Saturday, 1 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 67వ భాగం - మల్లియలారా! మాలికలారా! మౌనముగా ఉన్నారా!

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయారవ భాగం ఇక్కడ

67వ సజీవరాగం -  మల్లియలారా! మాలికలారా! మౌనముగా ఉన్నారా! 

చిత్రం - నిర్దోషి
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.
సంగీతం - ఘంటసాల



పల్లవి :

మల్లియలారా మాలికలారా

మౌనముగా ఉన్నారా!

మా కధయే విన్నారా ! !మల్లియలార!

చరణం 1: 

జాబిలిలోనే జ్వాలలు రేగె

వెన్నెలలోనే చీకటిమూగె! - 2

పలుకగలేక పదములు రాక

పలుకలేక పదములే రాక

బ్రతుకే తానే బరువై సాగే

                                !మల్లియలారా!

చరణం 2: 

చెదరిన వీణా రవళించేనా

జీవనరాగం చివురించేనా -2

కలతలుపోయి వలపులు పొంగి-2

మనసే లోలో పులకించేనా

                                                                                !మల్లియలారా!

మాటకు మెట్టా? లేక  మెట్టుకు మాటా? అనే సందేహం శ్రోతలలో చాలామందికి కలుగుతూంటుంది. వ్రాసి యిచ్చిన సాహిత్యానికి వరస కూర్చడమే కష్టమని కొందరు భావిస్తే, కాదు పాట వరసకు సాహిత్యం మకూర్చడమే ఘనతని మరికొందరు అనుకుంటారు. సినీగీతాలు రూపొందించడంలో ఈ రెండు విధాల ప్రక్రియలకు బాగా అలవాటు పడవలసిన అవసరం అటు రచయితలకు, ఇటు సంగీత దర్శకులకు ఇద్దరికీ వుంది. కధాపరంగా సన్నివేశానికి తగినట్లుగా సందర్భోచితమైన సాహిత్యము, దానికి సముచితమైన సంగీతాన్ని సమకూర్చడమే రచయితలకు, సంగీత దర్శకులకు లక్ష్యంగా వుంటుంది తప్ప పాట వరస ముందా ? సాహిత్యం ముందా అనే విషయాల మీద కాదు. తద్వారా ఒక కవి లేదా సంగీత దర్శకుని ప్రతిభావ్యుత్పత్తులను నిర్ణయించడం సముచితం కాదు. సంగీత దర్శకుడు, గీత రచయితల అందుబాటు,  సౌలభ్యం, పరస్పర అవగాహన మేరకు పాట స్వరకల్పన జరుగుతుంది. 

ఉదాహరణకు సుప్రసిద్ధ కవి, సినీ గీత రచయిత డా.సి.నారాయణరెడ్డిగారినే తీసుకుందాము. ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ సినీమాలకు పాటలు వ్రాసేవారు. అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసులో వుండడం వలన పాటల రికార్డింగ్ వ్యవహారమంతా మద్రాసు లోనే సాగేది. నారాయణరెడ్డిగారు ప్రతీ నెల కొన్ని రోజులు మద్రాసు వచ్చి దాదాపు పది పదిహేను పాటల రచన చేసి తన పని పూర్తికాగానే హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. సంగీతదర్శకుడితో రోజుల తరబడి కూర్చొని పాటలు వ్రాసే అవకాశం వుండేదికాదు. నారాయణరెడ్డిగారు ముందుగానే  పాట సన్నివేశం గురించి తెలుసుకొని అందుకు తగిన సాహిత్యాన్ని తనకు తోచిన మీటర్ లో వ్రాసుకువచ్చేవారు. అవి దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకునికి ఆమోదయోగ్యంగా వుండేవి. అవసరాన్నిబట్టి చిన్న చిన్న మార్పులతో ఆ పాటలనే ఓకే చేసేవారు. ఘంటసాల, నారాయణరెడ్డిగారి కలయికలో వచ్చిన పాటలెన్నో ఈవిధమైన పరస్పర సౌలభ్యం మేరకే జరిగేవి. కానీ కొన్ని పాటల విషయంలో ఘంటసాలవారి కోరిక మేరకు ట్యూన్ కే సాహిత్యం వ్రాయవలసి వచ్చేది.

అలాటి సంగీత, సాహిత్య ప్రాధాన్యత కలిగిన  ఘంటసాలగారి ఒక పాటే నేటి మన సజీవరాగం. అదే 'మల్లియలారా మాలికలారా' అనే 'నిర్దోషి' సినీమా లోని ఏకగళ విరహగీతం.

"మల్లియలారా! మాలికలారా! మౌనముగా వున్నారా! మా కధయే విన్నారా!" పాట పుట్టుక గురించి, ఘంటసాల స్వర సరళి గురించి ఆ పాట రచయిత డా.సి.నారాయణరెడ్డిగారు ఏమన్నారో ఒకసారి ఈ క్రింది ఆడియో లో వినండి.


                                       మల్లియలారా పాట గురించి సినారె


ప్రేయసీ ప్రియులు, నవదంపతులు తమకు సంబంధించిన మరపురాని మధురాతి మధుర  వలపు కథలను, ఆ వలపు వికటించినపుడు కలిగే విషాద, విరహ బాధలను చల్లని జాబిల్లికి, మనసుకు సేదను తీర్చే పరిమళభరిత మల్లె సుమాలకు మనసారా చెప్పుకుంటారు. అలాగే ఈ గంభీరమైన సన్నివేశంలో కథానాయకుడైన ఎన్.టి.రామారావు తన మనోవేదనను మల్లెమాలికలకు వెల్లడిస్తాడు. కథానాయిక సావిత్రితో పాటు  తొలిరేయికోసం అలంకరించిన మెత్తని పూలపాన్పు, మల్లెమాలలు, చల్లని జాబిల్లి అన్ని పరమ ఆప్తులలాగే ఆ విరహవేదనలను మౌనంగా ఆలకిస్తూంటాయి. పాట ప్రారంభంలో స్వల్ప వాద్యసంగీతం మీద నిర్వేదంతో కూడిన నవ్వు, 'మల్లియలారా, మాలికలారా' అనే మాటలమీద ఎక్కువ stress చేయకుండా 'ఉన్నారా', 'విన్నారా' అనే మాటలమీద నోట్ ను sustain చేస్తూ ఆలపించడంలో మిగతా పాటల కన్నా ఒక విధమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఘంటసాలగారికి ఏ పాటైనా పల్లవి ఒక వరసలో, తర్వాత వచ్చే చరణాలన్ని ఒక వరసలో  ట్యూన్ చేయడమే పరిపాటి. అప్పుడే అందరూ సులభంగా పాడుకోవడానికి వీలవుతుందని ఆయన అనేవారు. చరణం, చరణానికి tune లో వేరియేషన్,  అవసరం లేకపోయినా గజిబిజి గా వుండే lengthy background musical bits ను వినిపించడం ఘంటసాలగారి పద్ధతి కాదు. ఈ పాటలో ఆయన వేసిన సంగతులు, గమకాలు ఇతర గాయకుల నోట అంత నిర్దిష్టంగా, అంత భావోద్వేగంతో పలకవు అంటే అది అతిశయోక్తి కానేరదు.

ఈ పాటకోసం మాస్టారు సితార్, ఫ్లూట్, వైలీన్స్, సెల్లో, స్పానిష్ గిటార్, వైబ్రోఫోన్, బ్యాంగోస్ వంటి వాద్యాలను అతి సరళమైన రీతిలో ఉపయోగించారు. ఫలానా రాగం ఫలానా రసానికి మాత్రమే అనే concept ను ఘంటసాలవారు నమ్మినట్లుగా తోచదు. నవరసాలలో ఏ రసానికైనా ఏ రాగమైన ఉపయోగించుకోవచ్చనే నమ్మకం గల వ్యక్తి ఘంటసాల.

 ఉదాహరణకు ఈ పాటనే తీసుకుంటే, ఘంటసాలగారు ఈ పాటను స్వరపర్చడానికి మధ్యమావతి రాగాన్ని ఎన్నుకున్నారు. 22 వ మేళకర్త ఖరహరప్రియ జన్యం. ఐదు స్వరాలు (సరిమపని) స్వరాలు మాత్రమే కల ఔఢవరాగం. గ, ద  స్వరాలు లేని ఐదు స్వరాల రాగం మధ్యమావతి. ఈ రాగానికి హిందుస్థానీలో సమాంతరమైన రాగం మేఘ్ మల్హర్. మధ్యమావతి రాగం చాలా మంగళకరమైన రాగమని భావిస్తారు. సాధారణంగా సంప్రదాయ కర్ణాటక సంగీత కచ్చేరీలలో తమ కార్యక్రమాన్ని మధ్యమావతి రాగంలో వున్న కీర్తనతో కానీ, లేదా పాటతో కానీ ముగిస్తారు. 

అలాటి మధ్యమావతి రాగాన్ని ఘంటసాలగారు 'మల్లియలారా' వంటి వేదనాభరిత విషాదరస గీతానికి సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. 57 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట సజీవమై నిలచివుందంటే అది ఘంటసాలవారి  సంగీత వైదుష్యానికి గీటురాయిగా భావించవచ్చును.

దాదామిరాసి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, సావిత్రి ప్రధాన తారాగణంగా గౌతమీ పిక్చర్స్ నర్రా రామబ్రహ్మం నిర్మించిన క్రైమ్ , సెంటిమెంట్ 'నిర్దోషి' సినీమా. ఘంటసాల సంగీతం, ఎన్.టి.ఆర్, సావిత్రి ల అద్భుత నటన నిర్దోషి సినీమా విజయానికి దోహదపడ్డాయి. 'మల్లియలారా' పాటను ఘంటసాలగారు తన ప్రతి కచ్చేరీలో పాడేవారు. 

1951 లో హెచ్.ఎమ్.రెడ్డి అంజలీదేవి, జి.వరలక్ష్మి, ముక్కామల, కోన ప్రభాకరావులతో 'నిర్దోషి' అనే సినీమా తీసారు. దానికి కూడా ఘంటసాలగారే సంగీత దర్శకత్వం వహించారు. అందులో నటించిన ముక్కామల, అంజలీదేవి ఈ కొత్త నిర్దోషి సినీమా లో తండ్రి కూతుళ్ళుగా నటించడం ఓ విశేషం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్



Saturday, 25 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 66వ భాగం - ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా !

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయయిదవ భాగం ఇక్కడ

66వ సజీవరాగం -  ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా ! 

చిత్రం - శ్రీకృష్ణతులాభారం
గానం - ఘంటసాల
రచన - దాశరధి
సంగీతం - పెండ్యాల

పల్లవి : ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా

సఖీ! నీవలిగితే నే తాళజాలా   

                                            !!ఓ చెలీ!! 

చరణం 1:

అందాలు చిందే మోము కందేను

ఆవేదనలో పన్నీట తేలించదనే మన్నించవే   

                                            !!ఓ చెలీ!!

చరణం 2: 

ఏనాడు దాచని మేను ఈనాడు

దాచెదవేలా దరిచేరి అలరించెదనే దయజూపవే   

                                            !!ఓ చెలీ!!

 చరణం 3:

ఈ మౌనమోపగలేనే విరహాలు

సైపగలేనే తలవంచి  నీ పదములకూ

మ్రొక్కేనులే ...

 

పద్యం

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని 

తాచిన అది నాకు మన్ననయ, చెల్వగు

నీ పదపల్లవమ్ము మత్తను పులకాగ్ర కంటకవితానము తాకిన

నొచ్చునంచు నేననియద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !

నల్లని ఒత్తైన కేశ సంపద కలదానా! నేను నీ దాసానుదాసుడిని. ఏదో ప్రణయకలహము వలన నాపై ఆగ్రహము చెంది నీవు నన్ను తన్నినందుకు నేను బాధపడడం లేదు. అది మహద్భాగ్యంగానే భావిస్తాను. కానీ , నీ స్పర్శతో నా శరీరంలోని రోమాలు గగుర్పొడిచి ముళ్ళవలె వున్నాయి.  అసలే కుసుమకోమలివి , ఆ ముళ్ళు నీ మృదువైన పాదాలకు గుచ్చుకొని గాయపడితే నేను భరించలేను. అందుకే నీ అలుక విడచి నను కరుణించమని బ్రతిమాలుకుంటున్నాను". ఇది ఆ పద్య తాత్పర్యం.

" నెయ్యపు కిన్క - ప్రణయ కోపానికి మారు పదం ; " మత్తనుపులకాగ్ర కంటకవితానము - అంటే  గగుర్పాటు వలన దేహంపైని రోమాలు ముళ్ళవలె మారి గుచ్చడం. చూశారా ఈ కవి చమత్కారం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సూత్రాన్ని అక్షరాలా అన్వయింపజేసాడు  'పారిజాతాపహరణ' కావ్యకర్త నంది (ముక్కు) తిమ్మనగారు.

అష్టభార్యలు, పదహారువేల గోపికలను భరించిన శృంగారరసాధినాయకుడు, దక్షిణనాయకుడిగా పేరుపొందిన శ్రీకృష్ణుడికి భామ కాలితాపులు ఒక లెఖ్ఖా! ఆవిడగారి అహాన్ని  ఒకపక్క తన మాటలతో చేష్టలతో పెంచుతూనే ఒక దశలో సమూలంగా అణచివేసిన లీలా జగన్నాటక సూత్రధారి, లీలామానుష రూపధారి.

"ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా సఖీ! నీవలిగితే నే తాళజాలా.." అంటూ శ్రీకృష్ణుడు ఆడి, ఆడించిన  శృంగారలీలా వినోదమే నేటి మన సజీవరాగం.

సరిగ్గా 25 వారాల క్రితం ఇదే సన్నివేశం మీద ముచ్చటించడం జరిగింది.  అక్కడా ఇదే పద్యం, కానీ పాట, పాట సాహిత్యం వేరే. అక్కడా, ఇక్కడా   భామలు  వేరైనా కృష్ణుడు (ఎన్.టి.రామారావు), ఆ కృష్ణుని గాన పాత్రధారి ఒకరే. అలాగే అక్కడా ఇక్కడా నారదుడు (కాంతారావు), నారదుని గాన గాత్రధారీ ఒక్కడే. రెండు పాత్రలకు తన గళంతో ద్విపాత్రాభినయం చేశారు ఘంటసాల. అది 'శ్రీ కృష్ణార్జునయుధ్ధం' లోని శృంగార ఘట్టమయితే ఇది 'శ్రీకృష్ణతులాభారం' లోని శయ్యాగృహ ప్రణయకలహ శృంగార సన్నివేశం.

రెండు సినిమాలకు సంగీత దర్శకుడు ఒకరే - పెండ్యాల. మొదటిది పింగళి వారి రచనైతే ఇది దాశరధి కృష్ణమాచార్యులవారిది. ఇద్దరూ కవులుగా, సినీగీత రచయితలుగా లబ్దప్రతిష్టులే.

అసలు ఈ వారం సజీవరాగంగా చెప్పాలనుకున్నది శ్రీకృష్ణతులాభారం సినీమాలోని "భలే మంచి చౌకబేరము" పాట గురించి. ఘంటసాల గళాభినయనం గురించి. అయితే అందులో స్త్రీ కంఠం, ఇతరుల బృందగానం కూడా వుండడం వలన ఈనాటి ఈ శీర్షికలో చోటుచేసుకోలేకపోయింది.

అదే శ్రీకృష్ణ తులాభారం లో ఘంటసాలవారు ఆలపించిన గీతాలలో మరో ప్రాశస్త్యం కలిగిన పాట "ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా..." పాట.

ఘంటసాలవారి గాన వైదుష్యానికి దర్పణం పట్టిన సినీమా 'శ్రీకృష్ణతులాభారం'. వైవిధ్యభరితమైన తన కంఠస్వరంతో బహుపాత్రాభినయం చేశారు. శ్రీకృష్ణ, నారద పాత్రల పద్యాలు, పాటలు రెండూ తానే పాడుతూ ఆ పాటలను పాడేది ఆయా పాత్రధారులే అన్న అనుభూతి ని కలిగించారు ఘంటసాల.

బుజ్జగింపు, సరస శృంగారం కలిగిన గీతం "ఓ చెలీ కోపమా" పాట. ఆ భావాలను అతి సమర్ధవంతంగా తన గాత్రంలో పలికించారు ఘంటసాల. ఈ పాటలో "ఏనాడు దాచని మేను ఈనాడు దాచెదవేలా..." అంటూ దాశరధి ఒక అభ్యంతరకరమైన పదప్రయోగం చేశారు. అంటే ఏ అలుకా కోపం లేని సమయాలలో భామ తన దేహాన్ని బహిరంగపరచేదా (శయనమందిరంలోనే అనుకుందాం)? సెన్సార్ బోర్డ్ లో భాషమీద పట్టున్న రంధ్రాన్వేషక సభ్యులు ఎవరైనా వుండివుంటే ఈ పాట సాహిత్యం యిలాగే వుండేదా! 

ఈ సరస శృంగారగీతాన్ని పెండ్యాల గారు ఖమాస్ రాగంలోనూ, పద్యాన్ని హిందోళరాగంలోనూ స్వరపర్చారు. ఖమాస్ 28వ మేళకర్త హరికాంభోజికి జన్యం. వక్ర షాఢవ సంపూర్ణరాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు కలిగిన రాగం. శృంగారరస భావాలను ప్రకటితం చేయడానికి అనువైన రాగం ఖమాస్. అలాగే, పాట చివరలో వచ్చే పద్యాన్ని పెండ్యాల గారు గతంలో ఆరభిలో, ఈసారి హిందోళంలోనూ రసవత్తరంగా ఘంటసాలవారిచేత ఆలపింపజేసారు. హిందోళరాగం ఐదు స్వరాలు కలిగిన ఔఢవరాగం. హిందోళం జనకరాగం విషయంలో  సంగీత ప్రపంచంలో భిన్న భేదాభిప్రాయాలు వున్నాయి. హిందోళానికి సమానమైన హిందుస్థానీ రాగం మాల్ఖౌంస్. సున్నితభావాలకు అనువైన రాగం హిందోళం. ఈ హిందోళ, మాల్ఖౌంస్ రాగాలలో ఎన్ని వందల సుశ్రావ్య గీతాలున్నాయో అందరికీ తెలిసినదే.

"ఓ చెలీ కోపమా!" పాటలో 'కోపమా! తాపమా!' అనే మాటలమీది సంగతులను, గమకాలను ఎంతో సరళంగా, శ్రావ్యంగా ఆలపించి ఈ పాటను సజీవరాగం గా మలచారు గానగంధర్వ ఘంటసాల.  పెండ్యాలగారు ఈ పాట కోసం సితార్, ఫ్లూట్, పియోనా, వైబ్రోఫోన్, వైలిన్స్, డబుల్ బేస్, తబలా వంటి వాద్యాలను పాటలోని మెలోడీకి అవసరమైనంత మేరకు ఉపయోగించి పాట ఔన్నత్యాన్ని పెంచారు.

అలాగే, పాట చివరలో వచ్చే ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణంలోని  - "నను భవదీయ దాసుని" పద్యాన్ని ఘంటసాలగారు ఎంతో హృద్యంగా హిందోళ రాగంలో ఆలపించారు. ఈ పద్యంలో వచ్చే  "చెల్వగు నీ పదపల్లవమ్ము మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చునంచు నే ననియద" అనే అతి పెద్ద సమాసాన్ని గుక్కతిప్పుకోకుండా భావయుక్తంగా ఘంటసాలవారు ఆలపించిన తీరు అనన్యసామాన్యం.

ప్రేక్షకుల మనసులలో గాఢంగా ముద్రవేసుకున్న ఒక సన్నివేశాన్ని వారి మరపుకు రాకముందే మరల  జనప్రియత్వాన్ని కలిగిస్తూ అదే నటునితో, ఆదే గాయకునితో చిత్రీకరించడమనేది ఏమంత సులభసాధ్యమైన కార్యంకాదు. ఉన్నదానికి రెట్టింపు ఔన్నత్యాన్ని కలిగిస్తూ సన్నివేశాన్ని రక్తికట్టించడానికి దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, గాయకుడు, నటీనటులు ఎంతగానో శ్రమించవలసి వస్తుంది. అటువంటి సవాలును అతి సమర్ధవంతంగా ఎదుర్కొని బహుళ జనామోదాన్ని పొందారు శ్రీకృష్ణతులాభారంలోని "ఓ చెలీ కోపమా! పాటకు సంబంధించిన కళాకారులు - దాశరధి, పెండ్యాల, ఘంటసాల, ఎన్.టి.ఆర్, జమున, కమలాకర కామేశ్వరరావు ప్రభృతులు. 

మంచి సంగీతానికి ఎంతో స్కోప్ వున్న శ్రీకృష్ణతులాభారం సినీమాలో పాటలు, పద్యాలు అన్ని కలసి 31 వరకు వున్నాయి. ఓ పదిహేడు వరకు పద్యాలు, పాటలను కృష్ణుడు ఎన్.టి.రామారావు, నారదుడు కాంతారావు కోసం ఘంటసాల ఎంతో వైవిధ్యంతో గానం చేసి చిత్ర విజయానికి దోహదపడ్డారు. ఏ రకమైన గీతమైనా ఘంటసాల కంఠం నుండి వెలువడితే అది అమృతతుల్యమే అవుతుందని మరోసారి నిరూపించారు.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్

Saturday, 18 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 65వ భాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవై నాలుగవ భాగం ఇక్కడ

65వ సజీవరాగం - నా రాణి కనులలోనే ఆనాటి కలలు సాగే 

చిత్రం - చిలక గోరింకా
గానం - ఘంటసాల
రచన - శ్రీశ్రీ
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు

పల్లవి :

నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే 

ఊరించు తొలి దినాలే ఈ రేయి పిలువసాగే 

                                            ! నా రాణి!

చరణం 1:

నగుమోము చూడబోయి నినుచేర

నాటి రేయి నను క్రీగంటనే కని

ఆ వెంటనే చని దూరాన దాగుంటివే

                                            ! నా రాణి!

చరణం 2:

 సిగలోని మల్లెపూలా సవరించబోవు వేళా 

మది గిలిగింతగా చేయి విదిలించగా 

ఎద నినుకోరి పులకించెనే

                                            ! నా రాణి!

 చరణం 3:

పడకింటి శయ్య చెంత నీ మేను

తాకినంత మన గీతాలలో

జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే

                                            ! నా రాణి!

మోహం ముఫ్ఫైయేళ్ళు, ఆశ అరవై రోజులు అని అంటాడో అరవ కవి. అంటే యవ్వన దశలోని  కోరికలు, పరస్పర ఆకర్షణలు  వాటివలన కలిగే ఆనందం క్షణికమైనవి, తాత్కాలికమైనవి అని చెప్పడం. జీవితంలోని మహదానందం, తృప్తి దంపతులకు లభించేది వయసు మళ్ళిన తర్వాతే.  జీవితం నేర్పిన అనుభవసారంతో దంపతులిద్దరూ పరస్పరం ఒకరినొకరు అర్ధంచేసుకొని ఒకరికోసం మరొకరుగా జీవించేప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం. ఆ ప్రేమ శాశ్వతం. నిజమైన ప్రేమ బాహ్యాసౌందర్యానికి, అందువలన కలిగే వాంఛలకు సంబంధించినది కాదు. అనురాగభరితమైన ప్రేమ మనసుకు సంబంధించినది. వృధ్ధాప్యం దేహానికేగాని మనసుకు కాదు. పటిష్టమైన ప్రేమానుబంధంతో అరవైలలో కూడా ముఫ్ఫైలలోలా  ఆనందం అనుభవిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చును.

అదే నేటి ఘంటసాలవారి సజీవరాగం మనకు బోధపరుస్తుంది.

సంతానం తప్ప సకల సౌభాగ్యాలు కలిగిన ఒక ధనిక దంపతుల షష్టిపూర్తి మహొత్సవంనాటి రాత్రి శోభాయమానంగా అలంకరించబడిన పడకగదిలో  సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్య మనసెరిగిన  ఆ భర్త  తమ మొదటిరాత్రి మధురానుభూతులను వీణ మీద పలికిస్తూ  'నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే....'  అని సుశ్రావ్యంగా ఆలపిస్తూ ఆమెకు పరవశత్వాన్ని, ప్రమోదాన్ని కలిగిస్తాడు.

వృధ్ధాప్య దశకు చేరుకున్న ఓ అనురాగపూరిత అన్యోన్య దంపతుల కథే ఈ 'చిలకా గోరింక'. (చిలక  గోరింక ఒక జాతి పక్షులు కావని, ఒక గూటిలో కలసి జీవించవని  పక్షిశాస్త్రజ్ఞులంటారు. అయినా 'చిలకా గోరింకల్లా' కలసిమెలసి ఉండడాన్ని ఆ రెండు పక్షులకి అన్వయించడం మాత్రం సర్వత్రా స్థిరపడిపోయింది).

మన తెలుగు సినిమాలలో యవ్వన దశ దాటి వృధ్ధాప్యంలో అడుగుపెట్టిన ఒక వ్యక్తి  శృంగారపరమైన మధుర గత స్మృతులను నెమరువేసుకుంటూ ఆలపించడమనేది అరుదుగా జరిగే ఒక విలక్షణమైన వ్యవహారం. ఇటువంటి గీతాల చిత్రీకరణ రచయితకు, సంగీత దర్శకుడికి, గాయకుడికి, నటీనటులకు,  దర్శకుడికి అందరికీ కత్తిమీద సామే. పెను సవాలు వంటిదే. సున్నిత, లలిత శృంగారభావాలకు ఆమడ దూరంలో వుండే ఎస్.వి.రంగారావు వంటి నటుడితో ఆయనకు జోడీగా అంజలీదేవి మీద ఈ గీతాన్ని చిత్రీకరించాలని నిర్ణయించడం దుస్సాహసమే.

అయినా అటువంటి క్లిష్ట కార్యాన్ని 'చిలకా గోరింక' సినీమాలో బహు చాకచక్యంగా సమర్ధవంతంగా నిర్వహించారు దర్శక నిర్మాత కె.ప్రత్యగాత్మ. ప్రత్యగాత్మ అంటే స్వయంప్రకాశత్వం గల ఆత్మ కలిగినవాడని అర్ధం. ఆత్మా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రత్యగాత్మ నిర్మాతగా తన తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం 'చిలకా గోరింక' . కృష్ణకుమారి, కృష్ణంరాజు నవయవ్వన చిలకా గోరింకలైతే, అంజలీ దేవి, ఎస్.వి.రంగారావు మలి వయసు చిలకా గోరింకలు. ఈ ఇద్దరే ఈ సినీమాకు అసలైన నాయికా నాయకులు.

 'చిలకా గోరింక' సినీమా లో ఏడు పాటలు, మూడు పద్యాలు వున్నా ఘంటసాల మాస్టారు పాడిన పాటలు మాత్రం రెండే రెండు. మిగిలిన గీతాలను పి.సుశీల, జానకి, మాధవపెద్ది, టి.ఆర్.జయదేవ్  గానం చేశారు. అందులో ఘంటసాలవారి గళంలో నుండి వచ్చిన రెండు పాటలు మాత్రం బహుళ జనాదరణ పొందాయి. వాటిలో ప్రముఖమైనది, సజీవరాగమై విరాజిల్లుతున్నది 'నా రాణి కనులలోనే' అనే గీతం. ఈ పాటను మహాకవి శ్రీశ్రీ వ్రాశారు. అగాధమౌ జలనిధిలో అమూల్య ఆణిముత్యాల్లా విప్లవకవి కలం నుండి కూడా  సున్నితమనస్కమైన సరసగీతాలెన్నో అలవోకగా జాలువారాయి. అలాటి వాటిలో 'నా రాణి కనులలోనే' పాట ఒకటి. ఈ గీతంలోని - "నగుమోము చూడబోయి నినుచేర నాటి రేయి నను క్రీగంటనే కని అ వెంటనే చని దూరాన దాగుంటివే"; "పడకింటి శయ్య చెంత నీ మేను తాకినంత మన గీతాలలో, జలపాతాలలో నవ రాగాలు మ్రోగెనులే" వంటి పద ప్రయోగాలు శ్రీశ్రీ గారి ఉన్నత భావుకతకు అద్దం పడతాయి.

స్వరాలతో సయ్యాటలాడుకునే రసాలూరు రాజేశ్వరరావుగారు ఈ పాటకు అద్భుతమైన స్వరాలనే సమకూర్చారు. వలజి రాగ మాధుర్యమంతా ఈ పాటలో గుప్పించారు. వలజి ఐదు స్వరాలు కల ఔఢవరాగం. ఆరోహణలో ' స గ ప ద ని' అవరోహణలో ' స ని ద ప గ' అనే ఐదు స్వరాలే వుంటాయి. 'రిషభం మధ్యమం' స్వరాలు ఈ రాగానిలో వుండవు. వలజి రాగం 28వ మేళకర్త అయిన "హరికాంభోజి"  జన్యం.  హిందుస్థానీ సంగీత శైలిలో వలజికి సమాంతర రాగం 'కళావతి'. ఈ రెండు రాగాలలో జనాదరణ పొందిన సినీమా పాటలెన్నో అన్ని భాషలలో వున్నాయి. పాట ప్రారంభంలో వీణ చిట్టిబాబుగారి సుస్వరాల వీణ వలజి రాగ స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. వీణతో పాటు పియోనా, ఫ్లూట్, వైలీన్స్, తబలా, డబుల్ బేస్ వంటి వాద్యాలతో రాజేశ్వరరావుగారు ఈ పాటను మలచారు.

రాగ లక్షణాలకు, భావ ప్రకటనకు, సుస్పష్టమైన భాషకు మారుపేరైనై ఘంటసాల తన గాన మాధుర్యంతో 'నా రాణి కనులలోనే ' పాటను సజీవం చేశారు. ఆ గళంలోని లాలిత్యం, సౌమ్యత, శ్రావ్యత, గమకశుధ్ధి శ్రోతల హృదయాలలో మధురోహలను, అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తాయి.

 ఏ నటుడికి పాడినా, ఏ పాత్రకు పాడినా ఆ నటుడిని, ఆ పాత్రను మన కళ్ళెదట సాక్షాత్కరింపజేయడం ఘంటసాలవారికి వెన్నతో పెట్టిన విద్య. 'నా రాణి కనులలోనే' పాటను కళ్ళుమూసుకు విన్నా రంగారావుగారు, ఆయన పాత్రే మనకు గోచరిస్తాయి. అందుకు తగినట్లు గానే ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి ఈ పాటకు అసమాన్యమైన నటనను కనపర్చారు... లేదు ఆయా పాత్రలలో సజీవంగా కనిపించారు.   రొమాంటిక్ బెడ్ రూమ్ సీనే అయినా ఎక్కడా అసభ్యత, మితిమీరిన శృంగార చేష్టలు లేకుండా subtle expressions తో డిగ్నిఫైడ్ గా నటించడం వారిద్దరికే చెల్లు.  ముఖ్యంగా, ఈ పాటలో వీణను సక్రమమైన పధ్ధతిలో మీటడానికి రంగారావు గారు తీసుకున్న శ్రధ్ధ, కనపర్చిన అవగాహన ఎంతో అభినందించదగ్గది. సాధారణంగా మన సీనీమాలలో నటీనటులు వాయిద్యాలను సక్రమంగా handle చేయడం జరగదు. ఆ విషయంలో మన దర్శక నిర్మాతలు, నటులు ఆ విషయానికి తగిన ఓర్పు, ప్రత్యేక శ్రధ్ధ కనపర్చరు. అందుకే ఆ పాటలు సంగీతం తెలిసినవారికి హాస్యాస్పదంగా, ఆవేదన, కొన్ని సందర్భాలలో జుగప్స కలిగించేవిగా వుంటాయి.

ఘంటసాల గానం, ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి నట వైదుష్యంతో 'నా రాణి కనులలోనే' పాట సజీవరాగం అయింది. ఐదున్నర దశాబ్దాల తర్వాత కూడా ఇంకా సంగీతాభిమానులను అలరిస్తోంది.

ప్రత్యగాత్మ గారి "చిలకా గోరింక" కృష్ణంరాజు, రమాప్రభ వంటి నూతన నటులను తెలుగువారికి పరిచయం చేసింది. జయదేవ్ వంటి గాయకుడికి మూడు  పాటలతో మంచి అవకాశం కల్పించింది. ఈ సినీమా హీరోగా  కృష్ణంరాజుకు,  గాయకుడిగా జయదేవ్ కు గుర్తింపునిచ్చినా వెనువెంటనే మూకుమ్మడిగా గొప్ప అవకాశాలు లభించలేదు. అందుకు 'చిలకా గోరింక' సినీమా  అపజయం పాలవడం ఒక కారణం కావచ్చును. ఆర్ధికంగా అపజయం పాలయినా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది.

చిలకా గోరింక సినీమాలో ఘంటసాల మాస్టారు పాడిన రెండు పాటలు ఎస్.వి.రంగారావుగారి మీదే చిత్రీకరించబడడం ఒక విశేషం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్

Saturday, 11 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 64వ భాగం - మదిలో మౌనముగా కదలె మధుర వీణ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవై మూడవ భాగం ఇక్కడ

64వ సజీవరాగం - మదిలో మౌనముగా కదలె మధుర వీణ

చిత్రం - శకుంతల
గానం - ఘంటసాల
రచన - సినారె
సంగీతం - ఘంటసాల

శ్లోకం :

అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై

అనావిధ్ధం రత్నం మధు నవమనాస్వాదిత రసమ్

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూప మనఘం

నజానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః నజానే 

 (కాళిదాసు విరచిత అభిజ్జాన శాకుంతలం నుండి)

తాత్పర్యం :

అభిజ్ఞాన శాకుంతలం రెండవ అంకంలో శకుంతల గురించి రాజా దుష్యంతుడు తన చెలికానితో పలికిన మాటలు ...

 "ఈమె వాసన చూడబడని పువ్వు, ఏ గోళ్ళచేతా గిల్లబడని చిగురుటాకు. రంధ్రం తొలవబడని రత్నం. రుచి చూడబడని తియ్యని కొత్త తేనె. చేసుకున్న పుణ్యాలకి పరిపూర్ణమైన ఫలం. ఎవడు ఈ కన్నెను అనుభవించాలని బ్రహ్మ వ్రాసిపెట్టాడో! నాకు తెలియదు."

ఈ శ్లోకం దుష్యంతుడి వ్యామోహానికి, నిర్లజ్జకు పరాకాష్టగా కవి కాళిదాసు మలిచాడని భావించవచ్చును.

 (కీ.శే. పట్రాయని సంగీతరావుగారు ఇచ్చిన వివరణ )

పల్లవి : 

మదిలో మౌనముగా

కదలె మధుర వీణ - 2

చరణం 1 :

రాజహంసవోలె సాగి రమణి తిరిగి చూసే

మరుడేమొ దాగి దాగి విరితూపులు దూసె

ఈ విరాళి నాలో ఏ నాటికి తీరునో

                                    ! మదిలో!

 చరణం 2 :

తెలివెన్నెల జాలువారె చెలియ నవ్వులోన

కనరాని జ్వాలలేవో కలిగెను నాలోన

ఈ తీయని రేయి ఇటులే తెలవారునో

                                    ! మదిలో!

️అనాదిగా మన సమాజంలో  పురుషాధిక్యత వలన స్త్రీ అబలగా, బానిసగా, భోగవస్తువుగా అణగద్రొక్కబడింది. ఏ స్వేఛ్ఛ, స్వాతంత్ర్యం లేకుండా  స్త్రీలు అనుభవించే  కష్టనష్టాలకు, అవమానాలకు దర్పణం శకుంతల. పుట్టిన వెంటనే పసికందుగా వున్న కన్నబిడ్డను  నిర్దాక్షిణ్యంగా వదలిపెట్టి వెళ్ళి పోయిన ఆమె తల్లిదండ్రులు మేనకా విశ్వామిత్రులు. శాకుంతల పక్షులు కరుణించి  ఆ పసికందు ఆకలిని తీర్చడం వలన శకుంతలగా గుర్తించబడింది. కణ్వ మహర్షి దయతో పెరిగి పెద్దయిన కన్య శకుంతల.

కణ్వాశ్రమంలోని శకుంతల అందచందాలకు, ముగ్ధత్వానికి వ్యామోహం చెంది దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడినుండే శకుంతల కష్టాలు ప్రారంభమయాయి. నేడు మనం ఎవరి పేరుతో ఈ దేశాన్ని భారత దేశం అని పిలుచుకుంటున్నామో ఆ భరత చక్రవర్తి ఈ శకుంతల కుమారుడు. అంతటి చారిత్రక ప్రశస్తి పొందిన కావ్యనాయిక శకుంతల. ఐదవ శతాబ్దానికి(?) చెందిన సంస్కృత కవి కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని కథానాయిక శకుంతల. శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఇతివృత్తం. కాళిదాసు మహాకవి ఏ రాజాస్థానానికి చెందినవాడో నిర్దిష్టమైన చారిత్రకాధారాలు లేవు. అయినా రెండవ చంద్రగుప్తుని ఆస్థానకవియని కొంతమంది చరిత్రకారుల వాదన. విక్రమాదిత్యుని కొలువులో వున్నట్లు చెప్పబడినా 'విక్రమాదిత్య' అనే బిరుదు అనేక మంది చక్రవర్తులకు వున్నట్లు తెలుస్తోంది. కాళిదాసు మహాకవి అభిజ్జాన శాకుంతలంతో బాటు రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం, విక్రమోర్వశీయం వంటి గొప్ప కావ్యాలను కూడా వ్రాశాడు.

సినీమా మాధ్యమం ఆవిర్భవించినప్పటినుండి ఈ కథను అనేక భాషలలో అనేకసార్లు అనేక దిగ్ధంత దర్శకులు సినిమాగా మలిచారు. ముందుగా, 1940లో Ellis R. Dungan దర్శకత్వంలో తమిళంలో సుప్రసిధ్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం శకుంతల, దుష్యంతులుగా ఈ శకుంతల వచ్చింది. ఆ తర్వాత హిందీలో వి.శాంతారాం తన మొదటి భార్య జయశ్రీ గాడ్కర్ శకుంతలగా, చంద్రమోహన్ (తెలుగు రంగులరాట్నం  హీరో చంద్రమోహన్ కాదు) దుష్యంతుడిగా 1943లో నిర్మించారు. భారతీయ సంగీత, నృత్య, చిత్రకళలలోఅణువణువున ద్యోతకమయ్యే భావ సౌందర్యాన్ని, విశిష్టతను తన సినిమాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించి ప్రపంచానికి చాటిచెప్పిన నిర్మాత, దర్శకుడు వి.శాంతారామ్. ఆయనకు శకుంతల పాత్ర అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది.

ఈ శకుంతలను తిరిగి కలర్ లో  తెలుగు, హిందీ భాషలలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా నిర్మించబోతున్నారనే వార్త కొన్నాళ్ళు మద్రాస్ లో సంచారం చేయడం చేసింది. కానీ, ఏ కారణం చేతనో శాంతారాం సంకల్పం నెరవేరలేదు. అదే కనుక జరిగివుంటే ఎన్.టి.ఆర్., ఘంటసాల కీర్తికిరీటాలలో మరో ఉత్తమ మణిగా భాసిల్లివుండేది.

తర్వాత, 1961లో శాంతారాం తానే దుష్యంతుడిగా, తన రెండవ భార్య సంధ్య శకుంతలగా 'స్త్రీ' పేరిట నిర్మించి అఖండ ఖ్యాతిపొందారు. ఈ సినీమాను మౌంట్ రోడ్ లోని గ్లోబ్ ధియేటర్ (LIC పక్కన వుండేది) లో చూసిన గుర్తు. ఈ చిత్రంలోని పాటలు, నృత్యాలు,దృశ్య చిత్రీకరణ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. విదేశాలలో, చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలను పొందిన చిత్రం శాంతారాం 'స్త్రీ'.

ప్రేక్షకులను ఇంతటి ప్రభావితం చేసిన 'శకుంతల' ను 1965 లో తీయ సంకల్పించారు లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావులు. కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, బి.సరోజాదేవి శకుంతలగా, నాగయ్య కణ్వుడిగా, ఇ.వి.సరోజ, ముక్కామల మేనకా విశ్వామిత్రులుగా, శారదా, గీతాంజలి శకుంతల నెచ్చెలులు, అనసూయ, ప్రియంవదలుగా ప్రముఖ తారాగణంతో తలపెట్టారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని నియమించారు.

ఈ విషయం నాకు చాలా రకాలుగా ఆనందం కలిగించింది. ఒకటి ఈ సినిమా ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా పని చేయడం; సహజంగానే పౌరాణిక చిత్రాలంటే సుశ్రావ్యమైన మంచి సంగీతానికి స్కోప్ వుంటుంది; మరొకటి, శాంతారాం తీసిన  స్థాయిలో తెలుగులో సినీమా వస్తుందనే ఆశ. అయితే అది ఆశగానే మిగిలిపోయింది. కారణం ఈ తెలుగు సినీమా కలర్ లో కాకుండా బ్లాక్ ఎండ్ వైట్ లో తీసారు. అది నాకు బాగా అసంతృప్తి కలిగించిన విషయం. కారణం, ప్రకృతి సౌందర్య దృశ్యాలు,  కళాత్మకమైన భారీ సెట్ల ఔన్నత్యం  రంగులలో ప్రతిఫలించినంతగా తెలుపు నలుపులలో ప్రతిఫలించవు. అయితే, పీత కష్టాలు పీతవి, చెప్పుకుంటూపోతే కొండవీటి చేంతాడంత. ఆ  నిర్మాతల సాధకబాధకాలు వారివి.

సినీమా కలర్ కాకపోతేనేం! నటీనటుల పాత్రోచిత నటన, దర్శకుని ప్రతిభ, నవరసాలతో నిండిన వైవిధ్యభరితమైన ఘంటసాలవారి పాటలు, నేపథ్య సంగీతం శకుంతలకు ప్రాణప్రతిష్ట చేశాయి. ఈ సీనీమాలో  దుష్యంతుడిగా  ఎన్.టి.ఆర్ హుందాగా, దర్జాగా, రాజసంతో నటించారు. ఆ పాత్రకు ఘంటసాల మాస్టారు పాడిన ' అనాఘ్రాతం పుష్పం' అనే కాళిదాసు శ్లోకం,  'మదిలో మౌనముగా' పాట ఎంతో మనోహరంగా వుంటుంది. అదే ఈనాటి మన 'ఘంటసాల - సజీవరాగం'.

'అనాఘ్రాతం పుష్పం' శ్లోకాన్ని ఘంటసాల మాస్టారు కళ్యాణి రాగంలో స్వరపర్చి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ శ్లోకం అయిన మరుసటి ఒకటి రెండు సీన్లలో "మదిలో మౌనముగా" విరహగీతం.  ఎంతో ఔచిత్యంతో  డా.సి.నారాయణరెడ్డిగారు సమకూర్చిన సాహిత్యంఈ పాటకు నిండుదనాన్ని చేకూర్చింది. ఘంటసాల మాస్టారు హిందుస్థానీ ఖమాస్ రాగ నుడికారంతో అద్వితీయంగా గానం చేసారు. గాంభీర్యం, లాలిత్యంతో కూడిన ఘంటసాలవారి గాత్రమాధుర్యంతో ఈ పాట ఆపాతమధురమే అయింది.  ఘంటసాల మాస్టారు ఉపయోగించిన సితార్, ఫ్లూట్, హార్ప్, ఎలక్ట్రిక్ గిటార్, వైబ్రోఫోన్, వైలీన్స్, తబలా, డబుల్ బేస్ వంటి వాద్యాలు  "మదిలో మౌనముగా" పాటకు  నిండుదనాన్ని, శ్రావ్యతను చేకూర్చాయి. 'శకుంతల' చిత్రానికి ఆద్యంతం ఘంటసాల మాస్టారు అందించిన నేపథ్య సంగీతాన్ని అనుభవించడానికి ఎంతో రసహృదయం కావాలనడంలో ఎటువంటి సందేహం లేదు.  పాటలో 'కదలె మధుర వీణ' అంటూ నేపధ్యంలో పూర్తిగా సితార్ నే వినిపించడం; తెరమీద సితార్, వీణలకు బదులు ' గోటు' వాద్యంలాటిదానిని చూపించడం గీత వాద్యాల పట్ల కనీస అవగాహన ఉన్నవారిని కూసింత ఇబ్బంది పెట్టే విషయమే. అయితే ప్రాచీనకాలంలో ప్రతీ తంత్రీ వాద్యాన్ని 'వీణ' అనే అనేవారట. ఆ విధంగా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అగత్యంలేదు.

మంచి సంగీతాన్ని ఆస్వాదించాలని ఆశించే ప్రతీ ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం ' శకుంతల'.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...