మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా!
మా కధయే విన్నారా ! !మల్లియలార!
చరణం 1:
జాబిలిలోనే జ్వాలలు రేగె
వెన్నెలలోనే చీకటిమూగె! - 2
పలుకగలేక పదములు రాక
పలుకలేక పదములే రాక
బ్రతుకే తానే బరువై సాగే
!మల్లియలారా!
చెదరిన వీణా రవళించేనా
జీవనరాగం చివురించేనా -2
కలతలుపోయి వలపులు పొంగి-2
మనసే లోలో పులకించేనా
!మల్లియలారా!
అలాటి సంగీత, సాహిత్య ప్రాధాన్యత కలిగిన ఘంటసాలగారి ఒక పాటే నేటి మన సజీవరాగం. అదే 'మల్లియలారా మాలికలారా' అనే 'నిర్దోషి' సినీమా లోని ఏకగళ విరహగీతం.
"మల్లియలారా! మాలికలారా! మౌనముగా వున్నారా! మా కధయే విన్నారా!" పాట పుట్టుక గురించి, ఘంటసాల స్వర సరళి గురించి ఆ పాట రచయిత డా.సి.నారాయణరెడ్డిగారు ఏమన్నారో ఒకసారి ఈ క్రింది ఆడియో లో వినండి.
ప్రేయసీ ప్రియులు, నవదంపతులు తమకు సంబంధించిన మరపురాని మధురాతి మధుర వలపు కథలను, ఆ వలపు వికటించినపుడు కలిగే విషాద, విరహ బాధలను చల్లని జాబిల్లికి, మనసుకు సేదను తీర్చే పరిమళభరిత మల్లె సుమాలకు మనసారా చెప్పుకుంటారు. అలాగే ఈ గంభీరమైన సన్నివేశంలో కథానాయకుడైన ఎన్.టి.రామారావు తన మనోవేదనను మల్లెమాలికలకు వెల్లడిస్తాడు. కథానాయిక సావిత్రితో పాటు తొలిరేయికోసం అలంకరించిన మెత్తని పూలపాన్పు, మల్లెమాలలు, చల్లని జాబిల్లి అన్ని పరమ ఆప్తులలాగే ఆ విరహవేదనలను మౌనంగా ఆలకిస్తూంటాయి. పాట ప్రారంభంలో స్వల్ప వాద్యసంగీతం మీద నిర్వేదంతో కూడిన నవ్వు, 'మల్లియలారా, మాలికలారా' అనే మాటలమీద ఎక్కువ stress చేయకుండా 'ఉన్నారా', 'విన్నారా' అనే మాటలమీద నోట్ ను sustain చేస్తూ ఆలపించడంలో మిగతా పాటల కన్నా ఒక విధమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఘంటసాలగారికి ఏ పాటైనా పల్లవి ఒక వరసలో, తర్వాత వచ్చే చరణాలన్ని ఒక వరసలో ట్యూన్ చేయడమే పరిపాటి. అప్పుడే అందరూ సులభంగా పాడుకోవడానికి వీలవుతుందని ఆయన అనేవారు. చరణం, చరణానికి tune లో వేరియేషన్, అవసరం లేకపోయినా గజిబిజి గా వుండే lengthy background musical bits ను వినిపించడం ఘంటసాలగారి పద్ధతి కాదు. ఈ పాటలో ఆయన వేసిన సంగతులు, గమకాలు ఇతర గాయకుల నోట అంత నిర్దిష్టంగా, అంత భావోద్వేగంతో పలకవు అంటే అది అతిశయోక్తి కానేరదు.
ఈ పాటకోసం మాస్టారు సితార్, ఫ్లూట్, వైలీన్స్, సెల్లో, స్పానిష్ గిటార్, వైబ్రోఫోన్, బ్యాంగోస్ వంటి వాద్యాలను అతి సరళమైన రీతిలో ఉపయోగించారు. ఫలానా రాగం ఫలానా రసానికి మాత్రమే అనే concept ను ఘంటసాలవారు నమ్మినట్లుగా తోచదు. నవరసాలలో ఏ రసానికైనా ఏ రాగమైన ఉపయోగించుకోవచ్చనే నమ్మకం గల వ్యక్తి ఘంటసాల.
ఉదాహరణకు ఈ పాటనే తీసుకుంటే, ఘంటసాలగారు ఈ పాటను స్వరపర్చడానికి మధ్యమావతి రాగాన్ని ఎన్నుకున్నారు. 22 వ మేళకర్త ఖరహరప్రియ జన్యం. ఐదు స్వరాలు (సరిమపని) స్వరాలు మాత్రమే కల ఔఢవరాగం. గ, ద స్వరాలు లేని ఐదు స్వరాల రాగం మధ్యమావతి. ఈ రాగానికి హిందుస్థానీలో సమాంతరమైన రాగం మేఘ్ మల్హర్. మధ్యమావతి రాగం చాలా మంగళకరమైన రాగమని భావిస్తారు. సాధారణంగా సంప్రదాయ కర్ణాటక సంగీత కచ్చేరీలలో తమ కార్యక్రమాన్ని మధ్యమావతి రాగంలో వున్న కీర్తనతో కానీ, లేదా పాటతో కానీ ముగిస్తారు.
అలాటి మధ్యమావతి రాగాన్ని ఘంటసాలగారు 'మల్లియలారా' వంటి వేదనాభరిత విషాదరస గీతానికి సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. 57 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట సజీవమై నిలచివుందంటే అది ఘంటసాలవారి సంగీత వైదుష్యానికి గీటురాయిగా భావించవచ్చును.
దాదామిరాసి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, సావిత్రి ప్రధాన తారాగణంగా గౌతమీ పిక్చర్స్ నర్రా రామబ్రహ్మం నిర్మించిన క్రైమ్ , సెంటిమెంట్ 'నిర్దోషి' సినీమా. ఘంటసాల సంగీతం, ఎన్.టి.ఆర్, సావిత్రి ల అద్భుత నటన నిర్దోషి సినీమా విజయానికి దోహదపడ్డాయి. 'మల్లియలారా' పాటను ఘంటసాలగారు తన ప్రతి కచ్చేరీలో పాడేవారు.
1951 లో హెచ్.ఎమ్.రెడ్డి అంజలీదేవి, జి.వరలక్ష్మి, ముక్కామల, కోన ప్రభాకరావులతో 'నిర్దోషి' అనే సినీమా తీసారు. దానికి కూడా ఘంటసాలగారే సంగీత దర్శకత్వం వహించారు. అందులో నటించిన ముక్కామల, అంజలీదేవి ఈ కొత్త నిర్దోషి సినీమా లో తండ్రి కూతుళ్ళుగా నటించడం ఓ విశేషం.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment