Saturday, 15 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 69వ భాగం - మగజాతికి నువు బలిపశువమ్మా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయెనిమిదవ భాగం ఇక్కడ

69వ సజీవరాగం -  మగజాతికి నువు బలిపశువమ్మా

చిత్రం - స్త్రీజన్మ
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - ఘంటసాల

పల్లవి : మగజాతికి బలిపశువమ్మా"

సాకీ -

ఎన్ని పూవులిలా నలగిపోయినవో

ఎన్ని బ్రతుకులిలా చెదరి రాలినవో...

పల్లవి:

మగజాతికి నువు బలిపశువమ్మా

నీ సొగసూ వయసే నీకు పగమ్మా

స్త్రీ ప్రకృతే నీ పాలిట శాపం

ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం

                                    !మగజాతికి!

అందం నీవే అంటారు

ఆనందానికి నెలవంటారు

ఆ రెంటిని పొందీ నిన్నాఖరుకు

అపవిత్రవని వెలివేస్తారు 

                                   !మగజాతికి!

అరిటాకమ్మా ఆడజన్మము

ముళ్ళకంచె యీ మూఢసంఘము

అమ్మా...ఆ....

ముళ్ళకెన్నడూ దండన లేదూ

చిరిగిన ఆకు విస్తరికాదు

                                    !మగజాతికి!

చిరిగిన ఆకు విస్తరి కాదు

నీ సొగసు వయసే నీకు పగమ్మా...


ఈ పాట రెండవ పార్శ్వం :

సాకీ - " తల్లీ! ఇది తరతరాల కథ చెల్లీ!

           అలాగే జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ!...

 

పల్లవి : మగజాతికి నువు బలిపశువమ్మా నీ మనుగడ

ఆరని కన్నీరమ్మా

మాతృత్వం నీ పాలిట శాపం

ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం

 

లోకుల నిందలు ఓర్చిన తల్లీ

నిను నీ నెత్తురె నిందించినదీ

 

సహనం కూడా సహించరానిదీ

నీ మరణమే దీన్ని మాపేది-2

మరణమే దీన్ని మాపేది....

అరిటాకు మీద ముల్లు పడినా

ముల్లు మీద అరిటాకు పడినా ఛేదము అరిటాకుకే. అదింక విస్తరిగా ఉపయోగపడదు. ఆడజన్మ అరిటాకు వంటిదైతే  పురుషాధిక్యత గల దుష్ట సమాజం ఒక ముళ్ళకంచె వంటిది. యుగయుగాలుగా, తరతరాలుగా ఆడది అబల అనే ముద్రతో పురుష జాతికి అణగిమణగి నిస్సహాయస్థితిలో బానిసలా బ్రతుకుతోంది.  సీత, సావిత్రి, దమయంతి, అహల్య, ద్రౌపది  వంటి మహా పతివ్రతలు, మహనీయమూర్తులు కూడా పురుషాహంకారానికి తీవ్రంగా బలి కావలసివచ్చింది.

ఈ నవీన యుగంలో  స్త్రీ జాతి అభివృధ్ధి చెందిందని, అన్ని రంగాలలో స్త్రీ పురుషుడికి సమానమని చెప్పబడుతున్నా స్త్రీ పురుషుల మధ్య వివక్ష పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజు పత్రికలలో, టీవిలలో కనపడే దారుణ మానభంగాలు, మానభంగ హత్యలు, ఆత్మహత్యలు, కాలేజీలలో ఆడపిల్లల పట్ల జరిగే అమానుషకృత్య వార్తలే ఇందుకు నిదర్శనం.

Man is a social animal అంటాడు అరిస్టాటిల్. పశువులకు మనిషికి గల తేడా బుధ్ధి. మనిషి ఒంటరిగా జీవించలేడు. జంతువులు లాగే సామూహికంగా, సమాజంలో బ్రతకవలసినవాడు. బుధ్ధిజీవి అయిన మనిషిలో పశుప్రవృత్తి పెచ్చుపెరిగితే పర్యవసానం, ఫలితాలు ఎంత దారుణంగా వుంటాయో చాటిచెప్పే గీతమే  -  "మగజాతికి నువు బలిపశువమ్మా" ఈనాటి ఘంటసాలవారి సజీవరాగం.

త్రాగుడు మైకంలో మనిషిలోని పశువాంఛకు బలైన స్త్రీ ఒకరైతే, ఆ స్త్రీని రక్షించబోయి కులటగా అవమానాలపాలైనది మరో అభ్యుదయ వనిత. ఒకే మనిషి వలన ఈ ఇద్దరి జీవితాలు దుర్భరమైపోయాయి. అటువంటి అభాగినుల దీనగాథే 'స్త్రీజన్మసినిమా.

ఇదొక anti-hero, ladies sentiment Story. పురుషాధిక్య మనోప్రవృత్తితో కథానాయకుడు తన భార్యపట్లతోడబుట్టిన అక్కపట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో చిత్రీకరించబడిన చిత్రమే 'స్త్రీజన్మ'. మంచితనానికి మారు రూపైన స్త్రీమూర్తులుగా కృష్ణకుమారి, అంజలీదేవి తమ తమ పాత్రలలో జీవించారు. anti-hero పాత్రను చేయడానికి  ఎన్.టి.ఆర్ వంటి అగ్రనటుడు అంగీకరించడం ఆయన ధైర్యానికి, నిబ్బరానికి దర్పణం. ఏ రకమైన పాత్రలనైనా అవలీలగా పోషించగలనని ఎన్.టి.రామారావు ఈ సినిమాలో నిరూపించారు.

వివిధ సందర్భాలలో  ఇద్దరు స్త్రీలు ఒకే వ్యక్తి వల్ల ఎలా వంచించబడి, అవమానాలపాలయ్యారో "మగజాతికి నువు బలిపశువమ్మా" పాట వివరిస్తుంది. ఈ నేపథ్య గీతం సినిమాలో రెండు కట్స్ గా వస్తుంది.  పాట ట్యూన్ ఒకటే అయినా చరణాల సాహిత్యంలో సందర్భోచితమైన మార్పులను తన సహజశైలిలో చూపించారు మనసుకవి ఆత్రేయ.  మొదటిది కథానాయిక కృష్ణకుమారి పరంగా, రెండవసారి కధానాయకుడి అక్క అంజలీదేవి మీద  వినిపిస్తుంది. చిత్ర దర్శకుడు కోవెలమూడి సూర్య ప్రకాశరావు. సీరియస్ సినిమాల చిత్రీకరణ లో నిష్ణాతుడు.

ఉద్వేగము, ఉద్రేకము, విషాదము నిండిన సన్నివేశాలు ఇవి. గీత రచయిత, సంగీతదర్శకుల వివేచనకు , ప్రతిభకు అగ్నిపరీక్ష ఈ పాట. ఆత్రేయగారి పాటంటే అందరికి తెలిసిన విషయమే. అనుకున్న వెంటనే కాగితంమీద పదాలు పడవు. అందువల్ల చేసిన మెట్టుకు చిత్రిక పట్టడానికి సంగీతదర్శకుడికి కావలసినంత సమయం. 'స్త్రీ జన్మ' కు సంగీత దర్శకుడు ఘంటసాల. సురేష్ కంబైన్స్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమాలకు ఘంటసాల పనిచేసిన ఏకైక చిత్రం. బహుశా సహ నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు జోక్యం కావచ్చును.

ఎట్టకేలకు సన్నివేశబలానికి తగినట్లుగా బరువైన పదజాలంతో వేర్వేరు సాకీలతో, చరణాలతో రెండు పాటలను  శ్రోతల హృదయాలకు హత్తుకుపోయేలా తనదైన బాణీలో  వ్రాసిచ్చారు ఆత్రేయ.

నఠభైరవి  రాగ స్వరాలు ఆధారంగా ఘంటసాల మాస్టారు ఈ పాటను శోకరసభరితంగా, మంచి ఉద్వేగంతో స్వరపర్చారు. నఠభైరవి రాగం కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త. ఏడు స్వరాలు గల సంపూర్ణరాగం. భైరవి, ఆనందభైరవి, సారమతి, వంటి రాగాలు ఈ నఠభైరవి కి జన్యరాగాలు. హిందుస్థానీ సంగీతంలో కూడా భైరవి అనే రాగం వుంది. దానికి సమానమైన కర్ణాటక రాగం తోడి.

పాట సంబంధిత వ్యక్తులందరి ఆమోదముద్ర పొంది రికార్డింగ్ దశకు చేరుకుంది. పాట చాలా బాగా వచ్చింది. సన్నివేశపరంగా పాటను  ఎమోషనల్ గా, చాలా హైపిచ్ లో పాడాలి. అది మాస్టారివల్ల కాకపోవచ్చు. అందుచేత ఈ రెండు పాటలను టి.ఎమ్.సౌందరరాజన్ తో పాడించే ఏర్పాట్లు చేయమని  నిర్మాత రామానాయుడు తాను స్వయంగా మాట్లాడకుండా సంగీత సహాయకుడు జె.వి.రాఘవులు ద్వారా ఘంటసాలగారికి కబురు పంపారు.  ఈ విషయం ఘంటసాలగారికి నొప్పి కలిగించిందనే చెప్పాలి. తాను పాడవలసిన పాటకు ఇతరులచేత పాడించమనే సలహాను ఆయన అంత తేలికగా భావించలేకపోయారు.

ఆయన ఉద్రేకపడకుండా,'అలాగే నాయనా! ముందు నేను ట్రాక్ పాడతాను. దానిని నాయుడుగారిని వినమను. ఆ తర్వాత ఆయనకు కావలసినవారితో ట్రాక్ మిక్స్ చేద్దాము' అని చెప్పి పంపారు.  

పాట ట్రాక్ రికార్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. మామూలుగా ఘంటసాలగారు తన పాటలను ఒకటి, ఒకటిన్నర శ్రుతులలో పాడతారు. ఈ పాట సన్నివేశానికి కావలసిన ఆవేశం, ఉద్రేకం, గాంభీర్యానికి తగినట్లుగా  ఈ పాటను రెండు శ్రుతిలో పాడారు. ఈ పాటలో ఆర్కెష్ట్రా కూడా ఘనంగానే వినిపిస్తుంది. తబలా, పక్వాజ్, డ్రమ్స్, షెహనాయ్, వైయొలిన్స్ వంటి వాద్యాల నడుమ  ఘంటసాలవారి కంఠం కంచులా ఎంతో ఆవేశపూరితంగా ధ్వనించింది. ఈ పాటను ఘంటసాల ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. పాట రికార్డింగ్ పూర్తయింది. ఘంటసాలగారి గాత్రబలాన్ని శంకించినవారందరి నోళ్ళు మూతబడ్డాయి. సినిమా రిలీజయ్యాక  ఆడిటోరియంలలో ఈ పాటకు ఘంటసాల కంఠమే ప్రతిధ్వనించింది. శ్రోతలంతా ఎంతో ఉద్విగ్నులయ్యారు.

స్త్రీ జన్మ సినిమాలో మంచి పాటలలో ఒకటి ' ఎడారిలో పూలు పూచె ఎందుకనీ'. ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, అంజలీదేవి, కాంతారావు, నాగయ్య, కృష్ణ, ఎల్.విజయలక్ష్మి, ప్రభాకరరెడ్డి మొదలగువారు నటించిన ఈ చిత్రంలోని  11పాటలను ఆత్రేయ, జూ.సముద్రాల, సి.నా.రె., దాశరధి, ఆరుద్ర, కొసరాజు  రచించగా ఘంటసాలతో పాటు పి.సుశీలఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది, స్వర్ణలత మొదలగువారు గానం చేసారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిథి కథ, మాటలు సమకూర్చి, ఆయన మేనల్లుడు, తరవాతి రోజుల్లో కేంద్రమంత్రి, పత్రికాధినేత 'మురసొలి'మారన్ నిర్మించిన  'పూమాలై' అనే ladies sentiment తమిళ చిత్రం ' స్త్రీ జన్మ' తెలుగు సినిమాకు మూలం.

ఇటువంటి  చిత్రవిచిత్ర  సినీప్రపంచంలోని ఆటుపోట్లన్ని అధిగమిస్తూ ఎంతో సంయమనంతో  మూడు దశాబ్దాల పాటు అగ్రగణ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగువారందరి మన్ననలు పొందిన  ఘంటసాలవారి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...