Saturday, 11 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 23 - తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 23

అభిమానం - తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా

భారతీయ సనాతన ధర్మంలో తల్లి స్థానం చాలా  పవిత్రమైనది, మరియు, అద్వితీయమైనది. తల్లి తన సంతానానికి ప్రప్రథమ గురువు కూడా. పసిపిల్లల ఆటాపాటా, నడవడిక, నైతికవిలువలు, సంస్కారం మొదలైనవాటిని అమ్మ ఒడిలోనే  ఆరంభమవుతాయి. తన సంతానం  భవిష్యత్  కోసం నిస్స్వార్ధంగా తన సకలసుఖాలను త్యాగం చేసే ఏకైక వ్యక్తి  తల్లి మాత్రమే. అందుకే  'తైత్తిరీయ ఉపనిషత్తు' లో 'మాతృదేవోభవ పితృదేవోభవ' అని అన్నారు. అంటే జన్మనిచ్చిన  తల్లితండ్రులను దైవంతో సమానంగా భావించి పూజించాలి  అని అర్ధం.

మనము  తల్లిదండ్రులను ఎంత భక్తితో పూజించి ఆరాధిస్తామో  అంత గాఢముగా ప్రకృతి  శక్తులను కూడా  భక్తితో  కొలుస్తాము. ప్రకృతి శక్తులు మన సుఖ జీవనానికి  ఎంతగానో  దోహదపడుతున్నాయి.  దాహాన్ని తీర్చే జలాన్ని  గంగామాతగా,  ఆకలి తీర్చే పంట ధాన్యాలను సమకూర్చే భూమిని భూమాతగా, పాడిపంటలతో మనలను  కాపాడుతున్న పశువులను గోమాతగానూ  భావించి భక్తితో పూజిస్తున్నాము. ఇది అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి.

ఈ ఆధునికయుగంలో విదేశీ నాగరికతా వ్యామోహంతో  సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు మనం దూరంగా జరిగిపోకుండా అప్పుడప్పుడు మన పాత సినీమాలు, అందులోని పాటలు మనకు కర్తవ్యబోధ చేస్తూ సామాజికస్పృహను కలిగిస్తూవచ్చాయి.

శ్రీశ్రీ వంటి గొప్ప విప్లవకవి కూడా మన సనాతన ధర్మాలను గౌరవిస్తూ ఎన్నో మంచి పాటలను  వ్రాశారు.  అమృతతుల్యమైన ఘంటసాలవారి సుస్వరాలను అద్దుకుని శ్రోతలకెంతో  ఆహ్లాదాన్ని కలిగించిన 'తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా...' అనే గీతం ఆ కోవలోకే వస్తుంది.

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ఒక మంచి అమ్మాయి తెల్లవారుజాముననే లేచి  ప్రత్యక్ష దైవమైన తన తల్లిని తలచుకుంటూ ఓ చక్కటి గీతాన్ని అలపిస్తూ తన నిత్యకృత్యాలను ఉత్సాహంగా ఆరంభించింది. ఆ ప్రభాతగీతంలో తల్లితో సమానమైన గోమాత, భూమాత,  తులసిమాతల ఔన్నత్యాన్ని కూడా వర్ణిస్తున్నది. 

తేనెలొలుకు తేట తెలుగు పదాలతో తీయతీయగా  రూపొందిన  శ్రీశ్రీ గారి ఈ మధురగీతమే  నేటి  మన ఘంటసాల సజీవరాగం.

1960 లో వచ్చిన 'అభిమానం' సినిమా లోని ఈ హృద్యమైన గీతాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు రచించగా ఘంటసాల స్వరపర్చి శ్రీమతి జిక్కిగారిచేత అద్భుతంగా పాడించారు. చిత్రకథనం ప్రకారం ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఇంటి ఆడపడుచు, రెండవ కధానాయికయైన  కృష్ణకుమారి ఈ పాటను ముగ్ధమనోహరంగా అభినయించి 'అభిమానం' సినిమాకు శుభారంభం చేశారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను గోరఖ్ కళ్యాణ్ రాగ స్వరాలతో చేసినట్లు అనిపిస్తోంది. గోరఖ్ కళ్యాణ్ ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రాగం. ఖమాస్ థాట్ కు చెందిన ఔడవ రాగం. ఇందులో ఐదు స్వరాలు మాత్రమే వినిపిస్తాయి. గాంధార, పంచమ స్వరాలు రెండూ ఈ రాగంలో వుండవు. మృదువైన భావనలను వెలిబుచ్చడానికి అనువైనరాగం. ఈ రాగం పేరులో కళ్యాణ్ ఉన్నా కళ్యాణి రాగ లక్షణాలేవీ ఈ రాగానికి లేవనే తెలుస్తున్నది. మాస్టారు ఈ పాటకోసం సితార్, మేండొలిన్, ఫ్లూట్, క్లారినెట్,  వయొలిన్స్, డబుల్ బేస్, పియోనా, తబలా, డోలక్, కబాష్ వంటి వాద్యాలను ఉపయోగించారు. పి.జి.కృష్ణవేణి (జిక్కి) ఈ పాటను తనదైన బాణీలో చక్కగా పాడారు.  ఒకానొక కాలంలో జిక్కి, లీల, సుశీల మధ్య గట్టి పోటీయే వుండేది.

ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన అభిమానం సినిమాలో ఈ పాటే కాకుండా మరో తొమ్మిది మంచి పాటలు,  రెండు పద్యాలు వున్నాయి. డైరెక్టర్ సి.ఎస్.రావుకు పద్యాలంటే మోజు, అభిమానం. సాంఘిక సినిమాలలో ఎక్కువగా పద్యాలను ఉపయోగించిన దర్శకుడు సి.ఎస్.రావు. ఈ సినిమాలోని పాటలను జూనియర్ సముద్రాల, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజుగార్లు వ్రాయగా వాటిని ఘంటసాలపి.సుశీల, జిక్కి, ఎ.పి.కోమల, ఎస్.వరలక్ష్మి,  మాధవపెద్ది, జె.వి.రాఘవులు పాడారు.

అభిమానం సినిమా కూడా సుందర్ లాల్ నహతాగారిదైనా హిందీ/తమిళ గీతాలకు ఎక్కువ చోటివ్వలేదు. 'ఓహో బస్తీ దొరసానీ' (హిందీ వరస) పాట తప్ప మిగిలిన పాటలన్నింటిలో ఘంటసాల ముద్రే కనపడుతుంది.

'అభిమానం' ఒక కుటుంబ గాధా చిత్రం. పేదరికమే నేపథేయంగా గల ఒక యువకుడు అందముఆస్తి ఐశ్వర్యము గల ఓ గొప్పింటి అమ్మాయి పరస్పరం ప్రేమించి పెళ్ళిచేసుకున్నా పేదా గొప్ప ఆంతర్యాలవల్ల  భార్యాభర్తల మధ్యా, అత్తా, ఆడపడుచు, కోడళ్ళ మధ్య అనుక్షణం ఏర్పడే భేదాభిప్రాయాల చిచ్చుతో ఆ కుటుంబం ఎలా ఛిన్నాభిన్నమవుతుందో, ఎవరికి వారే ఎంత మంచివాళ్ళైనా ఎన్ని కష్టాలు, నష్టాలు కలుగుతాయో ఈ సినిమా చూపిస్తుంది.

అక్కినేని, సావిత్రి, కన్నాంబ, కృష్ణకుమారి, చలం, కె.వి.ఎస్.శర్మ, రేలంగి, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, అల్లు రామలింగయ్య, తదితరులు నటించిన 'అభిమానం' సినిమా ను శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుందర్ లాల్ నహతా, టి.అశ్వత్థనారాయణ నిర్మించారు.

 

కొసమెరుపు:-

మా నాన్నగారు పట్రాయని సంగీతరావుగారు ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో 1952 నుండీ పనిచేస్తున్నా 1955ల నుండి సంగీత సహాయకుడిగా వున్నా మొట్టమొదటి సారిగా  టైటిల్స్ లో సంగీతరావుగారి పేరును మాత్రం వేసిన సినీమా  'అభిమానం'.

అయితే ఆయన ఏనాడు టైటిల్స్ లో తన పేరు రావడంపట్ల ఎటువంటి ఆసక్తి కనపర్చలేదు. సినిమా రంగంలో తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించిన వ్యక్తి సంగీతరావుగారు.


వచ్చే వారం మరల, ఘంటసాలవారి మరో సజీవరాగం తో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 23 - తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...