Saturday, 11 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 103వ భాగం - వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటరెండవ భాగం ఇక్కడ

103వ సజీవరాగం - వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురా

చిత్రం - కనకతార
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - ఘంటసాల

పల్లవి:

వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర-2

ఆ యిబ్బందే మనకొద్దురా

యములోడికి కూడా వద్దురా

వద్దుర బాబూ వద్దురా!

చరణం 1: 

ఆపెతో సరసాలాడామా అగ్నిపర్వతం పగిలిందే -2

ఈపెతో యిష్టం చూపేమా యిల్లు పిల్లి కూనెగిరిందే

గోడదెబ్బతో చెంపదెబ్బతో  కుమిలి

కుమిలి పడిచస్తున్నాం 

                                !వద్దుర బాబూ!

చరణం 2: 

ఎక్కడ తాళం అక్కడ వేసీ టక్కరితనం నేర్వాలి 

నిజం చెప్పడం మరవాలి

                                        !వద్దుర!

రంభా ఊర్వశి తాతలు మీరని 

రకరకాలుగా పొగడాలి 

                                !వద్దుర బాబూ!

 చరణం 3: 

శివుడిద్దరి పెళ్ళాల బాధతో 

తిరిపమెత్తుకొని తిరిగాడూ

గంగను తలపై నిలిపాడు ! శివుడి!

అదీ యిదేమని పార్వతీదేవిని

అర్ధనారిగా చేశాడూ

                                !వద్దుర బాబూ!

చరణం 4:  

ఏడుకొండల యెంకటేశ్వరా -2

ఈ బాధే నీకున్నదా?

అలివేలు బాధ నీకున్నదా?

నాంచారి బాధ నీకున్నదా ?

దేవుళ్ళగుండే మీపనే యిట్లుంటే

మనుషులు పాట్లు చెప్పాలా

                                !వద్దుర బాబూ!

 

ఇద్దరి భార్యల బాధతో పరమశివుడు బిచ్చమెత్తుక తిరిగాడట; గంగను నెత్తిన పెట్టి గౌరిని తన దేహంలో అర్ధనారిగా చేశాడట. ఇద్దరు పెళ్ళాల జీవితంలోని సుఖము,ఆనందము ఎంతమాత్రమో తెలియదు కానీ ఆ మొగుడి అగచాట్లు మాత్రం చెప్పశక్యంకాదు. మంచితనం, వ్యక్తిత్వం గల మనిషికి రెండిళ్ళ పూజారిత్వం చాలా దౌర్భాగ్యం. ఇచ్చకాలతో, మోసకారితనంతో నీతి నిజాయితీలకు తిలోదకాలివ్వాలి.  చూడ దుర్భరంగా వున్నా రంభా ఊర్వశులను చంపిపుట్టిన అందగత్తెలని సదా భజన చేస్తూవుండాలి. మరి అలాటివారిని ఎందుకు కట్టుకున్నాడంటే అది లలాట లిఖితమే. 

నుదుటను జాతకాలు రాసే బ్రహ్మకు సరస్వతి ఒక్కతే; ఆయన తండ్రి మహావిష్ణువు కు ఇద్దరు సతులు శ్రీదేవి, భూదేవి; ఆ విష్ణువు అంశతో అవతారమెత్తిన రాముడు ఏకపత్నీ వ్రతుడనని పరస్త్రీల జోలికే పోలేదు. రాముడి తండ్రి దశరధునికి భార్యలు ముగ్గురు. ముద్దుల భార్య కైక మూలంగా  పెద్ద రామాయణమే జరిగింది. ద్వాపరయుగంలో కృష్ణుడిగా అష్టభార్యలతోపాటు పదహారు వేల మంది గోపికలను మాయచేస్తూ వచ్చాడు. కలియుగంలో  ఇద్దరు భార్యల పోరు భరించలేక శ్రీపతి వేంకటాద్రిపై శిలయైపోయాడు.

ఇలాటి గాథలెన్నో విన్న ఒక అర్భకుడు గ్రహపాటు సరిగాలేక రెండు సంసారాల జంఝాటంలో చిక్కుకొని 'వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర' అని ఇద్దరు భార్యల ఎంకన్న దేముడికి మొరెట్టుకుంటున్నాడు... అదే నేటి మన సజీవరాగం.

'కనకతార' సినిమాలో ఈపాటను సరదాకోసం హాస్యనటుడు చదలవాడ కుటుంబరావు మీద చిత్రీకరించినా, ఆలోచించి చూస్తే ఇందులో చాలా వ్యవహారముంది. ఇద్దరు భార్యలు గల మగాడి జీవితంలో ఈతిబాధలనేకం. ఈ విషయంలో అనుభవజ్ఞుడైన వ్యక్తినే ఈ గీతం సంగీతదర్శకుడిగా, గాయకుడిగా వరించడం ఒక విశేషం. తన స్వానుభవసారంతో ఘంటసాలగారు ఈ గీతానికి పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

అసలు ఈ బహుభార్యా వ్యవస్థ ఏనాటిది? దీని అవసరం ఎంతవరకు? తరచిచూస్తే రామాయణ, మహాభారత, భాగవత కాలాలనుండి ఈ బహుభార్యత్వం అనేది మన భారతదేశంలో కొనసాగుతున్నట్లు ఈ కావ్యాల ద్వారా తెలుస్తోంది. గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజాధిరాజులు, ధనికవర్గాలవారు తమ తమ హోదాను, దర్పాన్ని, అహంకారాన్ని చాటుకునేందుకు, తమ తమ రాజ్యాలను సుస్థిరం చేసుకునే క్రమంలో రాచకీయపుటెత్తులలో భాగంగా అనేక పెళ్ళిళ్ళను చేసుకునేవారు. పరశురాముడు దాడి నుండి తప్పించుకునేందుకు దశరథుడు తరచూ పెళ్ళిపీటలెక్కేవాడట. అలాగే తమ సామ్రాజ్య విస్తారణ కోసం శ్రీకృష్ణ దేవరాయలు, అక్బర్ పాదుషా అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నారని చరిత్ర చెపుతుంది.  రెండో భార్యగానో, నాల్గవ భార్యగానో కాలం గడపడానికి సిధ్ధపడిన స్త్రీల సంగతేమోకానీ తమ ఇష్టానికి విరుధ్ధంగా, మనసు చంపుకొని, పరిస్థితుల ప్రాబల్యంతో బలవంతాన ఉంపుడుగత్తెలుగా జీవితాంతం వ్యధలపాలవుతున్న స్త్రీలు ఎందరో!  ఏమైనా, అక్రమ సంబంధాల వలన, రహస్య వివాహాలు చేసుకునే సామాన్య స్త్రీలకు సామాజిక గౌరవం, జీవితాలలో ఆత్మ తృప్తి, సుఖసంతోషాలు మృగ్యమనే చెప్పాలి. అలాగే మోహావేశాలకు, ప్రలోభాలకులోనై  పెళ్ళి పేరిట అనేక మంది స్త్రీలతో ఆడుకునే పురుషుల జీవితమూ దుర్భరమే. అక్రమ సంబంధాలు, రహస్య పెళ్ళిళ్ళు వాటి వల్ల సంభవించే కష్టనష్టాలు ఇతివృత్తాలుగా మనకు వున్నన్ని కథలు, సినీమాలు, సీరియల్స్ కోకొల్లలు.

వీటికి ఉన్నంత క్రేజ్, గిరాకీ ఇతర కథాంశాలకు లేదు. ఇందులోని గొప్ప తమాషా ఏమంటే, మన దేశంలో ఇలాటి సినీమాలను  ఆదరించి పోషించేది, అలాటి హీరోయిజంపై మోజుపడేది ఎక్కువగా మహిళా ప్రేక్షకులే. సంఘానికి చీడపురుగులైన అలాటి స్త్రీ పురుషుల మీదా ఎలాటి తిరుగుబాటుదనమూ మనవాళ్ళలో కనపడదు. 

బహుభార్యత్వం విషయంలో ప్రభుత్వాలు కూడా ద్వంద వైఖరి నే పాటిస్తున్నట్లనిపిస్తుంది. ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలతో సహా అనేక దేశాలలో బహుభార్యత్వం నిషేధించబడింది. ముస్లీం దేశాలలో కూడా నిబంధనలతో కూడిన ఆమోదం మాత్రమే అమలులో వుంది. భారతదేశంలో కూడా బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ 1956 లో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిప్రకారం ఒక భార్య సజీవంగా వుండగా మరొక స్త్రీతో సంపర్కమో లేక రెండవ వివాహం చేసుకోవడమో చట్టవిరుధ్ధంగా పరిగణించబడింది. అయితే చట్టాలలోని లొసుగుల వల్ల రాజకీయ ప్రలోభాలవలన ఈ చట్టం వల్ల కలిగే సత్ఫలితాలు అంతంతమాత్రమే. ఇలాటి చట్టాలను, నీతి నియమాలను గౌరవించేది అంతరాత్మకు భయపడే సగటు మనిషి మాత్రమే.

సరి, ఎక్కడో మొదలైన మన చర్చ ఎక్కడికో పోతోంది. ప్రస్తుతం ఈనాటి సజీవరాగం విషయానికి వద్దాము. 1956 లో విడుదలైన ' కనకతార' అనే ఒక జానపద చిత్రంలోని పాట ' వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర'. సినిమా లో ఒక జాలరి పాత్ర (చదలవాడ కుటుంబరావు) పాడే పాట. స్వీయ సంగీతంలో ఘంటసాలగారు సంపూర్ణంగా అనుభవిస్తూ జనరంజకంగా ఆలపించిన గీతం. దీనిని జానపదగీత బ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి తనదైన శైలిలో అద్భుతంగా వ్రాసారు. కొసరాజుగారికి తాను వ్రాసిన పాటను ఏదో మీటర్లో పాడుతూ వినిపించడం అలవాటు. కొన్ని సందర్భాలలో ఆయన పాడిన ట్యూన్ నే అవసరమైన సవరణలు చేసి సంగీతదర్శకులు పాటను స్వరపర్చడం జరిగేది. జానపదశైలిలో సాగే ఈ పాటను ఘంటసాలగారు ఖరహరప్రియ రాగస్వరాలతో రూపొందించారు. ఖరహరప్రియ కర్ణాటక సంగీతశైలిలో 22వ మేళకర్త. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతాయి. చాలా ప్రాచీనమైనరాగం.హిందుస్థానీ బాణీలో కాపి థాట్ రాగంగా చెపుతారు. ఖరహరప్రియ రాగానికి ప్రసిధ్ధి చెందిన జన్యరాగాలు ఎన్నో వున్నాయి. ఖరహరప్రియ రాగానికి ఆ పేరు రావణుని గానం వలన శివునిపరంగా (హరప్రియ) ఖరుడనే రాక్షసుని చంపిన రామునికి ఇష్టమైన రాగంగా త్యాగరాజస్వామి వారి వలన కలిగినట్లు ప్రతీతి. ఖరహరప్రియలో, దాని జన్యరాగాలైన ఉదయరవిచంద్రిక, రీతిగౌళ, శ్రీరంజని, ముఖారి, అభేరి, అభోగి, భీంప్లాసd, కాపి, మధ్యమావతి, బృందావనసారంగి, మొదలైన వాటిలో స్వరపర్చబడిన సినీమాపాటలు అసంఖ్యాకం.

రాగప్రధానమైన గీతాలను రసానుభవానికి తగినట్లుగా రూపొందించడంలో ఘంటసాలగారు మాస్టరే. జానపద బాణీలో సాగే ఈ పాట కోసం ఘంటసాల మాస్టారు మాండొలిన్, వైలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్, చిడతలు వంటి వాద్యాలను ఉపయోగించారు. చదలవాడ మ్యానరిజమ్స్ ను దృష్టిలోపెట్టుకొని ఘంటసాల ఈ పాటను బలే గమ్మత్తుగా పాడారు.

తెలుగు సినిమా తొలితరం మాటల, పాటల రచయిత చందాల కేశవదాసు వ్రాసిన నాటకం 'కనకతార'. దీనిని 1937లో సరస్వతీ టాకీస్ వారు హెచ్.వి.బాబు డైరక్షన్ లో కన్నాంబ, సూరిబాబు, దొమ్మేటి సూర్యనారాయణ లతో సినిమాగా తీసారు. భీమవరపు నరసింహారావు సంగీతం నిర్వహించగా పాటలు పద్యాలను సముద్రాల రాఘవాచార్య, చందాల కేశవదాసు వ్రాసారు. అదే కనకతార, తన పుత్రసమానుడు ఘంటసాల సంగీతదర్శకునిగా, 1956లో రెండవసారి  నిర్మించినపుడు అందులో సముద్రాలగారు ఒక పాటను, పద్యాన్ని కూడా వ్రాయకపోవడం ఒక విశేషం. దీనినిబట్టి  ఆనాడు ఎక్కువగా నిర్మాతల మాటే చెల్లుబాటు అయేదని తెలుస్తోంది.

కనకతారలో వున్న 13 పాటలు/పద్యాలను జంపన, అనిశెట్టి, కొసరాజు వ్రాయగా వాటిని ఘంటసాల, ఎస్.వరలక్ష్మి, జిక్కి, మాధవపెద్ది ఆలపించేరు. ఇందులో ఘంటసాలగారు నాలుగు పాటలు పాడగా ఆ నాలుగింటినీ కొసరాజుగారే వ్రాసారు. గోకుల్ ప్రొడక్షన్ దోనేపూడి కృష్ణమూర్తి అంతకుముందు తీసిన 'వదినగారి గాజులు' చిత్రానికి కూడా ఘంటసాలగారే సంగీతం నిర్వహించారు. రజనీకాంత్ సబ్నవీస్ ఈ కనకతార చిత్రదర్శకుడు. 

ఎన్నో మంచి పాటలున్న ఈ చిత్రం విడియో లభించకపోవడం దురదృష్టం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 4 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 102వ భాగం - నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటొకటవ భాగం ఇక్కడ

102వ సజీవరాగం - నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి

చిత్రం - మాయింటి దేవత
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - మాస్టర్ వేణు

పల్లవి:

నీ లేత గులాబీ పెదవులతో

కమ్మని మధువును తాకాలి -2

విందులు చేసే నీ అందాలు

నామదిలోనే చిందాలి

                                నీ లేత!

చరణం 1: 

మధురమైన ఈ మంచి రేయిని 

వృధాచేయకే...సిగ్గులతో -2

చంద్రుని ముందర తార వలె

నా సందిట నీవే ఉండాలి....

ఈ మధువంతా నీకోసం

పెదవుల మధువే నాకోసం

                                నీ లేత!

 

చరణం 2:

మధువు పుట్టింది నా కోసం

నేను పుట్టింది నీ కోసం -2

కన్నుల కాటుక కరగకముందే

సిగలో పువ్వులు వాడకముందే-2

పానీయముతో పరవశమై-2

నీ కౌగిట నన్నే బంధించుకో

                                నీ లేత!

'ప్రేమ'  రెండక్షరాల ఒక చిన్న మాట. కాని సముద్రమంత లోతైనది, గాఢమైనది. ప్రేమ తత్వాన్ని  సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం అంత సులభంకాదు. ఈ విశ్వమంతా ప్రేమమయం. విశ్వశాంతికి, మనుషుల మధ్య ఐక్యతకు, సామాజిక పురోభివృద్ధికి ప్రేమ, మమకారం ఆవశ్యకం. మనిషి  మానసిక, నైతిక, శారీరక స్వస్థతకు ప్రేమ ఎంతో ముఖ్యం. నీ నా తరతమ బేధం లేకుండా సమస్త ప్రాణులను ప్రేమించగలిగేవారికి ఆయుర్దాయం ఎక్కువగా వుంటుందని పెద్దలంటారు.

ప్రేమ అనే మధురభావం మనస్సుకు సంబంధించినది. ఆ ప్రేమ పరిపరివిధాలు. యువతీయువకుల మధ్య ప్రేమ; భార్యాభర్తల ప్రేమ; తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ --- ఇలా ప్రేమ భావనా స్వరూపం మారుతూంటుంది. అర్ధవంతము, గాఢత్వము కలిగి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పూర్తిగా నిష్కల్మషమైన స్నేహమనే పునాదిపై ఇద్దరు వ్యక్తుల మధ్య (అది స్త్రీ పురుషులు కావచ్చు లేదా ఇద్దరూ పురుషులు లేక ఇద్దరు స్త్రీలు కావచ్చు) ఏర్పడిన ప్రేమ  పవిత్రమైనదిగా, ఉన్నతమైనదిగా భావించబడుతుంది. శాశ్వతత్త్వాన్ని కలిగివుంటుంది. అయితే అలాటి ఉత్కృష్టమైన ప్రేమ మనకు కథలలో, సినిమాలలో మాత్రమే కనిపిస్తుంది. నిజజీవితంలో అలాటి ఉదాత్తమైన ప్రేమ బహు అరుదు.

సామాన్యంగా సగటు మనిషి  అనుభవించే ప్రేమ,పంచే ప్రేమ  మోహ, ప్రలోభాలకు, స్వార్థానికి అతీతమైనదేమీ కాదు.  బాహ్య సౌందర్యానికి,లౌకిక కోరికలకు లోబడివుంటుంది. జీవితం యవ్వన దశలో స్త్రీ పురుషుల మధ్య ఈ ప్రేమ శారీరక, ఆర్ధిక, సామాజిక అవసరాలను తీర్చే సాధనంగా  ఉపయోగపడుతున్నది. ఈనాడు యువతీయువకులు  లేదా భార్యాభర్తల మధ్య గల ప్రేమలో కూడా హిపోక్రసి చోటు చేసుకుంటున్నది. ఎదుటి వ్యక్తి బలహీనతలను ఆసరాగాచేసుకొని  మోసం, దగాకోరుతనంతో తన చెప్పుచేతల్లో వుంచుకునే లక్షణం కనిపిస్తుంది.

స్త్రీ అంటే కేవలం  శారీరక కాంక్ష తీర్చే భోగవస్తువుగా భావించే ఒక కాముకుడు పాడే గీతాన్ని ఈనాటి సజీవరాగంగా ప్రకటించడానికి మనసొప్పకపోయినా అలాటి వికృతభావాలను ప్రకటించడంలో కూడా ఘంటసాలవారి గాన ప్రతిభ ఎంత సున్నితంగా, హృద్యంగా వుంటుందో తెలియజేయడానికే ఈ వారం 'లేత గులాబీ పెదవులు'  ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

వివాహం జరిగిన తొలినాటి రాత్రే శోభనంగదిలో ఆప్యాయంగా ప్రేమానురాగాలు పంచవలసిన భర్త మధువు నిషాలో తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి నిర్బంధిస్తూంటే  సభ్యతా సంస్కారాలు గల ఆ భార్య మనసు ఎంత క్షోభిస్తుంది. వ్యసనపరుడైన ఆ భర్తకు భార్యయైనా ఒక్కటే, వెలయాలైనా ఒక్కటే. తన వాంఛ తీర్చుకోవడమే ముఖ్యం. వ్యామోహమే ప్రధానాంశంగా గల ఈ గీతాన్ని  గొంతులో నిషాను, మోహాన్ని  పలికిస్తూ ఘంటసాల మాస్టారు ఆలపించిన విధం; మగువ, మదిరలకు బానిసయైన భర్తగా తెరమీద హరనాథ్ రాజు, బలిపశువైన భార్యగా జమున నటన ఈ పాటకు సజీవత్వాన్ని కలిగించింది.


'కన్నుల కాటుక కరగకముందే సిగలో పువ్వులు వాడక ముందే నీ కౌగిట నన్ను బంధించుకో;  మధురమైన ఈ మంచిరేయిని వృధా చేయకే సిగ్గులతో విందులు చేసే నీ అందాలు నా మదిలోనే నిండాలి నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి' - ఎంత చక్కటి భావన. ఎంత అద్భుతంగా వ్రాసారు దాశరథి ఈ ప్రణయగీతాన్ని.  నిజానికి ఇటువంటి సున్నితమైన శృంగారభావాలు కల ఆ వ్యక్తి మందును ఆశ్రయించవలసిన పనే లేదు. 

ఘంటసాలగారి గాత్ర మాధుర్యంతో ఈ తొలిరేయి గీతం ప్రేమికులందరిలో అనిర్వచనీయమైన మత్తునే కలిగిస్తుంది. పాటలో వచ్చే 'చిందాలి', 'సిగ్గులతో', ' నా కోసం, 'కన్నుల కాటుక కరగక ముందే' వంటి పదాలమీద ఘంటసాల మాస్టర్ గారు ఇచ్చిన వైవిధ్యభరితమైన భావాలు, మధ్య మధ్య చిరునవ్వులు  ప్రేక్షకులలో ఈ పాట పట్ల మోజును పెంచుతుంది.

కృష్ణ, జమున, హరనాథ్, పద్మప్రియలు ముఖ్యపాత్రలుగా చాలా సాదాసీదా కధాంశంతో నడిచే సినిమా 'మాయింటి దేవత'. ఈ సినీమాకు అంతో యింతో ఊరట కలిగించే విషయం మాస్టర్ వేణుగారి సంగీతం, ఘంటసాల మాస్టారు పాడిన 'నీ లేత గులాబీ పెదవులతో' గీతం మాత్రమే. సంతూర్, సితార్, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, వైబ్రోఫోన్ కాంబినేషన్లతో మాస్టర్ వేణు సమకూర్చిన ఆర్కెస్ట్రేషన్ పాటకు ఎంతో శ్రావ్యతను చేకూర్చింది. పాట ఆద్యంతం ఘంటసాల మాస్టారి గాత్రాన్ని అనుసరిస్తూ సాగిన తబలా నడక మనసుకెంతో హాయిని కలిగిస్తుంది. అసలు ఈ పాట ఇంత హృద్యంగా రూపొందడానికి కారణం ఈ గీతాన్ని రూపొందించడానికి ఎన్నుకున్న రాగం. హిందోళ రాగ స్వరస్థానాలతో వేణు ఈ పాటను చేశారు. అంతేకాదు ఆ రాగంలో లేని అన్యస్వరాలను కూడా జోడించి ఎనిమిది స్వరాలతో (రిషభం, పంచమం, అంతరగాంధారం అన్యస్వరాలు) మనకు వీనులవిందు చేశారు. కర్ణాటక సంగీత హిందోళానికి సమాంతర హిందుస్థానీ రాగం మాల్కౌంస్. ఈ రెండు రాగాలలో అన్యస్వర ప్రయోగాలతో ఘంటసాల మాస్టారు పాడిన గీతాలెన్నో సంగీత ప్రపంచంలో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి.

ఈ సినిమాలోని పదకొండు పాటలలో ఘంటసాలగారు పాడినవి రెండు విడివిడి సాకీలు, ఈ పాట మాత్రమే. ఈ మూడింటిని విలన్ టైప్ పాత్రధారి హరనాథ్ మీదనే చిత్రీకరించారు నటదర్శకుడు బి.పద్మనాభం. ఘంటసాల హరనాధ్ కాంబినేషన్లో గతంలో కూడా చాలా మంచిపాటలు వచ్చాయి. 'నేను పాడిన పాటలకు హరనాథ్ లిప్ మూవ్మెంట్ చాలా చక్కగా సింక్రనైజ్ అవుతుందని ఒక రీరికార్డింగ్ లో ఘంటసాల మాస్టారు హరనాథ్ ను ప్రశంసించడం నేను విన్నాను. ఈ చిత్రంలో మిగిలిన పాటలను ఎస్పిబాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, వాణీ జయరాం పాడారు. 

'మాయింటిదేవత' సినిమా అసలు నిర్మాత హరనాథ్. ఆర్ధికపరమైన ఇబ్బందులతో చిత్రనిర్మాణం ఆగిపోయింది. హరనాథ్ ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా చాలా నష్టపోయారు. తర్వాత సినిమా చేతులు మారి ఏడెనిమిదేళ్ళ తర్వాత  విడుదలయింది. అప్పటికి ఘంటసాలగారు అమరులయి ఆరేళ్ళయింది. ఘంటసాలగారి గొంతును వినిపించిన ఆఖరి సినిమా 'మాయింటిదేవత'. హరనాథ్. తొలి చిత్రమైన 'మా ఇంటి మహాలక్ష్మి' లో కూడా ఘంటసాలగారు జిక్కి తో కలసి ఒక డ్యూయెట్ పాడారు. ఈ చిత్రంలో కూడా జమునే హీరోయిన్.

జమున హరనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించాయి. మరి, 'మాయింటిదేవత' కు ఆ అదృష్టం పట్టినట్లులేదు. చిత్రనిర్మాణం లోని జాప్యం ఒక కారణం కావచ్చును.

ఇలాటి సినిమాలు ఇంకా గుర్తుండిపోవడానికి కారణం వాటిల్లోని ఘంటసాలగారి పాటలే అంటే అతిశయోక్తికాదు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



Saturday, 27 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 101వ భాగం - ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

 "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూరవ భాగం ఇక్కడ

101వ సజీవరాగం - ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

చిత్రం - భూమికోసం
గానం - ఘంటసాల
రచన - శ్రీశ్రీ

సంగీతం - పెండ్యాల

పల్లవి:

ఎవరో వస్తారని ఏదో చేస్తారని 

ఎదురుచూసి మోసపోకుమా!

నిజం మరచి నిదురపోకుమా....

చరణం 1:

బడులే లేని పల్లెటూళ్ళలో-2

చదువేరాని పిల్లలకు

చవుడురాలే చదువుల బడిలో

జీతాల్ రాలని పంతుళ్ళకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

చరణం 2:

చాలీచాలన పూరిగుడిసెలో-2

కాలేకడుపుల పేదలకు

మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

చరణం 3:

తరతరాలుగా మూఢాచారపు వలలో 

చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి 

బలియైపోయిన పడతులకు 

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

 చరణం 4:

కూలి డబ్బుతో లాటరీ టిక్కెట్ -2

కూలి డబ్బుతో లాటరీ టిక్కెట్ కొనే దురాశా జీవులకు

దురలవాట్లతో బాధ్యత మరచి చెడే నిరాశా జీవులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

 చరణం 5:

సేద్యం లేని బీడునేలలో ఓ....-2

పనులే లేని ప్రాణులకు

పగలు రేయి శ్రమపడుతున్నా ఫలితం దక్కని దీనులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

ఎన్నో శతాబ్దాలుగా మన దేశాన్ని, మన దేశమే ఏమిటి యావత్ప్రపంచాన్ని పట్టి కుదుపుతున్న ప్రధాన సమస్యలు Social injustice & economic inequality అంటే సామాజిక అన్యాయం మరియు ఆర్ధిక అసమానత్వం. వీటివల్ల కలుగుతున్న దురాగతాలనుండి, కష్టనష్టాలనుండి బక్కచిక్కిన బడుగు ప్రజలను రక్షించి ఉధ్ధరించాలని ఎందరో మహానుభావులు తరతరాలుగా శ్రమిస్తున్నారు, యింకా ఆ దిశగా కృషిచేస్తూనే వున్నారు. అయినా ఫలితం అంతంతమాత్రమే.

దున్నేవాడిదే భూమి, ప్రజలదే రాజ్యం అనే నినాదాలు కేవలం ఉపన్యాసాలకే పరిమితం. ఫలితం ఎక్కడవేసిన గొంగళి అక్కడే. విదేశీ పాలకుల కబంధహస్తాలనుండి విముక్తి కలిగి స్వరాజ్యం, స్వాతంత్ర్యం లభిస్తే పేదప్రజల జీవనవిధానమే మారిపోతుందనే కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. జమిందారీ వ్యవస్థ రద్దువలన, భూదానోద్యమాల వల్ల, మరేవేవో సంస్కరణల వలన సగటు మనిషి సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాడని ఆశించినవారి కలలు ఇంకా పరిపూర్ణంగా సఫలీకృతం కాలేదు‌, అవి పగటికలలుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏమిటి? లోపం ఎక్కడుంది?  ఈ దుస్థితిని రూపుమాపడానికి సామాజిక స్పృహ కలిగిన సంస్కర్తలు,దీనజనోధ్ధారకులు తమవంతు కృషిని స్వార్ధరహితంగా చేస్తూనేవున్నా పేదా గొప్పా తారతమ్యాన్ని మాత్రం సమూలంగా నిర్మూలించలేకపోతున్నారు.

ఆలోచించి చూస్తే కారణాలెన్నో కనిపిస్తాయి. అట్టడుగు స్థాయిలో ఉన్న నిరక్షరాస్యత, బుధ్ధిహీనత, తెలివిలేమి వారి అభివృద్ధికి అడ్డుకట్టగా నిలుస్తున్నాయి. తమ దైనందిక జీవితావసరాలు తీరడానికి, రెండుపూటలా ఇంత గంజి త్రాగడానికి  ఏ డబ్బున్న ఆసామినో ఆశ్రయించక తప్పడంలేదు. ధనికవర్గాలు సర్వవిధాల దోపిడీ చేసి ఆ పేదలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని తమ బానిసలుగా చేసుకుంటున్నారు.  నోట్లతో ఓట్లను కొని పదవులకు ఎగబ్రాకే రాజకీయ నాయకులంతా ఆ ధనికులకు వత్తాసుగా నిలుస్తున్నారు. క్రమంగా ఆ ధనికులే నాయకుల అవతారలెత్తుతున్నారు. 

దీనికి తోడు పేదలలోని అజ్ఞానం, ఒకే రాత్రిలో అప్పనంగా డబ్బు సంపాదించి కోటీశ్వరులైపోవాలన్న దురాశ. అందుకోసమై తప్పుడు దార్లు తొక్కడం. చాలీచాలని దినసరి కూలి డబ్బులను త్రాగుడు మీద, లాటరీ టిక్కెట్ల మీద తగలేసి బాధ్యతారహితంగా బ్రతికేవారిలో  చైతన్యం  తీసుకువచ్చి వారిలోని పిరికిదనాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యం కలిగేలా నవసమాజ స్థాపనే ధ్యేయంగా ఎందరో అభ్యుదయవాదులు కృషి చేశారు.

మనిషి తనకు తానుగా  ఆలోచించి సక్రమ మార్గంలో ఎదగడానికి ప్రయత్నించాలి. పరాన్నజీవులుగా బ్రతకడం మానుకోవాలి. నీ కష్టసుఖాలు నీవే. నిన్ను ఉధ్ధరించడానికి ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఆశిస్తూ ఎదురుచూడడం అవివేకం.  అలా ఏ స్వయంకృషి లేకుండా   అలసత్వంతో సోమరిగా గడిపితే మొదటికే మోసం వస్తుందంటున్న ఘంటసాల మాస్టారు ఆలపించిన శ్రీశ్రీ ప్రబోధ గేయమే నేటి మన సజీవరాగం... అదే...

'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా....'

 ప్రజలను మేల్కొలిపి వారికి కావలసిందేమిటో వారే తెలుసుకునేలా చేయడమే ఈ గీతం లక్ష్యం. వామపక్ష భావజాలం కలిగి అట్టడుగు వర్గ సమాజానికేదో మంచి ఉద్బోధ చేయాలనే తలంపుతో కె.బి.తిలక్, శ్రీశ్రీ, సుంకర , పీపుల్స్ వార్ గ్రూప్  వ్యవస్థాపకుడు కె.జి.సత్యమూర్తి మొదలగువారి సమిష్టి కృషి ఫలితమే 1974లో వచ్చిన  ' భూమికోసం'.

సుప్రసిద్ధ సీనియర్ హిందీ నటుడు అశోక్ కుమార్ ఈ చిత్రంలో అతిధి నటుడిగా కనిపించడం ఒక విశేషం. సాత్వీక మైన పాత్రలలో కనిపించే అశోక్ కుమార్ 'భూమికోసం' లో స్వార్ధపరుడైన  దుష్ట జమీందారుగా నటించడం మరో విశేషం. సామాన్య ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా జమీందారు కుమారుడిగా జగ్గయ్య, కుమార్తె గా జమున నటించారు. లలితారాణి అనే నూతన నటిని జయప్రదగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసింది  ఈ 'భూమికోసం'.

ఘంటసాలగారు పాడి, ఆయన నిర్యాణం తర్వాత ఎనిమిది మాసాలకు విడుదలైన సినిమా 'భూమికోసం'. ఈ సినిమా లో ఘంటసాలగారు పాడిన ఏకైక గీతం 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా'. ఈ పాటను కథానాయకుడి స్నేహితుడు, శ్రేయోభిలాషి, సమాజ శ్రేయస్సుపై  అక్కరగల పాత్రలో నటించిన గుమ్మడిపై చిత్రీకరించారు.

అనుపమ ఫిలింస్ ఆస్థాన సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారే ఈ సినిమాకు కూడా సంగీతదర్శకుడు.

కరుణ, శోకం, భక్తి,విరహం, ప్రేమ వంటి రసాల ప్రకటనకు ఎంతో అనువైన రాగం సింధుభైరవి. కర్ణాటక సంగీతంలో 8వ మేళకర్త అయిన హనుమత్తోడికి జన్యరాగం. అక్బర్ ఆస్థాన విద్వాంసుడు మియా తాన్సేన్ ఈ సింధుభైరవి రాగాన్ని ఉత్తరభారతదేశంలో బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడని చెపుతారు. అసావేరీ థాట్ కు జన్యరాగం. ఈ సింధుభైరవి రాగంలో అసంఖ్యాకమైన సినిమా పాటలు అన్ని భాషలలో వచ్చాయి. మన తెలుగు సినిమా సంగీతదర్శకులకు, నిర్మాతా దర్శకులకు అత్యంత ప్రీతిపాత్రమైన రాగం సింధుభైరవి. ఈ రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపర్చి గానం చేసిన పాటలెన్నో అత్యంత జనాదరణ పొందాయి. అటువంటి ఘనత వహించిన సింధుభైరవి రాగంలో పెండ్యాలగారు 'ఎవరో వస్తారని' అనే పాటను  చాలా చక్కగా స్వరపర్చారు.

పాటలోని ప్రతీ చరణానికి ముందు వచ్చే మొదటి లైన్ ను సాకీగా మలచి మూడు చరణాలకు మూడు సాకీలు చేశారు. డప్పు, చిటికలు, మువ్వలు, మేండొలిన్, తబలా, డోలక్ వంటి వాద్యాలను చాలా సమర్థవంతంగా పెండ్యాల ఈ పాటలో ఉపయోగించారు.

శోక, శాంత, ఉదాత్తభావాలను  వ్యక్తపరుస్తూ ప్రేక్షకుల మనస్సులలో అవ్యక్తమైన ఉద్వేగం రేకెత్తిస్తూ హృదయాలకు హత్తుకునేలా ఘంటసాల మాస్టారు ఈ ప్రబోధగీతాన్ని  ఆలపించారు. గుమ్మడి, ఘంటసాల కలయిక  ఈ పాటకు మంచి రాణింపునిచ్చింది.

భూమికోసం జరిగిన పోరాటాలలో పాల్గొని పోలిస్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడు రామనరసింహారావుకు, అశువులుబాసిన  మరెందరో త్యాగమూర్తులకు  కె.బి.తిలక్ 'భూమికోసం' చిత్రాన్ని అంకితం చేశారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 20 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 100వ భాగం - విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభతొమ్మిదవ భాగం ఇక్కడ

100వ సజీవరాగం - విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

చిత్రం - డాక్టర్ బాబు
గానం - ఘంటసాల
రచన - సి.నారాయణ రెడ్డి

సంగీతం - టి.చలపతిరావు

పల్లవి:

విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే

                                                    !విరిసే!

చరణం 1: 

నీ కనుపాపలే వినీల కాంతి దీపాలు

నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు

నీ సొగసే నాదైతే నీ సొగసే నాదైతే

కలకలలాడులే వసంతాలు..

                                                    !విరిసే!

చరణం 2: 

ఎదురుగ నువ్వుంటే ఉదయకాంతులెందుకులే

జతగా నువ్వుంటే జాబిలి ఇంకెందుకులే

నీ వలపే నాదైతే నీ వలపే నాదైతే

ఏ బృందావనాలు ఎందుకులే...

                                                    !విరిసే!

ఓ పాత తెలుగు సినిమాలో హీరోయిన్ (భానుమతి) 'ప్రేమంటే'... అని అడుగుతుంది హీరో (నాగేశ్శర్రావు) ని. దానికి హీరో ఏం చెప్పాడో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు.

'ఆశ అరవైనాళ్ళు-మోహం ముఫ్ఫైనాళ్ళు' అని ఓ సామెత. ప్రేమలో నిజాయితీ గాని, గాఢత్వంగాని లేకుండా  కేవలం బాహ్యాకర్షణ వలన కలిగిన వ్యామోహమే ప్రేమగా చెలామణి అవుతోంది ఈ రోజుల్లో, అలాటివారిని ఉద్దేశించిన సామెత. ఎంతో సత్యమున్న సామెత. 'వయసు పిచ్చిది, ప్రేమ గుడ్డిది, మనసొక కళ్ళెం లేని కోర్కెల గుర్రం. పగ్గాలొదిలితే అంతా అస్తవ్యస్తమే. మనస్సు ప్రేరణతో మోహావేశాలకులోనైనప్పుడు  ఏర్పడిన ప్రేమ తాత్కాలికం.  నీటిబుడగలా ఏ క్షణాన్నైనా పేలిపోవచ్చు. అలాకాకుండా, విచక్షణతో తమ తమ వ్యక్తిత్వాలకు భంగం కలుగకుండా ఒకరినొకరు సంపూర్ణంగా అర్ధం చేసుకొని  ఎట్టి పరిస్థితులలోనైనా జీవితాంతం  స్వార్ధరహితంగా, నిష్కల్మషంగా కలసిమెలసి ప్రేమానురాగాలతో జీవనయానం చేస్తామనే దృఢనిశ్చయం కలిగినవారి మధ్య అంకురించిన ప్రేమే  నిజమైన ప్రేమ. అలాటి ప్రేమ మూడు పువ్వులు ఆరుకాయలుగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. ముగ్ధమనోహరంగా అరవిరిసిన కన్నుల్లో ఎన్నో ఆశలు, ఊసులు, మౌన భాషలు, చెప్పలేనన్ని బాసలు. అవి వలచినవాడి గుండెల్లో రేపే అల్లరులు అన్నీ ఇన్నీకావు. ప్రేయసి చిరునవ్వులే వెన్నెల పారిజాతాలు, ఆమె కనుపాపలే వినీలకాంతి దీపాలు. అటువంటి సుందరి సొగసులే తన సొంతమైతే వసంతమంతా కలకలలాడుతూ తన జీవితమంతా  ప్రకాశిస్తుందని భావించే ఓ నవయువకుని మనోగతమే నేటి మన సజీవరాగం. అదే డాక్టరు బాబు సినీమాలోని డా.సి.నారాయణరెడ్డి గారి భావుకతలో నుండి పుట్టి ఘంటసాలవారి గళం నుండి జాలువారిన మనోజ్ఞ ప్రణయగీతం 'విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే...'

డాక్టర్ బాబు సినిమా కు సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావుగారు. యువతరం మెచ్చే అధునాతన చలాకీ పాటలతో పాటు మనసుకు ఆహ్లాదం కలిగించే మెలోడియస్ గీతాలను స్వరపర్చడంలో కూడా చలపతిరావు గారు ఆరితేరిన దిట్ట. 'విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే' పాటను రూపొందించడానికి ఆయన ఎన్నుకున్న రాగం దర్బారీ కానడ. దర్బారీ కానడ పేరు వినగానే సంగీతాభిమానులందరికీ వెంటనే స్ఫురణకు వచ్చే అద్భుతగీతాలు 'శివశంకరీ; 'నమో భూతనాధా'. రెండూ పెండ్యాల గారివే, విజయావారి కోసం చేసినవి. వేర్వేరు సన్నివేశాలకోసం విభిన్నమైన మూడ్ లో చేసినవి. ఇక్కడ డాక్టరు బాబు సాంఘికం. తాను ప్రేమిస్తున్న మనోహరి నుద్దేశించి కథానాయకుడు ఆలపిస్తున్న ప్రణయగీతం.  రాగం ఒక్కటే కానీ  దానిని పరిపరివిధాలుగా మలచడంలో సంగీతదర్శకుని, గాయకుని ప్రతిభ, మనోధర్మం సుస్పష్టంగా తెలుస్తుంది. దర్బారీ కానడ సున్నితమైన వివిధ మనోభావాలను సుశ్రావ్యంగా వెలిబుచ్చడానికి అనువైన రాగం. 

ఈ రాగం కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలో చాలా ప్రసిధ్ధమైనది. 20వ మేళకర్త నఠభైరవికి జన్యరాగం. వక్ర సంపూర్ణరాగంగా చెపుతారు.కర్ణాటక సంగీతంలో చిరకాలంగా ప్రచారంలో వున్న ఈ దర్బారీ కానడ రాగం 16వ శతాబ్దపు సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మియా తాన్సేన్ ద్వారా ఉత్తర భారతదేశానికి పరిచయం చేయబడింది. ఈ దర్బారీ కానడ రాగంలో ఘంటసాలగారు ఆలపించిన సినిమా గీతాలు ఎన్నో బహుళ జనాదరణ పొందాయి. వాటిలో ఈనాటి 'విరిసే కన్నులలో' పాట కూడా గత ఐదు దశాబ్దాలుగా  ఘంటసాల మాస్టారి సజీవరాగంగా సంగీతాభిమానులకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది. ఈ పాట విడియో చూడకుండా ఆడియో విన్నాకూడా మన కళ్ళముందు శోభన్ బాబు మెదులుతారు. అది ఘంటసాలవారి ఘనత. శోభన్ బాబు వాయిస్ మాడ్యులేషన్ ఈ పాటలో స్పష్టంగా వినిపిస్తుంది. చరణాలలో  'నీ సొగసే నాదైతే', అలాగే, 'నీ వలపే నాదైతే' అనే మాటలు రెండుసార్లు రిపీట్ అవుతాయి. అప్పుడు  'నీ' అనే అక్షరం మీద ఘంటసాల మాస్టారు  రెండుసార్లు ఇచ్చిన గమకాలు పాటకి నిండుదనాన్ని, ఎంతో మాధుర్యాన్ని కలిగిస్తుంది. పియోనా వ్యాపింగ్ బిట్ తో పాట మొదలవుతుంది. సితర్, ఫ్లూట్, వైయొలిన్స్, షెహనాయ్, తబలా, డోలక్ వంటి వాద్యాలను చలపతిరావు ఉపయోగించుకున్నారు.

పాట మూడ్ కి తగినట్లుగా తెరమీద శోభన్ బాబు, జయలలిత చాలా హుందాగా నటించారు. ఇదే పాట సుశీలగారు పాడగా సినిమా ద్వితీయార్ధంలో  జయలలిత మీద మరోసారి విషాదంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు మనోజ్ కుమార్, మాలాసిన్హా నటించిన 'హిమాలయ్ కె గోద్ మే' అనే హిందీ సినిమా మూలం. అదే సినిమా తమిళంలో ఎమ్.జి.ఆర్, జయలలిత జోడీగా 'పుదియబూమి' (తమిళ లిపిలో ఒత్తులుండవు) పేరుతో వచ్చింది. తెలుగులో జయలలిత హీరోయిన్ గా నటించడానికి ఇదో కారణం కావచ్చు. ఈ తమిళ సినీమాను తాపీ చాణక్య డైరక్ట్ చేశారు.

డాక్టరు బాబు సినిమాలో ఘంటసాల మాస్టారు పాడిన రెండు పాటల్లో బహుళ ప్రచారమై ఈనాటికీ అందరిచే పాడబడుతూ సజీవరాగం గా నిలిచింది ఈ 'విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే' పాట మాత్రమే.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...