రచన : వెంపటి సదాశివబ్రహ్మం
పల్లవి : దీని భావము నీకే తెలియునురా
ఆనందకృష్ణ దీని మర్మము నీకే
తెలియునురా
తనువు కానిదేది తానైనదేది
తనలోనే తానైన తన రూపమేది
జగమంత అణువేది అణువంత మహిమేది
ఆదిలో కలదేది ఆద్యంతమేదీ
!!దీని భావము!!
మూడు తీవల మీద మొనసి మీటగ
ఒక్క మొగిరేకు కోలాహలమ్మేదీ
ఏడు వన్నెల పంజరమ్మేదీ
పంజరానా చిక్కి
పట్టశక్యంగాని
పంచవన్నెల రామచిలుకేది
!!దీని భావము!!
చీకటుల కావలీ చిక్కనీ
వెలుగేది
వెలుగుకూ మూలమౌ తళుకేదీ
తళకులో దాగిన మిడిమేల
మదియేది
ఏది తెలియని వాని కెదురయేదేదీ
!!దీని భావము!!
ఈ జన్మ సరిపోదు గురుడా
ఇంకొక జన్మమెత్తకా తప్పదుర నరుడ
ఆరు నదులాపైన ఆంబ యుందన్నా
అంబతో దుర్గాంబ ఆట్లాడునన్నా
ఆట్లాటలో మంచి అర్ధముందన్నా
అర్ధమెరిగినవాడు
హరిగురుడోరన్నా
!!ఈ జన్మ!!
మూడారు వాకిళ్ళు మూసివెయ్యాలి
ముక్తి వాకిట నిలిచి తలుపు
తియ్యాలి
తలుపు తీస్తె అంబ
తేజమిస్తుంది
తేజమందినవాడే తా గురుడోరన్నా
!!ఈ జన్మ!!
సాధించి నా మాట సత్యామయా
గురుడ సత్యామయా
దేవి చెప్పిన మాట నిత్యామయా
గురుడ నిత్యామయా
సత్యము నిత్యము జౌలిగా
పెనవేసి
సాధించినది మనకు గత్యంతరం అదే ముక్త్యంతరం
జన్మలలోకెల్లా మానవజన్మ సర్వోత్కృష్టమైనదని, జీవించినంతకాలం సర్వార్ధసాధకంగా ఆదర్శప్రాయంగా జీవించి అంత్యదశలో భగవద్దర్శనం పొంది, మరుజన్మ లేకుండా మోక్షం సిధ్ధింపజేసుకోవాలని ప్రాచీన సనాతన ధర్మపరాయణులంతా తపోదీక్ష వహించి సదా భగవధ్యానంలో గడిపేవారు. యంత్ర, తంత్ర, మంత్ర తపోశక్తితో అష్టసిధ్ధులను పొంది తాము కోరుకున్న లక్ష్యాన్ని సాధించేవారు. ఈ శక్తులు, సిధ్ధులు సాధించుకోవడం సామాన్యులందరివల్ల జరిగే కార్యం కాదు. అందుకోసం అర్హుడైన గురువును కనిపెట్టి తన శుశ్రూష, సేవలతో మెప్పించి ఆయన వద్ద నుండి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలని శిష్యులెందరో తపించేవారు. అయితే గురువులంతా ఉత్తములు కారు, సత్చింతనాపరులుకారు. తన తపో శక్తియుక్తులన్నీ తనకు మాత్రమే సొంతమని, లోకరక్షకి అయిన జగదంబ కరుణాకటాక్షాలు సదా తనకు మాత్రమే స్వంతమవాలని ఆశించే దురాశపరులు, స్వార్ధపరులూ వుంటారు. అలాటి ఓ కుత్సిత గురువుకు శిష్యుడిగా సంవత్సరాల తరబడి అహర్నిశలు సేవలు చేసినా గురువు ద్వారా అంబ కరుణాకటాక్షాలు లభించక చిత్త చాంచల్యానికిలోనైన ఓ అభాగ్యుడు మతిస్థిమితం లేకుండా వల్లించే తత్త్వాలే నేటి మన సజీవరాగం. తర్వాత ఎప్పుడో ఉత్తముడైన కథానాయకుని ద్వారా దేవి దర్శనం లభించి స్వస్థతతోపాటు తన చిరకాల మనోవాంఛ కూడా నెరవేరుతుంది. వెఱ్ఱిబాగుల వేదాంతి నోట పలికిన ఈ తత్త్వాలను ఘంటసాల మనకు వినిపిస్తారు.
ప్రాముఖ్యత కలిగిన ఒక విభిన్న పాత్రలో రమణారెడ్డి జీవించారు. గతంలో పాత సినిమాల్లో ఘంటసాల తత్త్వాలు కొన్ని మనం విని వున్నా రహస్యం సినిమా లోని తత్త్వాలు వైవిధ్యంతో కూడినవి. నిగూఢమైన వేదాంతార్ధాలతో పాటు వ్యంగ్యం, హాస్యం కూడా మిళితమైవున్న తత్త్వాలు ఇవి. జ్ఞానబోధకమైన ఈ తత్త్వాలు సినీమాలో వివిధ సన్నివేశాలలో నాలుగైదుసార్లు వినిపిస్తాయి. వీటిలో మొదటిదానిని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు, మిగిలినవాటిని వెంపటి సదాశివబ్రహ్మంగారు వ్రాసారు.
మతిభ్రమలో వున్న ఒక వెఱ్ఱిబాగుల సాధువు నోట వచ్చిన తత్త్వాలే అయినా వీటిలో అనంతమైన అర్ధం వుంది. యోగా, కుండలిని, యంత్ర, మంత్ర శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. 'తనువు కానిదేది తానైనదేది'; ఆదిలో కలదేది ఆద్యంతమేదీ'; 'మూడు తీవలు ఒక్క మొగిరేకు'; 'ఏడు వన్నెల పంజరము';'పట్టశక్యంగాని రామచిలుక';' చీకటుల కావలి చిక్కని వెలుగు'; అని రామకృష్ణ శాస్త్రిగారు శెలవిస్తే; వీటన్నిటి గురించి అర్ధంచేసుకోవడానికి ఈ జన్మ సరిపోదంటారు సదాశివబ్రహ్మం గారు. 'ఆరు నదులపైన అంబ';''మూడారు వాకిళ్ళు';సత్యమం నిత్యము జౌలిగా పెనవేసి' వంటి పదాలకు గల నిగూఢార్ధాలు అర్ధం కావడానికి ఎంతో కొంత మంత్ర తంత్ర శాస్త్ర పరిచయం కావాలి. వీటిపట్ల ఏ కొద్దిపాటి అవగాహన, విషయ పరిజ్ఞానము లేని నాబోటివాళ్ళు ఈ మహాకవుల సాహిత్యం గురించి విశ్లేషించేంతటి సాహసం నేను చేను. సరళమైన తెనుగు భాషలో సుస్పష్టంగా ఉన్న ఈ తత్త్వాలలోని భావం అర్ధమవడమనేది వినేవారికి గల జ్ఞానం మీద, మనోధర్మం మీద ఆధారపడివుంటుంది. తెర వెనుక గాయక సంగీత దర్శకుడు ఘంటసాల, తెరమీద ఆనందకృష్ణ పాత్రధారి రమణారెడ్డి పరస్పరం పరకాయప్రవేశం చేసి ఆ పాత్రను, ఆ తత్త్వాలను సజీవం చేసారు.
సందర్భోచితమైన సంగీత వాద్యాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. ఈ తత్త్వగీతాల కోసమై ఫ్లూట్, తబలా, ఏక్ తారా, డోల్కి, పంబ, మువ్వలు వంటి జానపద వాద్యాలను ఉపయోగించారు. పాత్ర స్వభావాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని దానికి కావలసిన భావప్రకటనతో, నుడికారంతో ఘంటసాల ఈ గీతాలకు ప్రాణప్రతిష్ట చేసారు.
ఘంటసాల మాస్టారు మొదటి గీతాన్ని సావేరీ రాగంలో , రెండు మూడు గీతాలను ఆరభి రాగంలోనూ స్వరపర్చారు. సావేరీ ఔఢవ-సంపూర్ణరాగం. 15వ మేళకర్త మాయామాళవగౌళకి జన్యం. కరుణరసపూరిత భావప్రకటనకు అనువైన రాగంగా చెపుతారు.
రెండవ తత్త్వానికి ఉపయోగించిన ఆరభి రాగం కూడా ఔఢవ-సంపూర్ణరాగమే. అంటే అరోహణలో ఐదు స్వరాలు, ఆవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. ఇది 29వ మేళకర్త శంకరాభరణానికి జన్యరాగం. అత్యంత ప్రాచీనరాగమైన కర్ణాటక దేవగాంధారి రాగాన్ని కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు అభేరి రాగంగా పేరు మార్చారు. అదే నేడు ప్రచారంలో వుంది. అభేరీ రాగానికి సమానమైన హిందుస్థానీ రాగం భీంప్లాస్. ఘంటసాల సంగీత ప్రస్థానంలో చోటుచేసుకున్న అనేక అంశాలలో ప్రముఖమైనవి భగవద్గీత, లవకుశ, రహస్యం సినీమాల సంగీత దర్శకత్వం, వాటిలోని గీతాల గానం. రహస్యం చిత్రంలోని గిరిజాకళ్యాణ కూచిపూడి యక్షగానం; త్రిదేవీ స్తోత్రం, ఇతర యుగళ గీతాలు ఘంటసాలవారి సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి. రహస్యం సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన ఎస్.వి.రంగారావుకు తప్ప అక్కినేని, కాంతారావు, గుమ్మడి, హరనాధ్, రమణారెడ్డిలందరికీ ఘంటసాలగారే గాత్రదానం చేసారు. మిగిలిన పాటలు పద్యాలను మాధవపెద్ది, మల్లిక్, లీల, సుశీల, కోమల, వైదేహి, వసంత మొదలగువారు పాడారు.
ఈ సినిమాలో మొత్తం 34 పాటలు, పద్యాలకు ఘంటసాల అమర్చిన
సంగీతం అజరామరం. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత
విద్వాంసుడు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యంపిళ్ళైగారు ఈ సినీమాకు ఘంటసాల
సమకూర్చిన సంప్రదాయ సంగీతాన్ని విని
ముగ్ధుడై ఎంతో ప్రశంసించారు. రహస్యం చిత్ర
సంగీతం ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక అమూల్య రత్నం గా ఎన్నటికీ భాసిల్లుతుంది.
బహుభాషా ప్రవీణుడు, జానతెనుగు కవి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి శిష్యుడనని ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు, శ్రీ వెంకట ఆనందకృష్ణ రంగారావు సగర్వంగా చెప్పుకుంటారు. రహస్యంలో మల్లాదివారు వ్రాసిన మొదటి తత్త్వగీతంలో తన పేరు (ఆనందకృష్ణ) కూడా ఉటంకించబడడం విఎకె రంగారావుగారికి సదా ఆనందం కలిగించే విషయం.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment