చిత్రం - వినాయకచవితి
గానం - ఘంటసాల
సంగీతం - ఘంటసాల
పల్లవి :
దినకరా.. దినకరా.. హే.. శుభకరా..
దినకరా శుభకరా - 2
దేవా దీనాధారా తిమిర సంహార ! దినకరా!
అనుపల్లవి :
సకలభువన సుఖకారణ కిరణా
మౌనిరాజ పరిపూజిత చరణా -2
నీరజాతముఖ శోభనకారణ -2
దినకరా శుభకరా -2
చరణం :
పతిత పావన మంగళదాతా
పాప సంతాప లోకహితా -2
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా - రాగాలాపన
బ్రహ్మ విష్ణు....
వివిధ వేద విజ్ఞాని నిధానా .. బ్రహ్మ..
వినతలోక పరిపాలక భాస్కర - దినకరా
దినకరా. హే.. దినకరా ప్రభో
దినకరా... శుభకరా
గతం తరం తెలుగు పౌరాణిక చిత్రాలలో సూర్య భగవానుడు మీద శ్లోకాలు , పద్యాలు అనేకం వినవచ్చాయి , కానీ సూర్యుడిని వర్ణిస్తూ చేసిన పాటలు బహు అరుదు. అలాటివాటిలో తలమానికంగా నిలిచే పాట "దినకరా శుభకరా దేవా దీనాధారా తిమిరసంహార" అనే పాట. ఈ పాటే ఈనాటి ఘంటసాల సజీవరాగం.
"దినకరా శుభకరా" పాట 1957 లో వచ్చిన " వినాయకచవితి" సినీమా లోనిది. పేరుకు వినాయకచవితే అయినా అధికశాతం కథంతా చవితి చంద్రుడిని చూసినందువలన శ్రీకృష్ణునికి కలిగిన నీలాపనిందలు, శమంతకమణి ఉపాఖ్యానం, జాంబవతి, సత్యభామా పరిణయాల మీదనే నడుస్తుంది.
రోజుకు ఎనిమిది బారువల (బారువ అనే తూనిక ఈనాటి కిలోలు, టన్నులు, క్వింటాళ్ళు, రాకపూర్వం. అప్పుడు తూనిక ప్రమాణాలు తులాలు, ఫలాలు, వీశెలు, మణుగులు లెక్కలో వుండేవి. ఒక బారువ అంటే సుమారుగా 224 కిలోలు. ఒక రోజుకు 8 బారువలంటే 1792 కిలోలు. సంవత్సరానికి 6 లక్షల 55 వేల కిలోల బంగారం. నేను లెక్కల్లో చాలా చాలా వీక్. నా యీ లెక్కలో తప్పులుంటే మన్నించండి).
బంగారం మీది వ్యామోహంతో సత్యభామా మణి తండ్రి సత్రాజిత్తు సూర్యోపాసన చేసి సూర్యభగవానుడిని మెప్పించి రోజుకు 8 బారువల బంగారాన్ని ప్రసాదించే శమంతకమణిని పొందుతాడు. అంత ధనం ఒక వ్యక్తి దగ్గర వుందంటే అది పరులకంట పడకుండా కాపాడుకోవడంకోసం ఎంత కథైనా జరుగుతుంది కదా. అలాటి కథే "వినాయకచవితి" సినీమా కథ.
సూర్యోపాసకుడైన సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధిస్తూ సముద్రపుటొడ్డున పాడిన పాటే "దినకరా శుభకరా" పాట. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారికి అనర్ఘమణిగా భాసిల్లిన గీతం "దినకరా శుభకరా". ఈ పాటను సినిమాలో సత్రాజిత్తు పాత్రధారి గుమ్మడి మీద చిత్రీకరించారు. ఈ పాటను వ్రాసినవారు శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారు. లోకపాలకుడైన సూర్యదేవుని గుణగణాలను వర్ణిస్తూ ఈపాటకు ఆచార్యులవారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. ఆయనే వినాయకచవితి సినీమా కు దర్శకత్వం వహించి, మాటలు, పాటలు, పద్యాలు వ్రాసారు.
చాలామంది సంగీతాభిమానులకు తెలియని ఒక విశేషం ఈ పాటలో వుంది. ఆచార్యులవారు ఈ పాటను వ్రాసినప్పుడు పల్లవి తర్వాత ఒక అనుపల్లవి , తర్వాత చరణాలు వ్రాయడం జరిగింది. (చూడుడు పాట సాహిత్యం). ఘంటసాల మాస్టారు కూడా అత్యంత శ్రవణపేయంగా ఈ గీతాన్ని పంతువరాళి లేదా కామవర్ధని అనే రాగంలో స్వరపర్చారు. అయితే ఏ కారణం చేతనో ఈ పాటలోని అనుపల్లవి సినీమా లోనూ లేదు, గ్రామఫోన్ రికార్డులోనూ లేదు. పాటలో పల్లవి, చరణాలు మాత్రమే వినిపిస్తాయి. ఘంటసాలవారి సంగీత కచేరీలను ప్రత్యక్షంగా చూసిన నాలాటి శ్రోతలకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది.
ఘంటసాలవారి ప్రతీ సంగీత కచేరీ ఈ "దినకరా శుభకరా" పాటతోనే ప్రారంభమయేది. ఆయన రికార్డులో లేని ఈ అనుపల్లవితో సహా ఈ పాటను కడు రమ్యంగా ఆలపించేవారు. కచేరీ సందర్భం , స్థలాలనుబట్టి ఈ పాటను శాస్త్రీయ సంగీత కచేరీ కీర్తనలా రాగాలపన చేసి, సంగతులు, నెరవులు వేసి ఘంటసాలగారు సుమారు ఎడెనిమిది నిముషాలపాటు పాడేవారు. ఇప్పుడు మీరంతా కూడా విని ఆనందించడానికి వీలుగా వాషింగ్టన్ కచేరీలో ఘంటసాల మాస్టారు పాడిన పాటను, వినాయకచవితి సినీమాలోని పాటను మీకు సమర్పిస్తున్నాను.
ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి ఎంచుకున్న రాగం - పంతువరాళి. దీనికే కామవర్ధని అని మరో పేరు వుంది. హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో పంతువరాళి రాగాన్ని 'పూర్యాధనశ్రీ' అంటారు. కర్నాటక సంగీతంలో అత్యంత ప్రాచీనమైన రాగం పంతువరాళి. అయినా మేళకర్తరాగ వర్గీకరణ జరిగేప్పుడు ఈ రాగాన్ని 51 వ మేళకర్త రాగంగా నిర్ణయించారు. పంతువరాళి/కామవర్ధని రాగం ఆరోహణ , అవరోహణలలో - షడ్జమం, శుధ్ధరిషభం, అంతర గాంధారం, ప్రతిమధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలినిషాధం అనే ఏడు స్వరాలు వినవస్తాయి. త్యాగయ్యగారి 'శివ శివ యనరాదా',' అప్ప రామభక్తి' అనే సుప్రసిధ్ధ కీర్తనలు పంతువరాళి రాగంలో చేసినవే. అలాగే, కంచెర్ల గోపన్న (రామదాసు ) కీర్తన 'ఎన్నగాను రామ భజన' కూడా పంతువరాళి రాగంలోనే చేశారు.
శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా తమ కచేరీలలో కామవర్ధని రాగ కృతులను విధిగా గానం చేస్తారు. శ్రోతల మనసులను రంజిఃపజేసే సుప్రసిద్ధ రాగం పంతువరాళి. ఈ రాగంలో స్వరపర్చబడిన "దినకరా శుభకరా" పాటను ఘంటసాలవారు ఎంత మనోజ్ఞంగా పాడారో, ఆ పాట ఎంతటి జనాదరణను పొందిందో అందరికీ తెలిసిందే. ఘంటసాల మాస్టారు మంచి రసస్ఫూర్తితో ఆత్మానందం పొందుతూ పాడిన ఈ పాట అరవైఆరేళ్ళ తర్వాత కూడా సంగీతాభిమానుల హృదయాలను రంజింపజేస్తూ, మేనులను పులకరింపజేస్తూనేవుంది. లలిత సంగీత గాయకులంతా తమ కచేరీలలో తప్పక పాడే పాట "దినకరా శుభకరా". ఘంటసాలవారి ఉత్తమశ్రేణి గీతాలలో ప్రధమ వరసలో నిలిచే గీతం " దినకరా శుభకరా".
ఘంటసాల మాస్టారి అపూర్వ సృష్టి అయిన 108 శ్లోకాల భగవద్గీత లోని ప్రప్రథమ శ్లోకమైన "పార్ధాయ ప్రతిబోధితాం నారాయణీ..." కూడా కామవర్ధని/పంతువరాళి రాగంలోనే సముచిత రీతిని స్వరపర్చడం వారి రాగ పరిజ్ఞానానికి, గానప్రతిభకు ఒక నిదర్శనం. ఈ రాగంలో ఇంత నిర్దిష్టంగా రూపొందిన సినిమా పాట మరొకటి లేదంటే అది అతిశయోక్తి కాదు.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment