77వ సజీవరాగం - మాధవా... మౌనమా... సనాతనా...
చిత్రం - శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం
గానం - ఘంటసాల
రచన - సముద్రాల (జూ)
సంగీతం - ఘంటసాల
పల్లవి :
మాధవా మౌనమా సనాతనా
కనరావ కమలనయనా..
!మాధవా!
చరణం :
హే పరంధామ కారుణ్యసింధో
సత్యవ్రతనామ హే దీనబంధో
కనుల నినుజూడ నే నోచలేదా
కావగరావా ప్రభో
!మాధవా!
నారాయణా.. నారాయణా..నారాయణా...
మాధవా..... కేశవా....🌺
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె... నీవే తప్ప ఇతఃపరంబెరుగ... రావే ఈశ్వర.. సంరక్షించు భద్రాత్మకా... అని గజేంద్రుడిచే మొరబెట్టిస్తారు పోతనగారు తన భాగవత కావ్యంలో. "అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ... సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచః" అనే భగవానుడి అభయవాక్కు సర్వకాల సర్వావస్థలలో సత్చింతనాపరుల విషయంలో తప్పక ఫలిస్తుంది అనే విషయం ఈ నాటి సజీవరాగం నిరూపిస్తుంది. సినిమాలో సన్నివేశపరంగానే కాక శ్రీ సత్యనారాయణ మహత్మ్యం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, నేటి సజీవరాగంగా గత ఆరు దశాబ్దాలుగా తెలుగు వారందరినీ అలరిస్తున్న "మాధవా మౌనమా సనాతనా" అనే గీతాన్ని ఆలపించిన మధుర గాయకుడు ఘంటసాలవారి విషయంలో కూడా ఈ శరణాగతి మంత్రం పరిపూర్ణంగా ఫలించింది. ఆ విషయం ఏమిటో మీకు తెలియాలంటే ఈ పాట నేపథ్యెలోకి కొంచెం వెళ్ళాలి.
శ్రీ సత్యనారాయణ మహత్మ్యం సినిమా కు నాయికా నాయకులు కృష్ణకుమారి, ఎన్.టి.రామారావు. అశ్వరాజ్ పిక్చర్స్ కె.గోపాలరావు నిర్మాత. గతంలో ఎన్.టి.ఆర్ హీరోగా వినాయకచవితి, దీపావళి, సినిమాలను తీసిన అనుభవం వుంది. దర్శకుడు రజనీకాంత్ సబ్నవిస్. దీపావళి సినిమా కు కూడా రజనీకాంతే డైరక్టర్. దురదృష్టవశాత్తు సినిమా సగంలో వుండగా డైరెక్టర్ రజనీకాంత్ స్వర్గస్థులయ్యారు. అప్పటికప్పుడు వేరే డైరెక్టర్ ను నియమించుకునే అవకాశం లేక గత చిత్రాలలోని అనుభవంతో నిర్మాత కె గోపాలరావు ఈ సినిమా డైరక్షన్ బాధ్యతలను కూడా చేపట్టారు. ఒకరోజు ఆ గోపాలరావుగారు ఘంటసాలగారి వద్దకు వచ్చి "మాస్టారు! అన్నగారు వరస కాల్షీట్లు ఇచ్చారు. ఈ షెడ్యూల్ లో ఆయనతో ఒక సాంగ్, క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తే ఆయన వర్క్ కంప్లీట్ అయిపోతుంది. (రామారావుగారు ఈ సినిమాలో మహావిష్ణువుగా, భూలోకంలో భక్తుడైన సత్యదేవునిగా ద్విపాత్రాభినయం చేశారు). దైవం అనుకూలిస్తే అనుకున్న ప్రకారం పిక్చర్ ను జూన్ (1964) లో రిలీజ్ చేసేయొచ్చు" అని చెప్పి పాట రికార్డింగ్ కు డేట్స్ ఫైనలైజ్ చేసుకు వెళ్ళారు.
క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట సినిమాకు కీలకమైనది. మత ఛాందసత్వంతో తాను దైవాంశ సంభూతుడనని, శివకేశవ అపరావతారమైన తననే ప్రజలంతా పూజించాలని, అలా చేయనివారు తీవ్రంగా శిక్షించబడతారని అనేక దురాగతాలకు పాల్పడే శివకేశవ మహారాజు పరమ వైష్ణవ భక్తుడైన సత్యదేవుని, అతని అనుయాయులను చిత్రహింసలకు గురిచేస్తాడు. ఇందుకు తండ్రిని గుడ్డిగా నమ్మే రాకుమార్తె, రాజుగారి పేరిట అరాచకాలు సృష్టించే ముఖ్య అనుచరులు సత్యదేవుని కళ్ళూడబెరికి అతని ఆశ్రమాన్ని, పరిసర ప్రాంతాలలో దహనకాండ సృష్టిస్తారు. ఈ భీభత్సమైన వాతావరణంలో నిస్సహాయుడైన కథానాయకుడు 'అన్యధా శరణం నాస్తి' అని తనను ఈ కష్టాలనుండి రక్షించి ధర్మాన్ని కాపాడమని పరమ ఆర్తితో భగవంతునితో మొరపెట్టుకునే సందర్భంలో వచ్చే పాట ఇది.
"మాధవా మౌనమా సనాతనా కనరావా కమలనయనా" అనే పల్లవితో సముద్రాల రామానుజంగారు ఈ పాటను ప్రారంభించారు. శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమాకు కథ, మాటలు, పాటలు, పద్యాలు అన్నీ జూనియర్ సముద్రాలగారే వ్రాశారు. ఘంటసాల, జూనియర్ సముద్రాల కాంబినేషన్లో అనేక విజయవంతమైన సినిమాలు రూపొందాయి.
కరుణరస ప్రధానమైన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఘూర్జరితోడి రాగంలో చేశారు. ఇది ఒక హిందుస్థానీ రాగం. తోడి రాగంలో వుండే పంచమ స్వరాన్ని తొలగించి పాడితే అది ఘూర్జరితోడి అవుతుంది. ఆరోహణ అవరోహణలలో ఆరు స్వరాలు మాత్రమే వుండే రాగం. ఉస్తాద్ బడేగులాం ఆలిఖాన్ గారి ఘూర్జరితోడి తుమ్రీ ఒకటి చాలా ప్రసిధ్ధి పొందింది.
ఆపదలలో వున్న తనను కాపాడమని భగవంతునితో మొరపెట్టుకునే ఈ పాటలో పల్లవి, ఒక చరణం మాత్రమే వుంటూ చివరలో నారాయణా, మాధవా, కేశవా అంటూ ఎలుగెత్తి విలపించడంతో ఆర్తత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తునికి తన విశ్వరూప దర్శనాన్నిచ్చి పోయిన కన్నులు మరల ప్రసాదించి అనుగ్రహిస్తాడు. అందరి తృప్తిమేరకు పాట చాలా ఎఫెక్టివ్ గా బాగా వచ్చింది. ఈ పాట కోసం వైయొలిన్స్, డ్రమ్స్, డబుల్ బాస్, వైబ్రోఫోన్, ట్రంపెట్స్, బాంజో, షెహనాయ్, తబలా వంటి వాద్యాలను ఉపయోగించడం జరిగింది. ఆర్కెష్ట్రావారందరికీ రికార్డింగ్ డేట్ కాల్షీట్ టైమ్, స్టూడియో తెలియపర్చడం జరిగింది. ఇక మర్నాడు రికార్డింగ్ అనగా ఒక అవాంఛనీయ సమస్య ఎదురయింది. మండువేసవి రోజులు కావడాన ఘంటసాలగారి ముఖాన సెగ గెడ్డలు లేచాయి. దానితోపాటు దాదాపు 102 డిగ్రీల జ్వరం. ఈ రెండు సమస్యలు మాస్టారిని చాలా తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. నొప్పితో బాధపడుతూ ఇంత తీవ్రమైన జ్వరంతో స్టూడియోకు వెళ్ళవద్దని రికార్డింగ్ క్యాన్సిల్ చేయమని ఇంట్లోవారంతా తెగ ఒత్తిడి చేసినా ఘంటసాల మాస్టారు ఒప్పుకోలేదు. తాను రికార్డింగ్ క్యాన్సిల్ చేయడం మూలంగా నిర్మాత షెడ్యూల్ అంతా తారుమారు అవుతుందని అసలే కష్టాలలో వున్న నిర్మాత మరింత నష్టపోతాడని అది తనకు ఇష్టంలేదని నిర్మాత సాధకబాధకాలన్నీ దృష్టిలో పెట్టుకొని తనకు జరగబోయే మంచైనా చెడైనా ఆ సత్యనారాయణస్వామిదే భారమని తన అస్వస్థతను ఏమాత్రం లెఖ్ఖచేయకుండా పాట రికార్డ్ చేయడానికే నిశ్చయించుకొని స్టూడియోకు బయల్దేరారు. వాహినీలో 2 టు 9 కాల్షీట్ లో జరిగిన ఈ పాట రికార్డింగ్ కు మాస్టారితో పాటూ నేనూ వెళ్ళాను. ముఖమంతా వ్యాపించిన సెగగెడ్డలమీద చందనం పూసుకొని,శాలువ కప్పుకొని వచ్చిన ఘంటసాలగారి వాలకం చూసి రికార్డింగ్ ధియేటర్ లోని వాద్యబృందం, సౌండ్ ఇంజనీర్, చిత్రనిర్మాత అందరూ ఆరోజు పని జరగదనే భావనకు వచ్చారు. కానీ ఘంటసాలగారు మాత్రం దేవుడిమీదే భారం వేసి పాట రికార్డింగ్ ప్రక్రియకు ఉపక్రమించారు. అప్పటికే మాస్టారి అసిస్టెంట్లు అయిన సంగీతరావుగారు, రాఘవులు గారు ఆర్కెష్ట్రావారికి ఇవ్వవలసిన నొటేషన్స్ , సూచనలు పూర్తిచేసినందువలన ఆర్కెష్ట్రాతో ఒకటి రెండు రిహార్సల్స్ చూసి మాస్టారు రెడి ఫర్ టేక్ అంటూ మైక్ ముందుకు వెళ్ళారు. రికార్డింగ్ ధియేటరంతా నిశబ్దమైపోయింది. మాస్టారికి ఏ శ్రమా కలుగకూడదని ఆర్కెష్ట్రా అంతా చాలా జాగ్రత్తగా తమ నొటేషన్స్ మీదే ధ్యాస పెట్టారు. రెండు శ్రుతి లోని మాస్టారి గంభీరమైన స్వరం ధియేటరంతా వ్యాపించింది. ఘంటసాలగారు తన జ్వరం, సెగ గెడ్డల నొప్పి అంతా మర్చిపోయారు. క్లైమాక్స్ లో బాధతో కలిగిన అనుభూతితో 'నారాయణా, మాధవా, కేశవా' అంటూ ఎలుగెత్తి పెట్టిన కేకకు అందరూ నిశ్చేష్టులైపోయారు. ఘంటసాలగారికి ఎదో జరిగిందని భయపడిపోయారు. మరుక్షణంలో అందరూ తేరుకున్నారు. సౌండ్ ఇంజనీర్ ఫస్ట్ టేక్ ఓకే చేశారు. సినిమాలో తన భక్తుడిని రక్షించిన శ్రీ సత్యనారాయణస్వామి రికార్డింగ్ ధియేటర్ లో తీవ్ర అనారోగ్యంతో వున్న ఘంటసాలను కూడా కరుణించాడు.
'మాధవా మౌనమా సనాతనా' పాటను విన్నవారెవరూ ఘంటసాల ఈ పాటను అనారోగ్యంతో ఉన్నప్పుడు పాడిన పాటని రవ్వంత కూడా అనుమానించలేరు. సన్నివేశపరమైన ఆవేదనానుభూతికి తన ఈతిబాధను కూడా జోడించి ఆర్తితో అపూర్వంగా పాడిన ఈ పాటకు తెరపై ఎన్టీఆర్ తన నటనా పాటవంతో ప్రాణ ప్రతిష్ట చేసి ఈ గీతాన్ని సజీవరాగం చేశారు.
ప్రణవ స్వరాట్
ఘంటసాలగారికి తన వృత్తి పట్ల గల అంకితభావాన్ని సోదాహరణంగా వివరిస్తూ వ్రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది. రచయిత ప్రణవ స్వరాట్ గారికి ధన్యవాదాలు, అభినందనలు.
ReplyDelete