సాకీ :
దీనులను కాపాడుటకు దేవుడే
ఉన్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడూ
చెడిపోడు
ఆకలికి అన్నము,వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ
మనసా !
రారా క్రిష్ణయ్యా.. రారా
క్రిష్ణయ్యా
దీనులను కాపాడ రారా
క్రిష్ణయ్యా -2
మా పాలిటి ఇలవేలుపు
నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో
కదిలేనయ్యా ! మా పాలిటి!
పేదల మొరలాలించే విభుడవు
నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
!పేదల !
అజ్జానపు చీకటికి దీపము నీవే
అన్యాయము నెదిరించే ధర్మము
నీవే
నీవే కృష్ణా,నీవే కృష్ణా,నీవే కృష్ణా
!రారా క్రిష్ణయ్యా!
కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు
బృందావనం
! కుంటివాని!
మూఢునికి జ్ఞానమొసగు
బృందావనం
మూగవాని పలికించే బృందావనం
!మూఢునికి!
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
! అందరినీ!
సన్నిధానం దేవుని సన్నిధానం
సన్నిధానం !
! రారా కృష్ణయ్యా!
కృష్ణా...కృష్ణా...కృష్ణా...కృష్ణా..
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
! కరుణించే!
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో
మురిసేనయ్యా
!మూగవాని!
నిన్ను చూసి బాధలన్ని
మరచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
!నిన్ను చూసి!
కృష్ణా... కృష్ణా... రారా....కృష్ణా
! రారా కృష్ణయ్యా!
'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' - జీవితంలో పడరాని కష్టాలన్నీ పడి మానవప్రయత్నంగా చేసే కార్యాలేవీ ఫలించకపోగా అవి వికటించినప్పుడు మనిషి విరక్తి చెంది దైవం మీద విశ్వాసం కోల్పోతాడు. దేవుడనేవాడున్నాడ,ఉంటే కళ్ళుమూసుకుని ఒక మూలన శిలయైకూచున్నాడా?తనను మాత్రం ఎందుకు కరుణించడంలేదని దేవుని నిందించడం,సర్వేశ్వరుని ఉనికినే శంకించడం మొదలెడుతాడు. భగవంతుడు తన సృష్టిలోని జీవులను పరీక్షిస్తాడేతప్ప ఎన్నటికి శిక్షించడు. ఏదో మార్గాంతరం చూపిస్తాడు. సుదూరంగా ఎక్కడినుండో హరినామ సంకీర్తనం చెవులబడుతుంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. శరణాగతి తప్ప తనకు వేరే మార్గంలేదని తెలుసుకొని దేవుడుండేచోటికి చేరుకొని తనను కాపాడమని వేడుకుంటాడు. మనిషి సదా సత్చించనతో సన్మార్గంలో పయనించడానికి మన పూర్వీకులు నవవిధ భక్తి మార్గాలను సూచించారు. అవి - శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏ ఒక్కదానినైనా మనస్ఫూర్తిగా, భక్తిశ్రధ్ధలతో పాటిస్తే ఆ మనిషి జీవితం సుఖమయమై ఆనందప్రదమవుతుంది.
ఘంటసాలవారి ఈనాటి సజీవరాగం నవవిధ భక్తిమార్గాలలో ఒకటైన 'కీర్తనం' ఆధారంగా రూపొందించబడింది. 'రారా క్రిష్ణయ్యా,రారా క్రిష్ణయ్యా దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా' అని 'రాము' చిత్రంకోసం ఘంటసాలవారు ఆలపించిన కృష్ణ నామసంకీర్తనం గత ఐదున్నర దశాబ్దాలకు పైగా తెలుగునాట బహుళప్రచారం పొందింది. సన్నివేశ ప్రాధాన్యత కలిగిన ఈ గీతం చిత్తూరు వి.నాగయ్య, ఎన్.టి రామారావు వంటి అగ్రనటుల నటవైదుష్యానికి ప్రతీకగా నిల్చింది. ఈ పాటలో ఈ ఇద్దరు ప్రముఖులకు ఘంటసాలగారే గాత్రదానం చేశారు. ఈ పాట మూడొంతుల భాగం నాగయ్యగారు పాడగా, ఆఖరి చరణం ఎన్.టి.రామారావుగారిమీద సాగుతుంది. పాట చివరలో ఇద్దరు కలసి పాడుతారు.
ప్రముఖ గేయరచయిత దాశరధి గారు వ్రాసిన ఈ గీతానికి ఆర్.గోవర్ధనం సంగీతం సమకూర్చారు. ఈ పాట హిందుస్థానీ రాగమైన 'యమన్' లో స్వరపర్చబడింది. కర్ణాటక సంగీతంలో 'యమన్' కు సమానమైన రాగం 'కళ్యాణి'. 65 వ మేళకర్త రాగం. సంపూర్ణరాగం. దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారు. ఈ కళ్యాణి/యమన్ రాగాలు ఘంటసాలగారి పేటెంట్ అని సంగీతాభిమానులంతా కొనియాడడం అందరికీ తెలిసినదే. ఈ రెండు రాగాలలో ఘంటసాల మాస్టారు ఆలపించి బహుళ జనాదరణ పొందిన అసంఖ్యాకమైన గీతాలు ఈనాటికి లలితసంగీత గాయకులందరినోట వినవస్తూనేవున్నాయి.
మంగళప్రదమైన యమన్ లో భావోద్వేగం, విషాదం మిళితమైవున్న 'రారా క్రిష్ణయ్యా' పాటను స్వరపర్చి మెప్పించడం ఎమ్మెస్వి వంటి ప్రతిభాశాలికి మాత్రమే సాధ్యం. ఎన్,టి.ఆర్, నాగయ్యగార్ల గాత్ర ధర్మాన్ని కాచి వడబోసిన ఘంటసాలగారు ఈ పాటలో ఎంతో వైవిధ్యాన్ని కనపర్చారు.
ఈ పాటలోని ఘంటసాలగారి గాన వైదుష్యం తలచుకునేముందు 'రాము' సినీమా నేపథ్యం గురించి కొంత తెలుసుకోవాలి.
1958లో 'ది ప్రౌడ్ రెబెల్' అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆధారంగా 1964లో కిశోర్ కుమార్ అన్నీ తానే అయి 'దూర్ గగన్ కి చాహోఁ' అనే సినిమా ను తీశారు. మంచి సినిమాగా పేరు పొందినా ఆర్ధికంగా ఘోరపరాజయం పొందింది.
కమలహాసన్, రోజారమణి, కుట్టిపద్మిని వంటి
బాలనటులను చిత్రసీమకు పరిచయం చేసి బాలల ప్రాధాన్యత కలిగిన సినీమాలెన్నో తీసిన ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారికి ఈ కథ తెగ నచ్చి, ఆ హిందీ సినిమా కథతో 1966లో
'రాము' పేరిట తమిళంలో నిర్మించారు.
రాజ్ కుమార్ (అసలు పేరు యోగీంద్రకుమార్) అనే బాలనటునికి అవకాశమిచ్చారు.(ఇతని
తండ్రి హనుమంతాచారిగారు కూడా మంచి గాయకుడు, కన్నడ చిత్రాలలో హాస్యనటుడు. ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో రెగ్యులర్ గా
యూనివాక్స్ అనే వాద్యాన్ని వాయించేవారు. ఘంటసాలవారి బృందంతో పాటు ఈయన కూడా
విదేశాలలో పర్యటించారు).
జెమినీ గణేశన్, కె.ఆ. విజయ, పుష్పలత, నాగయ్య, రంగారావు మొదలగువారు ప్రధాన తారాగణంగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమాకు ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీత దర్శకత్వం వహించి అజరామరమైన గీతాలతో
చిత్రవిజయానికి ముఖ్యకారకులయ్యారు.
ఈ సినిమాను మరల ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారే 1968 తెలుగులో ''రాము' గా ఎన్.టి.ఆర్, జమున, పుష్పలత, నాగయ్య, ఎస్.వి.రంగారావు, రేలంగి, రాజనాల మొదలగువారితో నిర్మించారు. తమిళంలో నటించి రాష్ట్రపతి అవార్డు పొందిన ఆ బాలనటుడే (రాజ్ కుమార్) లుగులో కూడా నటించేడు. ఎమ్.ఎస్.విశ్వనాధన్ కు సహాయకుడైన ఆర్.గోవర్ధనంకు తెలుగు రాము సంగీత దర్శకుడిగా బాధ్యత లు అప్పగించారు. పాటలన్నీ యథాతథంగా తమిళ వరసలనే తెలుగులో కూడా ఉపయోగించారు. తమిళంలో పి.బి.శ్రీనివాస్, శీర్కాళి గోవిందరాజన్, టి.ఎమ్.సౌందరరాజన్ పాడిన పాటలన్నీ తెలుగులో ఘంటసాలగారు పాడారు. తమిళ, తెలుగు భాషలలో ఘనవిజయం పొందిన 'రాము' 1975 లో మలయాళంలో కూడా తీయబడింది.
'రాము' చిత్రంలో ఘంటసాలగారు గారు పాడిన మరో మంచి పాట 'మంటలు రేపే నెలరాజా'. భాగేశ్వరి రాగంలో చేయబడిన ఈ పాటను తమిళంలో పి.బి.శ్రీనివాస్ పాడారు. ఈ పాటవిని ఘంటసాల మాస్టారు పి.బి.ఎస్,ను ఎంతో మెచ్చుకున్నారు.
యమన్ రాగంలో చేయబడిన నేటి సజీవరాగం ' రారా క్రిష్ణయ్యా' పాట తమిళం వెర్షన్ లో నాగయ్యగారికి శీర్కాళి గోవిందరాజన్, జెమినీ గణేశన్ కు టిఎమ్ సౌందరరాజన్ పాడారు. ఘంటసాలకు ఘంటసాలే సాటి అని భావించిన ఎ.వి.ఎమ్.వారు తెలుగులో నాగయ్య, ఎన్.టి.ఆర్ లు నటించిన రెండు పాత్రలకు ఘంటసాలగారి చేతే పాడించారు. మాస్టారు కూడా ఈ పాటను ఎంతో వైవిధ్యంతో పాడి పాటకు జీవంపోసారు.
ఈ పాట కోసం సితార్, వైయొలిన్స్, సెల్లొ, ఫ్లూట్, వైబ్రోఫోన్, తబలా, కోల్, బెల్స్, కబాష్, వంటి వాద్యాలను ఉపయోగించారు.
నాగయ్యగారి పోర్షన్ ను ఒక ట్రాక్ మీద, ఎన్టీఆర్ గారి పోర్షన్ ను వేరే ట్రాక్ మీద ఒకే కాల్షీట్ లో ఘంటసాలగారి చేత
పాడించి ఫైనల్ గా రెంటిని ఒకే ట్రాక్ మీద మిక్స్ చేసి ఇద్దరు వేర్వేరు గాయకులు
ఒకేసారి పాడిన ఎఫెక్ట్ ను రాబట్టినట్లు ఎ.వి.ఎమ్. సౌండ్ ఇంజనీర్ జె.జె.మాణిక్యం ఒక
ఇంటర్వ్యూలో చెప్పారు. ఘంటసాల గాత్రానికి రాణింపునిస్తూ తెరమీద నాగయ్యగారు, రామారావుగారు, మాస్టర్ రాజ్ కుమార్ లు
అద్భుతంగా నటించారు.
ఘంటసాలవారి సినీ సంగీత ప్రస్థానంలో ఆసక్తిగొలిపే ఇలాటి సజీవరాగాలు అసంఖ్యాకం.
ప్రణవ స్వరాట్
ఘంటసాలవారికి గురుతుల్యులు, ప్రీతిపాత్రులు, బహుభాషా నటులు, నిర్మాత, దర్శకులు విశేషానుభవశాలి అయిన చిత్తూరు వి.నాగయ్యగారికి వారి 121వ జయంతి సందర్భంగా, ఈ సజీవరాగాన్ని సవినయంగా సమర్పిస్తున్నాము.
No comments:
Post a Comment