శాస్త్రీయ సంగీతజ్ఞుడికున్నన్ని బందికట్లులేవు. 

రచయితకి, దర్శకుడికి సంగీతంలో ప్రాథమిక ప్రవేశంలేకపోతే ఆ శాస్త్రానికి అనుగుణ్యమైన jargon - పారిభాషిక జ్ఞానం కూడా అలవడదు. శుద్ధసావేరీ, శుద్ధధన్యాసిలాగ శుద్ధహిందోళం అని అనడం అపభ్రంశం. అందులోనూ శంకరశాస్త్రిలాంటి ఓ గొప్ప శుద్ధ కర్నాటక సంగీతజ్ఞుడు ఆ పద ప్రయోగం చెయ్యడం హాస్యాస్పదం.

'మోహనరూపా గోపాలా' పాట విషయంలో ఘంటసాల పూర్తిగా పెండ్యాల స్వరకల్పనలనే అనుసరించి ఆ పాటకు జీవం పోసారు. తెరమీద నారద పాత్రధారి పద్మనాభం కూడా చాలా హుందాగా నటించారు.

ఈ పాటలో వీణ, ఫ్లూట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను ఉపయోగించారు.  శుధ్ధ శాస్త్రీయమైన ఈ పాటలోని ఛాయాస్వరాలు ఆలపించడంలో ఘంటసాలవారి ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నాదాన్ని నాభిస్థానం నుండి పలికించడమంటే ఏమిటో, దానికి ఎంత దమ్ము పట్టాలో, అదెంత కష్టసాధ్యమో ఈ రకమైన పాటలు వినడం, పాడడం ద్వారా తెలుస్తుంది. ఘంటసాలవారి ఈ పాట గాయకులందరికీ ఒక పెద్ద టెస్ట్ వంటిది.

ఈ పాటను పాడడంలో ఎంతవరకూ సఫలీకృతులయ్యారో ఎవరికి వారు తమ మనస్సాక్షి ప్రకారం నిక్పక్షపాతంగా తేల్చుకోవలసిన విషయం.  

ఘంటసాలవారి ఈ గీతం సదా మదిలో మెదిలే సజీవరాగమే.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday, 25 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 31వ భాగం - ప్రియతమా రాధికా రావే రయమున కలియవె ప్రేమాభిసారికా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫైయవ భాగం ఇక్కడ  

31వ సజీవరాగం - ప్రియతమా రాధికా రావే  
రయమున కలియవె ప్రేమాభిసారికా
చిత్రం - పెళ్ళికాని పిల్లలు
గానం -  ఘంటసాల
సంగీతం - మాస్టర్ వేణు 

ప్రియతమా రాధికా 
ప్రియతమా రాధికా రావే  రయమున
కలియవె ప్రేమాభిసారికా !! ప్రియతమా

చరణం :
పరువము నీ మేన పరుగులు తీయ.. ఆ... పరువము !
చరణాల కికిణులు స్వరమేళ పాడ - 2

చరణం :
కడవనిడుకొని కలహంస నడతో
విడువని బిడియాన వేమారు వెదకి-2
అడుగులు తడబడ నడుమల్లాడా.. ఆ..- 2
వడి వడిగా నడిచేటి వనితా లలమా 

రాగాలాపన 
ప్రియతమా రాధికా -2

స్వరకల్పనలు 

ప్రియతమా రాధికా - 2
రాధికా.. రాధికా... రాధికా...
  
సంగీత రసాస్వాదన అనుభవైకవేద్యం. ఎవరి అభిరుచి, సంగీత సంస్కారాన్నిబట్టి ఆ రకమైన గీతాలాను విని ఆనందిస్తూంటారు. కొన్ని గీతాలు విన్న మొదటి క్షణంలోనే అవి మన మనసుకు పట్టేసి పదే పదే వినాలనే తపన మొదలవుతుంది. ఆ పాటలను ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. ఆ పాటలోని రాగభావం, ఆ పాటను ఆలపించిన గాయనీగాయకుల గాన మాధుర్యం, సన్నివేశ చిత్రీకరణ అందుకు కారణమనిపిస్తుంది. 

అలాటి ఆపాతమధురమే నేటి ఘంటసాలవారి సజీవరాగం ---

" ప్రియతమా రాధికా రావే రయమున కలియవె ప్రేమాభిసారిక " అనే పాట, 1961 నాటి " పెళ్ళికాని పిల్లలు" సినీమా లోనిది. గీత రచన ఆరుద్రగారిది, సంగీత రచన మాస్టర్ వేణు , చిత్రదర్శకుడు సి.ఎస్ రావు, నిర్మాత హైదరాబాద్ మూవీస్ పి.గంగాధరరావు. నిర్మాతా దర్శకులలో మంచి కళాభిరుచి, సంస్కారమూ వుంటే అమృతతుల్యమైన పాటలూ ఉద్భవిస్తాయని చెప్పడానికి నిదర్శనం ఈ పాట. ఈ పాట నూటికి నూరుపాళ్ళు ఘంటసాలవారికే సొంతం . తెరవెనుక ఈ పాట పాడడమే కాదు తెరమీద కూడా ఘంటసాల చిన వెంకటేశ్వరరావు (హరనాథ్) అనే నకిలి గాయకుడికి తన అపూర్వగళాన్ని ఎరువిస్తూ ఫోటోలో కూడా కనిపిస్తారు. సంగీతం తెలిసిన ఒక అమ్మాయి ప్రేమ సంపాదించడానికి ఒక అబ్బాయి ఘంటసాల పాటను ఆలంబనగా చేసుకొని మహాగాయకుడిలా నటిస్తాడు.  మనోజ్ఞమైన  సంగీతాన్ని, చక్కటి లాస్యాన్ని మేళవించి మరపురాని హాస్య సన్నివేశంగా రూపొందించారు దర్శకుడు సి.ఎస్.రావు. ఫేక్ సింగర్ గా హరనాథ్, అతనికి డైరెక్టర్ గా జగ్గయ్య, గాయనిగా వాణి ఈ సన్నివేశానికి జీవంపొసారు.

" ప్రియతమా రాధికా" పాట ఇంత మధురంగా వుండడానికి కారణం ఈ పాటను కళ్యాణి రాగంలో స్వరపర్చడమే. సంగీతంలో మంచి ప్రవేశము, రాగజ్ఞానమూ కల మాస్టర్ వేణు ఈ గీతాన్ని అపాతమధురంగా స్వరపర్చడంలో ఆశ్చర్యంలేదు. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో ఆణిముత్యాలు సంగీతాభిమానులను అలరించాయి.

కళ్యాణి ఘంటసాలవారి పేటెంట్ రాగమని ఈ పాట మరోసారి నిరూపిస్తుంది. సప్తస్వరాలు కలిగిన శోభాయమాన  సంపూర్ణరాగం కళ్యాణి. విస్తారమైన రాగాలాపన చేయడానికి, సుదీర్ఘంగా స్వరకల్పనలు చేయడానికి అవకాశం కలిగిన కళ్యాణి రాగం ఘంటసాలవారిలో జీర్ణించుకుపోయింది. ఈ రాగంలోని పాటలెన్నో అలవోకగా ఘంటసాల మాస్టారి మృదుమధుర కంఠం నుండి జాలువారి శ్రోతలను తన్మయులను చేసాయి. అలాటి గీతాలలో  " ప్రియతమా రాధికా" పాట ప్రముఖమైనది.  

ఈ పాటకు కూడా సితార్ వాద్యమే జీవనాదం. ఇతర వాద్యాలతో పాటు వేణుగారు ఈ పాటలో తబలా తరంగ్, జలతరంగ్, తబలా వాద్యాలకు ప్రాధాన్యత కల్పించారు.  కళ్యాణి రాగ విరుపులు, సంగతులు, గమకాల విషయంలో  వేణుగారి ముద్రకు మరింత సొగసులు, సొబగులు చేర్చి ఘంటసాల మాస్టారు ఈ పాటను మరింత క్లాసిక్ గా ఆలపించారు. రాగభావాన్ని ప్రస్ఫుటంగా హృదయాలకు హత్తుకునేలా శ్రావ్యంగా వినిపింపజేయడంలో ఘంటసాలవారి ని మించిన గాయకుడు మరొకరు లేరంటే అది అతిశయోక్తి కానేకాదు. సంగీతజ్ఞులంతా అంగీకరించిన సత్యం. ఈ విషయాలన్నింటినీ నిరూపించ గీతం "ప్రియతమా రాధికా". ఈ పాటలో ఘంటసాలవారి గళం ఎంతో గంభీరంగా, మృదుమధురంగా వినిపిస్తుంది.

ఘంటసాలవారి సినీ సంగీత రజతోత్సవ వేడుకలలో జరిగిన భారీ సంగీత విభావరిలో మాస్టర్ వేణు వాద్యబృందాన్ని పర్యవేక్షిస్తూండగా ఘంటసాల మాస్టారు సమ్మోహనంగా  పాడిన " ప్రియతమా రాధికా" పాటకు వేలాది ప్రేక్షకులు చేసిన  హర్షధ్వానాలు, కరతాళధ్వనులు ఇంకా నా చెవిలో మార్మోగుతూనేవున్నాయి.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday, 18 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై తొమ్మిదవ భాగం ఇక్కడ  

30వ సజీవరాగం - రసికరాజ తగువారము కామా
చిత్రం - జయభేరి
సంగీతం - పెండ్యాల

ముందుగా చిన్న ఆలాపన...
తర్వాత పాట పల్లవి -

రసికరాజ తగువారము కామా - 3

అగడు సేయ తగవా
ఏలు దొరవు అరమరికలు లేక 
ఏలవేల సరసాల సురసాల - ఏలు !! - 2
చరణం :

నిన్ను తలచి గుణగానము చేసి - 3
దివ్యనామ మధుపానము చేసీ !! నిన్ను!!

స్వరకల్పనలు - వివిధ స్థాయీ భేదంతో

నిన్ను దలచి గుణగానము చేసి
దివ్యనామ మధుపానము చేసి
సారసాక్ష మనసా వచసా
నీ సరస చేరగనే సదా వేదనా
ఏలు దొరవు అరమరికలు ఏల
ఏలవేల సరసాల సురసాల ఏలు దొరా......

గతవారం ఘంటసాలవారి సజీవరాగంగా 'దర్బారీకానడ' రాగంలో ' శివశంకరి శివానందలహరి' ని గుర్తు చేసుకున్నాం. ఈ వారం 'చక్రవాక, కానడ రాగాల మిశ్రమం అయిన "రసికరాజ తగువారము కామా" అనే ఆపాతమధురాన్ని మరోసారి ఆస్వాదిద్దాము.

శాస్త్రీయ సంగీత బాణీలో ఘంటసాల వారు అద్వితీయంగా ఆలపించి ఆ గీతానికి శాశ్వతత్వం కల్పించారు. నిజం చెప్పాలంటే 'శివశంకరి' పాటకు
ముందే ' రసికరాజ' తెలుగువారి హృదాయాలలో సుస్థిరపీఠం వేసుకు కూర్చుంది. అక్కినేని నాగేశ్వరరావుగారికి 'రసికరాజా', ఎన్.టి.రామారావుగారికి 'శివశంకరి' గీతాలను ఆలపించడం ద్వారా  ఘంటసాల ఆ ఇద్దరు మహా నటుల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసారు.

ఈనాటి సజీవరాగం 'జయభేరి'  సంగీత రసభరిత చిత్రంలోనిది. ఇటీవలే 'మదిశారదాదేవి' పాటను గురించి చెప్పుకున్నప్పుడు 'జయభేరి' సినిమా పూర్వాపరాలు ముచ్చటించడం జరిగింది.

శివశంకరి, రసికరాజ  -  ఈ రెండు పాటలకు  మూలాధార రాగం 'కానడ'
కర్నాటక సంగీత 'కానడ' రాగం నుండే హిందుస్తానీ 'దర్బారీకానడ' ఆవిర్భావం జరిగిందని చెపుతారు.

"రసికరాజ తగువారము కామా" పాటకు కథాపరంగా కవి మల్లాది రామకృష్ణశాస్త్రిగారు పెట్టిన పేరు 'విజయానందచంద్రిక'. ఈ
పాటలో చక్రవాక, కానడ రాగాలు రెండూ వున్నాయి. 
చక్రవాకం కర్నాటక సంగీతంలో 16 వ మేళకర్త రాగం. దీనికి దగ్గరలో వుండే హిందుస్థానీ రాగం అహిర్ భైరవ్. కానడ రాగం  20వ మేళకర్త రాగమైన నఠభైరవి జన్యం. 72 మేళకర్తల స్వరాల సమ్మేళనతో అనగా ఆయా స్వరాల permutations and combinations తో సుమారు ముప్ఫైవేల రాగాల రూపకల్పనకి సావకాశం ఉంది. అందులో నామకరణం జరిగిన 2044 రాగాల పేర్లు 1914 లో ముద్రితమైన 'సంగీతప్రస్తారసాగరం' అన్న గ్రంథంలో గ్రంథస్థమై ఉన్నాయి. అటువంటి గ్రంథాలలో మరికొన్ని రాగాల పేర్లు ఉండవచ్చు.   కానీ ఆ పేరు పెట్టబడిన రాగాలలో చక్రవాక-కానడ రాగస్వరమిశ్రమానికి ఏ పేరూ ఉన్నట్టు కనిపించదు. సంగీత గ్రంథాలలో నామకరణం జరగని ఆ స్వర మిశ్రమానికి  'విజయానందచంద్రిక' అన్న పేరు పెట్టిన సాహితీవేత్త మల్లాదివారి సంగీతజ్ఞానం ఈ పాట ద్వారా తెలుసుకోగలం. అంతేకాదు నేను ఓ కొత్త రాగం కనిపెట్టేను అని మల్లాదివారు జబ్బలు చఱచుకోలేదన్నదీ గమనించాల్సిన విషయమే. 

పెళ్ళిచేసి చూడు చిత్రం ద్వారా 'చక్రవాక' రాగాన్ని  తొలిసారిగా సినీ సంగీతలోకానికి పరిచయం చేసిన ఘనత ఘంటసాలవారిదే.

రసికరాజ, శివశంకరి పాటలకు సృష్టికర్త పెండ్యాలగారైతే, రసపుష్టికర్త శతాబ్ది గాయకుడు ఘంటసాలగారు. వీరిద్దరు ఈ రెండుపాటల ద్వారా తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసారు. ఈ రెండు పాటలు వెలువడి ఆరు దశాబ్దాలు దాటినా ఈ పాటలను తలచుకోని, మననం చేయని తెలుగువారు వుండరంటే అది అతిశయోక్తికానేకాదు. 

ఘంటసాలవారి పరిపూర్ణ సంగీత ప్రతిభ 'రసికరాజ' పాటలో దర్శనమిస్తుంది. 
ఒక గాయకుడికి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం, ప్రవేశం, అవగాహన ఎంత ముఖ్యమో ఈ రెండు పాటలు పాడేవారికి తెలుస్తుంది. సంగీతాభ్యాసం ప్రారంభదశలో గురువులు సంగీత విద్యార్ధుల చేత నిరంతరం అకార సాధన చేయిస్తారు. అందులో కఠోరసాధన చేసిన పరిపూర్ణత పొందగలిగినవారు మాత్రమే "రసికరాజ తగువారము కామా" వంటి పాటలు పాడడానికి సాహసం చేయగలుగుతారు. ఈ గీతంలో సాహిత్యం కంటే స్వరకల్పనలకే ప్రాధాన్యత నిచ్చారు. అవి సమస్థాయిలో, మంద్రస్థాయిలో ఒకేసారి సాగుతాయి.  ఇందుకు నాదశుధ్ధి ఎంతో అవసరం. సంప్రదాయబధ్ధంగా శాస్త్రీయ సంగీతంలో విశేష కృషి చేసినవారే ఈ తరహాపాటలను శ్రుతిశుధ్ధంగాఅత్యంత శ్రావ్యంగా అలపించగలుగుతారు. ఈ విషయంలో ఘంటసాలవారి ఆరేళ్ళ అసుర సాధన
తర్వాతి కాలంలో సినీమా రంగంలో ఆయనకు ఎంతగానో ఉపయోగించింది.

జయభేరి చిత్రంలో ' రసికరాజ తగువారము కామా' అంటూ మహారాజు సమక్షంలో ఒక సంగీత కళాకారుడు కచేరీ పధ్ధతిలో ఆలాపన మొదలెడతాడు. స్వరకర్త పెండ్యాల , గాయకుడు ఘంటసాల ఇద్దరకు ఇద్దరే. Perfection విషయంలో ఒకరికొకరు పోటీ. శాస్త్రీయ సంగీతకచేరీ బాణీ స్ఫురించేలా  పెండ్యాలగారు ఈ పాటలో వీణ, వైలిన్స్,  మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్  వంటి భారతీయ వాద్యాలనే ఉపయోగించి మెట్టు కట్టారు. కచేరీ పధ్ధతిలోలాగే వాద్యకారుల తనీ ఆవర్తనాలు ఈ గీతంలో వినిపిస్తాయి. చక్రవాక- కానడ రాగ లక్షణాలు,  రాగభావం, రసపోషణ ఘంటసాలవారి గాత్రంలో నూటికి నూరుపాళ్ళు గోచరిస్తాయి.

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసిన 'రసికరాజ తగువారము కామా' పాట సాహిత్యపరంగా కూడా ' ఎంతో ఉన్నతమైనది.  

అగడు సేయు ( అవమానించు); సురసాల (కల్పతరువు);
ఏల, ఏలు మాటలతో వివిధార్ధాలు ధ్వనింపజేసారు; దివ్యనామ మధుపానము;
సారసాక్ష ( కమలాక్షుడు); మనసా, వచసా - వంటి పదప్రయోగాలతో మల్లాదివారు ఎంతటి ఉన్నతస్థాయి కవివరేణ్యుడో మనకు అవగతమవుతుంది.

మహారాజులు ఆగ్రహానుగ్రహ సమర్ధులు. రాజుల ఆదరణ పొందాలంటే వారిని రకరకాల స్తోత్రాలతో సంతృప్తిపరచి  ఆనందపర్చాలి. వారి మెప్పులు పొందాలి. 
అందుకు తగిన విధంగా గీతం ఆరంభంలోనే మహారాజుకు ప్రీతిపాత్రమైన చక్రవాక, కానడ రాగాలు మిళితంచేసి 'విజయానందచంద్రిక' పేరుతో మహారాజును, సభలోని పండితులను మెప్పింపజేయాలని ఆశిస్తున్నట్లు  జనపద కళాకారుడుగా పేరు పొందిన ఆ గాయకుడు ప్రకటించి తన దేవగానాన్ని ప్రభువుల ముందు వినిపిస్తాడు. అందుకు తగిన ఆణిముత్యాలవంటి మాటలను పొదిగారు మల్లాదివారు. 

ఎంతో ఉదాత్తము, గంభీరము అయిన ఆ సన్నివేశంలో మహారాజుగా ఎస్.వి.రంగారావు, ఆ జనపద గాయకుడంటే విముఖత కలిగిన రాజనర్తకిగా రాజసులోచన, వీరందరి మెప్పులు పొందడానికి పోటీ పరిక్షకు సిధ్ధపడిన గాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు అతని భార్యగా అంజలీ దేవి అద్యంతం
అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా కథానాయకుడు అక్కినేనివారికి ఈ పాత్ర చాలా క్లిష్టతరమైన పాత్ర. మామూలు లలితగీతాలకు నటించడం వేరు, ఈలాటి శాస్త్రబధ్ధమైన గీతాలకు నటించడానికి సంగీత విద్వాంసుల ఆహార్యం, హావభావల పట్ల అవగాహన చాలా ముఖ్యం.

ఈ పాట సందర్భంలోని విషయాన్ని, పాటకి ముందు పాత్రల సంభాషణ చూస్తే ఈరోజు  అటువంటి సందర్భాన్ని, కథని ఊహించి అంతటి ఔచిత్యంతో సంభాషణలు రాయగలిగే రచయితలు, దాన్ని అంత అద్భుతంగానూ దృశ్యీకరించగల దర్శకులు, ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగల నటులూ లేరనే అనిపిస్తుంది.

ఘంటసాలవారి గానంలోని సంగతులు, గమకాలు, స్వరకల్పనలు వాటన్నికి తగినట్లు పెదవులను, కంఠనాళాలను కదల్చడం, అందుకు తగిన హావభావాలను తన ముఖంలో ప్రదర్శించడం విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు చూపిన టైమింగ్, ప్రతిభ అమోఘమైనది. కేవలం గాయక నటులు మాత్రమే అంత నిర్దుష్టంగా నటించగలుగుతారు. ఈ విషయంలో అక్కినేనిని మించిన నటులు బహు అరుదు.

చిత్ర జయాపజయాల విషయం పక్కనపెడితే పి.పుల్లయ్యగారి దర్శకత్వంలోని  'జయభేరి' ఒక గొప్ప సంగీత దృశ్యకావ్యం. తెలుగు సినిమా కీర్తి కిరీటంలో పొదగబడిన అమూల్య రత్నం.

ఒక కళాకారుడి ప్రతిభని అంచనావేసే విషయాలు ఆ కళాపరమైనవిగానే ఉండాలి తప్ప అతని కులం, మతం, ప్రాంతం, భాషా, వ్యక్తిగత అభిప్రాయాల ప్రాతిపదికనగాదు అన్నది సినిమాలో ఈ పాట సందర్భంలోని విషయం. కానీ ఈ సినిమా విడుదలైన అరవై అయిదేళ్ళ తరవాత కూడా కొందరి ఆలోచనాధోరణి అంతలోనే, ఆ గిరిలోనే  కొట్టుకుంటూండడం ఆశ్చర్యం. జయభేరి సినిమాలోని కాశీనాథశాస్త్రి  వ్యక్తిత్వం, ఈ సంవత్సరం మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారి "సంగీత కళానిధి" పురస్కార వివాదంలోని కేంద్రబిందువు శ్రీ T M కృష్ణ వ్యక్తిత్వాలలోని సారూప్యం గమనించకుండా ఉండలేము. ఆ విషయం గ్రహించడానికే ఈ పాట సందర్భంలోని ముందు మాటలతో ఈరోజు వీడియో సమర్పిస్తున్నాను. 








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


Saturday, 11 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 29వ భాగం - శివశంకరీ శివానందలహరి శివ శంకరి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఎనిమిదవ భాగం ఇక్కడ

29వ సజీవరాగం -   "శివశంకరీ శివానందలహరి శివశంకరి"
చిత్రం -  జగదేకవీరుని కథ
సంగీతం - పెండ్యాల


శివశంకరీ శివానందలహరి శివ శంకరి

చంద్రకళాధరి ఈశ్వరీ 
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము సేయవే
శివశంకరీ  శివానందలహరి
శివశంకరి...

ఈ పాటకు కవి పింగళి నాగేంద్రరావు గారు ఇచ్చిన మాటలు ఇంతే. మిగిలినదంతా సంగీతదర్శకుడు పెండ్యాల గారి స్వరమహత్యం, గాన గంధర్వుడు ఘంటసాలవారి త్రిస్థాయి గళ మాధుర్యమే.

గాయకుడిగా ఘంటసాలవారికి, నటుడిగా ఎన్.టి.రామారావుగారికి
శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన ఈ 'శివశంకరి' విజయావారి 'జగదేకవీరుని కథ'
సినీమాలోనిదన్న విషయం జగమెరిగిన విషయం.  నటుడు ఎన్.టి.రామారావుగారికి , గాయకుడు ఘంటసాలగారికి, గీత రచయిత పింగళి నాగేంద్రరావుగారికి విజయా ప్రొడక్షన్స్ మాతృస్థానం వంటిది.  అటువంటి సంస్థ తీసిన సినిమాలోని పాట అజరామరత్వం పొందడం ఓ గొప్ప విశేషం.

ఇప్పుడు శ్రీ పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన ఒక పల్లవి, ఒకటే చరణం కలిగిన
'శివశంకరీ శివానంద లహరి' పాటను గురించి, ఆ పాట నేపథ్యం గురించి చూద్దాము.

1944లో కోయంబత్తూర్ పక్షిరాజా స్టూడియోస్ అధినేత ఎస్.ఎమ్. శ్రీరాములు నాయుడు  'జగదల ప్రతాపన్' అనే జానపద చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈయన సోదరుడు ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు ప్రముఖ సంగీత దర్శకుడు ('మురిపించే మువ్వలు', 'విమల') కానీ జగదల్ ప్రతాపన్ తమిళ చిత్రానికి జి. రామనాధయ్యర్ సంగీతం సమకూర్చారు.
స్వతహాగా గాయకుడు కూడా అయిన పి.యు.చిన్నప్ప ఆ సినీమా హీరో. ఆ సినీమాలో హీరో పాటలన్నీ తానే పాడుకున్నారు. ఈ సినీమా తర్వాత హీరో పి.యు.చిన్నప్పకు  ఆనాటి సూపర్ స్టార్ ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ తో సమానమైన కీర్తిప్రతిష్టలు లభించాయి.

ఆనాటికి ఇంకా డబ్బింగ్ సినీమా ప్రక్రియ రాలేదు. జగదల ప్రతాపన్ తమిళ చిత్రమే తెలుగునాట కూడా ప్రదర్శించబడి విపరీతమైన జనాదరణ పొందింది.

ఈ సినీమా  వచ్చిన 18 ఏళ్ళ తర్వాత ఈ కథ  ఆధారంగానే  నాగిరెడ్డి-చక్రపాణి ల విజయా బ్యానర్ మీద  శ్రీ కె.వి.రెడ్డి 'జగదేకవీరుని కథ' చిత్రం నిర్మించారు. కథ అంతా తమిళ సినీమా కధథే. అందులో కూడా నలుగురు హీరోయిన్లు. అగ్నికుమారిగా తమిళంలో ఎస్.వరలక్ష్మి నటించి తన పాటలు తానే పాడారు . తెలుగులో గాయని కాని నటి కమలకుమారి (జయంతి) ఆ వేషాన్ని పోషించారు. జీవరత్నం అనే మరో నటి మరో హీరోయిన్.

శివశంకరి పాట సన్నివేశంలో తమిళంలో ఒక 12 నిముషాల పాట. ఏకబిగిన పి.యు.చిన్నప్ప శుధ్ధ కర్ణాటిక్ పధ్ధతిలో పాడారు. కళ్యాణి రాగంలో జి.రమనాధన్ స్వరపర్చారు. ఈ పాటలో ఒకే ఫ్రేములో హీరో పి.యు.చిన్నప్ప వైలిన్, మృదంగం, ఘటం, కున్నక్కోల్ (దీనినే సొల్లుకట్టు అంటారు. అంటే నోటితోనే తాళగతులను చెప్పడం) వాయిస్తూ పాడతారు. (తెలుగులో సితార్ ,  తబలా, మృదంగం,  తంబురా పక్క వాయిద్యాలుగా వాడారు).

తమిళంలో యీ పాట నిడివి ఎక్కువైపోయిన కారణంగా గ్రామఫోన్ రికార్డ్ గా రాలేదట. అసలు యీ పాట నలభై నిముషాల పాట అని మరొక చోట చదివాను. పి.యు.చిన్నప్ప తన శాస్త్రీయ సంగీత కచేరీలలో పాడేవారట. 

ఈ పాట స్ధానంలోనే తెలుగులో జగదేకవీరుని కథలో ' శివశంకరీ శివానందలహరి అనే అజరామర గీతం దర్బారీకానడ రాగంలో మాస్టారి త్రిస్థాయి గళం నుండి జాలువారింది. ఈ పాటలోని స్వరకల్పనలు, సంగతులు, గమకాలు ఎంతటి మహాగాయకులకైనా పెను సవాలే. సరస్వతీ వరప్రసాది కావడం వలన ఘంటసాలవారు తప్ప మరొకరు ఈ పాటకు పరిపూర్ణ న్యాయం చేకూర్చలేరనే కీర్తి లభించింది.

పెండ్యాల నాగేశ్వరరావుగారు ఈ పాటను స్వరపర్చడానికి దర్బారీకానడ అనే హిందుస్తానీ రాగాన్ని తీసుకున్నారనే విషయం అందరికీ తెలిసినదే. దర్బారీకానడ అసావేరి థాట్ కు చెందిన రాగం.  ఈ రాగాన్ని మొదటిసారిగా అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడు మియా తాన్సేన్ గానం చేసి ప్రచారంలోనికి తీసుకువచ్చారు. వివిధ భావావేశాలు ప్రకటించడానికి, త్రిస్థాయిలలో గానం చేయడానికి అనువైన రాగంగా చెపుతారు.

శివశంకరి పాటలో ప్రధానంగా వినిపించే వాయిద్యాలు - సితార్, ఫ్లూట్, తబలా, పక్వాజ్, తంబురా, వైయొలిన్స్, మొదలైన భారతీయ సంగీతానికి అనువైన వాయిద్యాలనే ఉపయోగించారు పెండ్యాల.

ఘంటసాల మాస్టారి గాత్రధర్మం గురించిచెపుతూ ఈ చిత్ర సంగీత దర్శకుడు
పెండ్యాల నాగేశ్వరరావుగారు - "ఏ గాయకుడి గాత్రమైనా గొప్పది, లేదా ఆ గాయకుడు గొప్ప గాయకుడు అని చెప్పడానికి ఆ గాయకుని గాత్రం త్రిస్థాయిలలోనూ శ్రుతిశుధ్ధంగా పలకాలి. మంద్రస్థాయిలో పాడినా, మధ్యమ స్థాయిలో పాడినా, తారస్థాయిలో పాడినా సంపూర్ణమైన
ధ్వనితో, నాదాన్ని అనుభవిస్తూ పాడగలగాలి. అటువంటి సంగీత కళాకారుడు యావద్భారత దేశంలో ఒక్క ఘంటసాలగారేనేమో అని అనిపిస్తుంది నాకు".

శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని అనుసరించి , అనేక స్వరకల్పనలతోను , జతులతోనూ నిండిన పాటను తెరమీద అభినయించడం, సంగీత పరిజ్ఞానం లేని ఏ నటుడికైనా కత్తిమీద సామువంటిదే. మూడు స్థాయిలలో వచ్చే స్వరాలకు నిర్దిష్టంగా నటుడు తన పెదవులు కదుపుతూ, ఆ గీతాన్ని సహజంగా తానే పాడుతున్న భ్రమను శ్రోతలకు కల్పించి మెప్పించడంరామారావుగారి వంటి నటరత్నానికే సాధ్యపడుతుంది. ఆయన శివశంకరి పాటకు తన నటనతో పరిపూర్ణ న్యాయంచేకూర్చి  ఆ పాట శతాబ్దాలపాటు ప్రజల హృదయాలలో నిలిచిపోయేలా చేసారు.

ఒక్క కథ విషయంలో తప్ప తమిళానికి, తెలుగుకు ఏవిషయంలోనూ సాపత్యం లేదు. ముఖ్యంగా సంగీతం పూర్తిగా విజయా, కె.వి.గార్ల అభిరుచితోనే రూపొందించబడ్డాయి. ముందుగా పింగళిగారు వ్రాసి పెండ్యాలగారు స్వరపర్చిన  ఒక పాట దాదాపు 15 నిముషాలుందని, అంతసేపు  ఒక శాస్త్రీయ గీతాన్ని వినే ఓపిక మన తెలుగు ప్రేక్షకులకు లేదని కె.వి.రెడ్డిగారు భావించి దానిని ఆరు నిముషాలకు కుదించి ట్యూన్ కట్టమని ఆదేశించారట.
ఆ విధంగా ఆరు,  ఏడు నిముషాలకు కుదించబడిన గీతమే 'శివశంకరి'.
తెలుగునాట ఒక పెద్ద సంచలనాన్ని, చరిత్రను సృష్టించింది.

గత రెండున్నర దశాబ్దాలుగా శివశంకరి పాట మీద వచ్చినన్ని సమీక్షలు, ప్రముఖుల అభిప్రాయాలు , చర్చలు మరే యితర పాట మీదా జరగలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ పాట విషయంలో తరుచూ చాలా మంది అడిగే ప్రశ్న - 
1. ఈ పాటను ఘంటసాలగారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు?
2. ఈ పాట ఒక్క టేక్ లోనే ఓకే అయిందా ? ఎన్ని టేకులులో పాట ఓకే అయింది.
3. ఈ పాటను ఘంటసాలవారు ఒక్కరే పాడారా లేక యితర గాయకులతో కలసి పాడారా ?
ఈ విధమైన సందేహాలను వెలిబుచ్చి రకరకాల అభిప్రాయాలు ప్రచారమయాయి.

ఈ పాట ట్యూన్ కట్టి, ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ చేయడం, తర్వాత పాట షూట్ చేయడం వంటి ప్రక్రియలన్నీ మామూలుగానే అన్ని సినీమా పాటల్లాగే జరిగింది. కాకపోతే రాగప్రధానమై అనేక స్వరాలతో నిండిన పాట కనుక ఘంటసాలగారు  మిగిలిన పాటలకంటే కొంచెం ఎక్కువకాలం ప్రాక్టీసు చేసారు. స్టూడియోలో పాట రికార్డింగ్ అయి, షూటింగ్ ముగిసి,  ఆ పాట గ్రామఫోన్ రికార్డై వచ్చి, సినీమా విడుదలై హిట్ కావడం, పాటలన్నింటికన్నా మిన్నగా 'శివశంకరి' మరింత హిట్ కావడంతో  ఘంటసాలవారి ఖ్యాతి మరింత పెరిగింది.  సినీమా విడుదలకు ముందు ప్రివ్యూ చూసినవారంతా మాస్టారిని, పెండ్యాల వారిని అభినందించారు. అది అన్ని సినీమాల విషయంలో జరిగినట్లే జరిగింది. 

అక్కడితో సరి. అప్పట్లో ఎవరు పై ప్రశ్నలను, సంశయాలను వెలిబుచ్చగా విన్న, లేదా చదివిన గుర్తులేదు.

ఇటీవలి కాలంలో, అంటే సోషియల్ మీడియా పెరిగిన తర్వాత,  దాదాపు ఇరవై సంవత్సరాలుగా యీ పాట గురించి ఎవరికి తోచిన అభిప్రాయాలు, అతిశయోక్తులు  తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ పాటలో ఘంటసాల మాస్టారితో పాటు మరో యిద్దరు కూడా గళం కలిపి పాడినట్లు  కొంత ప్రచారం జరిగింది. కాని అది తప్పని  ఘంటసాల ఒక్కరే  మొత్తం పాడారని, ఆఖరిలో వచ్చిన ద్విగళాలు, ఆయన పాడగా మరో ట్రాక్ మీద రికార్డ్ చేసి మిక్స్ చేసామని ఆ పాట రికార్డ్ చేసిన వాహినీ స్టూడియో సౌండ్ ఇంజనీరు  వల్లభజోస్యుల శివరాంగారు  ఒక ఇంటర్వ్యూలో చెప్పేరు.

గానగంధర్వుడు ఘంటసాల, ఆయన ఆప్తమిత్రుడు నటరత్న ఎన్.టి.రామారావుగార్ల శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో  వారిద్దరి సమ్మేళనంలో రూపొందిన 'శివశంకరి శివానందలహరి ' నిజంగా సజీవరాగమే.

ఇది తెలుగు భాష ఉన్నంతవరకూ చిరస్మరణీయంగా, చిరంజీవిగా మిగిలిపోయే పాట అనేది అక్షరసత్యం.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday, 4 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 28వ భాగం - నా హృదయంలో నిదురించే చెలీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఏడవ భాగం ఇక్కడ

28వ సజీవరాగం -   

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోన కవ్వించే సఖీ మయూరివై
వయారివై నేడే నటనమాడి నీవే నన్ను
దోచినావే - నా హృదయంలో !!

నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే - నా హృదయంలో !!

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే 
పల్లవిగా పలుకరించ రావే, నీ వెచ్చని నీడా వెలసెను నా
వలపుల మేడా నివాళితో చేయిచాచి
ఎదురు చూచినానే నిదుర కాచినానే
- నా హృదయంలో నిదురించే చెలీ...!!
                
శంకరాభరణం చాలా విశిష్టత కలిగిన రాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతున్నందువలన ఇది సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. గమక ప్రాధాన్యత గల రాగం. ఈ ధీరశంకరాభరణం రాగానికి ప్రసిధ్ధి పొందిన అనేక జన్యరాగాలు వున్నాయి. బిలహరి, దేవగాంధారి, ఆరభి, అఠాణా, కురింజి, కదనకుతూహలం, శుధ్ధ సావేరి, కేదారం, ఇలా ఎన్నోరాగాలు ధీరశంకరాభరణ  జన్యాలే. ఈ రాగాలన్నింటిలో బహుళ జనాదరణ పొందిన  సినిమా పాటలు అసంఖ్యాకంగా వున్నాయి. శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతశైలిలో బిలావల్ అంటారు. (కానీ  స్వరాల మూర్చన  బిలహరికి దగ్గరగా వుంటుందని అంటారు). ఈ  శంకరాభరణం రాగం మన భారతీయ సంగీతంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల సంగీతంలో కూడా వినిపిస్తుంది. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టమ్ లో శంకరాభరణాన్ని లోనియన్ మోడ్ లేదా మేజర్ స్కేల్ అంటారు. శ్రావ్యమైన, మృదుమధుర భావాలను వెల్లడించడానికి శంకరాభరణం రాగం చాలా అనువైన రాగంగా సంగీతజ్ఞులు భావిస్తారు.

ఈ శంకరాభరణ రాగ స్వరాలతో వచ్చిన పాటలెన్నింటినో అమరగాయకుడు ఘంటసాలవారు ఆలపించి వాటికి అజరామరత్వం కల్పించారు. సీతారామ కళ్యాణంలో  రామారావు గారికి పాడిన "కానరార కైలాసనివాస", భార్యాభర్తలులో అక్కినేని వారికి పాడిన "జోరుగా హుషారు షికారు పోదమా", శాంతినివాసం లోని "కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే", అభిమానం సినిమాలోని "లపు తేనె పాట"(అన్య స్వరాలతో)... చెప్పుకుంటూపోతే  ఇలాఎన్నో మనోరంజకమైన పాటలున్నాయి.

ఆ కోవలోకి చెందినదే నేటి మన ఘంటసాల మాస్టారి సజీవరాగం
"నా హృదయంలో నిదురించే చెలీ"
శంకరాభరణం రాగంలో స్వరపర్చబడింది.

ఈ పాట అక్కినేని, సావిత్రి , రాజశ్రీ, గిరిజ, జగ్గయ్య, రేలంగి మొదలగువారు నటించిన 1962లో విడుదలైన "ఆరాధన" సినీమాలోనిది. ఇదొక ట్రైయాంగిల్ లౌవ్ స్టోరీ. 

జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద విబి రాజేంద్రప్రసాద్ నిర్మించిన రెండవ సినీమా " ఆరాధన". అమోఘమైన విజయం సాధించింది. అందుకు కారణం ఈ సినీమా సంగీతం , ముఖ్యంగా, "నా హృదయంలో నిదురించే చెలీ" పాట.

ఈ సినీమాకు సంగీతదర్శకుడు సుస్వరాల రసాలూరు రాజేశ్వరరావుగారు. వివిధ వాద్యాలు వాయించడంలో, విభిన్న సంగీత బాణీలు సృష్టించడంలో నిష్ణాతుడు.

"నా హృదయంలో నిదురించ చెలీ" పాటను శ్రీ శ్రీ వ్రాసారు. "మనసు కవి" కితాబును మనవాళ్ళు ఆత్రేయగారికి ఇచ్చారు కానీ అలాటి హృద్యమైన , మనసులో చిరస్థాయిగా నిలచిపోయే పాటలెన్నింటినో శ్రీశ్రీ గారు వ్రాసారు.

ఈ ఆరాధన చిత్రానికి  మాతృక 'సాగరిక' అనే  బెంగాలీ సినీమా, 1956లో వచ్చింది. ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్ ప్రధాన పాత్రలు ధరించారు. రాబిన్ ఛటర్జీ సంగీతంలో శ్యామల్ మిత్ర అనే గాయకుడు పాడిన పాట వరసనే  తెలుగులో "నా హృదయంలో నిదురించే చెలి " గా మలిచారు రాజేశ్వరరావు గారు.

పాట మూలం బెంగాలీయే అయినా దానికి పూర్తి తెలుగుదనాన్ని ఆపాదించినవారు మాత్రం సాలూరు రాజేశ్వరరావుగారు, ఘంటసాలగారు మాత్రమే. గమకప్రాధాన్యంగల సుశాస్త్రీయ శంకరాభరణ రాగాన్ని లలితమైన గమకాలతో అత్యంత శ్రావ్యంగా, మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ అమోఘంగా గానం చేసారు ఘంటసాల.

మన పాత సినిమాలలో హీరో, హీరోయిన్లు లేదా వ్యాంప్ పాత్రధారులు చేత పియోనా వాయిస్తూ పాటలు పాడించడమనేది అనవాయితీగా వచ్చిన బాక్సాఫీస్ ఫార్ములా.  రాజేశ్వరరావుగారు చాలా బాగా పియోనా వాయిస్తారు. కానీ, తన సినిమా లలో పియోనా పాటలన్నీ తన పెద్ద కుమారుడు రామలింగేశ్వరావు చేతే వాయింపజేసేవారు. ఈ పాట చిత్రీకరణ లో పియోనా వాయిస్తూ  క్లోజప్ లో కనిపించే చేతులు రామలింగంవే అని చెప్పుకోవడం నేను విన్నాను.

పియోనా, ఫ్లూట్, తబలా ప్రధానంగా సాగే ఈ పాటలో ఘంటసాలవారి కంఠస్వరం  ప్రతీ నోట్ ను చాలా ఖణీగా, సుస్పష్టంగా శ్రోతల హృదయాలను తాకేలా పలికింది.

ఈ సినీమా లో ఏడు పాటలుండగా హీరో అక్కినేనికి ఒకే ఒక్క పాట ఈ సూపర్ హిట్ సాంగ్. మాస్టారు పాడారు. ఆనాటి సినీమాలలో హీరోల కంటే రేలంగికే ఎక్కువ పాటలుండేవి. ఆరాధనలో  రేలంగికి ఉన్న రెండు డ్యూయెట్ లను ఘంటసాల మాస్టారే పాడారు. ఆ పాటలలో ఘంటసాలవారి గాత్ర వైవిధ్యం విన్నవారికే ఎరుక.

అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు బెంగాలీ సాగరికలోని పాటకన్నా అరాధన చిత్రంలోని "నా హృదయంలో నిదురించే చెలీ" పాటే మిన్నగా భావిస్తాను. అందువల్లే ఈ పాట గత అరవై సంవత్సరాలుగా తెలుగు హృదయాలను దోచుకుంటూనే వుంది, గాయకులందరి నోటా వినవస్తూనే వుంది.

ఈ శీర్షిక విషయంగా చిన్న మాట.
ఘంటసాల పాట మీద ఉన్న ఆరాధనతో ఈ 'సజీవరాగం' సమీక్ష మొదలుపెట్టానే కానీ, ఆ యా పాటలలో గల సంగీత సాహిత్య వైశిష్ట్యాన్ని సోదోహరణంగా చెప్పడానికి  నాకు భాషలోగానీ, సంగీతంలో గానీ ఏమాత్రం ప్రవేశం లేదు. అందుచేత నా యీ వ్యాసాలు vague గా , shallow గా వుండే అవకాశం వుంది. 
అందరూ సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday, 27 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 27వ భాగం - దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఆరవ భాగం ఇక్కడ

27వ సజీవరాగం -   

"దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో..."
              
 పల్లవి :
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో !

చరణం :
పాలిత కింకర భవ నాశంకర శంకర
పురహర నమో నమో
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో !

చరణం: 
దురిత విమోచన ఫాలవిలోచన 
పరమదయాకర నమో నమో
కరిచర్మాబర , చంద్రకళాధర 
సాంబ దిగంబర నమో నమో !

చరణం :
నారాయణ హరి నమో నమో
నారద హృదయవిహారీ నమో నమో
పంకజనయనా పన్నగశయనా
శంకరవినుత నమో నమో 
నారాయణ హరి నమో నమో !

శివకేశవులకు అభేదం అని మన ప్రాచీన పురాణాలెన్నో చెపుతున్నా శైవమతం , వైష్ణవమతమంటూ మానవులు భేదాలతో వైషమ్యాలతో కలహించుకుంటూ శాంతికి భంగం కలిగించడం మనకు తెలిసినదే. శివుడు, విష్ణువ  పేరిట ఆ విధమైన విద్వేషాలు తగవని  1958 లో వచ్చిన భూకైలాస్ సినీమాలోని కొన్ని సన్నివేశాలు మనకు ప్రబోధించడం గమనించవచ్చును.

అందులోని  "దేవ దేవ ధవళాచల మందిర" నేటి మన సజీవరాగం. ఈ పాటలో హరి హరుల ఇద్దరి ప్రస్తావనను అతి సమర్ధంగా తీసుకువచ్చారు గేయ రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు. ఒకే సన్నివేశంలో  శివనామ స్మరణంతో రావణాసురుడు,  హరినామ స్మరణతో నారదుడు వస్తూ దారిలో కలుసుకుంటారు.   

పాత్రపరంగా హరి అవతారమైన రాముడు పేరుగల రామారావుగారు పరమేశ్వరుని; ఈశ్వర నామం గల అక్కినేని నాగేశ్వరరావు గారు నారాయణుని స్తుతిస్తూ  నటించడం శివకేశవులు ఒకటేనని చెప్పకచెప్పడం ఓ విశేషం.

భూకైలాస్ సినీమా పేరు చెప్పగానే వెంటనే మనం తల్చుకునేది ఆ సినీమాలోని ఘంటసాలవారి పాటలను, పద్యాలనే. భూకైలాస్ చిత్రం లో ఘంటసాలవారి  శాస్త్రీయ,/ లలిత గాన ప్రతిభ అణువణువునా ద్యోతకమౌతుంది. రావణాసురుడిగా రామారావుగారు, నారదుడిగా అక్కినేని వారు మన మనస్సుల్లో చిరస్థాయిగా నిల్చిపోవడానికి కారణం ఘంటసాల మాస్టారి అద్వితీయ దేవగానమే.

ఈ పాటలో శంకరుడికి సంబంధించిన పల్లవి, చరణాలను జంఝూటి రాగంలో, విష్ణువుకు సంబంధించిన చరణాన్ని కాపీ రాగంలో స్వరపర్చి  తగు మాత్రపు వాద్యాలు - ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలాలు వంటివి మాత్రమే సున్నితంగా ఉపయోగించి గాత్రానికే ప్రాధాన్యతనిచ్చారు సంగీత దర్శకులు. ఈ పాటలో ఘంటసాలవారి గాత్రంలోని భక్తి తత్పరతలు, పరవశత్వం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది.

జంఝూటి రాగం హిందుస్తానీ సంప్రదాయ సంగీతపు రాగం. ఆరోహణలో ఆరు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతూ, వక్ర సంచారం చేయడంవలన ఈ రాగాన్ని షాఢవ-సంపూర్ణ వక్ర రాగంగా పరిగణిస్తారు.

కర్నాటక సంగీత కాపి రాగం ఖరహరప్రియ జన్యరాగం. ఇది కూడా షాఢవ-సంపూర్ణ వక్రరాగమే. దీనికి సమాంతరమైన హిందుస్తానీ రాగం పీలు.

ఇంతటి చక్కటి పాటలను స్వరపర్చిన సుదర్శనం - గోవర్ధనం సోదరులు చిరస్మరణీయులు. ఏవిఎమ్ స్టూడియో వాద్యబృంద నిర్వాహకులుగా , ఎమ్మెస్ విశ్వనాధన్ కు సహాయకులుగా యీ సోదరులు చిరపరిచితులు.  ఏవిఎమ్ తీసిన అనేక చిత్రాలకు సుదర్శనం - గోవర్ధనం సోదరులు సంగీత దర్శకత్వం వహించారు.

భూకైలాస్ లో పాటలన్నీ సంప్రదాయబధ్ధంగా, రాగాలకు కట్టుబడే స్వరపర్చబడ్డాయి. ఈచిత్రంలో పాటలను ఘంటసాల, ఎమ్.ఎల్.వసంతకుమారి, కోమల, టి.ఎస్.భగవతి, సుశీల వంటి హేమాహేమీలు ఆలపించారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. 

ఘంటసాలవారి కంచుకంఠాన వెలువడిన యీ చిత్రంలోని ప్రతి పాట , పద్యం యీనాటికీ సంగీతాభిమానులందరికీ షడ్రసోపేత విందుభోజనమే. భూకైలాస్ లో మాస్టారు పాడిన - దేవ దేవ ధవళాచల మందిర, (జంఝూటి, కాపి) నీలకంధరా దేవా (తిలాంగ్ రాగం), తగునా వరమీయ ( మాయమాళవగౌళ, పీలు రాగాల మిశ్రమం) రాముని అవతారం రఘుకుల సొముని అవతారం, సుందరాంగ అందుకోరా - (సుశీలగారు పాడిన యీ పాట  నేపధ్యంలో ఘంటసాలవారు వివిధస్థాయిలలో ఆలపించిన ' ఓం నమశ్శివాయ ' నామం ఒక అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది.), వంటి పాటలతోపాటూ యితర పాటలు పద్యాలు కూడా  శాస్త్రీయ సంగీతాభిమానులందరినీ ఎంతగానో అలరించాయంటే అందుకు ప్రధాన కారణం ఘంటసాలవారి సంగీత విద్వత్తే అంటే అతిశయోక్తి కాదనే నా భావన.

అగ్రనటులు అక్కినేని, నందమూరి పోటాపోటిగా నటించి తమ నటనా వైదుష్యాన్ని కనపర్చిన చిత్రం భూకైలాస్. నందమూరి వారు రావణబ్రహ్మగా విశ్వరూపం దాల్చడానికి బీజం  యీ భూకైలాస్ లోనే పడిందని చెప్పవచ్చును.

సముద్రాల రాఘవాచార్యులవారు శుధ్ధశ్రోత్రీయ శ్రీవైష్ణవుడైనా, దేవదేవ ధవళాచల మందిర పాటలో శివ కేశవులిద్దరినీ సమానంగా తరతమ భేదం పాటించకుండా  స్తుతించి కవితా మర్యాదలను పాటించారు. 

దేవదేవ ధవళాచల మందిర పాటలో ఎన్.టి.ఆర్ , ఏ.ఎన్.ఆర్ యిద్దరికీ ఒకే సమయంలో  గాత్రదానం చేసి ఎంతో వైవిధ్యాన్ని చూపి శ్రోతలను మెప్పించిన ఘనత ఘంటసాలవారిదే. అక్కినేనే  పాడుతున్నారు , లేదు రామారావే పాడుతున్నారనే భ్రమలో పెట్టి పాడే సామర్ధ్యం ఒక్క ఘంటసాలవారి కే వుంది. వారిరువురి గాత్రధర్మాలకు తగినట్లు నామమాత్రపు శృతిభేధంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు వేలాది మనోజ్ఞగీతాలను ఆలపించిన ఘంటసాలవారు తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయులైనారు.

భూకైలాస్ కు ముందు మరే సినీమాలోనూ ఈ ఇద్దరు నటులకు ఒకేసారి ఒకే గాయకుడు పాడిన దాఖలాలు లేవు. ఆనాటికి ఇదొక అద్భుత గాత్ర ప్రయోగమేనని చెప్పాలి.

నిర్మాత  ఎ.వి.మెయ్యప్పన్, దర్శకుడు కె.శంకర్, సంగీతదర్శకులు  సుదర్శనం - గోవర్ధనం సోదరులు తెలుగువారు కానప్పటికి భూకైలాస్ వంటి అజరామరమైన పౌరాణిక చిత్ర కళాఖండాన్ని తెలుగువారి స్వంతం చేసినందుకు మనం చాలా ఋణపడివున్నామనే చెప్పాలి.

ఒక్క ఘంటసాలవారి కే కాక ఎన్.టి.రామారావు , అక్కినేని నాగేశ్వరరావుగార్లకు కూడా అజరామరత్వాన్ని కల్పించిన చిత్రరాజం భూకైలాస్.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...