చెలియ కురుల నీడ
కలదు రవ్వల మేడ
చెలియ కనులలోన కలదు వలపు
చెలియ పెదవులందు కలదోయి
అమృతము చెలియలేని బ్రతుకు వలదు వలదు
మేరే మెహబూబ్! ఇదర్ ఆవో....
మధువుపెదవిదాటి మైమరపించు
వధువు పెదవితాకి పరవశించు
మధువు వధువు కలిగి
మనజాలినప్పుడు
స్వర్గసుఖము గోరు చవట ఎవరు
మేరే బుల్ బుల్ !సునోతో...
నిన్న గడచిపోయె -
ఎన్నడు మరిరాదు
రేపు కొరకు ఎదురుచూపు వలదు
నేడు జారవిడుచువాడు -
దౌర్భాగ్యుడు - వట్టి దౌర్భాగ్యుడు
అనుభవించు సుఖములన్ని నేడే
అనుభవించు
గతం-భవితవ్యం-వర్తమానం నిన్న-రేపు-నేడు గతం తిరిగిరాదు. భవిష్యత్ నీ చేతిలో లేదు. రేపనేది ఎలావుంటుందో నువ్వు ఊహించలేవు, నిర్ణయించలేవు. వర్తమానం ఒక్కటే ప్రస్తుతానికి నిత్యము,సత్యము. ఉన్న నాలుగు గడియల కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఇది వేదాంతులు చెప్పే మాట. సద్వినియోగం చేసుకోవడమనేది మనిషి మనిషికి మారుతుంది. ఎవరి మనోధర్మాన్నిబట్టి వారు ఆలోచిస్తారు. సత్కార్యాలతో, సత్చించనతో మరుజన్మ లేకుండా జీవించి స్వర్గప్రాప్తి పొందాలని కొందరు ఆశిస్తే, ఆ స్వర్గంలో సంప్రాప్తించే సుఖభోగాలన్నీ ఇప్పుడే ఈ భూమీమీదే తనివితీరా అనుభవించడమే బుధ్ధిమంతుల లక్షణం. ఎదురుచూపులతో ఉన్నదానిని వదులుకోవడం వట్టి దౌర్భాగ్యం అంటారు మరికొందరు.
మధువు, మదవతి - ఈ రెండు చెంతనుంటే చాలు వేరే ప్రపంచంతో పనేలేదనే ఓ ప్రేమ పిపాసి వేదాంతసారమే నేటి మన సజీవరాగం.
గతవారం వేదాంత సారానికి ఈ వారం వేదాంత సారానికి మూలం ఒక్కటే. బ్రహ్మానందాన్ని పొందడం. లక్ష్యం ఒక్కటే. కానీ ఎంచుకున్న మార్గాలు వేరు. ఏది రాజబాట, ఏది ముళ్ళదారి అనేది వారివారి అనుభవాల ద్వారా తెలుసుకుంటారు. ఈనాటి మన కధానాయకుడు మధువుకు, మగువకు బానిస. ఒమర్ ఖయ్యాం తత్త్వాలకు వారసుడు.
ఒమర్ ఖయ్యాం 11 వ శతాబ్ది పార్శీ కవి. గొప్ప గణితశాస్త్ర, ఖగోళశాస్త్రవేత్త. అంతకుమించిన గొప్ప వేదాంతి. ఒమర్ ఖయ్యాం వ్రాసిన అనేకములైన పద్య కవితలు రుబాయియాత్ లు గా లోకప్రసిధ్ధి పొందాయి. నాలుగు నాలుగు వాక్యాలుండే ఈ పద్య కవితలు యతిప్రాసలతో చందోబధ్ధంగా వుంటూ పాఠకులకు రసానుభూతిని, అనిర్వచనీయ మానసికానందాన్ని కలిగిస్తాయి. అరబిక్ భాషలో ఒమర్ ఖయ్యాం వ్రాసిన రుబాయియాత్ ల ఇంగ్లీష్ అనువాదం ఆధారంగా హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగారు తెలుగులో అనువదించారు. దువ్వూరి రామిరెడ్డిగారి 'పానశాల' కవితలు అలాటిదే. మహారాజుల సాంగత్యం లభించిన నాళ్ళలో ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఖయ్యాం భావజాలానికి కొంతకాలం దాసుడై ఆ అనుభవాలన్నీ పొందారని అంటారు.
ఇటువంటి వారికి వారసుడు 'పెద్దక్కయ్య' సినిమా లోని ఒక ప్రధాన పాత్రధారి. నిషాకు, ఖుషీకి బానిస. అలాటి నిషాబాబును మన కళ్ళెదట నిలపడానికి ఒమర్ ఖయ్యాంను, ఆయన కవిత్వ ధోరణిని స్ఫూర్తిగా తీసుకున్నారు గీత రచయిత దాశరధి, చిత్రదర్శకుడు బి.ఎ.సుబ్బారావు.
ఖయ్యాం గెటప్ లోని కథానాయకుడు సరసనున్న సాకీ నృత్యగానాలకు దాసుడై మైమరచిపోయే సన్నివేశాన్ని పద్యాల రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో ఘంటసాలగారు పాడిన నిషా పాటలెన్నో రసజ్ఞులను అలరించాయి. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల మాస్టారి ప్రతిభ ఈ గీతాలలో మరోసారి నిరూపించబడింది. ఘంటసాలగారు పార్శీ, అరబిక్ సంగీత బాణీ ఛాయలతో ఈ పద్యాలను స్వరపర్చారు. కేదార్, మాల్ఖౌంస్, హేమంత్ వంటి రాగాలను ఎంచుకున్నారు. పద్యానికి పద్యానికి మధ్య యూనివాక్స్, స్పానిష్ గిటార్, తబలా, సితార్, హార్ప్, గజ్జెలు వంటి వాద్యాలతో రూపొందించిన అరబిక్ స్టైల్ బిజిఎమ్స్ చాలా రక్తికట్టాయి. ఏ రకమైన గీతమైనా తనలో పూర్తిగా జీర్ణింపజేసుకొని, పరిపూర్ణంగా అనుభవించి గానం చేయడం వలన ఎన్నో ఎఫెక్ట్స్ ఘంటసాలవారి గాత్రం నుండి అలవోకగా వెలువడుతాయి.
ఈ పద్యాల అనంతరం మాస్టారు, పి.సుశీల ఆలపించిన నృత్యగీతం అన్ని వర్గాలవారిని మత్తెక్కించడం ఖాయం. తెరమీద హరనాధ్, జ్యోతిలక్ష్మి తమ పాత్రలలో సంపూర్ణంగా జీవించారు. పెద్దక్కయ్య సినిమా Low budget చిత్రం కావడం వలనకానీ, ఇదే సన్నివేశాన్ని మరింత పెద్ద సెట్లమీద, రంగులలో తీసివుంటే ఈ పద్యాలకు మరింత రాణింపు వచ్చివుండేది.
1967లో ఘంటసాలగారు సంగీత దర్శకత్వం వహించినవి ఆరు సినిమాలు రిలీజయ్యాయి. అందులో మూడు సినిమాలు సంవత్సరాంతంలో ఒకే నెలలో విడుదలయ్యాయి. ఆ మూడింట్లో ఒకటి 'పెద్దక్కయ్య'. టైటిల్ రోల్ లో కృష్ణకుమారి నటించగా మిగిలిన ప్రధాన పాత్రలను గుమ్మడి, హరనాధ్, చంద్రమోహన్, జి.వరలక్ష్మి, రమణారెడ్డి పోషించారు.
ఘంటసాల మాస్టారి సంగీతబలం మీద జనాదరణ పొంది విజయవంతమైన కుటుంబగాధా చిత్రం 'పెద్దక్కయ్య'. దాశరధి, సినారె, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు వ్రాసిన తొమ్మిది పాటలు, పద్యాలను ఘంటసాల, పి.సుశీల, పి,బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు ఆలపించారు.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment