Saturday, 12 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 77వ భాగం - మాధవా... మౌనమా... సనాతనా...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయారవ భాగం ఇక్కడ

77వ సజీవరాగం -  మాధవా... మౌనమా... సనాతనా...

     
చిత్రం - శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం
గానం - ఘంటసాల
రచన - సముద్రాల (జూ)

సంగీతం - 
ఘంటసాల

పల్లవి :

మాధవా మౌనమా సనాతనా

కనరావ కమలనయనా.. 

                                !మాధవా!

చరణం :

హే పరంధామ కారుణ్యసింధో

సత్యవ్రతనామ హే దీనబంధో

కనుల నినుజూడ నే నోచలేదా

కావగరావా ప్రభో  

                                !మాధవా!

నారాయణా సత్యనారాయణా

నారాయణా.. నారాయణా..నారాయణా...

మాధవా..... కేశవా....🌺


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె... నీవే తప్ప ఇతఃపరంబెరుగ... రావే ఈశ్వర.. సంరక్షించు భద్రాత్మకా... అని గజేంద్రుడిచే మొరబెట్టిస్తారు పోతనగారు తన భాగవత కావ్యంలో. "అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ... సర్వధర్మాన్ పరిత్యజ్య  మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచః" అనే  భగవానుడి అభయవాక్కు సర్వకాల సర్వావస్థలలో సత్చింతనాపరుల విషయంలో తప్పక ఫలిస్తుంది అనే విషయం ఈ నాటి సజీవరాగం నిరూపిస్తుంది. సినిమాలో సన్నివేశపరంగానే కాక శ్రీ సత్యనారాయణ మహత్మ్యం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, నేటి సజీవరాగంగా గత ఆరు దశాబ్దాలుగా తెలుగు వారందరినీ అలరిస్తున్న "మాధవా మౌనమా సనాతనా" అనే గీతాన్ని ఆలపించిన మధుర గాయకుడు ఘంటసాలవారి విషయంలో కూడా ఈ శరణాగతి మంత్రం పరిపూర్ణంగా ఫలించింది. ఆ విషయం ఏమిటో మీకు తెలియాలంటే ఈ పాట నేపథ్యెలోకి కొంచెం వెళ్ళాలి.

శ్రీ సత్యనారాయణ మహత్మ్యం సినిమా కు నాయికా నాయకులు కృష్ణకుమారి, ఎన్.టి.రామారావు. అశ్వరాజ్ పిక్చర్స్  కె.గోపాలరావు  నిర్మాత. గతంలో ఎన్.టి.ఆర్ హీరోగా వినాయకచవితి, దీపావళి, సినిమాలను తీసిన అనుభవం వుంది. దర్శకుడు రజనీకాంత్ సబ్నవిస్. దీపావళి సినిమా కు కూడా రజనీకాంతే డైరక్టర్. దురదృష్టవశాత్తు సినిమా సగంలో వుండగా డైరెక్టర్ రజనీకాంత్ స్వర్గస్థులయ్యారు. అప్పటికప్పుడు వేరే డైరెక్టర్ ను నియమించుకునే అవకాశం లేక గత చిత్రాలలోని అనుభవంతో నిర్మాత కె గోపాలరావు ఈ సినిమా  డైరక్షన్ బాధ్యతలను కూడా చేపట్టారు. ఒకరోజు ఆ గోపాలరావుగారు ఘంటసాలగారి వద్దకు వచ్చి "మాస్టారు! అన్నగారు వరస కాల్షీట్లు ఇచ్చారు. ఈ షెడ్యూల్ లో ఆయనతో ఒక సాంగ్, క్లైమాక్స్ సీన్  షూట్ చేస్తే ఆయన వర్క్ కంప్లీట్ అయిపోతుంది. (రామారావుగారు ఈ సినిమాలో మహావిష్ణువుగా, భూలోకంలో భక్తుడైన సత్యదేవునిగా ద్విపాత్రాభినయం చేశారు). దైవం అనుకూలిస్తే అనుకున్న ప్రకారం పిక్చర్ ను జూన్ (1964) లో రిలీజ్ చేసేయొచ్చు" అని చెప్పి పాట రికార్డింగ్ కు డేట్స్ ఫైనలైజ్ చేసుకు వెళ్ళారు.

క్లైమాక్స్ లో వచ్చే  ఈ పాట సినిమాకు కీలకమైనది. మత ఛాందసత్వంతో తాను దైవాంశ సంభూతుడనని, శివకేశవ అపరావతారమైన తననే ప్రజలంతా పూజించాలని, అలా చేయనివారు తీవ్రంగా శిక్షించబడతారని అనేక దురాగతాలకు పాల్పడే శివకేశవ మహారాజు పరమ వైష్ణవ భక్తుడైన సత్యదేవుని, అతని అనుయాయులను చిత్రహింసలకు గురిచేస్తాడు. ఇందుకు తండ్రిని గుడ్డిగా నమ్మే రాకుమార్తె, రాజుగారి పేరిట అరాచకాలు సృష్టించే ముఖ్య అనుచరులు సత్యదేవుని కళ్ళూడబెరికి అతని ఆశ్రమాన్ని, పరిసర ప్రాంతాలలో దహనకాండ సృష్టిస్తారు. ఈ భీభత్సమైన వాతావరణంలో నిస్సహాయుడైన కథానాయకుడు 'అన్యధా శరణం నాస్తి' అని తనను ఈ కష్టాలనుండి రక్షించి ధర్మాన్ని కాపాడమని  పరమ ఆర్తితో భగవంతునితో మొరపెట్టుకునే సందర్భంలో వచ్చే పాట ఇది.

"మాధవా మౌనమా సనాతనా కనరావా కమలనయనా" అనే పల్లవితో సముద్రాల రామానుజంగారు ఈ పాటను ప్రారంభించారు. శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమాకు కథ, మాటలు, పాటలు, పద్యాలు అన్నీ జూనియర్ సముద్రాలగారే వ్రాశారు. ఘంటసాల, జూనియర్ సముద్రాల కాంబినేషన్లో అనేక విజయవంతమైన సినిమాలు రూపొందాయి.

కరుణరస ప్రధానమైన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఘూర్జరితోడి రాగంలో చేశారు. ఇది ఒక హిందుస్థానీ రాగం. తోడి రాగంలో వుండే పంచమ స్వరాన్ని తొలగించి పాడితే అది ఘూర్జరితోడి అవుతుంది.  ఆరోహణ అవరోహణలలో ఆరు స్వరాలు మాత్రమే వుండే రాగం.  ఉస్తాద్ బడేగులాం ఆలిఖాన్ గారి ఘూర్జరితోడి తుమ్రీ  ఒకటి చాలా ప్రసిధ్ధి పొందింది.

ఆపదలలో వున్న తనను కాపాడమని భగవంతునితో మొరపెట్టుకునే ఈ పాటలో  పల్లవి, ఒక చరణం మాత్రమే వుంటూ చివరలో నారాయణా, మాధవా, కేశవా అంటూ ఎలుగెత్తి విలపించడంతో ఆర్తత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తునికి తన విశ్వరూప దర్శనాన్నిచ్చి పోయిన  కన్నులు మరల ప్రసాదించి అనుగ్రహిస్తాడు. అందరి తృప్తిమేరకు పాట చాలా ఎఫెక్టివ్ గా బాగా వచ్చింది. ఈ పాట కోసం వైయొలిన్స్, డ్రమ్స్, డబుల్ బాస్, వైబ్రోఫోన్, ట్రంపెట్స్, బాంజో, షెహనాయ్, తబలా వంటి వాద్యాలను ఉపయోగించడం జరిగింది. ఆర్కెష్ట్రావారందరికీ రికార్డింగ్ డేట్ కాల్షీట్ టైమ్, స్టూడియో తెలియపర్చడం జరిగింది. ఇక మర్నాడు రికార్డింగ్ అనగా  ఒక అవాంఛనీయ సమస్య ఎదురయింది. మండువేసవి రోజులు కావడాన ఘంటసాలగారి ముఖాన సెగ గెడ్డలు లేచాయి. దానితోపాటు దాదాపు 102 డిగ్రీల జ్వరం. ఈ రెండు సమస్యలు మాస్టారిని చాలా తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. నొప్పితో బాధపడుతూ ఇంత తీవ్రమైన జ్వరంతో స్టూడియోకు వెళ్ళవద్దని రికార్డింగ్ క్యాన్సిల్ చేయమని ఇంట్లోవారంతా తెగ ఒత్తిడి చేసినా ఘంటసాల మాస్టారు ఒప్పుకోలేదు. తాను రికార్డింగ్ క్యాన్సిల్ చేయడం మూలంగా నిర్మాత షెడ్యూల్ అంతా తారుమారు అవుతుందని అసలే కష్టాలలో వున్న నిర్మాత మరింత నష్టపోతాడని అది తనకు ఇష్టంలేదని నిర్మాత సాధకబాధకాలన్నీ దృష్టిలో పెట్టుకొని  తనకు జరగబోయే మంచైనా చెడైనా ఆ సత్యనారాయణస్వామిదే భారమని  తన అస్వస్థతను ఏమాత్రం లెఖ్ఖచేయకుండా పాట  రికార్డ్ చేయడానికే నిశ్చయించుకొని  స్టూడియోకు బయల్దేరారు. వాహినీలో 2 టు 9 కాల్షీట్ లో జరిగిన ఈ పాట రికార్డింగ్ కు మాస్టారితో పాటూ నేనూ వెళ్ళాను. ముఖమంతా వ్యాపించిన సెగగెడ్డలమీద చందనం పూసుకొని,శాలువ కప్పుకొని వచ్చిన ఘంటసాలగారి వాలకం చూసి రికార్డింగ్ ధియేటర్ లోని వాద్యబృందం, సౌండ్ ఇంజనీర్, చిత్రనిర్మాత అందరూ ఆరోజు పని జరగదనే భావనకు వచ్చారు. కానీ ఘంటసాలగారు మాత్రం దేవుడిమీదే భారం వేసి పాట రికార్డింగ్ ప్రక్రియకు ఉపక్రమించారు. అప్పటికే మాస్టారి అసిస్టెంట్లు అయిన సంగీతరావుగారు, రాఘవులు గారు ఆర్కెష్ట్రావారికి ఇవ్వవలసిన నొటేషన్స్ , సూచనలు పూర్తిచేసినందువలన ఆర్కెష్ట్రాతో ఒకటి రెండు రిహార్సల్స్ చూసి మాస్టారు రెడి ఫర్ టేక్ అంటూ మైక్ ముందుకు వెళ్ళారు. రికార్డింగ్ ధియేటరంతా నిశబ్దమైపోయింది. మాస్టారికి ఏ శ్రమా కలుగకూడదని ఆర్కెష్ట్రా అంతా చాలా జాగ్రత్తగా తమ నొటేషన్స్ మీదే ధ్యాస పెట్టారు. రెండు శ్రుతి లోని మాస్టారి గంభీరమైన స్వరం ధియేటరంతా వ్యాపించింది. ఘంటసాలగారు తన జ్వరం, సెగ గెడ్డల నొప్పి అంతా మర్చిపోయారు. క్లైమాక్స్ లో బాధతో కలిగిన అనుభూతితో 'నారాయణా, మాధవా, కేశవా' అంటూ ఎలుగెత్తి పెట్టిన కేకకు అందరూ నిశ్చేష్టులైపోయారు. ఘంటసాలగారికి ఎదో జరిగిందని భయపడిపోయారు. మరుక్షణంలో అందరూ తేరుకున్నారు. సౌండ్ ఇంజనీర్   ఫస్ట్ టేక్ ఓకే చేశారు. సినిమాలో తన భక్తుడిని రక్షించిన శ్రీ సత్యనారాయణస్వామి రికార్డింగ్ ధియేటర్ లో తీవ్ర అనారోగ్యంతో వున్న ఘంటసాలను కూడా కరుణించాడు. 

'మాధవా మౌనమా సనాతనా' పాటను విన్నవారెవరూ ఘంటసాల ఈ పాటను అనారోగ్యంతో ఉన్నప్పుడు పాడిన పాటని రవ్వంత కూడా అనుమానించలేరు. సన్నివేశపరమైన ఆవేదనానుభూతికి తన ఈతిబాధను కూడా జోడించి ఆర్తితో అపూర్వంగా పాడిన ఈ పాటకు తెరపై ఎన్టీఆర్ తన నటనా పాటవంతో ప్రాణ ప్రతిష్ట చేసి  ఈ గీతాన్ని  సజీవరాగం చేశారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 5 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 76వ భాగం - పూవై విరిసిన పున్నమి వేళా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయైదవ భాగం ఇక్కడ

76వ సజీవరాగం -  పూవై విరిసిన పున్నమి వేళా

     
చిత్రం - శ్రీ తిరుపతమ్మ కథ
గానం - ఘంటసాల
రచన - 
సి.నారాయణరెడ్డి 
సంగీతం - పామర్తి - బి.శంకర్

పల్లవి :

పూవై విరిసిన పున్నమి వేళా

బిడియము నీకేలా బేలా 2

పూవై విరిసిన పున్నమి వేళా


చరణం 1: 

చల్లని గాలులు సందడి చేసె

తొలి తొలి వలపులు తొందరచేసె 2

జలతారంచుల మేలిముసుగులో

తలను వాల్తువేలా బేలా 

                         !పూవై విరిసిన !

చరణం 2:

మొదట మూగినవి మొలక నవ్వులు

పిదప సాగినవి బెదరు చూపులు 2

తెలిసెనులే నీ తలపులేమిటో

తొలగిపోదువేలా బేలా 

                         !పూవై విరిసిన!

చరణం 3: 

తీయని వలపుల పాయసమాని

మాయని మమతల ఊయలలూగి 2

ఇరువుర మొకటై పరవశించగా 

ఇంకా జాగేలా బేలా 

                         !పూవై విరిసిన!

1963వ సంవత్సరంలో గానగంధర్వుడు ఘంటసాల గళం బలం కలిగిన సినీమాలు 30 వరకు విడుదలయ్యాయి. వాటిలో ఏకంగా 12 సినీమాలు  - 'శ్రీకృష్ణార్జున యుధ్ధం' మొదలుకొని 'మంచి-చెడు' వరకు  నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించినవే. సరాసరిన నెలకు ఒక సినిమా చొప్పున వచ్చాయి. వాటిల్లో 10వ  చిత్రం  'శ్రీ తిరుపతమ్మ కథ'. 1963 అక్టోబర్ (10వ నెల) 4వ తేదీన రిలీజయింది. ఈ సినిమా శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ఒక భక్తురాలి జీవితగాధ ఆధారంగా తీయబడింది.

భార్యాభర్తల బంధం పరమ పవిత్రం. భర్త అనేవాడు సన్మార్గుడైనా, దుర్మార్గుడైనా ఆ భార్య అతన్నే అంటిపెట్టుకువుండాలి. పతియే ప్రత్యక్ష దైవం. బ్రతుకునైనా, చావునైనా భార్యాభర్తలు కలిసే వుండాలి.  వారిది ఎన్నటికీ ఎవరూ, ఎప్పుడూ విడదీయరాని బ్రహ్మముడి అనే భావనలు ప్రజలలో బలంగా నాటుకుపోయిన రోజులవి. స్త్రీ అబల, పరాధీన. మంచైనా, చెడైనా పురుషుని ఆశ్రయంలో జీవించవలసిన వ్యక్తిగా ఈ సమాజం ఉన్న రోజులలోని కథ. స్త్రీ స్వాతంత్ర్యానికి, సొంత ఆలోచనలకు, వ్యక్తిత్త్వానికి చోటులేని కాలమది.

ఈ సినిమా లో ఘంటసాలగారు పాడిన అత్యంత శ్రావ్యమైన ఏకగళ గీతం, డా.సి.నారాయణరెడ్డి గారు వ్రాసిన 'పూవై విరిసిన పున్నమి వేళా బిడియము నీకేలా బేలా' - అదే నేటి మన సజీవరాగం.

ఒక  యువకుడు ఒక పల్లెటూరి అందమైన యువతిని చూసి మోజుపడ్డాడు, వరించానన్నాడు. కోరుకున్న పిల్లనే పెళ్ళిచేసుకున్నాడు. మంచి కుటుంబంలో కట్టుబాట్ల మధ్య పెరిగి విచక్షణా జ్ఞానం సంపాదించుకున్న ఆ వధువు ఏం చేస్తుంది. పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ భర్త పాదాలవద్దే జీవించాలని అత్తింటికి చేరింది. వారిరువురికి మొదటిరాత్రి. పధ్ధతి ప్రకారం పడకగదికి చేరిన భార్యను లాలించి, మురిపించి  వలపు మాటలతో తన మగసిరిని ప్రదర్శించి తన తొలిరేయి కోర్కెలను సఫలం చేసుకుంటాడు.

ఇలాటి తొలిరేయి శృంగార సన్నివేశానికి కావలసిన పడికట్టు మాటలెప్పుడు కైవసం ఉండే కవి నారాయణరెడ్డిగారు కథానాయకుడు నందమూరి వారిని, కథానాయిక కృష్ణకుమారిలను దృష్టిలోపెట్టుకొని  ప్రేక్షకులకు మోహ పారవశ్యం కలిగేలా ఒక  చక్కటి రొమాంటిక్  గీతాన్ని సమకూర్చారు. ఇదే పాట తర్వాతి సన్నివేశాలలో కథానాయిక పరంగా శ్రీమతి లీల గాత్రంలో శోక గీతంగా వస్తుంది.

ఘంటసాల స్కూల్ కు  చెందిన సంగీత దర్శకుడు పామర్తి వెంకటేశ్వరరావు. ఘంటసాల సంగీత సహాయకుడిగా పనిచేసినవారు.  ఈ పాట కోసం కళ్యాణి రాగాన్ని ఎంచుకొని సంపూర్ణంగా గురువుగారి బాణీనే అనుసరించి ఒక సజీవరాగం సృష్టికి కారకులయ్యారు పామర్తి.  ఘంటసాలకు కళ్యాణికి గల రాగబంధం ఎలాటిదో తెలుగువారందరికీ సుపరిచితమే. గాయకుడిగా ఘంటసాలవారి గాన మాధుర్యం  గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.

గత 75 వారాలుగా ఘంటసాలవారి గాన మాధుర్యాన్ని  పలు కోణాలలో నుంచి ఆస్వాదిస్తున్న రసజ్ఞులకు, సందర్బం వచ్చింది కనుక, ఈ వారం ఘంటసాలగారి వ్యక్తిత్వం గురించి, వారి ఔదార్యం గురించి ఓ నాలుగు మాటలు చెప్పుకోవడం సముచితమైన విషయంగా భావిస్తున్నాను. 

అదే ఘంటసాల వెంకటేశ్వరరావు - పామర్తి వెంకటేశ్వరరావుల మైత్రీబంధం. ఆ విషయాలను ముచ్చటించుకోవాలంటే మనం 1948 లనాటికి వెళ్ళాలి.

అవి స్వర్గసీమ, పల్నాటి యుధ్ధం, యోగి వేమన, రత్నమాల, బాలరాజు, కీలుగుర్రం వంటి సినిమాలు వచ్చి ఘంటసాల అంటే ఎవరో ఏమిటో తెలుగువారంతా తెలుసుకుంటున్న రోజులవి.  కుచేల దశ నుండి బయటపడుతున్న ఘంటసాల తనలాటి కుచేలురను ఆదుకునే స్థితికి ఎదుగుతున్న రోజులవి.

పామర్తి గారిది ఘంటసాలగారి స్వస్థలమైన చౌటపల్లికి దగ్గరలోని సిధ్ధాంతం అనే గ్రామం. ఒకప్పుడు బాగా బ్రతికినవారే. ఘంటసాలగారితో తన ఆర్ధిక దుస్థితి గురించి చెప్పుకోగా ఘంటసాల ఆయనను మద్రాస్ రప్పించి తన దగ్గర ఆశ్రయమిచ్చారు. అప్పటికే ఘంటసాలగారి వివాహమయింది. అద్దెంటిలో కాపురం. పామర్తిగారిని కూడా తన సంగీతం లైన్లోనే పెట్టాలని ఘంటసాల ఆయనకు డోలక్ కొనిపెట్టారు. ముందు తను నేర్చుకొని తర్వాత పామర్తిగారికి నేర్పడం మొదలెట్టారు. వీరికి జీవనోపాధి అయిన సంగీతం ఆ ఇంటి యజమాన్లకు ఇబ్బందిగా తయారయింది. ఉదయాస్తమానం వీరు చేసే డోలక్ సాధన ఆ ఇంటివారు భరించలేక  వెంటనే ఇల్లు ఖాళీ చేయమని ఘంటసాలగారిపై ఒత్తిడి తెచ్చి ఇళ్ళు ఖాళీచేయించగా వేరే ఇంటికి మారవలసి వచ్చిందట.

(ఘంటసాల సావిత్రమ్మగారి వ్యాసాల నుండి సేకరణ)

ఈ విధంగా తనను నమ్ముకున్న వ్యక్తికోసం ఎన్నో తిప్పలు పడిన సహృదయుడు ఘంటసాల. తర్వాత పామర్తి కొంత అనుభవం సంపాదించి ఘంటసాల గారి పాటలకు తబలా వాయించడం, ఆర్కెష్ట్రా కండక్ట్ చేయడం వంటి పనులు చేసేవారు. ఘంటసాలగారు సొంతిల్లు కొనుకున్నాక అందులోని ఔట్ హౌస్ లో పామర్తిగారు తన భార్యా పిల్లలతో కాపురముండేవారు. రెండు కుటుంబాలు  కలసిమెలసి ఒకే కుటుంబంలా వుండేవారు. దాదాపు పది పన్నెండేళ్ళు పామర్తి ఘంటసాలగారి సహాయకుడిగా అనేక సినిమా లకు పనిచేశారు. అయితే ఆ జీవితం పామర్తిగారికి నచ్చలేదు. స్వతంత్రంగా సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే కాంక్ష పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా, ఘంటసాలగారు ఎంత వారించినా కాదని కుటుంబంతో అక్కడనుండి వెళ్ళిపోయి వేరే చోటుకు మకాం మార్చి తన ప్రయత్నాలు కొనసాగించారు.

పామర్తిగారి కుటుంబం ఘంటసాలవారి ఔట్ హౌస్ నుండి వెళ్ళిపోయాక  1955లో ఆ ఔట్ హౌస్ లోకి మా కుటుంబం ప్రవేశించగా, ఏకంగా 28 ఏళ్ళు '35 ఉస్మాన్ రోడ్డే' మా స్వంత ఇల్లంత గాఢమైన అనుబంధంతో మా జీవనయానం సాగింది.

పామర్తి గారు వెళ్ళిన తర్వాత  ఓ దశాబ్దకాలంలో ఓ పాతిక డబ్బింగ్ సినిమా లకు సంగీతం చేసివుంటారు. డబ్బింగ్ సినీమాల ద్వారా ఆదాయం అంటే ఒకప్పటి 'బ్రతకలేక బడిపంతులు' సామెతలాటిది. శ్రమతప్ప ఫలితం శూన్యం. తన డబ్బింగ్ నిర్మాత స్నేహితులు స్ట్రైట్ సినిమా లు తీసినప్పుడు ఆ సినిమా ల సంగీత దర్శకత్వం ఛాన్స్ తప్పక తనదేనని పామర్తి గాఢంగా విశ్వసించారు. అదే విషయాన్ని ఘంటసాలగారితోనూ,ఇంట్లోవారితోనూ చాలా నమ్మకంగా చెప్పేవారు. అయితే 'ఎక్కడైనా బావ కాని వంగతోట దగ్గర కాదు' అనే సామెతను ఋజువుపరుస్తూ పామర్తిగారి డబ్బింగ్ నిర్మాత మిత్రులు తాము స్ట్రైట్ సినిమా లు తీసినప్పుడు

పామర్తిగారిని కాదని బాగా పేరున్న పెద్జ మ్యూజిక్ డైరెక్టర్లను నియమించుకోవడం మొదలెట్టారు. ఇది పామర్తిగారిని బాగా కృంగదీసింది. సంసారం పెరిగి ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. మరల, ఘంటసాలవారినే ఆశ్రయించారు.    అప్పటికే రాఘవులు తన పురోభివృద్ధి ని వెతుక్కుంటూ ఘంటసాల మాస్టారిని వదలిపెట్టిపోవడంతో ఆ స్థానంలో  సంగీత సహాయకుడిగా పామర్తిగారికి  అవకాశాలు కల్పించి ఘంటసాల ఇతోధికంగా తోడ్పడ్డారు. పామర్తిగారింటి వివాహాది శుభకార్యాలన్నింటిలో చేదోడువాదోడుగా వుంటూ ఆర్ధికంగా తగు సహాయం అందించేవారు. మాస్టారింటిలోని వారంతా మంచి స్నేహంగానే ఉండేవారు.  పామర్తిగారి అమ్మాయిలకు అడపాదడపా బృందగానాలలో పాడే అవకాశాన్ని ఘంటసాల మాస్టారు కల్పించేవారు.

దాదాపు తన రెండున్నర దశాబ్దాల సినీజీవితంలో పామర్తిగారు స్వతంత్రంగా పనిచేసిన సినిమాలు ముచ్చటగా మూడే మూడు. అవి - సతీ తులసి, శ్రీ తిరుపతమ్మ కథ, బబృవాహన. ఈ మూడు సినిమాలు పామర్తిగారి పురోభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదనే చెప్పాలి. ఆఖరుగా1973లో  వసంతకుమార్ రెడ్డిగారి 'పూలమాల' అనే సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ, ఆ సినిమా  సగంలో వుండగానే పామర్తిగారు కాలం చేయడం జరిగింది. ఆ మిగిలిన సగం సినిమా పాటలను, రీరికార్డింగ్ ను ఘంటసాలగారే పూర్తిచేసి తనకు ఇచ్చిన పూర్తి పారితోషకాన్ని ఘంటసాలగారు పామర్తిగారి కుటుంబానికి అందజేసి వారిని ఆదుకున్నారు.

ఈవిధంగా ఘంటసాలవారు తనను నమ్మి వచ్చినవారెందరికో ఆశ్రయమిచ్చి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో ఆదుకున్నారు. ఘంటసాలగారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎంతటి ఉన్నతుడో మనసున్న మంచి మనిషిగా మరింత ఉన్నతుడు. కళాకారుడిగా అందరికీ ఆదర్శప్రాయుడు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 29 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 75వ భాగం - మనిషైతే మనసుంటే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైనాలుగవ భాగం ఇక్కడ

75వ సజీవరాగం -  మనిషైతే మనసుంటే
చిత్రం - అమాయకుడు
(మూలం -'అనారి' 1959 హిందీ చిత్రం)
గానం - ఘంటసాల

రచన - దేవులపల్లి
సంగీతం - బి.శంకర్ (హైదరాబాద్)

పల్లవి :

మనిషైతే మనసుంటే -2

కనులు కరగాలిరా కరిగి కరుణ

కురియాలిరా కురిసి జగతి నిండాలిరా

చరణం 1: 

ఆగి ఆగి సాగిపోరా సాగిపోతూ చూడరా !ఆగి ఆగి!

వేగిపోయే వెన్నెన్ని బ్రతుకులో

వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో వేచియున్నాయిరొ 

                                            ! మనిషైతే!

చరణం 2: 

తేలిపోతూ నీలిమేఘం జాలి జాలిగ కరిగెరా !తేలిపోతూ!

కేలుచాపి ఆ దైవమే తన కేలుచాపి

ఆకాశమే ఈ నేలపై ఒరిగెరా 

                                            !మనిషైతే!

 చరణం 3:

మనిషైతే మనసుంటే మనసుంటే

మనిషైతే వైకుంఠమే ఒరుగురా

నీకోసమే కరుగురా - 3

                                            !మనిషైతే!

జీవితంలో ఏ ఆశయం, లక్ష్యం లేకుండా బ్రతకడం ఒక్కటే ముఖ్యమనుకునేవారికి ఏ ఇబ్బంది లేదు. ఏదో రకంగా బ్రతికేస్తారు. అలా కాకుండా నీతినిజాయితీలతో నిక్కచ్చిగా జీవించాలనుకునేవారికి అడుగడుగునా అడ్డంకులే,అందరూ విరోధులే.

తన చుట్టూవున్న సమాజంలోని కుళ్ళు,కుత్సితాలకు  క్షోభించి మనసు ద్రవించి కళ్ళు కరిగి బరువెక్కిన హృదయంతో ఓ యువకుడు పాడుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆ పాటే - "మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా కురిసి జగతి నిండాలిరా...". అదే నేటి మన సజీవరాగం. అతి కరుణరసాత్మకంగా ఘంటసాలవారి గళం నుండి మృదుమధురంగా జాలువారిన గీతం.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చాలా సున్నితమనస్కుడు. తన బాధలకే గాదు యితరుల బాధలకు కూడా యిట్టే చలించిపోతారు. సమాజపు ఆటుపోట్లకు, అగ్నిజ్వాలలకు తట్టుకోలేక ఎన్నెన్ని బ్రతుకులు వేగివేసారిపోతున్నాయో,ఆసరాకోసం ఎన్నెన్ని చేతులు వేచియున్నాయో ఒక్కసారి ఆగి చూడమంటున్నారు. మనసున్న మనిషైతే వారి కష్టాలకు చలించి కనులు కరిగి కరుణ కురిపించమంటున్నారు. మనసున్న మనిషికోసం దైవం తన అభయహస్తాలతో వైకుంఠాన్నే నేలకు దింపుతాడని భరోసా కల్పిస్తున్నారు. కృష్ణశాస్త్రి గారి భావుకతకు తగినట్లుగానే వారి పదజాలం కూడా విలక్షణమైన రీతిలో వుంటుంది.

సాహిత్యానికి దీటుగా  మంచి సంగీతాన్ని సమకూర్చారు బి.శంకర్. తోడి రాగ స్వరాలు ఆధారంగా ఈ పాట మలచబడింది. కర్ణాటక సంగీతంలోని 8వ మేళకర్త రాగం తోడి. సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవి. ఈ రెండు రాగాలకు స్వరాలు ఒకటే అయినా గమక ప్రయోగంలో రెంటికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. హిందుస్థానీ సంగీతంలో కూడా ఒక తోడి వుంది. దానికి సమాంతరమైన కర్ణాటక రాగాన్ని శుభపంతువరాళి (45వ మేళకర్త) అంటారు. తోడి రాగాన్ని పాడి మెప్పించడం చాలా కష్టమని, ఎంతో పాండిత్యప్రకర్ష కలవారికి మాత్రమే సాధ్యమనే భావన సంగీతప్రపంచంలో వుంది. కొత్త సంగీత దర్శకుడైన బి.శంకర్ గారి నిర్దేశకత్వంలో 'అమాయకుడు' సినిమా లోని పాటలన్నీ చాలా వైవిధ్యభరితంగా అమరాయి. ఘంటసాల మాస్టారు పాడిన ఈ పాటలోని orchestration  శంకర్-జైకిషన్ స్టైల్ ను, ఆ  రిచ్ నెస్ ను గుర్తుకు తెస్తుంది. సహజమే. అందుకు కారణం లేకపోలేదు. 'అమాయకుడు' సినిమా కు మూలం హృషికేశ్ ముఖర్జీ గారి 'అనారి' హిందీ చిత్రం(1959). రాజ్ కపూర్, నూతన్ లు నటించిన ఈ చిత్రానికి సంగీతం నిర్వహించింది రాజ్ కపూర్ ఆప్త మిత్రులు శంకర్-జైకిషన్లే. అందుచేత అదే బాణీ తెలుగులోనూ కనిపించింది. ఎన్నో వైయొలిన్స్, సెల్లోలు, ఎకార్డియన్స్, కాంగో డ్రమ్స్, బ్యాంగోస్, డబుల్ బాస్, గిటార్స్, పియానో, యూనివాక్స్, తార్ షెనాయ్, ఫ్లూట్, తబలాలు వంటి భారీ వాద్యాలు ఈ పాటకు  చాలా నిండుదనాన్నిచ్చాయి. మంద్ర, తారస్థాయిలలో ఘంటసాల మాస్టారి కంఠం ఖంగున మ్రోగడమే కాక ఆ సన్నివేశానికి అవసరమైన కరుణరసాన్ని కూడా సమృద్ధిగా కురిపించింది.  తన  మాడ్యులేషన్ కూడా హీరో కృష్ణకు తగినట్లుగా మార్చారు మాస్టారు.

అందుకే ఈ 'మనిషైతే మనసుంటే' పాట ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సజీవరాగమై నిలిచింది. బి.శంకర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు చాలా తక్కువ.  అయినా మంచి పాటలనే అందించారు. బి.శంకర్, బొంబాయి శంకర్ - ఈ ఇద్దరూ హైదరాబాద్ కు చెందినవారే. 

జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, మొదలగువారు నటించిన చిత్రం 'అమాయకుడు'. ఈ సినిమాను తమిళంలో కూడా జెమినీ గణేశన్, బి.సరోజినీదేవీలతో 'పాశముమ్-నేశముమ్' అనే పేరుతో నిర్మించి 1964 లో విడుదల చేశారు. హీరో కృష్ణకు తన తొలినాళ్ళ చిత్రాలలో మంచి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమా లో ఘంటసాల మాస్టారు పాడిన ఈ సోలో,  సుశీల గారితో పాడిన మరొక డ్యూయెట్ ('చందమామ రమ్మంది చూడు) కృష్ణగారి పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి.

కృష్ణశాస్త్రి గారి కలం బలం, ఘంటసాల మాస్టారి గళం బలం ఈ పాటను అజరామరం చేసాయి.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



Saturday, 22 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 74వ భాగం - ధనమేరా అన్నిటికీ మూలం

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైమూడవ భాగం ఇక్కడ

74వ సజీవరాగం -  ధనమేరా అన్నిటికీ మూలం
చిత్రం - లక్ష్మీనివాసం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి :

ధనమేరా అన్నిటికీ మూలం

ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం

                                        !ధనమేరా!

 

మానవుడే ధనమన్నది సృజియించెనురా 

దానికి తానే తెలియని దాసుడాయెరా! మానవుడే!

ధనలక్ష్మిని అదుపులో పెట్టినవాడే

గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా 

                                        !ధనమేరా!

 ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు

చేయరా లేనినాడు ఒడలువంచి కూడబెట్టరా !ఉన్ననాడు!

కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే-2

అయో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే

                                        !ధనమేరా!

 కూలివాని చెమటలో ధనమున్నదిరా

పాలికాపు కండల్లో ధనమున్నదిరా -2

శ్రమజీవి కి జగమంతా లక్ష్మీనివాసం-2

 శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

                                        !ధనమేరా!

If we command our wealth, we shall be rich and free; if our

Wealth commands us,we are poor indeed. - Edmund Burke

Anglo-Irish Philosopher

 

డబ్బు నీ ఆధీనంలో వున్నంతవరకు నువ్వు మహాధనవంతుడివి; సర్వస్వతంత్రుడివి. ఎప్పుడైతే నువ్వు డబ్బుకు లోబడిపోయావో అప్పుడు నీ యంత దరిద్రుడు మరొకడు వుండడు.

"ధనం మూలం ఇదం జగత్" అన్నారు. గ్రహాలన్నీ సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయో లేదో తెలియదు కాని ఈనాటి యావత్ప్రపంచం మాత్రం నిర్విరామంగా డబ్బనే పదార్ధం చుట్టూ పరిభ్రమిస్తూనే వుంది. డబ్బు ఎంత విలువైనదో అంత చెడ్డది. డబ్బు సంబంధాలు పెంచనూ గలదు, వాటిని త్రెంచనూ గలదు. ఆప్తమిత్రుల మధ్య, రక్తసంబంధీకుల మధ్య తరాలపాటు ఆరని చిచ్చూ పెట్టగలదు. ధనాన్ని సృష్టించిన మనిషి నేడు దానికి పూర్తిగా బానిసైపోయాడు.

ధనమే అన్నిటికీ మూలం; ఆ ధనము విలువ తెలుసుకొని మానవత్వంతో ప్రవర్తించడం మానవధర్మం. ఈ రకమైన భావజాలంతో రూపొందించబడిన "ధనమేరా అన్నిటికీ మూలం" అనే ఆరుద్రగారి గీతమే నేటి మన సజీవరాగం. ఈ పాటలో మనసులను రంజింపజేసేంత గొప్ప సంగీతం లేదు. అయినా సజీవరాగమే. మానవతా విలువలు చాటిచెప్పే గొప్ప సాహిత్యానికి తగిన సందర్భోచితమైన సంగీతం గల గీతం "ధనమేరా అన్నింటికీ మూలం".

ధనాధిదేవత లక్ష్మీదేవి చంచల. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. నిరంతరంగా నిలకడగా ఒకే దగ్గర వుండదు. అందుకూ కారణం మనిషే. మనిషిలోని స్వార్ధచింతనే లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుంది.

ఇంత విలువైన తత్త్వాన్ని కేవలం మూడే మూడు నిముషాల పాటతో మనకు అవగతం చేశారు కవి ఆరుద్ర.  పాట తత్త్వానికి అనువైన మెట్టునే అమర్చారు సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్. ఈ రకమైన గీతాలు ఎక్కువగా ఘంటసాల, ఎస్.వి.రంగారావుగార్ల కోసమే అన్నట్లు రూపొందిచబడినాయి. ఇద్దరిలోనూ అసమాన్యమైన నటనాపాటవం వుండడంవలన ఆయా పాటలు సజీవరాగాలుగా ఈనాటికీ మనలను అలరిస్తున్నాయి. తెర వెనుక ఘంటసాలగారు పాడిన ఈ పాటకు తెరపై రంగారావుగారి హావభావాలు దానికి అంజలీదేవిగారి రియాక్షన్ ఈ పాట సన్నివేశాన్ని అజరామరం చేసింది.

మన తెలుగు సినీమాలలో వేదాంత, తాత్త్విక సంబంధ గీతాలకు హరికాంభోజి రాగాన్ని ఉపయోగించడం పరిపాటి. ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలో ఈ రాగం ఎక్కువ వినిపిస్తుంది. హరికాంభోజి రాగం కర్ణాటక సంగీతంలో 28 వ మేళకర్త రాగం. అంటే ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణ రాగం. జంఝూటి, తిలంగ్ రాగాలు రెండు హరికాంభోజికి జన్యరాగాలు. అలాగే, శంకరాభరణం రాగం 29 వ  మేళకర్త రాగం. హరికాంభోజికి, శంకరాభరణం రాగానికి ఉన్న తేడా అంతా ఒక్క నిషాదం స్వరంలోనే. హరికాంభోజి రాగంలో కైశికి నిషాదం పలికితే శంకరాభరణం రాగంలో కాకాలి నిషాదం పలుకుతుంది. ఈ ఒక్క తేడా తప్ప మిగిలిన స్వరాలన్నీ ఈ రెండు రాగాలకు ఒకటే. ఈ రకమైన స్వర సంబంధాలు కలిగి వుండడం వలన హరికాంభోజి, జంఝూటి, తిలంగ్, శంకారభరణం రాగాలలో మలచబడిన సినిమా పాటలు అంతకుముందు ఎప్పుడో ఎక్కడో విన్న పాటలాగే ఉందే అన్న భ్రమ సామాన్య శ్రోతలో కలగడం సహజం. అయితే రాగాలతో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వారికి  ఆయా పాటలలో వుండే తేడా తెలుస్తుంది. ఈనాటి మన సజీవరాగం ' ధనమేరా అన్నిటికీ మూలం' పాటలో  జంఝూటీ, తిలంగ్ రాగ లక్షణాలు రెండూ వున్నట్లు తెలుస్తున్నది.

1966 లో దర్శక నిర్మాత నటుడు అయిన బి ఆర్ పంతులు తన పద్మినీ పిక్చర్స్ బ్యానర్ లో 'దుడ్డే దొడ్డప్ప' అనే చిత్రాన్ని కన్నడంలో నిర్మించారు. టి.జి.లింగప్ప సంగీత దర్శకుడు. తమిళంలో కూడా 'నమ్మ వీట్టు మహాలక్ష్మి' గా అదే సంవత్సరం లో విడుదలయింది. ఇదే కథను 1968లో వీనస్-పద్మినీ పిక్చర్స్ కంబైన్డ్ గా వి.మధుసూదనరావు దర్శకత్వంలో 'లక్ష్మీ నివాసంగా' నిర్మించారు. కన్నడంలో బి.ఆర్.పంతులు, ఎమ్.వి.రాజమ్మ పోషించిన పాత్రలను తెలుగులో ఎస్.వి.రంగారావు, అంజలీదేవి ధరించారు. ఇతర పాత్రలలో కృష్ణ,శోభన్ బాబు, భారతి, నాగయ్య, రామ్మోహన్, పద్మనాభం మొదలగువారు నటించారు. కె.వి.మహాదేవన్ సంగీతం నిర్వహించారు.

తొమ్మిది పాటలున్న లక్ష్మీనివాసం లో ఘంటసాల మాస్టారు పాడిన ఏకైక గీతం 'ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం' పాట ఒక్కటే మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. సామాన్య శ్రోతలంతా కూడా చాలా సౌకర్యంగా, సులభంగా పాడుకునే రీతిలో మలచారు మహాదేవన్. దానిని అంత సులభసాధ్యంగానూ, పామరులకు కూడా అర్ధమయేలా సుశ్రావ్యంగా పాడారు ఘంటసాల. గిటార్, మేండలిన్, పియానో, వైబ్రోఫోన్, సితార్, కీబోర్డ్, వైయొలిన్స్, తబలా, ఘటసింగారి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి.

ఏ పాటైనా సంగీతపరంగా, సాహిత్య పరంగా పదికాలాలపాటు ప్రజల హృదయాలలో నిలవాలంటే కథలో సత్తా, సన్నివేశంలో సారం వుండాలనే సత్యాన్ని నేటి సజీవరాగం నిరూపిస్తుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...