Saturday, 10 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 81వ భాగం - వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయవ భాగం ఇక్కడ

81వ సజీవరాగం - వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా       

చిత్రం - గోవుల గోపన్న
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - 
ఘంటసాల

పల్లవి : 

ఓ...ఓ...ఓ.... వినరా వినరా నరుడా

తెలుసుకోర పామరుడా ! - 2.

గోమాతను నేనేరా ! నాతో సరిపోలవురా 

                                            !వినరా!

కల్లాకపటం ఎరుగని గంగీగోవును నేను

ఏది చెప్పినా కాదని ఎదురుచెప్పలేను

పారేసిన గడ్డితిని బ్రతుకు గడుపుతున్నాను

పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను 

                                            !వినరా! 

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా 

నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా

వయస్సుడిగిన నాడు నన్ను

కటికవాని పాల్జేస్తే - !వయస్సు!

ఉసురు గోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను 

                                            !వినరా!

నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయి

నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి

నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి - 2

నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయి 

                                            !వినరా!

 నమో దేవ్యై మహా దేవ్యై

 సురాభయైచ నమో నమః

గవాంబీజ స్వరూపాయ

నమస్తే జగదంబికే 

కుల వృధ్ధి, సత్సంతానం, ధనం, కీర్తి, సకల పుణ్యనదీ స్నాన సత్ఫలితాల కోసం ఆర్యులు కామధేను స్తోత్రాన్ని నిత్యం పఠించేవారు.యుగయుగాలుగా  గోవు పరమ పవిత్రమైన దేవతా స్వరూపంగా సనాతన భారతీయులచే పూజించబడుతున్నది. కృతయుగంలో క్షీరసాగర మధన సమయాన ఆవిర్భావం చెందిన అనేక అమూల్య వస్తువులలో కామధేను అనే గోవు ఒకటి. కోరిన కోరికలు తీర్చగల అపూర్వ శక్తిగలది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సూర్యచంద్రాది దేవ ప్రముఖులు ఈ కామధేనులో వసించియుండడం వలన ఇది చాలా పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా పురాణాలలో వర్ణించబడింది. కామధేను పంచి యిచ్చిన అమృతం వంటి పాలను త్రాగి దేవతలంతా సకల సుభిక్షాలను, సుఖసంతోషాలను అనుభవించారు. ఈ కామధేను సంతతే సురభి, కపిల వంటి గోవులు. ఇవి వశిష్ఠ, కశ్యపాది మహర్షుల ఆశ్రమాలలో వుంటూ వారు చేసే యజ్ఞ, యాగాది క్రతువులకు కావలసిన సకల సామగ్రిని సమకూరుస్తూ లోక సంక్షేమానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రపంచమంతా గో సంతతిని వృధ్ధిపర్చాయి. గోమాతను కులదైవంగా పూజించే ఆచారం కూడా మన దేశంలో వుంది. యుగాలు మారడంతో కాలధర్మం కూడా మారిపోతున్నది. ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల నడిచి  ప్రపంచమంతా సుభిక్షంగా, సశ్యశ్యామలంగా వుండేది. ఈనాడు ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదాన కుంటి నడకలు నడుస్తోంది. మానవులలో జాలి,కరుణ,దయ అనే గుణాలు కనుమరుగై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తమ తమ స్వార్ధం కోసం జంతుజాలాన్ని తీవ్రంగా హింసిస్తున్నారు.  దైవంగా, కన్నతల్లిగా భావిస్తూ వచ్చిన గోమాతను  మనిషి క్రమక్రమంగా తన ధనార్జనను పెంచే ముడి సరుకుగా ఉపయోగించడం మొదలెట్టాడు. గోవు నుండి లభించే పాలు మొదలు పేడ వరకు ప్రతీది అత్యంత విలువలు కలిగి మనిషి ఆదాయానికి ఉపయోగపడుతున్నాయి.

యంత్ర సాంకేతిక పరిజ్ఞానం లేనంతకాలం పశువులే వ్యవసాయ, రవాణా సాధనాలుగా మనిషికి జీవనానికి ఆలంబన అయ్యాయి. వయసుడిగిన గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయివాడికి అమ్మగా వచ్చిన డబ్బును కూడా మనిషి ఆనందంగా అనుభవిస్తున్నాడు. చివరకు ప్రాణం పోయిన పశువుల చర్మం కూడా వివిధ తోలు వస్తువుల రూపేణా మనిషికి భోగభాగ్యాలను సమకూరుస్తున్నది. 

రానురాను గోవు అంటే దైవస్వరూపం, పవిత్రమైనదనే భావన మనుషులలో క్షీణిస్తోంది.  ప్రతీ ప్రాణి తన మనుగడను కాపాడుకోవడం  కోసం తీవ్రంగా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది.  తమ ఉనికిని ఔన్నత్యాన్ని తామే చాటిచెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది.  మనిషి బుధ్ధి జీవి. నోరుంది. తన కష్టసుఖాలను ఇతరులకు చెప్పుకోగలడు. కానీ పశువులు తమ కష్టాలను ఎలా చెప్పుకుంటాయి. తమకు జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కోగలవు.

మనిషి స్వార్ధం వలన ఆవుల వంటి సాధు జంతువులు ఎంతగా హింసించబడుతున్నవో ఊహించుకుని  చదువు సంధ్యలు లేని దయార్ద్ర హృదయంగల ఒక పశువుల కాపరి ఒక గోవు యొక్క స్వగతాన్ని మనసుకు హత్తుకునేలా వినిపిస్తున్నాడు. ఆ పాటే ఈనాటి మన సజీవరాగం.

తమ  గుణగణాలను, కీర్తిప్రతిష్టలను, ఔన్నత్యాన్ని ఇతరులు పొగడాలే తప్ప ఎవరికి వారే చెప్పుకోవలసి రావడం చాలా బాధాకరం, దైన్యం. అటువంటి దుస్థితిని మనం ఈ గోవు పాటలో చూస్తాము. పాట ప్రారంభంలోనే ' వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా' అని అంటారు కవి కొసరాజు. పల్లెటూరిలో పశువులను కాచుకునే పామర గోపన్న పాడే గో స్వగతం ఈ పాట. ఎవరి కోసం ఈ పాట? ఇందులో పామరుడు ఎవరు? చదువు లేకపోయినా సాటి ప్రాణిగా  గోవు కష్ట సుఖాలకు చలించిపోయే మంచి హృదయమున్నవాడు పామరుడా? లేక గొప్ప గొప్ప చదువులు చదివినా   మానవత్వాన్ని మరచిపోయి సాధుజీవులను తన స్వార్ధం కోసం దయారహితంగా హింసించేవాడా? ఎవరు పామరుడు?

ఈ పాటలోని సాహిత్యం అత్యంత సరళం. ఐదారేళ్ళ పసిపాపలకు కూడా చాలా సులభంగా అర్ధమయే రీతిలో వ్రాసారు కొసరాజు. ఈ పాటను విని చలించనివాడే పామరుడు. అసలు నరుడే కాడు. సినిమా ఆరంభంలోనే టైటిల్స్ అయిన వెంటనే హీరో మనస్తత్త్వాన్ని  పరిచయం చేసేలా వచ్చే ఈ పాట 'గోవుల గోపన్న' సినీమాలోనిది. 

సున్నితంగా శ్రావ్యంగా వినవచ్చే ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు మోహన రాగ స్వరాలతో చేశారు. 28 వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగ జన్యమైన మోహన ఔడవరాగంగా జగత్ప్రసిధ్ధం.  దీనికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'భూప్ ' అంటారు. అయితే పై పాటలో  మోహనకు సంబంధించని అన్యస్వరాలు కూడా ప్రయోగించబడడం వలన దీనిని సినీమోహన రాగంగా చెప్పుకోవడమే సముచితం. ఫ్లూట్, క్లారినెట్, పియనో, యూనివాక్స్, అకార్డియన్, వైెయొలిన్స్, తబల, డోలక్, ఘటసింగారి వంటి వాద్యాలు  ఈ పాటలో  వినిపిస్తాయి. 

హృదయధర్మానికి చెందిన సందేశపూర్వక గీతాలను  పరిపూర్ణంగా తనలో జీర్ణింపజేసుకొని భావయుక్తంగా పాడే ఘంటసాల, దానికి తన నటన ద్వారా మెరుగులు దిద్దే అక్కినేని మధ్య గల పరస్పర అవగాహన వలన కొసరాజుగారి ఈ 'వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా' పాట కూడా ప్రజాబాహుళ్యంలోనికి చొచ్చుకుపోయి ఈనాటివరకు సజీవంగా నిల్చిపోయింది. 

అమాయకుడైన పశులకాపరిగా, లా చదివిన జూనియర్ అడ్వొకేట్ గా ఎ.ఎన్.ఆర్. ద్విపాత్రాభినయం చేసిన సినిమా.

రాజ్యం పిక్చర్స్ శ్రీధరరావు& నటి లక్ష్మీరాజ్యం దంపతులు నిర్మించిన 'గోవుల గోపన్న'  సినిమా కు రాజ్ కుమార్ నటించిన బి.ఆర్.పంతులు కన్నడ సినిమా 'ఎమ్మె తమ్మణ్ణ' మూలం. తర్వాత ఈ సినిమా హిందీలో జితేంద్ర తో ' జిగ్రిదోస్త్' గా , తమిళంలో ఎమ్.జి.ఆర్ తో 'మాట్టుకార వేలన్' గా వచ్చింది. ఇలా ఒకే కధ కన్నడ,తెలుగు,హిందీ, తమిళ భాషలలో సినిమాలుగా రూపొంది ఘనమైన ఆర్ధిక విజయాన్ని సాధించడం ఒక విశేషం. 

కథతో ఏ సబంధం లేకపోయినా 'వినరా వినరా నరుడా' పాటలోని సందేశం సామాన్య ప్రజలందరినీ ఆకర్షించి ఈ పాట సజీవరాగంగా నిలిచేందుకు దోహదపడింది. సినిమా లో ఈ పాట రెండు సందర్భాలలో ఏకగళ గీతంగా, యుగళగీతంగా వస్తుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 3 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 80వ భాగం - నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభై తొమ్మిదవ భాగం ఇక్కడ

80వ సజీవరాగం - నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా      

చిత్రం - పూలరంగడు
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - ఎస్.రాజేశ్వరరావు

పల్లవి : 

ఓహో ! హెయ్య.... 

నీతికి నిలబడి నిజాయితీగా

పదరా ముందుకు పదరా

అహ ఛల్ రే బేటా ఛల్ రే ! నీతికి!

తాతల తండ్రుల ఆర్జన తింటూ

చరణం  1:

జలసాగా నువు తిరగకురా - 2

కండలు కరగగ కష్టం చేసి

తలవంచక జీవించుమురా

పూలరంగడిగా వెలుగుమురా 

                                హెయ్య! నీతికి!

చరణం  2: 

పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ

హుషారుగా ఒకడున్నాడూ

బల్ ఖుషీ ఖుషీగా వున్నాడూ

కన్నబిడ్డకు గంజి దొరకక ఉసూరుమని ఒకడున్నాడూ.....

ఛల్ ఛల్ రే... 

                                            !నీతికి!

చరణం  3:

ఉన్నవాడికి అరగని జబ్బు

లేనివాడికీ ఆకలి జబ్బు

ఉండీ లేని మధ్య రకానికి

చాలీచాలని జబ్బురా

ఒకటే అప్పుల జబ్బురా!

                                హెయ్య! నీతికి!

చరణం  4: 

కష్టాలెన్నో ముంచుకు వచ్చినా

కన్నీరును ఒలికించకురా

కష్టజీవుల కలలు ఫలించే

కమ్మనిరోజులు వచ్చునురా

చివరకు నీదే విజయమురా

!నీతికి నిలబడి నిజాయితీగా

పదరా ముందుకు పదరా.....!

ఉన్నవాడు- లేనివాడు... ఈ ఆర్ధిక అసమానత్వం మన సమాజంలో ఏనాడు ఉద్భవించిందో గానీ ఈనాటికీ మనలను పట్టి పీడిస్తూనేవుంది.  ఈ ఊబిలోంచి బయటపడే మార్గం కానరాక కొట్టుమిట్టాడుతూనేవున్నాము. ఏనాడో ఐదున్నర దశాబ్దాల క్రితం కొసరాజుగారు రాశారు 'పూలరంగడు'

సినిమా కోసం, ఏమని, ... 'ఉన్నవాడికి అరగని జబ్బు లేనివాడికి ఆకలి జబ్బు ఉండీ లేని మధ్య రకానికి అప్పుల జబ్బు'  అని.  కన్నబిడ్డలకు గుక్కెడు గంజి కోసం ఒకడు అలమటిస్తూంటే, తన డాబును దర్జాను చాటుకునేలా పెంపుడు కుక్కలపై వేలకు వేలు ఖర్చు పెట్టే అమీర్లు ఒక వైపు. ఈ పరిస్థితిలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ రాలేదు. ఆనాడు ఎలా ఉన్నామో, ఈనాడూ అలానే ఉన్నాము. ఈ అంతరాన్ని గుర్తు చేస్తూ ఘంటసాలగారు ఆలపించిన  'నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా' అనే గీతమే ఈనాటి మన సజీవరాగం. 

ఈ పాటలో కొసరాజుగారు ' పూలరంగడు' అంటే ఎవరో మనకు తేటతెల్లం చేశారు. పెద్దలు సంపాదించిన ఆస్తులను  దుర్వ్యసనాల కోసం దూబరాగా ఖర్చు చేస్తూ జల్సాగా కులాసాగా తిరిగేవాడు పూలరంగడనిపించుకోడు. పూలరంగడంటే కండలు కరిగేలా కాయకష్టం చేసి ఆ వచ్చిన సంపాదనతో ఎవరికీ తలవంచక నీతి నిజాయితీ లతో ఇతరులకు సహాయపడుతూ తాను సంతోషంగా వుంటూ ధైర్యంగా ముందుకు సాగేవాడే అసలు సిసలు 'పూలరంగడు' అంటారు. 

ఎ జె క్రానిన్ అని స్కాట్లెండ్ లో ఒక ఆంగ్ల రచయిత. 1953లో ఆయన వ్రాసిన 'బియాండ్ దిస్ ప్లేస్' అనే నవల ఆధారంగా బెంగాలీలో ఉత్తమకుమార్ తో ఒక సినిమా వస్తే దానిని హిందీలో 'కాలాపానీ' గా దేవానంద్ తో తీశారు. 1959 లో వచ్చిన ఆ సినీమాలోని మూలకథను మాత్రమే తీసుకొని దుక్కిపాటి మధుసూదనరావుగారు ఆదుర్తి నిర్దేశకత్వంలో 'పూలరంగడు' సినిమాను అక్కినేని నాగేశ్వరరావు కధానాయకుని గా  నిర్మించారు. 

జమున, నాగయ్య, గుమ్మడి, శోభన్ బాబు, విజయనిర్మల, మొదలగువారు నటించారు. చేయని నేరం కోసం యావజ్జీవ జైలు శిక్షను అనుభవించే ఒక వ్యక్తిని అతని కొడుకే అసలు నేరస్తుడిని కనిపెట్టి తండ్రిని నిరపరాధిగా నిరూపించి బయటకు తీసుకురావడం ఈ సినిమా కథ సారాంశం.  

ఈ ఫార్ములా ఇండియాలో బాగా క్లిక్ అయింది. బెంగాలీ, హిందీ, తెలుగు భాషలలో సూపర్హిట్ కావడంతో 1970లో ఎమ్.జి.ఆర్. జయలలిత తమిళంలో 'ఎంగ అణ్ణన్' గా తమిళనాట కూడా ఘనవిజయం సాధించింది. ఈ కథ మీది వ్యామోహంతో ఆదుర్తి సుబ్బారావు గారే స్వయంగా  1972 లో మళ్ళా హిందీలో 'జీత్' గా రణధీర్ కపూర్, బబితలతో తీసారు. ముడి పదార్ధంలో సత్తా వుంటే అది సత్ఫలితాలనే ఇస్తుంది. 

'పూలరంగడు' సినిమా టైటిల్స్ మీద వచ్చే ఈ పాటను ఘంటసాలగారు బల్ హుషారుగా ఆలపిస్తే భాగ్యనగర్ రోడ్లమీద, పబ్లిక్ గార్డెన్స్ లో జట్కాబండిని తోలుతూ   ఎ.ఎన్.ఆర్.  మరింత ఖుషీ ఖుషీగా నటించారు.

(1960 ల నాటికే మా బొబ్బిలి లాంటి చిన్న చిన్న టౌన్లలోనే  గుర్రపు జట్కాల హవా అంతరించి సైకిల్ రిక్షాల కాలం ప్రారంభమయింది. మరి 1967లో కూడా హైదరాబాద్ వంటి మహా నగరంలో హీరో జట్కాబండి తోలడాన్ని చూపించారంటే అతనెంత కాయకష్టం చేసి, నిజాయితీగా  బ్రతికాడో ప్రేక్షకులం మనమే అర్ధం చేసుకోవాలి. 

కథానాయకుని లక్ష్య లక్షణాలు తెలియజేసే కొసరాజుగారి పాటకు రసరాజేశ్వరరావుగారు ఇచ్చిన టెంపో పాట ఆద్యంతం శ్రోతలను ఆనందపరుస్తుంది. రాజేశ్వరరావు ఈ పాటను తనదైన స్టైల్ లో  లోనియన్ మోడ్ స్వరాలతో కూర్చారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ . ప్రపంచంలోని అన్ని సంగీత శైలులలో వినపడే సర్వ గమక సంపూర్ణం రాగం. దీనిని హిందుస్థానీ వారు బిలావల్ అంటే దాక్షిణాత్య సంగీత శైలిలో ధీరశంకరాభరణం(శంకరాభరణం) అంటారు.29 వ మేళకర్త రాగం ఎంతో శ్రావ్యంగా, సున్నితంగా వుంటూ శ్రోతల మనసులను రంజింపజేస్తుంది. ఈ మేళకర్త రాగానికి ఉన్న జన్యరాగాలు కూడా జనరంజకమైనవే. అలాటి శంకరాభరణం రాగ స్వరాలతో  రాజేశ్వరరావుగారు చేసిన ఈ జట్కాబండి పాట వెర్సటైల్ సింగర్ అయిన  ఘంటసాల మాస్టారికి నల్లేరు మీద బండి నడకే. అందుకే ఎన్ని దశాబ్దాలైనా  నీతికి నిలబడి నిజాయితీగా ఘంటసాల గానాభిమానులంతా వారి పాటలను అనుక్షణం మననం చేసుకుంటూ తమ  స్వరప్రస్థానంలో ముందుకు సాగిపోతూనే వున్నారు.

సాలూరివారి సంగీత దర్శకత్వంలో ని పాటలంటే అమృతగుళికలే.  మాస్టారు పాడిన ఈ పాటే కాక ఇతర పాటలు కూడా బహుళ జనాదరణ పొందాయి. కొసరాజుగారే రాసిన ఘంటసాల మాస్టారు, నాగయ్యగారు కలసి పాడిన "చిల్లర రాళ్ళకు మ్రొక్కుతు వుంటే చెడిపోదువురా ఒరే ఒరే' పాట, అలాగే,  ఆనాటి దేశకాలమాన పరిస్థితులకు దర్పణం పట్టే విధంగా మాస్టారు, సుశీల, జమున కలసి ఆలపించిన బుర్రకథ అన్నపూర్ణా వారి బ్యానర్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసి అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడానికి దోహదపడాయి.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 26 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 79వ భాగం - నే తాళలేనే ఓ చెలియా ... ఓ లలనా ఓ మగువా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయెనిమిదవ భాగం ఇక్కడ

79వ సజీవరాగం - నే తాళలేనే ఓ చెలియా ... ఓ లలనా ఓ మగువా      

చిత్రం - శ్రీకృష్ణావతారం
గానం - ఘంటసాల
రచన - సముద్రాల (సీ)

సంగీతం - టి.వి.రాజు

పల్లవి : తాత్త ఝం తదికిట ఝం

తద్దిగిణ కిటతక తా త్త ఝం

తరికిట ఝం తధ్ధిగిణతోం !!

 

తతత ఝణుత తతత ఝణుత

ఝణు తధంగిణత తధ్ధీం గిణత

తాంగిటతక తరికిటతోం తరికిటతో

తాత్తరికిటతో తధ్ధీం తధికిట తోం

తాధ్ధికిటతక తరికిటతోం...

 

ఆహా! నే తాళలేనే ఓ చెలియా

నే తాళలేనే ఓ చెలియా - 2

ఓ లలనా ఓ మగువా ఓ సఖియా

నే తాళలేనే ఓ చెలియా! ఆహా!

నే తాళలేనే...

ఆనందభైరవి  ప్రాచీన కర్ణాటక సంగీత రాగాలలో ఒకటి. ఇది 20వ మేళకర్త రాగమైన నఠభైరవికి జన్యరాగం. ఆనందభైరవి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణ రాగమైనా వక్రసంచారం వలన, అన్యస్వర ప్రయోగం వలన జన్యరాగంగానే పరిగణించబడుతున్నది.  రీతిగౌళ,హుసేనీ రాగాలు ఈ రాగాన్ని పోలివుంటాయి. సంగీత ముమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి మధుర రక్తిరాగంగా కొనియాడబడే ఆనందభైరవి రాగంలో అనేక రచనలు చేశారు. చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి సుప్రసిద్ధ జావళి ' మధురానగరిలో చల్లలమ్మబోదు' ఆనందభైరవి రాగంలోనే చేయబడింది.

ఆనందభైరవి రాగం గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది త్యాగరాజస్వామివారి గురించి తలచుకుంటారు. సాహేతుకమైన చారిత్రక ఆధారాలు లేని ఈ ఉదంతం వినడానికి ఆసక్తికరంగానే వుంటుంది.

ఒకసారి త్యాగరాజస్వామి వారి స్వస్థలమైన తిరువైయ్యారులో వీధి భాగవత మేళం జరిగిందట. ఆ మేళంలోని సంగీతకళాకారులు ప్రదర్శించిన ఆనందభైరవి రాగంలోని గీతం త్యాగరాజస్వామి వారిని ఎంతగానో ఆకట్టుకొవడంతో వారు ఆ భాగవత కళాకారులను ఎంతగానో ప్రశంసించి వారికి తగిన కానుక ఇవ్వాలని సంకల్పించారట. అందుకు ఆ భాగవతులు బ్రహ్మానందభరితులై త్యాగబ్రహ్మంగారు తమకు ఆనందభైరవి రాగాన్ని కానుకగా ఇచ్చి ఇకపై వారు ఆ రాగంలో ఏ కృతులు చేయరాదనే వింత కోరిక కోరారట. భవిష్యత్తు లో త్యాగయ్యగారు ఎందువలన ఆనందభైరవి రాగంలో రచనలు చేయలేదనే ప్రశ్న వస్తే  సంగీత ముమూర్తులలో ప్రముఖుడైన  త్యాగరాజస్వామి వారి వలన తమకు కలిగిన ప్రశంసను కూడా ప్రజలు  తలచుకుంటారని ఆ తృప్తే తమకు చాలని అందుకే ఈ కోరికను కోరినట్లు సవినయంగా విన్నవించుకున్నారట. సద్గురు త్యాగరాజస్వామి కూడా వారి కోరికను మన్నించి ఆనందభైరవి రాగాన్ని వారికి కానుకగా ఇచ్చి ప్రతిగా ఆ రాగంలో రచనలు చేయడం మానివేసారట.

ఇలాంటి కథలు ప్రచారమవడానికి  త్యాగయ్యగారు ఎక్కువ కృతులు రక్తిరస ప్రధానమైన ఈ ఆనందభైరవి రాగంలో స్వరపర్చకపోవడం ఒక కారణం కావచ్చును. వేలాది కృతులు, కీర్తనలు వ్రాసిన త్యాగరాజస్వామి ఆనందభైరవి రాగంలో చేసినవి మాత్రం మూడే మూడు.

ఈ ఉదంతంలో ముడిపెట్టబడిన మరో ఆసక్తికరమైన  విషయం ఏమంటే త్యాగరాజస్వామి వారి వద్దనుండి ఆనందభైరవి రాగాన్ని కానుకగా పొందిన కళాకారులు ఆంధ్రదేశ కృష్ణాతీర కూచిపూడి భాగవుతులని చెప్పుకోవడం కద్దు.

ప్రాచీన భారతీయ సంప్రదాయ నృత్య కళా రీతులలో పేరెన్నిక పొందినది కూచిపూడి నృత్యం. క్రీ.శ. రెండవ శతాబ్దం నుండే కూచిపూడి నృత్యకళకు సంబంధించిన మూలాలు వున్నట్లు చెపుతారు. 14 వ శతాబ్దానికి చెందిన సిధ్ధేంద్రయోగి కూచిపూడి నాట్యాన్ని మరింత అభివృద్ధి పరచి ఈ నృత్యశైలికి మరింత ప్రాశస్త్యాన్ని తీసుకువచ్చారు. శాతవాహనులు, విజయనగరం రాజులు, తంజావూరు రాజుల పోషణలో కూచిపూడి నాట్యకళ ఎంతో ప్రసిధ్ధికెక్కింది.

కృష్ణాతీర కూచిపూడి గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాల పురుషులచేత మాత్రమే అభ్యసించబడిన ఈ కూచిపూడి నృత్యకళ 19వ శతాబ్దం ప్రథమార్ధం నుండి మరింత నూతనత్వాన్ని సంతరించుకుంది.  శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీ వెంపటి వెంకటనారాయణశాస్త్రి, చింతా వెంకట్రామయ్య వంటి కూచిపూడి దిగ్దంతలు కూచిపూడి నాట్యకళకు నూతనత్వాన్ని, నవతేజాన్ని తీసుకువచ్చారు. అంతవరకు పురుషులకు మాత్రమే పరిమితమై వున్న కూచిపూడి నృత్యకళ స్త్రీలకు కూడా అందుబాటులోకి వచ్చింది.

శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారి శిష్యుడైన శ్రీ వెంపటి చిన సత్యంగారి అవిశ్రాంత కృషి ఫలితంగా కూచిపూడి నృత్యకళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిధ్ధికెక్కింది. సంగీత, సాహిత్య, నృత్య సమాహారంగా అనేక నూతన నృత్యరూపకాలకు రూపకల్పన చేసి దేశ విదేశాలకు చెందిన వేలాది స్త్రీ పురుషులకు కూచిపూడి నృత్యంలో శిక్షణనిచ్చి కూచిపూడి నాట్య విశిష్టతకు  ఎనలేని సేవ చేసిన కళాప్రపూర్ణుడు, పద్మభూషణ్ డా.వెంపటి చిన సత్యం. 

శ్రీ వెంపటి చిన సత్యం కూచిపూడి నృత్యరంగంలోనే కాదు చలనచిత్ర సీమలో కూడా తనదైన ముద్రవేసారు. సినిమాలలో వచ్చే సత్సాంప్రదాయ నృత్య సన్నివేశాలెన్నింటికో ప్రాణ ప్రతిష్ట చేసిన ఘనత ఆయనకు వుంది. డా. వెంపటి చిన సత్యం నిర్దేశకత్వంలో ఆనందభైరవి రాగంలో రూపొందించబడి గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారిచే అద్భుతంగా గానం చేయబడిన  ఒక చిన్న కూచిపూడి నృత్య దరువే ఈనాటి మన సజీవరాగం.

నిజానికి ఈ గీతంలో సాహిత్యమంటూ చెప్పుకోవడానికి ఏమీలేదు. 'తాళలేనే,  చెలియా, లలనా, మగువా, సఖియా' అంటూ ఐదే ఐదు పదాలతో ఈ పదాన్ని ముగించారు సముద్రాలవారు. ఇందులో మనకు ఎక్కువగా వినపడేది కూచిపూడి నృత్య జతులే. అయితే నృత్యదర్శకుడు, సంగీతదర్శకుడు, గాయకుడు, నటీనటులు  దీనిని ఆవిష్కరించిన విధానం వలన ఈ చిన్ని నృత్య సన్నివేశం ప్రేక్షకులను ఎంతో ఆకర్షించి అలరించింది. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య లకు గల ఉత్తమాభిరుచుల ఫలితంగా మంచి కళాత్మక విలువలతో  శ్రీకృష్ణావతారం భారీ పౌరాణిక చిత్రం తెలుగువారి సొంతమయింది. మహాభారతం, మహాభాగవతం గ్రంథాలలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఘట్టాలన్నింటిని పొందుపరచి శ్రీకృష్ణావతారం గా రూపొందించారు. ఈ చిత్రం పూర్తిగా నటరత్న ఎన్.టి.రామారావు భుజస్కంధాలపై నడిచిన సినిమా. రామారావు గారి నటవైదుష్యం, ఘంటసాలవారి గానం శ్రీకృష్ణావతారం చిత్రానికి ఆయువుపట్టులు.

ఈనాటి సజీవరాగం ఈ చిత్రంలో హాస్యరస ప్రధానంగా చిత్రీకరించబడింది. కలహభోజనుడైన నారదుడు శ్రీకృష్ణుని అష్టభార్యల మధ్య తంపులు పెట్టి ఆనందించాలని ఎక్కే గుమ్మం,దిగే గుమ్మంగా ప్రతీ అంతఃపురానికి వెళ్ళి అక్కడ కృష్ణునిపై, ఇతర సవతుల మీద అవాకులు చెప్పాలనుకునేలోపలే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై తన భార్యతో సఖ్యంగా వుండడం చూసి చల్లగా అక్కడనుండి జారుకోవడం ఇందులోని ఇతివృత్తం. అందులో భాగంగా శ్రీకృష్ణుడు (ఎన్.టి.రామారావు) తన అష్టభార్యలలో ఒకరైన కాళింది (ఎల్.విజయలక్ష్మి) తో  ఆనందంగా నృత్య సంగీతాలతో గడుపుతూంటాడు.  ఈ సందర్భంలో కూచిపూడి నృత్య భంగిమలతో ఆనందభైరవి రాగంలో ఈ చిన్న గీతాన్ని ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ సన్నివేశం లో ప్రధానంగా మనలను ఆకట్టుకునేది కూచిపూడి జతులతో కూడిన ఘంటసాలవారి గంధర్వగానం, లాస్య కృష్ణునిగా ఎన్.టి.రామారావు నటన, సహజంగానే మంచి నర్తకి అయిన ఎల్.విజయలక్ష్మి నృత్యాభినయం.

ఈ గీతంలో ఘంటసాల మాస్టారికి ఇతర కళా ప్రక్రియల పట్ల గల సంపూర్ణ అవగాహన, దానిని సంపూర్ణంగా ప్రయోగించగలిగే సమర్ధత కనిపిస్తుంది. పరిపక్వత చెందిన నాట్యాచార్యుడు ఉచ్ఛరించే పధ్ధతిలో ఈ పాటలోని జతులను సుస్పష్టంగా భావయుక్తంగా పలకడం ఘంటసాల మాస్టారి గానప్రతిభకు దర్పణం పడుతుంది. గాయకుడి విశిష్టత తెలియడానికి ఒక పాట నాలుగైదు చరణాల సాహిత్యంతో, రాగమాలిక రాగాలలో ఎన్నో ఆవృత్తాల స్వరకల్పనలతోనే నిండివుండాలన్న నిర్బంధం ఏమీలేదు. 'నే తాళలేనే ఓ చెలియా' వంటి చిరుగీతం కూడా సంప్రదాయ పధ్ధతిలో గానం చేయబడితే అది కూడా శ్రోతల హృదయాలను తాకి పది కాలాలపాటు సజీవరాగం గా నిలిచిపోతుంది.

శ్రీకృష్ణావతారం సినిమా పాటలు, పద్యాలన్నీ  ఘంటసాలవారి గాన పటిమకు గీటురాళ్ళే. ఈ చిత్ర నిర్మాణ సమయంలో  ఘంటసాల మాస్టారికి సైనస్ ఆపరేషన్ జరిగింది. అందువలన ఘంటసాలగారు రికార్డింగ్ లకు హాజరు కాలేని పరిస్థితి. షూటింగ్ కు అంతరాయం కలగకుండా పద్యాలన్నీ ట్రాక్ పాడిద్దామని నిర్మాత సంకల్పించి ఆ విషయాన్ని ఘంటసాలగారికి చెప్పగా పాటల విషయంలోలా పద్యాలకు ట్రాక్ తీయడమనేది అనుకూలంకాదని పద్యాలను ఒక ఒరవడిలో లైవ్ లోనే రికార్డ్ చేయాలని అందుచేత తానే వచ్చి పాడతానని చెప్పి ఓ రెండు రోజుల తర్వాత పద్యాలన్నీ లైవ్ లో రికార్డ్ చేసారు. ఘంటసాలగారి నిర్యాణం తర్వాత ఆయన శైలిలో నిర్దిష్టంగా పద్యాలు చదివే గాయకులే కరువై పౌరాణిక చిత్రాలలో పద్యాలు పెట్టడమనదే మానేసారు. దానితో పౌరాణిక చిత్ర నిర్మాణం కూడా పూర్తిగా తగ్గిపోయింది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 19 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 78వ భాగం - నీ దాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయేడవ భాగం ఇక్కడ

78వ సజీవరాగం -  నీ దాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా

     
చిత్రం - జయభేరి 
గానం - ఘంటసాల
రచన - మల్లాది రామకృష్ణశాస్త్రి

సంగీతం - 
పెండ్యాల

పల్లవి :

నీ దాన నన్నదిరా నిన్నే

నమ్మిన చిన్నదిరా... 2

 

చరణం 1:

తానే మధుకలశమని

మనసే నందనమని

వన్నెలతో చిన్నెలతో

మువ్వలతో నవ్వులతో

మోమాటముగా కులికి

                            !నీదాన!

చరణం 2: 

చుక్క.... చుక్క....

చుక్కల కన్నా తానే

చక్కనిదాన నన్నదిరా.. చుక్క..

చక్కని సామీ... చక్కని సామి యని

పక్కనజేరి  పలుకరించి నీ.. దాన నన్నదిరా 

హ్హ హ్హ హ్హా

నిన్నే నమ్మిన చిన్నదిరా... ఆ....

 చుక్క... సుక్క.... చుక్క మూడు చుక్కల రసమాధుర్యాన్ని  అనుభవైకవేద్యం చేస్తూ మల్లాది రామకృష్ణ కవి గారు చక్కని చిక్కని సిరా చుక్కలతో 'నీదాన నన్నదిరా...' అంటూ అలవోకగా వ్రాయగా, పెండ్యాల వారి సుమధుర సంగీతం, ఘంటసాలవారి సుశ్రావ్య రసస్ఫోరక గానంతో 'జయభేరి' సినిమా లోని ఈ నిషా గీతం తెలుగువారి హృదయాలలో సజీవరాగమై నిలిచిపోయింది. 

చుక్క...సుక్క...చుక్క... వినీలాకాశంలోని నక్షత్రాలను చుక్కలంటారు... అందమైన నవయవ్వనాంగినీ చుక్క అనే అంటారు.  ఈ చుక్కల అయస్కాంత ఆకర్షణ , వ్యామోహం మనిషిని సదా వాటికి బానిసను చేస్తూనేవుంది. ఆ దివిలోని చుక్కలు, ఈ భువి పైని చుక్కలు తరతరాలుగా కవులందరికి కవితా వస్తువులై సౌందర్యపిపాసులను మైమరపించి మత్తెక్కిస్తూనే వున్నాయి. ఈ రెండు చుక్కలకు తోడు మరో 'సుక్క' అదీ చుక్కే. పౌరాణిక యుగాలలో సురాపానంగా, మదిరగా, ఆధునికకాలంలో కుషీని, నిషాను  కలిగించే మత్తు 'మందు'. ఇది మనిషి శారీరక, మానసికారోగ్య వినాశనానికి హేతువని పండితుడి మొదలు పామరుడి వరకు తెలిసినా ఈ సుక్కకు చాలామంది లొంగిపోతారు. చుక్క+సుక్క సంపర్కానికి బానిసైతే ఆ మనిషి జీవితం సర్వనాశనమేనని ప్రముఖులెందరి చరిత్రలో చెపుతాయి.

సమాజంలో ఒక వ్యక్తి తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలకు గుర్తింపురావడం మొదలెడితే గౌరవం, పరపతి, అంతస్తు, ఆదాయం  అన్నీ ఒకదానివెనక మరొకటిగా ఆ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానితోపాటు అంతకుముందు కనివిని ఎరుగని వ్యసనాలెన్నో అలవాటు అవుతాయి. రంభ వంటి అందగత్తెను తలదన్నే భార్య ఇంటిలో వున్నా పరస్త్రీ సావాసాలకు, మధుపానానికి బానిసై జీవితంలో పతనావస్థను అనుభవించిన ఒక గొప్ప సంగీత కళాకారుడి కథే 'జయభేరి' సినిమా కథ.

తనలోని విద్వత్తుకు, సంగీత ప్రతిభకు గొప్ప రాజాశ్రయం, గౌరవప్రతిష్టలు లభించగానే ఒక రాజనర్తకి వ్యామోహంలోబడి, మధుపానానికి కూడా దాసుడైన సందర్భంలో ఆలపించిన నిషా గీతం ఇది. ఎంత మత్తులో వున్నా శ్రుతిలయలు తప్పకుండా మృదుమధురంగా సాగే ఈ పాట ఎన్ని దశాబ్దాలైనా సజీవస్వరమే.

మధుకలశం వంటి ఒక లావణ్యవతి వన్నెచిన్నెలతో కాలి మువ్వల సవ్వడులతో, చిరునవ్వులు చిందిస్తూ మోమాటంగా కులుకుతూ చెంతచేరిన వైనాన్ని కథానాయకుని స్వగతంగా మల్లాది వారు ఎంత అద్భుతంగా వర్ణించారో!  తననే నమ్మి వచ్చిన చిన్నదిగా భావించే అతను ఆమె తన పక్కకుజేరి  చక్కని సామి అని ముద్దుముద్దుగా పలుకరించడంతో అతనికెంత మైమరపో, ఎంత ఆనందమో!  పెండ్యాల గారి బాణి, ఘంటసాలవారి సుస్వరాలవాణి కథానాయకుని భావోద్వేగాలను ఎంత రసరమ్యంగా పలికించి మన హృదయాలను మత్తెక్కించిందో  సంగీతాభిమానులందరికీ అనుభవమే.

ఈ పాటలో ఘంటసాలగారి కంఠమాధుర్యం, రాగాలాపనలు, సంగతులు, గమకాలు, భావప్రకటనలు, నవ్వులు అనితరసాధ్యంగా చాలా అలవోకగా జాలువారాయి. మాటల్లో చెప్పలేని అనుభూతి ఘంటసాలవారి గాత్రంలో వినిపిస్తుంది. మాండ్, రాగేశ్వరి రాగఛాయలలో వినిపించే ఈ గీతంలో సితార్, వైయొలిన్స్, ఫ్లూట్, తబలా వంటి తక్కువ వాద్యాలు మాత్రమే పెండ్యాల గారు ఉపయోగించారు.

సుప్రసిద్ధ హిందీ, మరాఠీ చిత్రాల దర్శక నిర్మాత వి.శాంతారాం గొప్ప భావుకుడు, కళాపిపాసి. భారతీయ కళాహృదయాన్ని ప్రతిబింబించే అద్భుత చిత్రాలనెన్నిటినో నిర్మించి భారతీయ సినీమాకు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చారు. 1947లో శాంతారాం మరాఠీ భాషలో తీసిన 'లోక్ షేర్ రామ్ జోషి', హిందీలోని 'మత్వాలా శాయర్ రామ్ జోషి' సినీమాల ఆధారంగా  మన ప్రాంతీయతకు తగినట్లుగా ఆ కథకు మరింత మెరుగులుదిద్ది పి.పుల్లయ్యగారు 1959లో 'జయభేరి' చిత్రాన్ని  తెలుగులో, 'కలైవాణన్'' తమిళ చిత్రాన్ని అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, రాజసులోచన, రేలంగి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా నిర్మించారు.

మరాఠా పీష్వాల కాలంలోని రామ జోషి అనే కవి, ప్రజాగాయకుని జీవితకథ ఇది. శారదా ఫిలింస్ బ్యానర్ మీద వాసిరెడ్డి నారాయణ రావు నిర్మించిన జయభేరిలో అగ్రకులం, నిమ్నకులాల ప్రసక్తి కొంచెం తీవ్రంగా చర్చించబడడం ఈ సినిమా పరాజయానికి కారణమయిందని పలువురి అభిప్రాయం.  చిత్రం బాక్సాఫీస్ వద్ద జయభేరులు మ్రోగించకపోయినా గొప్ప కళాత్మక విలువలు కలిగిన సంగీత నృత్యభరిత చిత్రంగా తెలుగులో ఒక ఉత్తమ దృశ్యకావ్యంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. జయభేరిలో ఎన్నో పాటలు. అన్నీ ఆణిముత్యాలే.

జయభేరి అజరామరం గా నిలిచిపోవడానికి మల్లాది వారి సాహిత్యం, పెండ్యాలగారి సంగీతం, ఘంటసాల, సుశీల అపురూప గానం, అక్కినేని, అంజలీదేవి నటవైదుష్యం ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చును.

కొసమెరుపు -

ఆనాడు తెలుగు రాష్ట్రాలలో మద్యపాన నిషేధం వున్న కారణంగా 'జయభేరి' సినిమాలోని ఈ  మందు నిషా పాట ' నీదాన నన్నదిరా' పాటను సెన్సార్ వారు తొలగించారట. కానీ, మేము స్టూడియోలో 'జయభేరి' సినిమా ప్రివ్యూ చూసినప్పుడు ఈ పాట వుండడం బాగా గుర్తు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...