చిత్రం - కృష్ణప్రేమ
గానం - ఘంటసాల
సంగీతం - పెండ్యాల
పల్లవి :
మోహనరూపా గోపాలా - 2
ఊహాతీతము నీ లీలా - 2
చరణం :
వలదని నిన్ను వారించువారిని
వదలక వెంట తిరిగెదవయ్యా ! వలదని!
వేణువునూదుచు వేడుక చేయగ
వేడినవారికి దరిశనమీయవు - మోహనరూపా గోపాలా
రెండవ చరణం :
అవనిభారము అమితముకాగా
అవతరించితివి ఎన్నిసారులో...
కృష్ణా.... రాగాలాపన
అవని భారము...
అన్నిటికన్నా అపురూపమైనది
కన్నులవిందగు ఈనాటి రూపము ..
మోహనరూపా గోపాలా..
రాగాలాపన..
శ్రీకృష్ణుడు లీలామానుష రూపధారి. మూర్తీభవించిన అలౌకికానందం. సచ్చిదానంద స్వరూపం. రాధ పట్ల,గోపికల పట్ల కృష్ణుడు కనపర్చిన ప్రేమానురాగాలు బాహ్యమైన మోహానికి అతీతమైనవి. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలకు అతీతమైనవారికే కృష్ణుని ప్రేమ అర్ధమవుతుంది.
తనంటే నమ్మకంలేనివారికి, తనను ద్వేషించేవారికి తరచూ కనిపిస్తూ వారిని కల్లోలపరుస్తాడు. తననే నమ్మి తన దివ్య దర్శనం కోసం తపించి , ఆరాటపడేవారి కంటపడకుండా దూరంగా వుంచుతూ మురిపిస్తూంటాడు ఆ కృష్ణుడు. కృష్ణ శబ్దంలోనే నల్లనివాడు అనే అర్ధముంది. ఆ నీలమేఘశ్యాముని సౌందర్యం స్త్రీ పురుషులనే కాదు సకలజీవులను సమ్మోహనపరుస్తుంది. సామాన్య మానవులకు అర్ధం కానిది కృష్ణతత్త్వం. మహావిష్ణువు అవతారాలలోని ఎనిమిదవ పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఆ భగవత్స్వరూపుని అర్ధంచేసుకోవాలని నారదాది మహర్షులు, మునిపుంగవులు, మహాభక్తులెందరో నిరంతరం స్మరించి, జపించి, తపించి, తరించారు.
నిత్య హరినామ స్మరణతో నారదుడు లోకకళ్యాణ కార్యక్రమాలెన్నింటినో ఆ దేవదేవుని అండదండలతో నిర్వహించాడు. "మోహనరూపా గోపాలా , ఊహాతీతము నీ లీల" అంటూ అనిర్వచనీయమైన కృష్ణుని ప్రేమతత్త్వాన్ని సామాన్య పామరాజనాలకు బోధపరుస్తాడు నారదుడు "కృష్ణప్రేమ" చిత్రంలో.
సంగీతాభిమానులందరినీ సమ్మోహనపర్చే ఈ భక్తిగీతాన్ని ఆరుద్ర ఎంతో భావయుక్తంగా వ్రాసారు. "వలదని నిన్ను వారించువారిని", "వేడుకచేయగ వేడినవారికి దరిశనమీయవు" అనే పదాలను తరచిచూస్తే ఎంతటి గొప్ప అర్ధమైనా స్ఫురిస్తుంది. ఎవరెంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆ కృష్ణుడు వివిధ కోణాలలో గోచరిస్తాడు.
ఈ పాటలో వున్నవి రెండే చిన్న చిన్న చరణాలు. ఉన్న మూడు నిముషాల పాటా సినీమా లో ఒకేసారి రాదు. నారదుడు లోకసంచారికదా, అక్కడో పల్లవి, ఇక్కడో చరణం అని సందర్భానుసారం రెండు మూడు కట్ల్ గా "కృష్ణప్రేమ" సినీమా లో ఆలపిస్తాడు.
ఈ చిత్రానికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. సాంఘిక చిత్రాల నిష్ణాతుడైన ఆదుర్తి బహు అరుదుగా పౌరాణిక చిత్రాలకు డైరక్ట్ చేసారు. బహుశా "కృష్ణప్రేమ" ఒక్కటేనేమో వారి పౌరాణికం. కృష్ణుడుగా బాలయ్యను ఎన్నుకోవడం ఆదుర్తిలాటివారికే సాధ్యం. సత్యభామ గా గిరిజ , రాధగా ఎస్.వరలక్ష్మి, కృష్ణ ద్వేషిణి అయిన ఆమె చెల్లెలు చంద్రగా జమున నటించారు. నారదుడు పద్మనాభం.
కృష్ణుడి పాటలు, పద్యాలు పి.బి.శ్రీనివాస్ గారు పాడగా, నారదుడి రెండు పాటలు, కొన్ని పద్యాలు ఘంటసాల పాడారు.
ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెండ్యాల. పెండ్యాలగారు ఆషామాషీ సంగీతదర్శకుడు కాదు. రాగప్రధానమైన పాటలను స్వరపర్చడంలో అసమాన్యుడు. ఆయనకు నల్లేరుమీద బండి నడకే. అందులోనూ ఈ పాటను పాడేది ఘంటసాలగారేనని తెలిసాక ఊరకే ఉంటారా, ఆ పాట అంతుచూడక వదులుతారా చెప్పండి. "మోహనరూపా గోపాలా" పాటను అద్భుతంగా స్వరపర్చి ఆ పాట ఘంటసాల కోసమే పుట్టిందన్నట్లు మెట్టుకట్టారు.
ఈ పాటకు పెండ్యాల గారు ఎంచుకున్న రాగం హిందోళం. హిందోళం నఠభైరవి రాగం యొక్క జన్యరాగం. షడ్జమం(స), సాధారణ గాంధారం(గ), శుధ్ధ మధ్యమం(మ), శుధ్ధ ధైవతం (ద), కైశికి నిషాదం(ని) ... సగమదని అనే ఐదు స్వరాలే ఆరోహణా, అవరోహణా క్రమంలో వినిపిస్తాయి. ఇదొక ఔడవరాగం. కర్ణాటక శైలిలోని హిందోళ రాగానికి సమానమైన హిందుస్థానీ సంగీత రాగాన్ని మాల్కౌంస్ అంటారు. ఈ రెండు రాగాలలో అనేక వందల సినీమా పాటలు అన్ని భాషలలో వెలువడ్డాయి. హిందోళ రాగంలోని త్యాగరాజకీర్తన 'సామజవరగమన' లోకప్రసిద్ధం. చైనా వంటి ప్రాచ్యదేశలలో కూడా ఐదు స్వరాలుతో కూడిన హిందోళం , మోహన రాగ ఛాయలుగల సంగీతం వినవస్తూంటుంది.
హిందోళరాగ ప్రస్తావన వచ్చింది కనుక ఈ పాటకు సంబంధంలేకపోయినా ఒక విషయం ప్రస్తావించడంలో తప్పులేదని భావిస్తున్నాను. "శంకరాభరణం"లో శంకరశాస్త్రి "శుద్ధహిందోళం"లో రిషభం ఎలా వచ్చిందని రంకెలు వేసినా అన్యస్వర లేదా భాషాంగస్వర ప్రయోగాల్ని సంప్రదాయ శాస్త్రీయ కర్నాటక సంగీతం భాషాంగరాగాలుగా గుర్తించి అంగీకరించింది. ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలో ఉద్దేశపూర్వకంగానే హిందోళలో రిషభ, పంచమాలు ప్రయోగించిన సందర్భాలున్నాయి. అయితే కర్నాటక సంప్రదాయ సంగీతంలో ఆ ప్రయోగ ఫలితంగా రూపుదిద్దుకున్న రాగానికి స్వరప్రస్తారసాగరం వంటి గ్రంథాలలో ఏ పేరూ కనబడదు. ఒకవేళ అటువంటి ప్రయోగాలకి ఏ పేరు లేకపోతే "మనం దానికి ఒకపేరు పెట్టుకుందాం" అని ఘంటసాలగారే ఒక AIR ఇంర్వ్యూలో అన్నారు. అంతేకాక ఆ రాగం ఎప్పుడు వినియోగించుకున్నా ఆ విశేష ప్రయోగంతోనే ఆ సంచారాన్ని వినియోగించేను అని అన్నారు. "సందేహింపకుమమ్మా" "కలనైనా నీ పిలుపే" లాంటి పాటలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా సంగీతదర్శకుడి మనోధర్మనికి సంప్రదాయ శాస్త్రీయ సంగీతజ్ఞుడికున్నన్ని బందికట్లులేవు.
రచయితకి, దర్శకుడికి సంగీతంలో ప్రాథమిక ప్రవేశంలేకపోతే ఆ శాస్త్రానికి అనుగుణ్యమైన jargon - పారిభాషిక జ్ఞానం కూడా అలవడదు. శుద్ధసావేరీ, శుద్ధధన్యాసిలాగ శుద్ధహిందోళం అని అనడం అపభ్రంశం. అందులోనూ శంకరశాస్త్రిలాంటి ఓ గొప్ప శుద్ధ కర్నాటక సంగీతజ్ఞుడు ఆ పద ప్రయోగం చెయ్యడం హాస్యాస్పదం.
'మోహనరూపా గోపాలా' పాట విషయంలో ఘంటసాల పూర్తిగా పెండ్యాల స్వరకల్పనలనే అనుసరించి ఆ పాటకు జీవం పోసారు. తెరమీద నారద పాత్రధారి పద్మనాభం కూడా చాలా హుందాగా నటించారు.
ఈ పాటలో వీణ, ఫ్లూట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను ఉపయోగించారు. శుధ్ధ శాస్త్రీయమైన ఈ పాటలోని ఛాయాస్వరాలు ఆలపించడంలో ఘంటసాలవారి ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నాదాన్ని నాభిస్థానం నుండి పలికించడమంటే ఏమిటో, దానికి ఎంత దమ్ము పట్టాలో, అదెంత కష్టసాధ్యమో ఈ రకమైన పాటలు వినడం, పాడడం ద్వారా తెలుస్తుంది. ఘంటసాలవారి ఈ పాట గాయకులందరికీ ఒక పెద్ద టెస్ట్ వంటిది.
ఈ పాటను పాడడంలో ఎంతవరకూ సఫలీకృతులయ్యారో ఎవరికి వారు తమ మనస్సాక్షి ప్రకారం నిక్పక్షపాతంగా తేల్చుకోవలసిన విషయం.
ఘంటసాలవారి ఈ గీతం సదా మదిలో మెదిలే సజీవరాగమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment