Saturday, 4 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 22 - రాగాలా సరాగాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 22

శాంతినివాసం - రాగాలా సరాగాలా

నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలకు భారతీయ సనాతనధర్మం ఆదర్శప్రాయంమార్గదర్శి. ప్రాచీన సంస్కృత నీతి శాస్త్ర గ్రంధాలలో ఆదర్శ గృహిణి యొక్క ఆరు  లక్షణాలను, ధర్మాలను ఇలా ఈ శ్లోక రూపంలో బోధించారు:

 

"కార్యేషు దాసి కరణేషు మంత్రీ

భోజ్యేషు మాతా శయనేషు రంభా

రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ

షట్ ధర్మయుక్తా కులధర్మపత్నీ"

అంటే ... ఒక ఆదర్శనీయమైన గృహిణి - 

తన దైనందిక ఇంటిపనులను నడుమువంచి పనిమనిషిలా శ్రధ్ధగా చేస్తుంది.  

. భర్త కార్యకలాపాలలో సమస్యలెదురైతే  తన తెలివితేటలు ఉపయోగించి ఒక మంత్రిలా చక్కటి సలహాలు, సన్మార్గాలు సూచిస్తుంది.

. భోజన సమయంలో కుటుంబంలోని వారందరికీ ప్రేమానురాగాలతో ఒక మాతృమూర్తిగా కడుపునిండా తినిపిస్తుంది.

. విశ్రాంతి సమయంలో పడకగదిలో అప్సరసలా అలంకరించుకుని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మహాలక్ష్మీ దేవిలా నిరంతరం కళకళలాడుతూ  అందాలరాశిలా వుంటుంది.

సహనానికి మారుపేరైన భూదేవి యంత సహనాన్ని, ఓర్మిని కలిగివుంటుంది.

ఈ ప్రాచీన సంస్కృత శ్లోకాన్ని తులసీదాసు తన రామాయణ కావ్యం అరణ్యకాండలో  అత్రిమహర్షి సతీమణి అనసూయాదేవి సీతాదేవికి ధర్మపత్ని లక్షణాలను ఉపదేశించే  సందర్భంలో ఉపయోగించుకున్నారని చెపుతారు.

అలాగే, సనాతన నీతిశాస్త్రంలో ఉత్తమ భర్త యొక్క ధర్మాలు, కర్తవ్యాలు, బాధ్యతల వివరణ కూడా ఉంది - 

. భర్త భార్యను తనలో సగభాగంగా ఆమె అవసరాలన్నీ తీరుస్తూ, జీవితాంతం ఆమె పోషణ, రక్షణ బాధ్యతలను వహించాలి

. భార్యను ఎట్టి పరిస్థితులలోనూ శారీరకంగా, మానసికంగా హింసించకూడదు.

. భార్య సముచిత సలహాలను, సూచనలను పాటిస్తూ ఆమె ఆలోచనలను గౌరవించాలి.

. భార్యాభర్తలిద్దరూ ఒకరిపట్ల మరొకరు  పరస్పర నమ్మిక కలిగి అనురాగంతో జీవితాన్ని సాగించాలి.

. భర్త పరకాంతా వ్యామోహంలో పడకుండా శ్రీరాముడివలే ఒక్క భామతోనే తన ప్రేమను పంచుకోవాలి.

పతినే  ప్రత్యక్ష దైవంగాభర్త పాదసేవే మహాయోగంగా భావించే స్త్రీలుభార్య సౌభాగ్యాలన్నీ తన భాగ్యమేనని ధర్మనిరతితో ఆమె యెడల ప్రేమానురాగాలు కలిగివుండి సంసారజీవితాన్ని సుఖమయంగా భూలోకస్వర్గముగా  చేసుకునే భర్తలు పురాణకాలంలోనే కాదు ఈ ఆధునిక యుగంలో కూడా వున్నారు.

నిదర్శనం కావాలా!

1960ల నాటి   ఈ సినిమా పాటే...


భార్య: 

'రాగాలా సరాగాలా 

హాసాలా విలాసాలా 

సాగే సంసారం హాయ్

సుఖ జీవనసారం 

                                !రాగాలా!

 

పతి పదసేవయే యోగముగా

నాతికి పతియే దైవముగా !పతి 2!

భర్త: 

సతి సౌభాగ్యాలే  తన భాగ్యమనే

భావనయే పతి ధర్మముగా -2

                                 !రాగాలా!

భార్య: 

మాయని ప్రేమల కాపురమే

మహిలో వెలసిన స్వర్గముగా -2

భర్త: 

జతబాయని కూరిమి జంటగ

మెలిగే దంపతులే ఇల ధన్యులుగా - 2

ఇద్ధరు : 

రాగాలా సరాగాలా

హాసాలా విలాసాలా 

సాగే  సంసారం హా...య్

సుఖజీవనసారం... హా..య్ సుఖజీవన సా...రం


రాగాలను, సరాగాలను మేళవించి ఘంటసాలగారు స్వరపర్చిన ఈ యుగళగీతమే సదా మదిలో మెదిలే సజీవరాగం.

జీవితాంతం సంసారం సుఖజీవనసారంగా సాగిపోతూంటే చూసేవాళ్ళకి ఏ థ్రిల్లు, ఎక్సైట్మెంట్ వుండదనేది సినిమా సిధ్ధాంతం. అందుకోసం కుటుంబ సభ్యుల మధ్య  ఈర్ష్యాసూయలుభార్యాభర్తల మధ్య అపనమ్మిక, అపార్ధాలు, సంసారం అస్తవ్యస్తం కావడం, కష్టాలు, కన్నీళ్ళు , చివరకు తన తప్పిదాన్ని భర్త తెలుసుకుని భార్యను క్షమాపణలు కోరి ఆ ఇరువురు ఒకటవడంతో సుఖాంతం కావడమనే తెలుగు సినిమా ఫార్ములాను నూటికి నూరుపాళ్ళు విజయవంతంగావినోదాత్మకంగా పండించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను, కాసులను పంటను పుష్కలంగా పొందిన సినిమా 1960ల నాటి 'శాంతినివాసం'.

జనరంజకమైన గీతాలతో చిత్రాన్ని ఆద్యంతం  మూడు డాన్సులు ఆరు పాటలుగా వినోదభరితంగా చూపిస్తూనే సనాతన ధర్మసూత్రాలను కథలో అంతర్లీనంగా ప్రవేశపెట్టి ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించారు కధారచయిత జూనియర్ సముద్రాల, దర్శకుడు సిఎస్ రావు.

ఏదో సామెత కోసం ' మూడు డాన్సులు ఆరు పాటలు ' అని అన్నానే తప్ప శాంతినివాసం సినిమాలో ఎనిమిది పాటలు, ఆరు పద్యాలు వున్నాయి. డ్యూయెట్స్ అన్నీ  ఆటా పాటా మిశ్రమమే. ఇవికాక, పూర్తిగా నృత్యగీతం ఒకటి వుంది.  వీటన్నిటినీ కథ, మాటలు సమకూర్చిన సముద్రాల రామానుజాచార్యులుగారే వ్రాశారు.

అసలు శాంతినివాసం సినిమా టైటిల్ మ్యూజిక్కే ఒక పాట. సద్గురు త్యాగరాజస్వామి సామ రాగంలో రచించిన 'శాంతములేక సౌఖ్యము లేదూ...' అనే కీర్తనను   సినిమా నేపథ్యాన్ని ప్రేక్షకులకు తెలియజేసేలా ఘంటసాలగారు సందర్భోచితంగాసింబాలిక్ గా ఉపయోగించారు. సినీమాలోని మొదటి సీనుకు లీడ్ ను ఇస్తూ  ప్రేక్షకులను భక్తి అనుభూతిలోకి ముందుగానే తీసుకువెళ్ళారు ఘంటసాల.

ఈ సినిమా లో ఐదు పాటలు హిందీ బాణీలను అనుసరించి చెసినవే. పద్యాలు, ఒక మూడు పాటలు (కలనైనా నీ తలపే- పి.లీల, శ్రీరఘురాం జయ రఘురాం - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, రాగాలా సరాగాలా - పి. సుశీల-ఘంటసాల) మాత్రం ఘంటసాలగారి సొంత స్వరరచనలు.

అలాటి ఘంటసాలగారి సొంత స్వరకల్పనలోని  'రాగాలా సరాగాలా...గీతమే నేటి మన సజీవరాగం.

భార్యభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు లేకుండా పరస్పర నమ్మికతో చల్లగా కాపురం చేసుకోవాలని, అలాకాకుండా అసూయాపరులు చెప్పే చెప్పుడుమాటలకు లొంగిపోయి భార్య సౌశీల్యాన్ని అనుమానిస్తే ఆ కుటుంబం ఎంత అతలాకుతలం అవుతుందో చాటిచెప్పే కథ 'శాంతినివాసం' కథాపరంగా ఆ ఇంటి పెద్దకొడుకు, కోడలే నాయికా నాయకులు. వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న ఆ ఇద్దరిమధ్యా సాగే ప్రణయ సరాగరాగాలే నేటి మన సజీవరాగం.

పి.సుశీల, ఘంటసాలగారు ఆలపించిన ఈ సుశ్రావ్య యుగళగీతాన్ని శాంతినివాసపు పెద్దకోడలు, పెద్దకొడుకులైన దేవిక, కాంతారావుల మీద వారి పడకగదిలో ముచ్చటగొలిపే విధంగా చిత్రీకరించారు డైరెక్టర్ సి.ఎస్. రావు.

ఒక చిన్న గిటార్ వ్యాంపింగ్, మేండొలిన్ బిట్ మీద సుశీలగారి హమ్మింగ్ తో  హుషారుగా ప్రారంభమయే ఈ పాట బ్యాక్గ్రౌండ్ లో గిటార్, మేండొలిన్, పియోనా, డబుల్ బేస్, సితార్, ఫ్లూట్, క్లారినెట్, వయొలిన్స్, తబలా, తదితర రిథిమ్స్ ను ఘంటసాల ఉపయోగించారు.

ఈ పాటలో కేదార రాగ స్వరాలు వినిపిస్తాయి. కేదారం 29 వ మేళకర్త ధీరశంకరాభరణానికి జన్యరాగం. కేదార రాగ   ఆరోహణాక్రమంలో వక్ర సంచారంతో ఐదు స్వరాలు ( 'రి, '' స్వరాలు వుండవు) అవరోహణలో  ఆరు స్వరాలు ('' వుండదు) వుండడంవలన ఈ రాగాన్ని  వక్ర ఔఢవ- షాఢవ రాగంగా పరిగణిస్తారు.

ఇలాటి హృద్యమైన రాగంలో సుశీల, ఘంటసాలగార్ల వంటి అసమాన్య గాయకులు ఆలపించిన ఈ పాటలో రాగభావా

నుభూతులకు ఏం కొదవ. శ్రోతలను మైమరపించి ఆనందామృతంలో ఓలలాడించారు. మనకు పరభాషా గీతాల అనుసరణేమాత్రం అవసరం లేదని ఈ పాట ద్వారా నిరూపించారు ఘంటసాల.

శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా& టి అశ్వత్థనారాయణ నిర్మించిన ఈ వినోదాత్మక శాంతినివాసం సినిమాలో అక్కినేని, రాజసులోచన, కాంతారావు, దేవిక, కృష్ణకుమారి, రేలంగి, సూర్యకాంతం, సురభి బాలసరస్వతి, రమణారెడ్డి, నాగయ్య, కె.వి.ఎస్.శర్మ, తదితరులు నటించగా సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు.

అత్యంత విజయవంతమైన ఈ శాంతినివాసం చిత్రానికి మూలం పాలగుమ్మి పద్మరాజుగారి 'శాంతినివాసం' నాటకం. ప్రముఖ హాస్య నటుడు బి.పద్మనాభం నాటక సంస్థ రేఖ & మురళీ ఆర్ట్స్ కోసం ఒక తమిళ నాటకం ఆధారంగా వ్రాసిన నాటకం.

వినోదం, సెంటిమెంట్ రెండూ పుష్కలంగా వున్న శాంతినివాసం సినీమా అనేక చోట్ల శతదినోత్సవాలను జరుపుకుంది. ఈ కథ హిందీలో రెండుసార్లు సినిమాగా వచ్చింది. మొదట 'ఘరానా', తర్వాత, 'ఘర్ ఘర్ కి కహానీ'.

శాంతినివాసంలో వున్న తెలుగేతర బాణీలకు అవసరమైన  తెలుగుదనం అద్ది అసలు కన్నా నకలే మిన్న అనిపించారు ఘంటసాల.


కొసమెరుపు :

మైసూర్ బృందావనం గార్డెన్స్ లో ఔట్ డోర్ షూటింగ్. ఎ.ఎన్నా.ఆర్., రాజసులోచన, కెమేరా, టెక్నికల్ యూనిట్ అందరూ మైసూరు వెళ్ళిపోయారు. ఒక డ్యూయెట్ సాంగ్ పిక్చరైజేషన్ మొదలెట్టారు. అటువంటి ఆఖరి నిముషంలో మరొక పాట కూడా అక్కడే షూట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. అర్జంట్ గా 24 గంటల్లో పాట రికార్డు చేసి టేప్ బృదావన్ గార్డెన్స్ కు పంపమని ఒక హిందీ పాట గ్రామఫోన్ రికార్డుతో సహా ఘంటసాలగారికి కబురుచేశారు. వెంటనే రికార్డింగ్ థియేటర్ బుక్ చేసి సింగర్ కు  ఆర్కెష్ట్రా వారికి ఆఘమేఘాలమీద తెలియజేశారు. ఆ మధ్యాహ్నం లోపల సముద్రాల జూనియర్ గారు రావడం హిందీ పాటకు మాటలు ఇవ్వడంఘంటసాలగారు తగిన చేర్పులు మార్పులు చేసి 2 to 9 కాల్షీటులో ఆ పాటను రికార్డు చేసి రాత్రికి రాత్రే ఆ తెలుగు పాటను మైసూర్ బృందావన్ గార్డెన్స్ కు పంపడంతో ఎట్టి అవాంతరాలు లేకుండా అనుకున్న సమయానికి కొత్త పాట షూటింగ్ కూడా జరిగిపోయింది. శాంతినివాసం లో రెండు  హుషారైన డ్యూయెట్లును బృందావన్ గార్డెన్స్ లో అక్కినేని, రాజసులోచనల మీద చిత్రీకరించారు. ఆఖరి నిముషంలో చేసిన ఆ పాట ఏదో ఇప్పుడు జ్ఞాపకం లేదు.

ఇన్స్టెంట్ కాఫీలా తయారు చేయడం కోసమే నిర్మాతలు ఇలాటి హిందీ/తమిళ సినిమా పాటలను   రెడీగా వుంచుకుంటారేమో! 

వచ్చేవారం, మరల, ఘంటసాలగారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 22 - రాగాలా సరాగాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...