Saturday, 15 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 73వ భాగం - రారా కృష్ణయ్యా! రా రా కృష్ణయ్యా!

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైరెండవ భాగం ఇక్కడ

73వ సజీవరాగం -  రారా కృష్ణయ్యా!  రా రా కృష్ణయ్యా! 
చిత్రం - రాము
గానం - ఘంటసాల
రచన - దాశరధి
సంగీతం - ఆర్.గోవర్ధనం

సాకీ :

     దీనులను కాపాడుటకు దేవుడే

     ఉన్నాడు

     దేవుని నమ్మినవాడు ఎన్నడూ

     చెడిపోడు

     ఆకలికి అన్నము,వేదనకు ఔషధం

     పరమాత్ముని సన్నిధికి రావే ఓ

     మనసా !

పల్లవి :

రారా క్రిష్ణయ్యా.. రారా క్రిష్ణయ్యా

దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా -2

 

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా

ఎదురుచూచు కన్నులలో

కదిలేనయ్యా ! మా పాలిటి!

 

పేదల మొరలాలించే విభుడవు నీవే

కోరిన వరములనొసగే వరదుడవీవే

!పేదల !

అజ్జానపు చీకటికి దీపము నీవే

అన్యాయము నెదిరించే ధర్మము నీవే

నీవే కృష్ణా,నీవే కృష్ణా,నీవే కృష్ణా

!రారా క్రిష్ణయ్యా!

 

కుంటివాని నడిపించే బృందావనం

గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం

! కుంటివాని!

మూఢునికి జ్ఞానమొసగు బృందావనం

మూగవాని పలికించే బృందావనం

!మూఢునికి!

అందరినీ ఆదరించు సన్నిధానం

అభయమిచ్చి దీవించే సన్నిధానం

! అందరినీ!

సన్నిధానం దేవుని సన్నిధానం

సన్నిధానం ! 

                            ! రారా కృష్ణయ్యా! 

కృష్ణా...కృష్ణా...కృష్ణా...కృష్ణా..

 కరుణించే చూపులతో కాంచవయ్యా

శరణొసగే కరములతో కావవయ్యా

! కరుణించే!

మూగవాని పలికించి బ్రోవవయ్యా

కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా

!మూగవాని!

నిన్ను చూసి బాధలన్ని మరచేనయ్యా

ఆధారము నీవేరా రారా కృష్ణా

!నిన్ను చూసి!

కృష్ణా... కృష్ణా... రారా....కృష్ణా

                            ! రారా కృష్ణయ్యా! 

'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' - జీవితంలో పడరాని కష్టాలన్నీ పడి మానవప్రయత్నంగా చేసే కార్యాలేవీ ఫలించకపోగా అవి వికటించినప్పుడు మనిషి విరక్తి చెంది దైవం మీద విశ్వాసం కోల్పోతాడు. దేవుడనేవాడున్నాడ,ఉంటే కళ్ళుమూసుకుని ఒక మూలన శిలయైకూచున్నాడా?తనను మాత్రం ఎందుకు కరుణించడంలేదని దేవుని నిందించడం,సర్వేశ్వరుని ఉనికినే శంకించడం మొదలెడుతాడు. భగవంతుడు తన సృష్టిలోని జీవులను పరీక్షిస్తాడేతప్ప ఎన్నటికి శిక్షించడు. ఏదో మార్గాంతరం చూపిస్తాడు. సుదూరంగా ఎక్కడినుండో హరినామ సంకీర్తనం చెవులబడుతుంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. శరణాగతి తప్ప తనకు వేరే మార్గంలేదని తెలుసుకొని దేవుడుండేచోటికి చేరుకొని తనను కాపాడమని వేడుకుంటాడు. మనిషి సదా సత్చించనతో సన్మార్గంలో పయనించడానికి మన పూర్వీకులు నవవిధ భక్తి మార్గాలను సూచించారు. అవి - శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏ ఒక్కదానినైనా మనస్ఫూర్తిగా, భక్తిశ్రధ్ధలతో పాటిస్తే ఆ మనిషి జీవితం సుఖమయమై ఆనందప్రదమవుతుంది.

ఘంటసాలవారి ఈనాటి సజీవరాగం నవవిధ భక్తిమార్గాలలో ఒకటైన 'కీర్తనం' ఆధారంగా రూపొందించబడింది. 'రారా క్రిష్ణయ్యా,రారా క్రిష్ణయ్యా దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా' అని 'రాము' చిత్రంకోసం ఘంటసాలవారు ఆలపించిన కృష్ణ నామసంకీర్తనం గత ఐదున్నర దశాబ్దాలకు పైగా తెలుగునాట బహుళప్రచారం పొందింది. సన్నివేశ ప్రాధాన్యత కలిగిన ఈ గీతం చిత్తూరు వి.నాగయ్య, ఎన్.టి రామారావు వంటి అగ్రనటుల నటవైదుష్యానికి ప్రతీకగా నిల్చింది.  ఈ పాటలో ఈ ఇద్దరు ప్రముఖులకు ఘంటసాలగారే గాత్రదానం చేశారు. ఈ పాట మూడొంతుల భాగం నాగయ్యగారు పాడగా, ఆఖరి చరణం ఎన్.టి.రామారావుగారిమీద సాగుతుంది. పాట చివరలో ఇద్దరు కలసి పాడుతారు.

ప్రముఖ గేయరచయిత దాశరధి గారు వ్రాసిన ఈ గీతానికి ఆర్.గోవర్ధనం సంగీతం సమకూర్చారు. ఈ పాట హిందుస్థానీ రాగమైన 'యమన్' లో  స్వరపర్చబడింది. కర్ణాటక సంగీతంలో 'యమన్' కు సమానమైన రాగం 'కళ్యాణి'. 65 వ మేళకర్త రాగం. సంపూర్ణరాగం. దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారు. ఈ కళ్యాణి/యమన్ రాగాలు ఘంటసాలగారి పేటెంట్ అని సంగీతాభిమానులంతా కొనియాడడం అందరికీ తెలిసినదే. ఈ రెండు రాగాలలో ఘంటసాల మాస్టారు ఆలపించి బహుళ జనాదరణ పొందిన అసంఖ్యాకమైన గీతాలు ఈనాటికి లలితసంగీత గాయకులందరినోట వినవస్తూనేవున్నాయి.

మంగళప్రదమైన యమన్ లో భావోద్వేగం, విషాదం మిళితమైవున్న 'రారా క్రిష్ణయ్యా' పాటను స్వరపర్చి మెప్పించడం  ఎమ్మెస్వి వంటి ప్రతిభాశాలికి మాత్రమే సాధ్యం. ఎన్,టి.ఆర్, నాగయ్యగార్ల గాత్ర ధర్మాన్ని కాచి వడబోసిన ఘంటసాలగారు ఈ పాటలో ఎంతో వైవిధ్యాన్ని కనపర్చారు.

ఈ పాటలోని ఘంటసాలగారి గాన వైదుష్యం తలచుకునేముందు  'రాము' సినీమా నేపథ్యం గురించి కొంత తెలుసుకోవాలి.

1958లో 'ది ప్రౌడ్ రెబెల్' అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆధారంగా 1964లో కిశోర్ కుమార్ అన్నీ తానే అయి 'దూర్ గగన్ కి చాహోఁ' అనే సినిమా ను తీశారు. మంచి సినిమాగా పేరు పొందినా ఆర్ధికంగా ఘోరపరాజయం పొందింది.

కమలహాసన్, రోజారమణి, కుట్టిపద్మిని వంటి బాలనటులను చిత్రసీమకు పరిచయం చేసి బాలల ప్రాధాన్యత కలిగిన సినీమాలెన్నో తీసిన   ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారికి ఈ కథ తెగ నచ్చి, ఆ హిందీ సినిమా కథతో 1966లో 'రాము' పేరిట తమిళంలో నిర్మించారు. రాజ్ కుమార్ (అసలు పేరు యోగీంద్రకుమార్) అనే బాలనటునికి అవకాశమిచ్చారు.(ఇతని తండ్రి హనుమంతాచారిగారు కూడా మంచి గాయకుడు, కన్నడ చిత్రాలలో హాస్యనటుడు. ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో రెగ్యులర్ గా యూనివాక్స్ అనే వాద్యాన్ని వాయించేవారు. ఘంటసాలవారి బృందంతో పాటు ఈయన కూడా విదేశాలలో పర్యటించారు).

జెమినీ గణేశన్, కె.ఆ. విజయ, పుష్పలత, నాగయ్య, రంగారావు మొదలగువారు ప్రధాన తారాగణంగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీత దర్శకత్వం వహించి అజరామరమైన గీతాలతో చిత్రవిజయానికి ముఖ్యకారకులయ్యారు.

ఈ సినిమాను మరల ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారే  1968 తెలుగులో ''రాము' గా ఎన్.టి.ఆర్, జమున, పుష్పలత, నాగయ్య, ఎస్.వి.రంగారావు, రేలంగి, రాజనాల మొదలగువారితో నిర్మించారు. తమిళంలో నటించి రాష్ట్రపతి అవార్డు పొందిన ఆ బాలనటుడే (రాజ్ కుమార్) లుగులో కూడా నటించేడు. ఎమ్.ఎస్.విశ్వనాధన్ కు సహాయకుడైన ఆర్.గోవర్ధనంకు తెలుగు రాము సంగీత దర్శకుడిగా బాధ్యత లు అప్పగించారు. పాటలన్నీ యథాతథంగా తమిళ వరసలనే తెలుగులో కూడా ఉపయోగించారు. తమిళంలో పి.బి.శ్రీనివాస్, శీర్కాళి గోవిందరాజన్, టి.ఎమ్.సౌందరరాజన్ పాడిన పాటలన్నీ తెలుగులో ఘంటసాలగారు పాడారు. తమిళ, తెలుగు భాషలలో ఘనవిజయం పొందిన 'రాము' 1975 లో మలయాళంలో కూడా తీయబడింది.

'రాము' చిత్రంలో ఘంటసాలగారు గారు పాడిన మరో మంచి పాట 'మంటలు రేపే నెలరాజా'. భాగేశ్వరి రాగంలో చేయబడిన ఈ పాటను తమిళంలో పి.బి.శ్రీనివాస్ పాడారు. ఈ పాటవిని  ఘంటసాల మాస్టారు పి.బి.ఎస్,ను ఎంతో మెచ్చుకున్నారు.

యమన్ రాగంలో చేయబడిన నేటి సజీవరాగం ' రారా క్రిష్ణయ్యా'  పాట తమిళం  వెర్షన్ లో నాగయ్యగారికి శీర్కాళి గోవిందరాజన్, జెమినీ గణేశన్ కు టిఎమ్ సౌందరరాజన్ పాడారు. ఘంటసాలకు ఘంటసాలే సాటి అని భావించిన ఎ.వి.ఎమ్.వారు తెలుగులో  నాగయ్య, ఎన్.టి.ఆర్ లు నటించిన రెండు పాత్రలకు ఘంటసాలగారి చేతే పాడించారు. మాస్టారు కూడా ఈ పాటను ఎంతో వైవిధ్యంతో పాడి పాటకు జీవంపోసారు. 

ఈ పాట కోసం సితార్, వైయొలిన్స్, సెల్లొ, ఫ్లూట్, వైబ్రోఫోన్, తబలా, కోల్, బెల్స్, కబాష్, వంటి వాద్యాలను ఉపయోగించారు. నాగయ్యగారి పోర్షన్ ను ఒక ట్రాక్ మీద, ఎన్టీఆర్ గారి పోర్షన్ ను వేరే ట్రాక్ మీద ఒకే కాల్షీట్ లో ఘంటసాలగారి చేత పాడించి ఫైనల్ గా రెంటిని ఒకే ట్రాక్ మీద మిక్స్ చేసి ఇద్దరు వేర్వేరు గాయకులు ఒకేసారి పాడిన ఎఫెక్ట్ ను రాబట్టినట్లు ఎ.వి.ఎమ్. సౌండ్ ఇంజనీర్ జె.జె.మాణిక్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఘంటసాల గాత్రానికి రాణింపునిస్తూ తెరమీద నాగయ్యగారు, రామారావుగారు, మాస్టర్ రాజ్ కుమార్ లు అద్భుతంగా నటించారు.

ఘంటసాలవారి సినీ సంగీత ప్రస్థానంలో ఆసక్తిగొలిపే ఇలాటి సజీవరాగాలు అసంఖ్యాకం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్

ఘంటసాలవారికి గురుతుల్యులు, ప్రీతిపాత్రులు, బహుభాషా నటులు, నిర్మాత, దర్శకులు  విశేషానుభవశాలి అయిన చిత్తూరు వి.నాగయ్యగారికి వారి 121వ జయంతి  సందర్భంగా, ఈ సజీవరాగాన్ని సవినయంగా సమర్పిస్తున్నాము.

Saturday, 8 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 72వ భాగం - చెలియ కురుల నీడ కలదు రవ్వల మేడ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయొకటవ భాగం ఇక్కడ

72వ సజీవరాగం -  చెలియ కురుల నీడ కలదు రవ్వల మేడ
చిత్రం - పెద్దక్కయ్య
గానం - ఘంటసాల
రచన - దాశరధి
సంగీతం - ఘంటసాల

పల్లవి :

చెలియ కురుల నీడ

కలదు రవ్వల మేడ

చెలియ కనులలోన కలదు వలపు

చెలియ పెదవులందు కలదోయి

అమృతము చెలియలేని బ్రతుకు వలదు వలదు

మేరే మెహబూబ్! ఇదర్ ఆవో....

మధువుపెదవిదాటి మైమరపించు

వధువు పెదవితాకి పరవశించు

మధువు వధువు కలిగి

మనజాలినప్పుడు

స్వర్గసుఖము గోరు చవట ఎవరు

మేరే బుల్ బుల్ !సునోతో...

నిన్న గడచిపోయె -

ఎన్నడు మరిరాదు

రేపు కొరకు ఎదురుచూపు వలదు

నేడు జా‌రవిడుచువాడు -

దౌర్భాగ్యుడు - వట్టి దౌర్భాగ్యుడు

అనుభవించు సుఖములన్ని నేడే

అనుభవించు

గతం-భవితవ్యం-వర్తమానం నిన్న-రేపు-నేడు గతం తి‌రిగిరాదు. భవిష్యత్ నీ చేతిలో లేదు. రేపనేది ఎలావుంటుందో నువ్వు ఊహించలేవు, నిర్ణయించలేవు. వర్తమానం ఒక్కటే ప్రస్తుతానికి నిత్యము,సత్యము. ఉన్న నాలుగు గడియల కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఇది వేదాంతులు చెప్పే మాట. సద్వినియోగం చేసుకోవడమనేది మనిషి మనిషికి మారుతుంది. ఎవరి మనోధర్మాన్నిబట్టి వారు ఆలోచిస్తారు. సత్కార్యాలతో, సత్చించనతో మరుజన్మ లేకుండా జీవించి స్వర్గప్రాప్తి పొందాలని కొందరు ఆశిస్తే, ఆ స్వర్గంలో సంప్రాప్తించే సుఖభోగాలన్నీ ఇప్పుడే ఈ భూమీమీదే తనివితీరా అనుభవించడమే బుధ్ధిమంతుల లక్షణం. ఎదురుచూపులతో ఉన్నదానిని వదులుకోవడం వట్టి దౌర్భాగ్యం అంటారు మరికొందరు.

మధువు, మదవతి - ఈ రెండు చెంతనుంటే చాలు వేరే ప్రపంచంతో పనేలేదనే ఓ ప్రేమ పిపాసి వేదాంతసారమే నేటి మన సజీవరాగం.

గతవారం వేదాంత సారానికి ఈ వారం వేదాంత సారానికి మూలం ఒక్కటే. బ్రహ్మానందాన్ని పొందడం. లక్ష్యం ఒక్కటే. కానీ ఎంచుకున్న మార్గాలు వేరు. ఏది రాజబాట, ఏది ముళ్ళదారి అనేది వారివారి అనుభవాల ద్వారా తెలుసుకుంటారు. ఈనాటి మన కధానాయకుడు మధువుకు, మగువకు బానిస. ఒమర్ ఖయ్యాం తత్త్వాలకు వారసుడు.

ఒమర్ ఖయ్యాం 11 వ శతాబ్ది పార్శీ కవి. గొప్ప గణితశాస్త్ర, ఖగోళశాస్త్రవేత్త. అంతకుమించిన గొప్ప వేదాంతి. ఒమర్ ఖయ్యాం వ్రాసిన  అనేకములైన పద్య కవితలు రుబాయియాత్ లు గా లోకప్రసిధ్ధి పొందాయి. నాలుగు నాలుగు వాక్యాలుండే ఈ పద్య కవితలు యతిప్రాసలతో చందోబధ్ధంగా వుంటూ పాఠకులకు రసానుభూతిని, అనిర్వచనీయ మానసికానందాన్ని కలిగిస్తాయి. అరబిక్  భాషలో ఒమర్ ఖయ్యాం వ్రాసిన రుబాయియాత్ ల ఇంగ్లీష్ అనువాదం ఆధారంగా హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగారు తెలుగులో అనువదించారు. దువ్వూరి రామిరెడ్డిగారి 'పానశాల' కవితలు అలాటిదే. మహారాజుల సాంగత్యం లభించిన నాళ్ళలో ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఖయ్యాం భావజాలానికి కొంతకాలం దాసుడై ఆ అనుభవాలన్నీ పొందారని అంటారు.

ఇటువంటి వారికి వారసుడు 'పెద్దక్కయ్య' సినిమా లోని ఒక ప్రధాన పాత్రధారి. నిషాకు, ఖుషీకి బానిస. అలాటి నిషాబాబును మన కళ్ళెదట నిలపడానికి ఒమర్ ఖయ్యాంను, ఆయన కవిత్వ ధోరణిని స్ఫూర్తిగా తీసుకున్నారు గీత రచయిత దాశరధి, చిత్రదర్శకుడు బి.ఎ.సుబ్బారావు.

ఖయ్యాం గెటప్ లోని కథానాయకుడు సరసనున్న సాకీ నృత్యగానాలకు దాసుడై మైమరచిపోయే సన్నివేశాన్ని పద్యాల రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో ఘంటసాలగారు పాడిన నిషా పాటలెన్నో రసజ్ఞులను అలరించాయి. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల మాస్టారి ప్రతిభ ఈ గీతాలలో మరోసారి నిరూపించబడింది. ఘంటసాలగారు పార్శీ, అరబిక్ సంగీత బాణీ ఛాయలతో ఈ పద్యాలను స్వరపర్చారు. కేదార్, మాల్ఖౌంస్, హేమంత్ వంటి రాగాలను ఎంచుకున్నారు. పద్యానికి పద్యానికి మధ్య యూనివాక్స్, స్పానిష్ గిటార్, తబలా, సితార్, హార్ప్, గజ్జెలు వంటి వాద్యాలతో రూపొందించిన అరబిక్ స్టైల్  బిజిఎమ్స్ చాలా రక్తికట్టాయి. ఏ రకమైన గీతమైనా తనలో పూర్తిగా జీర్ణింపజేసుకొని, పరిపూర్ణంగా అనుభవించి గానం చేయడం వలన ఎన్నో ఎఫెక్ట్స్ ఘంటసాలవారి గాత్రం నుండి అలవోకగా వెలువడుతాయి.

ఈ పద్యాల అనంతరం మాస్టారు, పి.సుశీల ఆలపించిన  నృత్యగీతం అన్ని వర్గాలవారిని మత్తెక్కించడం ఖాయం. తెరమీద హరనాధ్, జ్యోతిలక్ష్మి తమ పాత్రలలో సంపూర్ణంగా జీవించారు. పెద్దక్కయ్య సినిమా Low budget చిత్రం కావడం వలనకానీ, ఇదే సన్నివేశాన్ని మరింత పెద్ద సెట్లమీద, రంగులలో తీసివుంటే ఈ పద్యాలకు మరింత రాణింపు వచ్చివుండేది. 

1967లో ఘంటసాలగారు సంగీత దర్శకత్వం వహించినవి ఆరు సినిమాలు రిలీజయ్యాయి. అందులో మూడు సినిమాలు సంవత్సరాంతంలో ఒకే నెలలో విడుదలయ్యాయి. ఆ మూడింట్లో ఒకటి 'పెద్దక్కయ్య'. టైటిల్ రోల్ లో కృష్ణకుమారి నటించగా మిగిలిన ప్రధాన పాత్రలను గుమ్మడి, హరనాధ్, చంద్రమోహన్, జి.వరలక్ష్మి, రమణారెడ్డి పోషించారు.

ఘంటసాల మాస్టారి సంగీతబలం మీద జనాదరణ పొంది విజయవంతమైన కుటుంబగాధా చిత్రం 'పెద్దక్కయ్య'. దాశరధి, సినారె, శ్రీశ్రీ‌, ఆరుద్ర, కొసరాజు వ్రాసిన తొమ్మిది పాటలు, పద్యాలను ఘంటసాల, పి.సుశీల, పి,బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు ఆలపించారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్

Saturday, 1 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 71వ భాగం - దీని భావము నీకే తెలియునురా - ఈ జన్మ సరిపోదు గురుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయవ భాగం ఇక్కడ

71వ సజీవరాగం -  దీని భావము నీకే తెలియునురా (సావేరి) & ఈ జన్మ సరిపోదు గురుడా (ఆరభి)

చిత్రం - రహస్యం
గానం - ఘంటసాల
రచన - మల్లాది రామకృష్ణశాస్త్రి & సదాశివ బ్రహ్మం
సంగీతం - ఘంటసాల
అభినయం - రమణారెడ్డి

3. " సాధించినామాట సత్యామయా"

రచన : వెంపటి సదాశివబ్రహ్మం

 

 పల్లవి : దీని భావము నీకే తెలియునురా

ఆనందకృష్ణ దీని మర్మము నీకే తెలియునురా

 

తనువు కానిదేది తానైనదేది

తనలోనే తానైన తన రూపమేది

జగమంత అణువేది అణువంత మహిమేది 

ఆదిలో కలదేది ఆద్యంతమేదీ 

                                !!దీని భావము!!

 

మూడు తీవల మీద మొనసి మీటగ

ఒక్క మొగిరేకు కోలాహలమ్మేదీ

ఏడు వన్నెల పంజరమ్మేదీ 

పంజరానా చిక్కి పట్టశక్యంగాని

పంచవన్నెల రామచిలుకేది  

                                !!దీని భావము!!

 

చీకటుల కావలీ చిక్కనీ వెలుగేది

వెలుగుకూ మూలమౌ తళుకేదీ

తళకులో దాగిన మిడిమేల మదియేది

ఏది తెలియని వాని కెదురయేదేదీ 

                                !!దీని భావము!!

 

ఈ జన్మ సరిపోదు గురుడా 

ఇంకొక జన్మమెత్తకా తప్పదుర నరుడ


ఆరు నదులాపైన ఆంబ యుందన్నా

అంబతో దుర్గాంబ ఆట్లాడునన్నా

ఆట్లాటలో మంచి అర్ధముందన్నా

అర్ధమెరిగినవాడు హరిగురుడోరన్నా

                                     !!ఈ జన్మ!!

మూడారు వాకిళ్ళు మూసివెయ్యాలి

ముక్తి వాకిట నిలిచి తలుపు తియ్యాలి

తలుపు తీస్తె అంబ తేజమిస్తుంది

తేజమందినవాడే తా గురుడోరన్నా

                                     !!ఈ జన్మ!!

 

సాధించి నా మాట సత్యామయా గురుడ సత్యామయా

దేవి చెప్పిన మాట నిత్యామయా గురుడ నిత్యామయా

సత్యము నిత్యము జౌలిగా పెనవేసి

సాధించినది మనకు గత్యంతరం అదే ముక్త్యంతరం 

జన్మలలోకెల్లా మానవజన్మ సర్వోత్కృష్టమైనదని, జీవించినంతకాలం సర్వార్ధసాధకంగా ఆదర్శప్రాయంగా జీవించి అంత్యదశలో భగవద్దర్శనం పొంది, మరుజన్మ లేకుండా మోక్షం సిధ్ధింపజేసుకోవాలని ప్రాచీన సనాతన ధర్మపరాయణులంతా తపోదీక్ష వహించి సదా భగవధ్యానంలో గడిపేవారు.  యంత్ర, తంత్ర, మంత్ర తపోశక్తితో అష్టసిధ్ధులను పొంది తాము కోరుకున్న లక్ష్యాన్ని సాధించేవారు. ఈ శక్తులు, సిధ్ధులు సాధించుకోవడం సామాన్యులందరివల్ల జరిగే కార్యం కాదు. అందుకోసం అర్హుడైన గురువును కనిపెట్టి తన శుశ్రూష,  సేవలతో మెప్పించి ఆయన వద్ద నుండి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలని శిష్యులెందరో తపించేవారు. అయితే గురువులంతా ఉత్తములు కారు, సత్చింతనాపరులుకారు. తన తపో శక్తియుక్తులన్నీ తనకు మాత్రమే సొంతమని,  లోకరక్షకి అయిన జగదంబ కరుణాకటాక్షాలు  సదా తనకు మాత్రమే స్వంతమవాలని ఆశించే దురాశపరులు, స్వార్ధపరులూ వుంటారు. అలాటి ఓ కుత్సిత గురువుకు శిష్యుడిగా  సంవత్సరాల తరబడి అహర్నిశలు సేవలు చేసినా  గురువు ద్వారా అంబ కరుణాకటాక్షాలు లభించక చిత్త చాంచల్యానికిలోనైన ఓ అభాగ్యుడు మతిస్థిమితం లేకుండా వల్లించే తత్త్వాలే నేటి మన సజీవరాగం. తర్వాత ఎప్పుడో  ఉత్తముడైన కథానాయకుని ద్వారా దేవి దర్శనం లభించి స్వస్థతతోపాటు తన చిరకాల మనోవాంఛ కూడా నెరవేరుతుంది. వెఱ్ఱిబాగుల వేదాంతి నోట పలికిన ఈ తత్త్వాలను ఘంటసాల మనకు వినిపిస్తారు.

ప్రాముఖ్యత కలిగిన ఒక విభిన్న పాత్రలో రమణారెడ్డి జీవించారు. గతంలో   పాత సినిమాల్లో ఘంటసాల తత్త్వాలు కొన్ని మనం విని వున్నా రహస్యం సినిమా లోని తత్త్వాలు వైవిధ్యంతో కూడినవి. నిగూఢమైన వేదాంతార్ధాలతో పాటు వ్యంగ్యం, హాస్యం కూడా మిళితమైవున్న తత్త్వాలు ఇవి. జ్ఞానబోధకమైన ఈ తత్త్వాలు సినీమాలో వివిధ సన్నివేశాలలో నాలుగైదుసార్లు  వినిపిస్తాయి. వీటిలో మొదటిదానిని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు, మిగిలినవాటిని వెంపటి సదాశివబ్రహ్మంగారు వ్రాసారు.

మతిభ్రమలో వున్న ఒక వెఱ్ఱిబాగుల సాధువు నోట వచ్చిన తత్త్వాలే అయినా వీటిలో అనంతమైన అర్ధం వుంది. యోగా, కుండలిని, యంత్ర, మంత్ర శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. 'తనువు కానిదేది తానైనదేది'; ఆదిలో కలదేది ఆద్యంతమేదీ'; 'మూడు తీవలు ఒక్క మొగిరేకు'; 'ఏడు వన్నెల పంజరము';'పట్టశక్యంగాని రామచిలుక';' చీకటుల కావలి చిక్కని వెలుగు';  అని రామకృష్ణ శాస్త్రిగారు శెలవిస్తే; వీటన్నిటి గురించి అర్ధంచేసుకోవడానికి ఈ జన్మ  సరిపోదంటారు సదాశివబ్రహ్మం గారు. 'ఆరు నదులపైన అంబ';''మూడారు వాకిళ్ళు';సత్యమం నిత్యము జౌలిగా పెనవేసి' వంటి పదాలకు గల నిగూఢార్ధాలు అర్ధం కావడానికి ఎంతో కొంత మంత్ర తంత్ర శాస్త్ర పరిచయం కావాలి. వీటిపట్ల ఏ కొద్దిపాటి అవగాహన, విషయ పరిజ్ఞానము లేని నాబోటివాళ్ళు ఈ మహాకవుల సాహిత్యం గురించి విశ్లేషించేంతటి సాహసం నేను చేను. సరళమైన తెనుగు భాషలో సుస్పష్టంగా ఉన్న ఈ తత్త్వాలలోని భావం అర్ధమవడమనేది వినేవారికి గల జ్ఞానం మీద, మనోధర్మం మీద ఆధారపడివుంటుంది. తెర వెనుక గాయక సంగీత దర్శకుడు ఘంటసాల, తెరమీద ఆనందకృష్ణ పాత్రధారి రమణారెడ్డి  పరస్పరం పరకాయప్రవేశం చేసి ఆ పాత్రను, ఆ తత్త్వాలను సజీవం చేసారు. 

సందర్భోచితమైన సంగీత వాద్యాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. ఈ తత్త్వగీతాల కోసమై ఫ్లూట్, తబలా, ఏక్ తారా, డోల్కి, పంబ,  మువ్వలు వంటి జానపద వాద్యాలను ఉపయోగించారు. పాత్ర స్వభావాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని దానికి కావలసిన భావప్రకటనతో, నుడికారంతో  ఘంటసాల ఈ గీతాలకు ప్రాణప్రతిష్ట చేసారు.

ఘంటసాల మాస్టారు మొదటి గీతాన్ని సావేరీ రాగంలో , రెండు మూడు గీతాలను ఆరభి రాగంలోనూ స్వరపర్చారు. సావేరీ ఔఢవ-సంపూర్ణరాగం. 15వ మేళకర్త మాయామాళవగౌళకి జన్యం. కరుణరసపూరిత భావప్రకటనకు అనువైన రాగంగా చెపుతారు.

రెండవ తత్త్వానికి ఉపయోగించిన ఆరభి రాగం కూడా ఔఢవ-సంపూర్ణరాగమే. అంటే అరోహణలో ఐదు స్వరాలు, ఆవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. ఇది 29వ మేళకర్త  శంకరాభరణానికి జన్యరాగం. అత్యంత ప్రాచీనరాగమైన కర్ణాటక దేవగాంధారి రాగాన్ని  కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన  ముత్తుస్వామి దీక్షితులు అభేరి రాగంగా పేరు మార్చారు. అదే నేడు ప్రచారంలో వుంది. అభేరీ రాగానికి సమానమైన హిందుస్థానీ రాగం భీంప్లాస్. ఘంటసాల  సంగీత ప్రస్థానంలో చోటుచేసుకున్న అనేక అంశాలలో ప్రముఖమైనవి భగవద్గీత, లవకుశ, రహస్యం సినీమాల సంగీత దర్శకత్వం, వాటిలోని గీతాల గానం. రహస్యం చిత్రంలోని గిరిజాకళ్యాణ కూచిపూడి యక్షగానం; త్రిదేవీ స్తోత్రం, ఇతర యుగళ గీతాలు ఘంటసాలవారి సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి. రహస్యం సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన ఎస్.వి.రంగారావుకు తప్ప  అక్కినేని, కాంతారావు, గుమ్మడి, హరనాధ్, రమణారెడ్డిలందరికీ ఘంటసాలగారే గాత్రదానం చేసారు. మిగిలిన పాటలు పద్యాలను మాధవపెద్ది, మల్లిక్,  లీల, సుశీల, కోమల, వైదేహి, వసంత మొదలగువారు పాడారు.

ఈ సినిమాలో మొత్తం 34 పాటలు, పద్యాలకు ఘంటసాల అమర్చిన సంగీతం అజరామరం.  సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యంపిళ్ళైగారు ఈ సినీమాకు ఘంటసాల సమకూర్చిన  సంప్రదాయ సంగీతాన్ని విని ముగ్ధుడై ఎంతో ప్రశంసించారు.  రహస్యం చిత్ర సంగీతం ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక అమూల్య రత్నం గా ఎన్నటికీ భాసిల్లుతుంది.

బహుభాషా ప్రవీణుడు, జానతెనుగు కవి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి శిష్యుడనని ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు, శ్రీ వెంకట ఆనందకృష్ణ రంగారావు సగర్వంగా చెప్పుకుంటారు. రహస్యంలో మల్లాదివారు వ్రాసిన మొదటి తత్త్వగీతంలో తన పేరు (ఆనందకృష్ణ) కూడా ఉటంకించబడడం విఎకె రంగారావుగారికి సదా ఆనందం కలిగించే విషయం.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...