Saturday, 22 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 74వ భాగం - ధనమేరా అన్నిటికీ మూలం

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైమూడవ భాగం ఇక్కడ

74వ సజీవరాగం -  ధనమేరా అన్నిటికీ మూలం
చిత్రం - లక్ష్మీనివాసం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి :

ధనమేరా అన్నిటికీ మూలం

ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం

                                        !ధనమేరా!

 

మానవుడే ధనమన్నది సృజియించెనురా 

దానికి తానే తెలియని దాసుడాయెరా! మానవుడే!

ధనలక్ష్మిని అదుపులో పెట్టినవాడే

గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా 

                                        !ధనమేరా!

 ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు

చేయరా లేనినాడు ఒడలువంచి కూడబెట్టరా !ఉన్ననాడు!

కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే-2

అయో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే

                                        !ధనమేరా!

 కూలివాని చెమటలో ధనమున్నదిరా

పాలికాపు కండల్లో ధనమున్నదిరా -2

శ్రమజీవి కి జగమంతా లక్ష్మీనివాసం-2

 శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

                                        !ధనమేరా!

If we command our wealth, we shall be rich and free; if our

Wealth commands us,we are poor indeed. - Edmund Burke

Anglo-Irish Philosopher

 

డబ్బు నీ ఆధీనంలో వున్నంతవరకు నువ్వు మహాధనవంతుడివిసర్వస్వతంత్రుడివి. ఎప్పుడైతే నువ్వు డబ్బుకు లోబడిపోయావో అప్పుడు నీ యంత దరిద్రుడు మరొకడు వుండడు.

"ధనం మూలం ఇదం జగత్" అన్నారు. గ్రహాలన్నీ సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయో లేదో తెలియదు కాని ఈనాటి యావత్ప్రపంచం మాత్రం నిర్విరామంగా డబ్బనే పదార్ధం చుట్టూ పరిభ్రమిస్తూనే వుంది. డబ్బు ఎంత విలువైనదో అంత చెడ్డది. డబ్బు సంబంధాలు పెంచనూ గలదువాటిని త్రెంచనూ గలదు. ఆప్తమిత్రుల మధ్యరక్తసంబంధీకుల మధ్య తరాలపాటు ఆరని చిచ్చూ పెట్టగలదు. ధనాన్ని సృష్టించిన మనిషి నేడు దానికి పూర్తిగా బానిసైపోయాడు.

ధనమే అన్నిటికీ మూలం; ఆ ధనము విలువ తెలుసుకొని మానవత్వంతో ప్రవర్తించడం మానవధర్మం. ఈ రకమైన భావజాలంతో రూపొందించబడిన "ధనమేరా అన్నిటికీ మూలం" అనే ఆరుద్రగారి గీతమే నేటి మన సజీవరాగం. ఈ పాటలో మనసులను రంజింపజేసేంత గొప్ప సంగీతం లేదు. అయినా సజీవరాగమే. మానవతా విలువలు చాటిచెప్పే గొప్ప సాహిత్యానికి తగిన సందర్భోచితమైన సంగీతం గల గీతం "ధనమేరా అన్నింటికీ మూలం".

ధనాధిదేవత లక్ష్మీదేవి చంచల. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. నిరంతరంగా నిలకడగా ఒకే దగ్గర వుండదు. అందుకూ కారణం మనిషే. మనిషిలోని స్వార్ధచింతనే లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుంది.

ఇంత విలువైన తత్త్వాన్ని కేవలం మూడే మూడు నిముషాల పాటతో మనకు అవగతం చేశారు కవి ఆరుద్ర.  పాట తత్త్వానికి అనువైన మెట్టునే అమర్చారు సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్. ఈ రకమైన గీతాలు ఎక్కువగా ఘంటసాలఎస్.వి.రంగారావుగార్ల కోసమే అన్నట్లు రూపొందిచబడినాయి. ఇద్దరిలోనూ అసమాన్యమైన నటనాపాటవం వుండడంవలన ఆయా పాటలు సజీవరాగాలుగా ఈనాటికీ మనలను అలరిస్తున్నాయి. తెర వెనుక ఘంటసాలగారు పాడిన ఈ పాటకు తెరపై రంగారావుగారి హావభావాలు దానికి అంజలీదేవిగారి రియాక్షన్ ఈ పాట సన్నివేశాన్ని అజరామరం చేసింది.

మన తెలుగు సినీమాలలో వేదాంతతాత్త్విక సంబంధ గీతాలకు హరికాంభోజి రాగాన్ని ఉపయోగించడం పరిపాటి. ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలో ఈ రాగం ఎక్కువ వినిపిస్తుంది. హరికాంభోజి రాగం కర్ణాటక సంగీతంలో 28 వ మేళకర్త రాగం. అంటే ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణ రాగం. జంఝూటితిలంగ్ రాగాలు రెండు హరికాంభోజికి జన్యరాగాలు. అలాగే, శంకరాభరణం రాగం 29 వ  మేళకర్త రాగం. హరికాంభోజికి, శంకరాభరణం రాగానికి ఉన్న తేడా అంతా ఒక్క నిషాదం స్వరంలోనే. హరికాంభోజి రాగంలో కైశికి నిషాదం పలికితే శంకరాభరణం రాగంలో కాకాలి నిషాదం పలుకుతుంది. ఈ ఒక్క తేడా తప్ప మిగిలిన స్వరాలన్నీ ఈ రెండు రాగాలకు ఒకటే. ఈ రకమైన స్వర సంబంధాలు కలిగి వుండడం వలన హరికాంభోజిజంఝూటితిలంగ్, శంకారభరణం రాగాలలో మలచబడిన సినిమా పాటలు అంతకుముందు ఎప్పుడో ఎక్కడో విన్న పాటలాగే ఉందే అన్న భ్రమ సామాన్య శ్రోతలో కలగడం సహజం. అయితే రాగాలతో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వారికి  ఆయా పాటలలో వుండే తేడా తెలుస్తుంది. ఈనాటి మన సజీవరాగం ' ధనమేరా అన్నిటికీ మూలం' పాటలో  జంఝూటీతిలంగ్ రాగ లక్షణాలు రెండూ వున్నట్లు తెలుస్తున్నది.

1966 లో దర్శక నిర్మాత నటుడు అయిన బి ఆర్ పంతులు తన పద్మినీ పిక్చర్స్ బ్యానర్ లో 'దుడ్డే దొడ్డప్పఅనే చిత్రాన్ని కన్నడంలో నిర్మించారు. టి.జి.లింగప్ప సంగీత దర్శకుడు. తమిళంలో కూడా 'నమ్మ వీట్టు మహాలక్ష్మి' గా అదే సంవత్సరం లో విడుదలయింది. ఇదే కథను 1968లో వీనస్-పద్మినీ పిక్చర్స్ కంబైన్డ్ గా వి.మధుసూదనరావు దర్శకత్వంలో 'లక్ష్మీ నివాసంగా' నిర్మించారు. కన్నడంలో బి.ఆర్.పంతులుఎమ్.వి.రాజమ్మ పోషించిన పాత్రలను తెలుగులో ఎస్.వి.రంగారావు, అంజలీదేవి ధరించారు. ఇతర పాత్రలలో కృష్ణ,శోభన్ బాబు, భారతినాగయ్యరామ్మోహన్పద్మనాభం మొదలగువారు నటించారు. కె.వి.మహాదేవన్ సంగీతం నిర్వహించారు.

తొమ్మిది పాటలున్న లక్ష్మీనివాసం లో ఘంటసాల మాస్టారు పాడిన ఏకైక గీతం 'ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం' పాట ఒక్కటే మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. సామాన్య శ్రోతలంతా కూడా చాలా సౌకర్యంగాసులభంగా పాడుకునే రీతిలో మలచారు మహాదేవన్. దానిని అంత సులభసాధ్యంగానూ, పామరులకు కూడా అర్ధమయేలా సుశ్రావ్యంగా పాడారు ఘంటసాల. గిటార్మేండలిన్పియానోవైబ్రోఫోన్సితార్కీబోర్డ్, వైయొలిన్స్తబలా, ఘటసింగారి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి.

ఏ పాటైనా సంగీతపరంగాసాహిత్య పరంగా పదికాలాలపాటు ప్రజల హృదయాలలో నిలవాలంటే కథలో సత్తాసన్నివేశంలో సారం వుండాలనే సత్యాన్ని నేటి సజీవరాగం నిరూపిస్తుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...