జోడు గుళ్ళ పిస్తోలు ..ఠాఁ!
నేను ఆడితప్పనివాణ్ణి
జీ..హా..! జోడు!
హద్దుమీరువారు
శిక్షింపబడుదురు
బుధ్ధిమంతులెపుడు
రక్షింపబడుదురు
! జోడు!
అధికారం చెలాయిస్తె ఇంక
చెల్లదు
తొండ ముదిరితే ఊసరవెల్లి
అత్తా...హజం ముదిరితే హళ్ళికి హళ్ళీ
! జోడు!అది అందుచేత కాగూడదు మొద్దు
ఎవరి గొప్ప వాళ్ళ వద్ద
ఆగకున్నచో
అత్తా ! దేహశుద్ధి కొండొకచో జరుగుట కద్దు
! జోడు!నోరు మంచిదైతేనే ఊరు మంచిది
పోరు నష్టము - ఎపుడూ
పొందులాభము ఇది కోర్టుకెక్కితే
అంతా ఆభాసు అత్తా ... నీ
జోరు
తగ్గకుంటేను కొంప కళాస్
! జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!
తెలుగు సినిమా ప్రపంచంలో ప్రముఖ మిత్రద్వయాలు చూస్తూంటాం. బాపు-రమణ, విశ్వనాథన్-రామ్మూర్తి. మా నాన్నాగారూ, శ్రీ ఘంటసాలగారు కూడా చిరకాల 'ఇద్దరు మిత్రులే'. ఘంటసాలగారు 1938 లో విజయనగరం వచ్చిననాటినుంచి ఆ మిత్రత్వం కొనసాగింది. ఇంకా మా కుటుంబాల మధ్య ఆ స్నేహబాంధవ్యాలు కొనసాగుతునే ఉన్నాయి. అటువంటి మిత్రద్వయం నాకు తెలిసినంతలో మరొకటి శ్రీ YN శర్మగారు శ్రీ అచ్యుతశాస్త్రిగారిది. శ్రీ యనమండ్ర నాగయజ్ఞశర్మగారు - ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మగారి తండ్రిగారు, శ్రీ హరి అచ్యుత రామశాస్త్రిగారు వాగ్గేయకారుడు, ప్రముఖ వాయులీన విద్వాంసుడు శ్రీ హరి నాగభూషణంగారి కుమారుడు. శ్రీయుతులు శర్మ, శాస్త్రి ద్వయం పేరెన్నిక పొందిన వైయొలిన్ వాద్యకళాకారులు. సన్నిహిత మిత్రులు. ఒకరినొకరు అంటిపెట్టుకొని ఎక్కడ ఏ రికార్డింగ్ లో పాల్గొన్నా ఒక్కటిగా పక్కపక్కనే ఉండేవారు. ఎక్కడికైనా కలసిరావడం, కలసివెళ్ళడం జరిగేది. వారు ఘంటసాలగారు సంగీతం నిర్వహించిన అనేక చిత్రాలలోని పాటలకు, ఘంటసాలగారి లలిత సంగీత కచేరిలలో తమ వైయొలిన్ వాద్య సహకారాన్ని అందించేవారు.
అచ్యుత రామశాస్త్రిగారు మా తండ్రిగారు పట్రాయని సంగీతరావుగారు మద్రాసులో చేసిన ఒక కర్ణాటక సంగీత కచేరీలో తమ వైయొలిన్ తో సహకరించారు కూడా.
ఈ మిత్రద్వయం వివిధ రకాల సినీ సంగీత ప్రక్రియలలో మంచి అనుభవం సంపాదించడంవలన చిత్రరంగంలోని ప్రముఖ సంగీత దర్శకులందరి వద్దా రోజుకు రెండు మూడు పాటలకు పనిచేస్తూ చాలా బిజీగా వుండేవారు.
ఈ వైయొలిన్ మిత్రద్వయంలోని శ్రీ హరి అచ్యుత రామశాస్త్రిగారు ఒక వ్యాసంలో ఘంటసాలగారి గాన ప్రతిభను వర్ణిస్తూ ఒక పాట గురించి చెప్పిన తమాషా ఉదంతమే నేటి మన సజీవరాగం. అదే "జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!".
అది భరణీ స్టూడియో రికార్డింగ్ ధియేటర్. మధ్యాహ్నం 2 టు 9 కాల్షీట్. పి.వి.కోటేశ్వరరావు సౌండ్ ఇంజనీర్. అనుపమ ఫిలింస్ "అత్తా ఒకింటి కోడలే" చిత్రంలోని " జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!" అనే పాట రికార్డింగ్. పెండ్యాల సంగీత దర్శకుడు, కె.బి.తిలక్ దర్శక నిర్మాత. గాయకుడు ఘంటసాల. ఆర్కెష్ట్రా నొటేషన్ టేకింగ్, ప్లేయర్స్ ప్లేస్మెంట్స్, మైక్ సెట్టింగ్స్, ఆర్కెష్ట్రా రిహార్సల్స్, సౌండ్ రికార్డిస్ట్ ల పేరామీటర్స్ ... ఇవన్ని అయేప్పటికి సాయంత్రం 7 గంటలు. పాట పాడేందుకు మాస్టారు వచ్చారు.
ఒక త్రాగుబోతు పాడే పాట. హెవీ ఆర్కెష్ట్రా. పూర్తి వెస్ట్రన్ టైప్ సాంగ్. పెండ్యాల గారి రికార్డింగ్ అంటే అందరికీ భయమే. పాటనీ ఒక పట్టాన ఓకే చేయరని, టేకుల మీద టేకులు తీసుకుంటేకానీ తృప్తిపడరని అందరికీ తెలుసు. రికార్డింగ్ పూర్తి అయి ఇళ్ళకు వెళ్ళడానికి ఎంత రాత్రవుతుందోనని భయం.
ఘంటసాలగారు రిహార్సల్స్ సమయంలో మైక్ లేకుండా పాడుతున్నప్పుడు మామూలుగా, అందరూ పాడుతున్నట్లుగానే వినిపిస్తుంది. అదే మైకు ముందుకు రాగానే ఆ కంఠస్వరం పూర్తిగా మారిపోతుంది. ఆ గాంభీర్యానికి ధియేటర్ అంతా వైబ్రేట్ అవుతుంది. ఆ గాత్ర మాధుర్యానికి, శ్రావ్యతకు ప్రతీ ఒక్కరు మెస్మరైజ్ అవుతారు. అది ఏ గాయకులకు లభించని గొప్ప వరం. ఆర్కెష్ట్రా, సింగర్ తో రిహార్సల్స్ చేసి ఒకటి రెండు మానిటర్లు చూశారు. సాంగ్ టేక్ అన్నారు పెండ్యాల. ఒక టేక్ అయింది. ఆనవాయితీగా రెండో టేక్ కు సిద్ధపడుతున్న సమయంలో డైరెక్టర్ తిలక్ గారు కలగజేసుకొని మరో టేక్ అవసరం లేదని ఫస్ట్ మానిటర్ రిహార్సల్స్ లోనే పాట ఓకే అయిపోయిందని, అది రికార్డు చేయడం జరిగిందని మాస్టారు చాలా అద్భుతంగా పాడారు, ఇంక మరిన్ని టేకుల అవసరం లేదని ఎనౌన్స్ చేశారు. ఇది మా ఆర్కెష్ట్రా వారందరికీ చాలా ఆనందం, ఆశ్చర్యం కలిగించిన విషయం. నిజంగానే ఘంటసాలగారు ఆ పాటను అంత రసవత్తరంగా పాడారని అచ్యుత రామశాస్త్రిగారు అభివర్ణించారు.
'కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువే'. మనిషికి వుండే కొన్ని ఫోబియాలతో, బలహీనతలతో ఎంతటి బలశాలియైనా, కరకు దుర్మార్గుడైనా కొన్ని సందర్భాలలో లొంగక తప్పదు. ఒక పరమ గయ్యాళి అత్తగారికి త్రాగుబోతుల ఫోబియా. త్రాగుబోతులను చూస్తేనే హడలు. ఆవిడలోని ఆ బలహీనతను, భయాన్ని అవకాశంగా తీసుకొని ఆవిడను మార్చడానికి కూతురి సహకారంతో అల్లుడు ఒక త్రాగుబోతుగా నటిస్తాడు. ఆ సందర్భంలో వచ్చే పాటే ' జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!'
సూర్యకాంతం , జగ్గయ్య , గిరిజలు పాల్గొన్న ఈ హాస్య
సన్నివేశం , అందులో వచ్చే ఈ పాట ఆనాడు , ఈనాడు కూడా ప్రేక్షకులను ఎంతో అలరిస్తూనే వుంది.
"జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ!" -- ఈ పాటలో ఒక తమాషా వైవిధ్యం వుంది.
ఈ నిషా పాట ట్యూన్ పూర్తిగా వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్. ఆర్కెష్ట్రా కకూడా వెస్ట్రన్ బ్యాండ్ . అంటే ట్రంపెట్స్, కెటిల్ డ్రమ్స్, బ్రషెస్ డ్రమ్స్, డబుల్ బాస్, వైలిన్స్, వయోలాలు మొదలైనవి. పాటలోని సాహిత్యం మాత్రం పూర్తి విరుధ్ధంగా తెలుగుదేశ గ్రామీణ వాతావరణానికి చెందిన పదజాలాన్ని వాడారు కవి ఆరుద్ర.
త్రాగుబోతు వాడి మాట తుపాకీ గుండంత సూటిగా నిఖార్స్ గా వుంటుందనే అభిప్రాయమేమో. గయ్యాళి అత్తకు బుధ్ధి వచ్చేలా చేయడానికి ఈ నిషా పాటలో హీరో నోట పాత తెలుగు సామెతలతో పాటు, కొన్ని నీతి సూత్రాలను కూడా వల్లింపజేసారు. దుష్టశిక్షణ , శిష్టరక్షణ; అధికారముందని అహం కూడదు; తొండ ముదిరితే ఊసరవెల్లి; కాకిపిల్ల కాకికి ముద్దు; నోరు మంచిదైతే ఊరు మంచిది; పోరు నష్టము- పొందు లాభము; వంటి పదాలు ఉపయోగించి సినిమా పాట సామాజిక స్పృహ కలిగివుండాలనే నినాదాన్ని దర్శక నిర్మాత కె.బి.తిలక్ ప్రజలకు అందించారు. ప్రేక్షకులు ఆదరించారు.
ఫేక్ త్రాగుబోతుగా ఈ పాటలో జగ్గయ్య, గయ్యాళి అత్తగా సూర్యకాంతం రాణించడానికి పూర్తిగా దోహదపడింది ఘంటసాలవారి గాన నటనా పటిమ. ఘంటసాలగారు ఈ పాటకు ముందు గతంలో కొన్ని నిషా పాటలు పాడినా అవన్నీ గాంభీర్యం కలవి, వేదనాపూరితమైనవి. ఈ పాట అలాటిది కాదు, హాస్యం, వినోదం ప్రధానాశయంగా కలిగిన పాట. అది ఘంటసాలవారి గాత్రంలో పాట ఆద్యంతం ధ్వనిస్తుంది. జగ్గయ్యగారికి ఘంటసాలగారు పాడిన మొదటి మందు పాట " జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...! " జగ్గయ్యగారే స్వయంగా పాడుతున్నట్లు అనిపించే ఈ పాట ఎప్పటికీ సజీవరాగమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
కనుల ముందు.. రికార్డింగ్ జరుగుతు వున్నది... అని నా అభిమాన హృదయం భావన లొ కి వెళ్ళిలింది. సజీవ దృశ్యం గా మలిచిన శ్రీ స్వ రాట్ గారికి వందనాలు...... చల్లా సుబ్బారాయుడు
ReplyDelete